వైఎస్ జగన్‌పై కేసు నమోదు
విజయవాడ : ప్రతిపక్ష పార్టీపై రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఎదురుదాడికి దిగింది. ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కేసు నమోదు అయింది. వైఎస్ జగన్ సహా పార్టీ నేతలు పార్థసారధి, ఉదయభాను, జోగి రమేష్, అరుణ్ కుమార్‌లపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆస్పత్రి సిబ్బంది విధులుకు ఆటంకం కలిగించారంటూ వైఎస్ జగన్ సహా పార్టీ నేతలపై సెక్షన్ 353, 503,34 కింద కేసులు నమోదు అయ్యాయి. నందిగామ ప్రభుత్వాస్పత్రిలో కలెక్టర్‌పై దురుసుగా ప్రవర్తించారని టీడీపీ నేత వాసిరెడ్డి సత్యనారాయణ ప్రసాద్ బుధవారం నందిగామ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు హుటాహుటీన కేసు నమోదు చేయడం గమనార్హం. కాగా రాజకీయ కక్షతోనే టీడీపీ నేతలతో ఫిర్యాదు చేయించి ప్రతిపక్షంపై కేసులు నమోదు చేయిస్తున్నారని వైఎస్‌ఆర్ సీపీ నేతలు వ్యాఖ్యానించారు.
కాగా కృష్ణాజిల్లా నందిగామ మండలం ముండ్లపాడు వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. దీంతో వైఎస్ జగన్ హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం సంఘటనా స్థలానికి చేరుకున్న ప్రమాదం జరిగిన తీరుపై అధికారులను వాకబు చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిని పరామర్శించారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ మృతదేహానికి పోస్టుమార్టం చేయకుండానే మూటకట్టేయడం , రహస్యంగా తరలించే ప్రయత్నం చేయడంపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
సంబంధిత వార్తలు....