జేసీ ప్రభాకర్‌రెడ్డి రౌడీయిజం
బస్సు ప్రమాద ఘటనపై ‘సాక్షి’ కథనాలతో అసహనం
⇒ ప్రతిపక్ష నేతపై వ్యక్తిగత దూషణలు
⇒ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ బైఠాయింపు
⇒ ‘సాక్షి’ అనంతపురం కార్యాలయం ఎదుట హల్‌చల్
అనంతపురం: జేసీ ప్రభాకర్‌రెడ్డి.. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం నుంచి తొలిసారి గెలిచిన ఎమ్మెల్యే.. నియోజకవర్గంలోని దాదాపు 2.50 లక్షల మంది ఓటర్లకు ప్రతినిధి.. కానీ, ఇవన్నీ మరిచిపోయారు. తన సహజసిద్ధ శైలిలో రౌడీలా రెచ్చిపోయారు. ఎన్నికల కోడ్‌ను ధిక్కరించారు. పోలీసుల హెచ్చరికలను బేఖాతర్ చేశారు. శనివారం తాడిపత్రి నుంచి భారీసంఖ్యలో వాహనాల్లో జనాలను తీసుకొచ్చి అనంతపురం సమీపంలోని ‘సాక్షి’ ఎడిషన్ కార్యాలయం ఎదుట టెంట్ వేసి ధర్నాకు దిగారు. ధర్నాలో నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేశారు.
తాను బాధ్యతగల ప్రజాప్రతినిధిని అనే విషయం మరిచిపోయారు. వినేవారే చెవులు మూసుకునేలా, రాజకీయ వ్యవస్థను దిగజార్చేలా, ప్రజాస్వామ్యం తలదించుకునేలా విపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని వ్యక్తిగతంగా దూషించారు. ప్రభాకర్‌రెడ్డి హావభావాలు, మాటలు, తీరు ఓ వీధిరౌడీని తలపించేలా ఉన్నాయని సర్వత్రా చర్చ జరిగిందంటే ఆయన ఏ స్థాయిలో రెచ్చిపోయి ఉంటారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
జగన్, ‘సాక్షి’కి వ్యతిరేకంగా నినాదాలు
కృష్ణా జిల్లాలో దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ప్రమాదానికి గురైన ఘటనలో 10 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ బస్సు యజమానులైన జేసీ దివాకర్‌రెడ్డి, జేసీ ప్రభాకర్‌రెడ్డి సోదరులను ఈ కేసు నుంచి కాపాడేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ విమర్శించారు. బస్సు ప్రమాదం కేసును తీరుగారుస్తున్న ప్రభుత్వ తీరుపై ‘సాక్షి’ పత్రికలో పలు కథనాలు వెలువడ్డాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి సహనంకోల్పోయారు. శనివారం ‘సాక్షి’ అనంతపురం ఎడిషన్ కార్యాలయం ఎదుట తన అనుచరులతో కలిసి హల్‌చల్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ను అతిక్రమించారు. ఉదయమే జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరులు ‘సాక్షి’ కార్యాలయం వద్దకు చేరుకున్నారు.
ఎదురుగా టెంట్ వేశారు. వందలాది మంది అనుచరులతో జేసీ ప్రభాకర్‌రెడ్డి అక్కడికి చేరుకున్నారు. వచ్చీరాగానే తన కుమారుడు అస్మిత్‌రెడ్డితో కలిసి శిబిరంలో బైఠాయించారు. ప్రతిపక్ష నేతను ఇష్టం వచ్చినట్లు దూషించారు. వ్యక్తిగతంగానూ కించపరిచేలా మాట్లాడారు. ఇదే సమయంలో జేసీ అనుచరులు ‘సాక్షి’ దినపత్రిక ప్రతులను దహనం చేశారు. వైఎస్ జగన్‌కు, ‘సాక్షి’కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డీఎస్పీ మల్లికార్జున వర్మ వచ్చి ఎన్నికల కోడ్ అమల్లో ఉందని చెప్పే ప్రయత్నం చేసినా జేసీ లెక్కచే యలేదు. జగన్ ఇంటి వద్దకూ వెళ్తానంటూ రెచ్చిపోయారు.
కాసేపటికి పోలీసులు జేసీ ప్రభాకర్‌రెడ్డితోపాటు ఆయన కుమారుడిని నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు. ‘సాక్షి’ కథనాలపై అభ్యంతరాలుంటే జేసీ ప్రభాకర్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి ఖండించవచ్చు. లేదంటే పత్రికా ప్రకటన విడుదల చేయొచ్చు. అదీ ఇష్టం లేకపోతే కోర్టును ఆశ్రయించి న్యాయపరంగా పోరాడొచ్చు. కానీ, బాధ్యతగల ఎమ్మెల్యేగా ఉండి ‘సాక్షి’ కార్యాలయం ఎదుట బైఠాయించారు. ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.
అనంతపురం ఎడ్యుకేషన్: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై కారుకూతలు కూస్తున్న జేసీ ప్రభాకర్‌రెడ్డీ.. ఖబడ్దార్! అంటూ వైఎఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం నాయకులు, పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు హెచ్చరించారు. శనివారం సాయంత్రం అనంతపురం టవర్‌క్లాక్ సర్కిల్‌లో ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రభాకర్‌రెడ్డి వీధిరౌడీలా వ్యవహరిస్తూ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు.