ఏపీ పౌరుడి ప్రాణం విలువ రూ.3లక్షలు!
ఓ ప్రాణమంటే ఓ కుటుంబం.. ఓ సముదాయం.. ఓ గమనం.. అది కాస్త పోయిందా ఇక అంతే.. తిరిగి ఆ వ్యక్తికి చెందిన కుటుంబం సామాన్యజనాల్లో కలిసేందుకు తరాలు పట్టొచ్చు.. అసలు కలవలేకపోవచ్చు.. అంతమైపోయినా ఆశ్చర్యంకాకపోవొచ్చు. ఎవరి ప్రాణం వారికి విలువైంది. గుడిసెలో ఉన్నవాడి ప్రాణం ఆ గుడిసెలో ఉండేవారికి.. ధనవంతుల ప్రాణం ఆ ధనవంతుల కుటుంబానికి.. ఏదేమైనా ప్రాణానికి విలువకట్టే శక్తి ఏ పౌరుడికీ లేదు ప్రభుత్వానికి లేదు. అలా ఉందనుకుంటే పొరపాటే. అందుకే ప్రమాదాల్లో పడి ప్రాణాలుకోల్పోయినవారికి, క్షతగాత్రులకు ముందుగా మేమున్నామనే భరోసా ఇవ్వాలి. అది నిలబడేందుకు మంచి ఆర్థిక సహాయం చేయాలి.
అది ఇతరుల దృష్టిలో నష్టపరిహారంగా కనిపించొచ్చు.. ఆపన్నహస్తమని పిలుచుకోవచ్చు మరింకేదైనా పేరుతో కావచ్చు.. కానీ, ఆ సాయం వారికి కచ్చితంగా ఊతం అవ్వాలేగానీ, మా వాళ్ల ప్రాణం, మా ప్రాణం విలువ ఇంతేనా అనే ఆలోచన అస్సలు రానివ్వకూడదు. అలా చేయగలిగే పాలకులే మంచి పాలకులు.. అలా చేసే ప్రభుత్వమే మంచి ప్రభుత్వం. గత ప్రమాదాల విషయం ఎట్లున్నా మంగళవారం కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం ములపాడు వద్ద దివాకర్ ట్రావెల్స్ బస్సు ఘోర రోడ్డు ప్రమాదం మరోసారి సామాన్యుడి దయనీయ పరిస్థితిని నడిరోడ్డుపై స్పష్టంగా చూపించింది. తమకు ప్రభుత్వం కట్టిన విలువ ప్రాణంపోయిన వారికి మళ్లీ తెలుసుకునే అవకాశం ఉండి తెలుసుకోగలిగితే అది నిజంగా వారికి అంతకు పదిసార్లు చనిపోయినంత అవమానం. సాక్షాత్తు బలి పశువులకు ప్రకటించినట్లుగా నష్టపరిహారం ప్రకటించిన తీరు చూస్తుంటే విస్మయం చెందే పరిస్థితి. సాక్షాత్తు తనకు చాలా అనుభవం ఉందని చెప్పుకునే అమాత్యుడి ప్రభుత్వమే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటే ముక్కున వేలేసుకోవాల్సిందే.
ఈ ప్రభుత్వ పెద్దలు కనీసం చదువుకున్నారా? ఒక వేళ చదివితే అందులో మానవత్వ పాళ్లు ఉన్నాయా? నిజంగా వీరికి సామాన్యుల కుటుంబాలు అంటే తెలుసా? వారి జీవనక్రమం ఏనాడైనా అనుభవించారా? పోనీ చూశారా అంటే అనుమానమే. పోని, ఇలాంటి ప్రకటనలు వచ్చే సమయంలో వాటిని అమలు చేసే అధికారులు నిరక్షరాస్యులా? కనీసం ఇదెలా సాధ్యం అని ప్రశ్నించే ధైర్యం లేనంత బలహీనమైన ఉద్యోగాలు పాలకుల కింద చేస్తున్నారా అని ఎన్నో సమాధానాలు దొరకని ప్రశ్నలు. ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం, అండగా ఉంటామని ప్రకటించడం, చివరకు చిల్లర వేసినట్లుగా వారికి నష్టపరిహారాలు ప్రకటించడం ప్రభుత్వాలకు బాగా అలవాటయ్యాయి. అదీ కాకుండా ప్రాంతాల వారీగా ప్రాణాలకు విలువకట్టడం కాస్తంత సిగ్గుగా అనిపించే అంశమే.
మంగళవారం పెనుగ్రంచి పోలు వద్ద జరిగిన ప్రమాదంలో చనిపోయినవారికి చంద్రన్నబీమా కింద రూ.3లక్షలు ఆంధ్రులకు, రూ.2లక్షలు తెలంగాణ ఇతర ప్రాంతాలకు చెందినవారి కుటుంబాలకు అని ప్రకటించారు. ఇది ఎంతమేరకు సమంజసమైన ప్రకటనో ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇచ్చిన బత్తెం అరకొర.. అందులోనూ కొరుకుడుబడని కొర్రీలు. పైగా ప్రమాదానికి కారణమైన బస్సు యాజమాన్యంపై చర్యలకు బలమైన ప్రకటనగానీ, బాధితులకు నష్టపరిహారం ఇప్పించే ప్రకటనగానీ ప్రభుత్వం చేయలేదు.
అదీకాకుండా ప్రభుత్వ పెద్దలు మరిచిపోయిన విషయాలను గుర్తు చేసేందుకు ప్రతిపక్షాలు ముందుకు కదిలితే వారికంటే ముందు పోలీసులతో చకచకా పనులు చేయించుకోవడం, ప్రతిపక్షాలను అడ్డుకోవడం, పార్టీ కార్యకర్తలతో గందరగోళానికి గురిచేయించడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో షరామాములైంది. ఇన్నేళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు నిజంగా తన అనుభవాన్ని మరిచిపోయారా? పరిపాలనకు కొత్త భాష్యం లిఖిస్తున్నారా అని చూసిన వాళ్లంతా ఆశ్చర్యపోతున్నారు.
ఎందుకంత తత్తరపాటు? ఎందుకా బెదురు?
సాధారణంగా ప్రమాదం జరిగినప్పుడు ఒక్క ప్రభుత్వమే కాదు.. సహృదయంతో ఉన్న ప్రతి వ్యక్తి స్పందిస్తాడు. ప్రభుత్వపరంగా చేయాల్సిన చర్యలు చేసుకుంటూ వెళితే.. ప్రతిపక్ష పార్టీల నేతలు, అంతకుముందు పరిపాలనలో ఉన్న సీనియర్ నాయకులు బాధితులకు భరోసా ఇచ్చేందుకు వస్తుంటారు. పరామర్శిస్తారు. ప్రభుత్వ లోపాలు ఉంటే ఎండగడతారు.. ప్రభుత్వం తరుపున బాధితులకు అందాల్సిన సహాయం గురించి డిమాండ్ చేసి వారికి దన్నుగా నిలుస్తారు. ఇది ఇప్పుడే వచ్చిన సాంప్రదాయం కాదు.. ఆనాదిగా ఉంది. కానీ, మంగళవారంనాటి ప్రమాదంలో ఏపీ ప్రభుత్వ తీరు మాత్రం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. ప్రమాదానికి కారణమైన బస్సు యాజమాన్యంపై ఈగ కూడా వాలకుండా పనులు పూర్తి చేయాలని పనిచేసినట్లు పరిణామలు స్పష్టం చేశాయి.
ప్రతిపక్ష నేత వస్తున్నారని తెలిసి ప్రమాద స్థలం నుంచి బస్సును తొలగించడమే కాకుండా నందిగామ ఆస్పత్రి వద్ద హడావుడి మొదలుపెట్టారు. ఎవ్వరినీ రానివ్వకుండా పోలీసులను మోహరించారు. దానికి అదనంగా ప్రభుత్వ పార్టీ కార్యకర్తలు పోలీసులకంటే ముందే కొలువుతీరారు. ఒక ఉద్రిక్త వాతావరణం ఏర్పాటుచేసి హడావుడిగా మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించడం, శవాలను తరలించేందుకు అంబులెన్స్‌లు నిలపడం, పోలీసులే ఈ సపర్యలు చేయడం, బస్సు రెండో డ్రైవర్‌ని పంపిచేయడం.. ఇలా మొత్తం వ్యవహారమంతా చూస్తుంటే అసలు ప్రభుత్వానికెందుకు ఇంత తత్తరపాటు అని పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ఎక్స్‌గ్రేషియా పెంచాల్సి వస్తుందని ఈ పరిస్థితులు సృష్టించారా? లేక బస్సు యాజమాన్యం తమ ప్రభుత్వంలో ఒక భాగస్వామి కాబట్టి ఆయనను రక్షించేందుకు ఈ పనిచేశారా? అసలు చావుల దగ్గర రాజకీయ వాతావరణం సృష్టించాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రతిపక్షం అంటే కేవలం అసెంబ్లీలో సభలో మాత్రమే కనిపించాలా? మరెక్కడ కనిపించినా వారు రాజకీయం చేసేందుకు వస్తున్నారని ఎలా అనుకోగలుగుతారు? నిజానికి ఎలాంటి లోపాలు లేని పాలక వర్గానికి ఇంత బెదురు ఎందుకుంటుంది? అని ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకుంటున్నారు. మొత్తానికి సామాన్యుడి ప్రాణాలకు ఏపీ ప్రభుత్వం ప్రాంతాలవారిగా విలువకట్టిన తీరు చూస్తుంటే మానవత్వం కలత చెందే పరిస్థితి మాత్రం కనిపిస్తోంది.