‘మన ప్రభుత్వ హయాంలోనే బోగస్ వ్యక్తులకు పింఛన్లు మంజూరు కావడం.. మనకే మచ్చగా మిగులుతుంది.. పింఛన్ల మంజూరు బాధ్యత జన్మభూమి కమిటీలకు ఇచ్చిన తర్వాతే బోగస్ బెడద పెరిగింది.. నా నియోజకవర్గంలోనే పరిశీలిస్తే.. 1267 నకిలీ పింఛన్లు బయటపడ్డాయి’.. .. ఈ మాటలన్నది ఎవరో సాధారణ వ్యక్తి కాదు.. సాక్షాత్తు రాష్ట్ర మంత్రి అయ్యన్నపాత్రుడే పింఛన్ల బండారాన్ని ఇలా బయటపెట్టారు..
అదీ ముఖ్యమంత్రి వద్ద కుండబద్దలు కొట్టారు..టీడీపీ అధికారంలోకి వచ్చిన 2014 నుంచీ ఇదే దందా సాగుతోంది.. ఒక్క నర్సీపట్నం నియోజకవర్గంలోనే కాదు.. విశాఖ నగరంతో సహా జిల్లావ్యాప్తంగా జన్మభూమి కమిటీల నిర్వాకం ఫలితంగా వేలాది బోగస్ లబ్ధిదారులు సంక్షేమ పింఛన్లు దక్కించుకుంటే.. అర్హులైన వారు దీనంగా దిక్కులు చూస్తున్నారు.
సాక్షి, విశాఖపట్నం: ‘బోగస్’ తుట్ట కదులుతోంది.. నర్సీపట్నంలో అర్హత లేనివారికి పెన్షన్లు దక్కినట్టు నిర్ధారణ కావడంతో అధికారులు జిల్లావ్యాప్తంగా మరోసారి సర్వేకు సిద్ధమవుతున్నారు. స్వయంగా మంత్రి అయ్యన్న అవకతవకలను బయటపెట్టడంతో సమగ్ర నివేదిక పంపాల్సిందిగా సీఎం చంద్రబాబు కలెక్టర్‌ను ఆదేశించారు. థర్డ్ పార్టీ ద్వారా ఈ పరిశీలన చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం రంగం సిద్ధం చేస్తోంది. నిష్పక్షపాతంగా సర్వే చేస్తే భారీ స్థాయిలో రద్దు చేయాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. టీడీపీ హయాంలో మంజూరు చేసిన కొత్త పింఛన్లలో 80 శాతం టీడీపీ కార్యకర్తలు, ఆ పార్టీ సానుభూతిపరులకే కట్టబెట్టారు. వీరిలో 90 శాతంమంది అనర్హులే. గడిచిన మూడున్నరేళ్లలో మంజూరు చేసిన 40 వేల పింఛన్లలోనే 30 వేలకు పైగా అనర్హులకు దక్కాయని అధికారులే చెబుతున్నారు. జన్మభూమి కమిటీలు సిఫార్సు చేశాయి.. ఎమ్మెల్యేలు ఆమోద ముద్ర వేశారు కాబట్టి తాము ఆపలేకపోయామంటున్నారు. అంతేకాదు సిటీలో ఉన్న వారికి గ్రామీణ ప్రాంతాల్లోనూ.. గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్న వారికి సిటీలోనూ పింఛన్లు మంజూరు చేసిన దాఖలాలు కూడా బయటçపడ్డాయి. ఐదెకరాల పంట భూములు, డూప్లెక్స్ ఇళ్లు, స్థలాలు, కార్లు ఉన్న వారికి సైతం పింఛన్లు మంజూరు చేశారు. అంతే కాదు.. 50–55 ఏళ్ల వయసున్న వారు సైతం ఆధార్ కార్డుల్లో వయసు మార్చుకొని మరీ పింఛన్లు పొందారు.
మరో 3 నియోజకవర్గాల్లో భారీ అవకతవకలు
నర్సీపట్నం తరహాలోనే అనకాపల్లి, పాయకరావుపేట, పెందుర్తి నియోజక వర్గాల్లో గడిచిన మూడేళ్లలో పెద్ద ఎత్తున బోగస్ పింఛన్లు మంజూరైనట్టుగా సంబంధిత శాఖాధికారులే అంగీకరిస్తున్నారు. అన్నీ తెలిసుండి కూడా తాము ఏమీ చేయలేకపోతున్నామని వాపోతున్నారు. నర్సీపట్నం తరహాలో జీవీఎంసీతోపాటు మొత్తం జిల్లా అంతటా సర్వే చేస్తే మంజూరు చేసిన వాటిలో 80 శాతం పింఛన్లు రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటున్నారు. అదే కనుక జరిగితే ప్రభుత్వానికి డామేజి వస్తుందన్న అభిప్రాయం అధికార టీడీపీ పెద్దల్లో నెలకొంది.
వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులపై గురి
బోగస్ ఏరివేత నెపంతో వైఎస్సార్‌సీపీకి చెందిన కార్యకర్తలు, సానుభూతిపరుల పింఛన్లపై వేటు వేసేందుకు టీడీపీ నేతలు సమాయత్తమవుతున్నట్టు ఆందోళన వ్యక్తమవుతోంది. ఆ విధంగా ఇప్పటికే మౌఖిక ఆదేశాలు కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి ఐదో విడతలో మంజూరైన 30 వేల పింఛన్ల కోసం ఎంపిక చేసిన లబ్ధిదారులు అర్హులా కాదా అన్న విషయాన్ని నిర్ధారించేందుకు ప్రత్యేక బృందాలతో సర్వే చేయించనున్నారు. ఆ తర్వాత ప్రజాసాధికారత సర్వేతోపాటు ప్రస్తుతం ఉన్న వృద్ధాప్య, వితంతు, వికలాంగ పింఛన్లను అనుసంధానించి పరిశీలించాలని భావిస్తున్నారు. నకిలీ పింఛన్ల బాగోతంతో అధికార టీడీపీలో కుదుపు మొదలైంది.
Comments
Please login to add a commentAdd a comment