ఇలాగైతే జైలుకెళ్తారు
⇒ డ్రైవర్ మృతదేహానికి పోస్టుమార్టం చేయకపోయినా చేసినట్లు కలెక్టర్ చెప్పడంపై జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం
⇒ డ్రైవర్ తాగి ఉన్నాడో లేదో తెలిసేదెలా?
⇒ టీడీపీ ఎంపీ ట్రావెల్స్ కాబట్టి కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారా?
⇒ రిపోర్ట్ కాపీ ఇవ్వడానికి అభ్యంతరం ఏమిటి?
సాక్షి, అమరావతిబ్యూరో: రోడ్డు ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ మృతదేహానికి పోస్టుమార్టం చేయకుండానే మూటకట్టేయడం , రహస్యంగా తరలించే ప్రయత్నం చేయడంపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం సంఘటనా స్థలానికి చేరుకున్న జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాదం జరిగిన తీరుపై అధికారులను వాకబు చేశారు.
అనంతరం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతుల కుటుంబీకులను పరామర్శించారు. ప్రమాద కారణాలను గుర్తించడానికి తీసుకున్న చర్యలపై అధికారులు సూటిగా సమాధానం చెప్పలేదు. అక్కడే మూటగట్టి ఉన్న డ్రైవర్ ఆదినారాయణ మృతదేహాన్ని చూస్తూ వైద్యులను జగన్ ప్రశ్నించారు. ‘‘డ్రైవర్ మృతదేహానికి పోస్టుమార్టం చేశారా?’’ అని అడగ్గా డాక్టర్ స్పందిస్తూ... ‘‘ఆ!... ఇంకా చేయలేదు. చేస్తాం’’ అంటూ ముక్తసరిగా సమాధానం చెబుతూ కొన్ని నివేదికల ప్రతులు చూపించారు.
ఆ నివేదికలను చూసి వైఎస్ జగన్ స్పందిస్తూ.. ‘‘డ్రైవర్ మృతదేహానికి పోస్టుమార్టం చేయకపోతే ప్రమాదానికి గల కారణాలు ఎలా తెలుస్తాయి? తాగి ఉన్నారో లేదో తెలుసుకోవద్దా? పోస్టుమార్టం చేయకుండానే మృతదేహాన్ని ఎందుకు మూటగట్టేశారు? గుట్టుచప్పుడు కాకుండా తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు’’ అని నిలదీశారు. అదే విషయాన్ని అక్కడే ఉన్న కలెక్టర్ బాబు.ఎను కూడా అడిగారు. పోస్టుమార్టం చేయలేదని డాక్టర్ ఓ వైపు చెబుతుండగా కలెక్టర్ మాత్రం మాట దాటవేసేందుకు యత్నించడం గమనార్హం. ‘‘బాధ్యతాయుత ప్రతిపక్ష నేతగా అడుగుతుంటే సరైన సమాచారం ఇవ్వరా? ట్రావెల్స్ యాజమాన్యం టీడీపీ ఎంపీకి చెందినది కాబట్టి తప్పును కప్పిపుచ్చేందుకు యత్నిస్తున్నారా?’’ అని ప్రశ్నించారు. వైద్యులు రూపొందించిన రిపోర్టు కాపీలను తాను తీసుకుంటానని చెప్పారు. అప్పటికే కలెక్టర్ ఆగ్రహంతో చూస్తుండటంతో ఆ డాక్టర్ తడబడ్డారు.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతి నుంచి పత్రాలను తీసుకునేందుకు యత్నించారు. దీనిపై జగన్ స్పందిస్తూ.. ‘‘ఆ పత్రాలు నేను ఉంచుకుంటాను. మూడు కాపీలు తయారు చేస్తారు కదా? మిగిలిన కాపీలు మీ వద్ద ఉంటాయి కదా’’ అని అన్నారు. తన వద్ద ఇక కాపీలు లేవని చెబుతూ డాక్టర్ వాటిని తీసుకునేందుకు మరోసారి యత్నించారు. దాంతో వైఎస్ జగన్ స్పందిస్తూ... ‘‘మీరు జిరాక్స్‌లు తీసుకోండి. నా వద్ద ఈ కాపీలు ఉండనివ్వండి’’ అని చెప్పారు. కానీ, కలెక్టర్ మాత్రం ఆ పత్రాలు ఇచ్చేయాలని జగన్‌తో చెప్పడం గమనార్హం. దీనిపై జగన్ తీవ్రంగా స్పందిస్తూ.. ‘‘బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతకు సమాచారం ఇవ్వరా? పత్రాలు ఇవ్వరా? నాకు అధికారులు అంటే పూర్తి గౌరవం ఉంది. పోస్టుమార్టం జరగకపోయినా జరిగినట్లు చెప్పడం, ఇలా ప్రభుత్వ తప్పులను కప్పిపుచ్చేందుకు ప్రయత్నించడం సరికాదు. బాధితులకు న్యాయం జరిగేలా వ్యవహరించకపోతే అందరూ జైలుకు వెళ్లాల్సి వస్తుంది’’ అని స్పష్టం చేశారు.
నిబంధనలకు నీళ్లొదిలేశారు
బస్సు ప్రమాదానికి గల కారణాలను విచారించాల్సిన అధికారులు అందుకు విరుద్ధంగా ప్రవర్తించారు. ప్రమాద సమయంలో డ్రైవింగ్ చేస్తున్న డ్రైవర్ ఆదినారాయణ అక్కడిక్కడే మృతి చెందాడు. నిబంధనల ప్రకారం... ఆ డ్రైవర్ తాగి డ్రైవింగ్ చేశాడా లేదా అన్నది నిర్ధారించాలి. అందుకు మృతదేహానికి పోస్టుమార్టం చేయడం ఒక్కటే మార్గం. ఆ విషయాన్ని అధికారులు ఉద్దేశపూర్వకంగా విస్మరించారు. డ్రైవర్ మృతదేహాన్ని ప్యాక్ చేసి, ఆయన స్వగ్రామానికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇక బస్సులో ఉండాల్సిన రెండో డ్రైవర్ ఏమయ్యాడో పోలీసులు, అధికారులు పట్టించుకోలేదు. రెండో డ్రైవర్‌కు లైసెన్స్ ఉందా? అతడు కూడా తాగి ఉన్నాడా? అనే విషయాలను తెలుసునేందుకు అధికారులు ప్రయత్నించిన పాపానపోలేదు. మధ్యాహ్నం 1.45 గంటలకు సంఘటనా స్థలానికి చేరుకున్న కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు.ఎ కూడా అలాగే వ్యవహరించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు నిబంధనల ప్రకారం వ్యవహరిస్తున్నారా లేదా అన్నది పరిశీలించలేదు.
పోస్టుమార్టం తప్పనిసరి
స్పష్టం చేస్తున్న న్యాయ, ఫోరెన్సిక్ నిపుణులు, పోలీసు అధికారులు
కృష్ణా జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో మృతి చెందిన డ్రైవర్, మరికొందరు మృతుల దేహాలకు పోస్టుమార్టం చేయకుండానే వారి దేహాలను తరలించే ప్రయత్నం జరిగింది. అసలు ఈ విధంగా పోస్టుమార్టం చేయకుం డా మృతదేహాలను తరలించవచ్చా అంటే అలా కుదరదని, అది చట్ట రీత్యా నేరమని న్యాయ, ఫోరెన్సిక్ నిపుణులు, పోలీసు అధికారులు చెబుతున్నారు. ప్రమాదాల్లో మృతుల దేహాలకు పోస్టుమార్టం నిర్వహించడం మన దేశంలోనే కాదు.. అనేక దేశాల్లో చట్ట ప్రకారం తప్పనిసరి అని వారు చెబుతున్నారు. ముఖ్యంగా మంగళవారం జరిగిన ప్రమాదం వంటి ఘటనల్లో పోస్టుమార్టం నివేదిక అత్యంత కీలక సాక్ష్యమని, ఇది లేకుండా ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు, ఇతర ప్రయోజనాలు కోరడం సాధ్య పడదని వారు చెబుతున్నారు.
అందువల్ల పోస్టుమార్టం చేయకపోవడం మృతుల కుటుంబాలకు అన్యాయం చేయడమేనని తెలిపారు. ప్రమాదానికి గురైన వాహన డ్రైవర్ చనిపోతే అతని మృతదేహానికి తప్పనిసరిగా పోస్టుమార్టం నిర్వహించాలని స్పష్టంగా చెప్పారు. ఏ కారణం చేత ప్రమాదం జరిగిందో అతని పోస్టుమార్టం నివేదిక ద్వారా ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. పోస్టుమార్టం బాధ్యతల నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరని, ఈ నివేదికలు లేకుండా చట్ట ప్రకారం ముందుకెళ్లడం సాధ్యం కాదని తేల్చి చెబుతున్నారు.