penuganchiprolu bus accidnet
-
వైఎస్ జగన్‌పై కేసు నమోదు
విజయవాడ : ప్రతిపక్ష పార్టీపై రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఎదురుదాడికి దిగింది. ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కేసు నమోదు అయింది. వైఎస్ జగన్ సహా పార్టీ నేతలు పార్థసారధి, ఉదయభాను, జోగి రమేష్, అరుణ్ కుమార్లపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆస్పత్రి సిబ్బంది విధులుకు ఆటంకం కలిగించారంటూ వైఎస్ జగన్ సహా పార్టీ నేతలపై సెక్షన్ 353, 503,34 కింద కేసులు నమోదు అయ్యాయి. నందిగామ ప్రభుత్వాస్పత్రిలో కలెక్టర్‌పై దురుసుగా ప్రవర్తించారని టీడీపీ నేత వాసిరెడ్డి సత్యనారాయణ ప్రసాద్ బుధవారం నందిగామ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు హుటాహుటీన కేసు నమోదు చేయడం గమనార్హం. కాగా రాజకీయ కక్షతోనే టీడీపీ నేతలతో ఫిర్యాదు చేయించి ప్రతిపక్షంపై కేసులు నమోదు చేయిస్తున్నారని వైఎస్ఆర్ సీపీ నేతలు వ్యాఖ్యానించారు. కాగా కృష్ణాజిల్లా నందిగామ మండలం ముండ్లపాడు వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. దీంతో వైఎస్ జగన్ హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం సంఘటనా స్థలానికి చేరుకున్న ప్రమాదం జరిగిన తీరుపై అధికారులను వాకబు చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిని పరామర్శించారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ మృతదేహానికి పోస్టుమార్టం చేయకుండానే మూటకట్టేయడం , రహస్యంగా తరలించే ప్రయత్నం చేయడంపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సంబంధిత వార్తలు.... ఇలాగైతే జైలుకెళ్తారు -
వైఎస్ జగన్‌పై కేసు నమోదు
-
ఇలాగైతే జైలుకెళ్తారు
⇒ డ్రైవర్ మృతదేహానికి పోస్టుమార్టం చేయకపోయినా చేసినట్లు కలెక్టర్ చెప్పడంపై జగన్మోహన్రెడ్డి ఆగ్రహం ⇒ డ్రైవర్ తాగి ఉన్నాడో లేదో తెలిసేదెలా? ⇒ టీడీపీ ఎంపీ ట్రావెల్స్ కాబట్టి కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారా? ⇒ రిపోర్ట్ కాపీ ఇవ్వడానికి అభ్యంతరం ఏమిటి? సాక్షి, అమరావతిబ్యూరో: రోడ్డు ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ మృతదేహానికి పోస్టుమార్టం చేయకుండానే మూటకట్టేయడం , రహస్యంగా తరలించే ప్రయత్నం చేయడంపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం సంఘటనా స్థలానికి చేరుకున్న జగన్మోహన్రెడ్డి ప్రమాదం జరిగిన తీరుపై అధికారులను వాకబు చేశారు. అనంతరం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతుల కుటుంబీకులను పరామర్శించారు. ప్రమాద కారణాలను గుర్తించడానికి తీసుకున్న చర్యలపై అధికారులు సూటిగా సమాధానం చెప్పలేదు. అక్కడే మూటగట్టి ఉన్న డ్రైవర్ ఆదినారాయణ మృతదేహాన్ని చూస్తూ వైద్యులను జగన్ ప్రశ్నించారు. ‘‘డ్రైవర్ మృతదేహానికి పోస్టుమార్టం చేశారా?’’ అని అడగ్గా డాక్టర్ స్పందిస్తూ... ‘‘ఆ!... ఇంకా చేయలేదు. చేస్తాం’’ అంటూ ముక్తసరిగా సమాధానం చెబుతూ కొన్ని నివేదికల ప్రతులు చూపించారు. ఆ నివేదికలను చూసి వైఎస్ జగన్ స్పందిస్తూ.. ‘‘డ్రైవర్ మృతదేహానికి పోస్టుమార్టం చేయకపోతే ప్రమాదానికి గల కారణాలు ఎలా తెలుస్తాయి? తాగి ఉన్నారో లేదో తెలుసుకోవద్దా? పోస్టుమార్టం చేయకుండానే మృతదేహాన్ని ఎందుకు మూటగట్టేశారు? గుట్టుచప్పుడు కాకుండా తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు’’ అని నిలదీశారు. అదే విషయాన్ని అక్కడే ఉన్న కలెక్టర్ బాబు.ఎను కూడా అడిగారు. పోస్టుమార్టం చేయలేదని డాక్టర్ ఓ వైపు చెబుతుండగా కలెక్టర్ మాత్రం మాట దాటవేసేందుకు యత్నించడం గమనార్హం. ‘‘బాధ్యతాయుత ప్రతిపక్ష నేతగా అడుగుతుంటే సరైన సమాచారం ఇవ్వరా? ట్రావెల్స్ యాజమాన్యం టీడీపీ ఎంపీకి చెందినది కాబట్టి తప్పును కప్పిపుచ్చేందుకు యత్నిస్తున్నారా?’’ అని ప్రశ్నించారు. వైద్యులు రూపొందించిన రిపోర్టు కాపీలను తాను తీసుకుంటానని చెప్పారు. అప్పటికే కలెక్టర్ ఆగ్రహంతో చూస్తుండటంతో ఆ డాక్టర్ తడబడ్డారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతి నుంచి పత్రాలను తీసుకునేందుకు యత్నించారు. దీనిపై జగన్ స్పందిస్తూ.. ‘‘ఆ పత్రాలు నేను ఉంచుకుంటాను. మూడు కాపీలు తయారు చేస్తారు కదా? మిగిలిన కాపీలు మీ వద్ద ఉంటాయి కదా’’ అని అన్నారు. తన వద్ద ఇక కాపీలు లేవని చెబుతూ డాక్టర్ వాటిని తీసుకునేందుకు మరోసారి యత్నించారు. దాంతో వైఎస్ జగన్ స్పందిస్తూ... ‘‘మీరు జిరాక్స్‌లు తీసుకోండి. నా వద్ద ఈ కాపీలు ఉండనివ్వండి’’ అని చెప్పారు. కానీ, కలెక్టర్ మాత్రం ఆ పత్రాలు ఇచ్చేయాలని జగన్‌తో చెప్పడం గమనార్హం. దీనిపై జగన్ తీవ్రంగా స్పందిస్తూ.. ‘‘బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతకు సమాచారం ఇవ్వరా? పత్రాలు ఇవ్వరా? నాకు అధికారులు అంటే పూర్తి గౌరవం ఉంది. పోస్టుమార్టం జరగకపోయినా జరిగినట్లు చెప్పడం, ఇలా ప్రభుత్వ తప్పులను కప్పిపుచ్చేందుకు ప్రయత్నించడం సరికాదు. బాధితులకు న్యాయం జరిగేలా వ్యవహరించకపోతే అందరూ జైలుకు వెళ్లాల్సి వస్తుంది’’ అని స్పష్టం చేశారు. నిబంధనలకు నీళ్లొదిలేశారు బస్సు ప్రమాదానికి గల కారణాలను విచారించాల్సిన అధికారులు అందుకు విరుద్ధంగా ప్రవర్తించారు. ప్రమాద సమయంలో డ్రైవింగ్ చేస్తున్న డ్రైవర్ ఆదినారాయణ అక్కడిక్కడే మృతి చెందాడు. నిబంధనల ప్రకారం... ఆ డ్రైవర్ తాగి డ్రైవింగ్ చేశాడా లేదా అన్నది నిర్ధారించాలి. అందుకు మృతదేహానికి పోస్టుమార్టం చేయడం ఒక్కటే మార్గం. ఆ విషయాన్ని అధికారులు ఉద్దేశపూర్వకంగా విస్మరించారు. డ్రైవర్ మృతదేహాన్ని ప్యాక్ చేసి, ఆయన స్వగ్రామానికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇక బస్సులో ఉండాల్సిన రెండో డ్రైవర్ ఏమయ్యాడో పోలీసులు, అధికారులు పట్టించుకోలేదు. రెండో డ్రైవర్‌కు లైసెన్స్ ఉందా? అతడు కూడా తాగి ఉన్నాడా? అనే విషయాలను తెలుసునేందుకు అధికారులు ప్రయత్నించిన పాపానపోలేదు. మధ్యాహ్నం 1.45 గంటలకు సంఘటనా స్థలానికి చేరుకున్న కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు.ఎ కూడా అలాగే వ్యవహరించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు నిబంధనల ప్రకారం వ్యవహరిస్తున్నారా లేదా అన్నది పరిశీలించలేదు. పోస్టుమార్టం తప్పనిసరి స్పష్టం చేస్తున్న న్యాయ, ఫోరెన్సిక్ నిపుణులు, పోలీసు అధికారులు కృష్ణా జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో మృతి చెందిన డ్రైవర్, మరికొందరు మృతుల దేహాలకు పోస్టుమార్టం చేయకుండానే వారి దేహాలను తరలించే ప్రయత్నం జరిగింది. అసలు ఈ విధంగా పోస్టుమార్టం చేయకుం డా మృతదేహాలను తరలించవచ్చా అంటే అలా కుదరదని, అది చట్ట రీత్యా నేరమని న్యాయ, ఫోరెన్సిక్ నిపుణులు, పోలీసు అధికారులు చెబుతున్నారు. ప్రమాదాల్లో మృతుల దేహాలకు పోస్టుమార్టం నిర్వహించడం మన దేశంలోనే కాదు.. అనేక దేశాల్లో చట్ట ప్రకారం తప్పనిసరి అని వారు చెబుతున్నారు. ముఖ్యంగా మంగళవారం జరిగిన ప్రమాదం వంటి ఘటనల్లో పోస్టుమార్టం నివేదిక అత్యంత కీలక సాక్ష్యమని, ఇది లేకుండా ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు, ఇతర ప్రయోజనాలు కోరడం సాధ్య పడదని వారు చెబుతున్నారు. అందువల్ల పోస్టుమార్టం చేయకపోవడం మృతుల కుటుంబాలకు అన్యాయం చేయడమేనని తెలిపారు. ప్రమాదానికి గురైన వాహన డ్రైవర్ చనిపోతే అతని మృతదేహానికి తప్పనిసరిగా పోస్టుమార్టం నిర్వహించాలని స్పష్టంగా చెప్పారు. ఏ కారణం చేత ప్రమాదం జరిగిందో అతని పోస్టుమార్టం నివేదిక ద్వారా ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. పోస్టుమార్టం బాధ్యతల నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరని, ఈ నివేదికలు లేకుండా చట్ట ప్రకారం ముందుకెళ్లడం సాధ్యం కాదని తేల్చి చెబుతున్నారు. -
ఏపీ పౌరుడి ప్రాణం విలువ రూ.3లక్షలు!
ఓ ప్రాణమంటే ఓ కుటుంబం.. ఓ సముదాయం.. ఓ గమనం.. అది కాస్త పోయిందా ఇక అంతే.. తిరిగి ఆ వ్యక్తికి చెందిన కుటుంబం సామాన్యజనాల్లో కలిసేందుకు తరాలు పట్టొచ్చు.. అసలు కలవలేకపోవచ్చు.. అంతమైపోయినా ఆశ్చర్యంకాకపోవొచ్చు. ఎవరి ప్రాణం వారికి విలువైంది. గుడిసెలో ఉన్నవాడి ప్రాణం ఆ గుడిసెలో ఉండేవారికి.. ధనవంతుల ప్రాణం ఆ ధనవంతుల కుటుంబానికి.. ఏదేమైనా ప్రాణానికి విలువకట్టే శక్తి ఏ పౌరుడికీ లేదు ప్రభుత్వానికి లేదు. అలా ఉందనుకుంటే పొరపాటే. అందుకే ప్రమాదాల్లో పడి ప్రాణాలుకోల్పోయినవారికి, క్షతగాత్రులకు ముందుగా మేమున్నామనే భరోసా ఇవ్వాలి. అది నిలబడేందుకు మంచి ఆర్థిక సహాయం చేయాలి. అది ఇతరుల దృష్టిలో నష్టపరిహారంగా కనిపించొచ్చు.. ఆపన్నహస్తమని పిలుచుకోవచ్చు మరింకేదైనా పేరుతో కావచ్చు.. కానీ, ఆ సాయం వారికి కచ్చితంగా ఊతం అవ్వాలేగానీ, మా వాళ్ల ప్రాణం, మా ప్రాణం విలువ ఇంతేనా అనే ఆలోచన అస్సలు రానివ్వకూడదు. అలా చేయగలిగే పాలకులే మంచి పాలకులు.. అలా చేసే ప్రభుత్వమే మంచి ప్రభుత్వం. గత ప్రమాదాల విషయం ఎట్లున్నా మంగళవారం కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం ములపాడు వద్ద దివాకర్ ట్రావెల్స్ బస్సు ఘోర రోడ్డు ప్రమాదం మరోసారి సామాన్యుడి దయనీయ పరిస్థితిని నడిరోడ్డుపై స్పష్టంగా చూపించింది. తమకు ప్రభుత్వం కట్టిన విలువ ప్రాణంపోయిన వారికి మళ్లీ తెలుసుకునే అవకాశం ఉండి తెలుసుకోగలిగితే అది నిజంగా వారికి అంతకు పదిసార్లు చనిపోయినంత అవమానం. సాక్షాత్తు బలి పశువులకు ప్రకటించినట్లుగా నష్టపరిహారం ప్రకటించిన తీరు చూస్తుంటే విస్మయం చెందే పరిస్థితి. సాక్షాత్తు తనకు చాలా అనుభవం ఉందని చెప్పుకునే అమాత్యుడి ప్రభుత్వమే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటే ముక్కున వేలేసుకోవాల్సిందే. ఈ ప్రభుత్వ పెద్దలు కనీసం చదువుకున్నారా? ఒక వేళ చదివితే అందులో మానవత్వ పాళ్లు ఉన్నాయా? నిజంగా వీరికి సామాన్యుల కుటుంబాలు అంటే తెలుసా? వారి జీవనక్రమం ఏనాడైనా అనుభవించారా? పోనీ చూశారా అంటే అనుమానమే. పోని, ఇలాంటి ప్రకటనలు వచ్చే సమయంలో వాటిని అమలు చేసే అధికారులు నిరక్షరాస్యులా? కనీసం ఇదెలా సాధ్యం అని ప్రశ్నించే ధైర్యం లేనంత బలహీనమైన ఉద్యోగాలు పాలకుల కింద చేస్తున్నారా అని ఎన్నో సమాధానాలు దొరకని ప్రశ్నలు. ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం, అండగా ఉంటామని ప్రకటించడం, చివరకు చిల్లర వేసినట్లుగా వారికి నష్టపరిహారాలు ప్రకటించడం ప్రభుత్వాలకు బాగా అలవాటయ్యాయి. అదీ కాకుండా ప్రాంతాల వారీగా ప్రాణాలకు విలువకట్టడం కాస్తంత సిగ్గుగా అనిపించే అంశమే. మంగళవారం పెనుగ్రంచి పోలు వద్ద జరిగిన ప్రమాదంలో చనిపోయినవారికి చంద్రన్నబీమా కింద రూ.3లక్షలు ఆంధ్రులకు, రూ.2లక్షలు తెలంగాణ ఇతర ప్రాంతాలకు చెందినవారి కుటుంబాలకు అని ప్రకటించారు. ఇది ఎంతమేరకు సమంజసమైన ప్రకటనో ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇచ్చిన బత్తెం అరకొర.. అందులోనూ కొరుకుడుబడని కొర్రీలు. పైగా ప్రమాదానికి కారణమైన బస్సు యాజమాన్యంపై చర్యలకు బలమైన ప్రకటనగానీ, బాధితులకు నష్టపరిహారం ఇప్పించే ప్రకటనగానీ ప్రభుత్వం చేయలేదు. అదీకాకుండా ప్రభుత్వ పెద్దలు మరిచిపోయిన విషయాలను గుర్తు చేసేందుకు ప్రతిపక్షాలు ముందుకు కదిలితే వారికంటే ముందు పోలీసులతో చకచకా పనులు చేయించుకోవడం, ప్రతిపక్షాలను అడ్డుకోవడం, పార్టీ కార్యకర్తలతో గందరగోళానికి గురిచేయించడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో షరామాములైంది. ఇన్నేళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు నిజంగా తన అనుభవాన్ని మరిచిపోయారా? పరిపాలనకు కొత్త భాష్యం లిఖిస్తున్నారా అని చూసిన వాళ్లంతా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంత తత్తరపాటు? ఎందుకా బెదురు? సాధారణంగా ప్రమాదం జరిగినప్పుడు ఒక్క ప్రభుత్వమే కాదు.. సహృదయంతో ఉన్న ప్రతి వ్యక్తి స్పందిస్తాడు. ప్రభుత్వపరంగా చేయాల్సిన చర్యలు చేసుకుంటూ వెళితే.. ప్రతిపక్ష పార్టీల నేతలు, అంతకుముందు పరిపాలనలో ఉన్న సీనియర్ నాయకులు బాధితులకు భరోసా ఇచ్చేందుకు వస్తుంటారు. పరామర్శిస్తారు. ప్రభుత్వ లోపాలు ఉంటే ఎండగడతారు.. ప్రభుత్వం తరుపున బాధితులకు అందాల్సిన సహాయం గురించి డిమాండ్ చేసి వారికి దన్నుగా నిలుస్తారు. ఇది ఇప్పుడే వచ్చిన సాంప్రదాయం కాదు.. ఆనాదిగా ఉంది. కానీ, మంగళవారంనాటి ప్రమాదంలో ఏపీ ప్రభుత్వ తీరు మాత్రం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. ప్రమాదానికి కారణమైన బస్సు యాజమాన్యంపై ఈగ కూడా వాలకుండా పనులు పూర్తి చేయాలని పనిచేసినట్లు పరిణామలు స్పష్టం చేశాయి. ప్రతిపక్ష నేత వస్తున్నారని తెలిసి ప్రమాద స్థలం నుంచి బస్సును తొలగించడమే కాకుండా నందిగామ ఆస్పత్రి వద్ద హడావుడి మొదలుపెట్టారు. ఎవ్వరినీ రానివ్వకుండా పోలీసులను మోహరించారు. దానికి అదనంగా ప్రభుత్వ పార్టీ కార్యకర్తలు పోలీసులకంటే ముందే కొలువుతీరారు. ఒక ఉద్రిక్త వాతావరణం ఏర్పాటుచేసి హడావుడిగా మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించడం, శవాలను తరలించేందుకు అంబులెన్స్‌లు నిలపడం, పోలీసులే ఈ సపర్యలు చేయడం, బస్సు రెండో డ్రైవర్ని పంపిచేయడం.. ఇలా మొత్తం వ్యవహారమంతా చూస్తుంటే అసలు ప్రభుత్వానికెందుకు ఇంత తత్తరపాటు అని పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎక్స్‌గ్రేషియా పెంచాల్సి వస్తుందని ఈ పరిస్థితులు సృష్టించారా? లేక బస్సు యాజమాన్యం తమ ప్రభుత్వంలో ఒక భాగస్వామి కాబట్టి ఆయనను రక్షించేందుకు ఈ పనిచేశారా? అసలు చావుల దగ్గర రాజకీయ వాతావరణం సృష్టించాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రతిపక్షం అంటే కేవలం అసెంబ్లీలో సభలో మాత్రమే కనిపించాలా? మరెక్కడ కనిపించినా వారు రాజకీయం చేసేందుకు వస్తున్నారని ఎలా అనుకోగలుగుతారు? నిజానికి ఎలాంటి లోపాలు లేని పాలక వర్గానికి ఇంత బెదురు ఎందుకుంటుంది? అని ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకుంటున్నారు. మొత్తానికి సామాన్యుడి ప్రాణాలకు ఏపీ ప్రభుత్వం ప్రాంతాలవారిగా విలువకట్టిన తీరు చూస్తుంటే మానవత్వం కలత చెందే పరిస్థితి మాత్రం కనిపిస్తోంది. -
పోస్టుమార్టం చేయకుండా ప్యాకింగా..?