మాట వినకుంటే వేటు..!
⇒ బిగ్‌బాస్ వేధింపులు తాళలేక ఉద్యోగులు బదిలీల బాట
⇒ పని ఒత్తిడి భరించలేక గుండెపోటుతో పంచాయతీ కార్యదర్శి మృతి
సాక్షి, అమరావతి బ్యూరో : జిల్లాలో బిగ్‌బాస్ వ్యవహార శైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాస్థాయి అధికారులు సైతం సొంత నిర్ణయాలు తీసుకొనే పరిస్థితి లేదంటున్నారు. చిన్న పనులకూ ఆయన అనుమతి తీసుకోవాల్సిందేనట. కాదంటే టార్గెట్ చేసి ముప్పుతిప్పలు పెట్టి బదిలీపై వెళ్లేలా చేస్తున్నారు. బిగ్‌బాస్ వేధింపులు తాళలేక ఓ అధికారి ఈ జిల్లాను వదిలి వెళ్లిపోగా, పని ఒత్తిడి భరించలేక ఓ పంచాయతీ కార్యదర్శి గుండెపోటుతో మృతి చెందాడు.
⇒ జిల్లాలో బిగ్‌బాస్ మాట తీరు, వ్యవహార శైలి కింది స్థాయి అధికారులు, ఉద్యోగులకు ఇబ్బందికరంగా తయారైందంటున్నారు. ‘చినబాబు’ అండతో రెచ్చిపోతున్న బిగ్‌బాస్ ఆగడాలు, వేధింపులకు ఉద్యోగులు సతమతమవుతున్నారు. తనకు నచ్చని అధికారులపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ అందరి ముందే యూజ్‌లెస్ ఫెలో, వేస్ట్‌ఫెలో అంటూ తన అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారని ఉద్యోగు లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘శివుడిఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదన్నట్లు..’ బిగ్‌బాస్ ఆదేశం లేకుండా జిల్లాలో ఏ పనీ జరగకూడదనే రీతిలో పాలన సాగుతోంది.
⇒ బిగ్‌బాస్ ప్రతి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తుంటారు. జిల్లా అధికారులు అంతా విజయవాడలో నివాసం ఉండడంతో వారిని కాన్ఫరెన్స్ పేరిట అర్ధరాత్రి వరకు మచిలీపట్నంలో ఉంచేస్తున్నారని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. ఈ క్రమంలో మహిళా అధికారులు అర్ధరాత్రి వేళ విజయవాడ రాలేక ఇబ్బందులు పడాల్సివస్తోంది.
⇒ జిల్లా వ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శులకు ఇంటి పన్ను వసూలుకు సంబంధించి టార్గెట్స్ ఇచ్చారు. జిల్లాలో పంచాయతీ కార్యదర్శుల సంఖ్య తక్కువగా ఉండడంతో ఒక్కో కార్యదర్శి నాలుగు పంచాయతీలకు ఇన్‌చార్జిగా వ్యవహరించాల్సి వస్తోంది. మార్చి 31 లోపు టార్గెట్ పూర్తిచేయకుంటే వేటు తప్పదని ఒత్తిడి చేయడంతో బందరు మండలంలోని ఓ కార్యదర్శి గుండె పోటుతో మృతి చెందాడు.
⇒ ఇటీవల డీపీవో తనకు తెలియకుండా ఆ శాఖ ఉద్యోగులను బదిలీ చేశారనే కారణంతో బిగ్‌బాస్ ఆమెను వేధించి ప్రభుత్వానికి సరెండర్ చేశారని తెలుస్తోంది.
⇒ జెడ్పీ సీఈఓ సైతం బిగ్‌బాస్ వేధింపులు తట్టుకోలేక బదిలీ చేయించుకుని వెళ్లిపోయారు. జెడ్పీ చైర్‌పర్సన్ అధ్యక్షతన కౌన్సెలింగ్ పక్రియ చేపట్టి జిల్లా ఉద్యోగులను బదిలీ చేశారు. అందుకు సీఈఓ సహకరించారనే కారణంతో ఆయనను వేధించినట్టు తెలుస్తోంది.
⇒ ఇక దివాకర్ ట్రావెల్స్ దుర్ఘటనలో బాధితులను పరామర్శించేందుకు వచ్చిన వైఎస్సార్ సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై బిగ్‌బాస్ వ్యవహరించిన తీరును జిల్లాస్థాయి అధికారులు, ఉద్యోగులు తప్పుపట్టారు. అయితే బిగ్‌బాస్ తన కోటరీని రంగంలోకి దింపి ప్రతిపక్షనేతకు వ్యతిరేకంగా జిల్లాలో నిరసన సమావేశాలు నిర్వహించేలా ఒత్తిడి చేశారని ఉద్యోగ వర్గాలు ఆవేదన వ్యక్తం చేశాయి. నిరసన సమావేశాలు నిర్వహించడం తమకు ఇష్టంలేకపోయినా బిగ్‌బాస్ ఆదేశాల మేరకు తప్పలేదని ఓ అధికారి వాపోయారు.
⇒ అధికార పార్టీ నేతలు కూడా బిగ్‌బాస్ ఆగడాలు భరించలేక పోతున్నారని, ‘చినబాబు’ అండ ఉండడంతోనే ఆయనను ఈ జిల్లా నుంచి సాగనంపలేకపోతున్నారని తెలుగుదేశం వర్గాలు వాపోతుండడం కొసమెరుపు..!