అనకాపల్లి: గణితం సబ్జెక్ట్‌పై ఆసక్తి కాబోలు.. జీవితంలో ఎక్కడా లెక్క తప్పకుండా అడుగులేస్తున్నారు.. మేం వయసుకు వచ్చాం అం టూ పరిచయం చేసుకని.. ప్రియతమా నీవచట కుశలమా అంటూ పలకరించినా.. సినిమా చూపిస్త మావ అంటూ కడుపుబ్బా నవ్వించారు. సినిమాల్లో అగణితమైన పరిధిని పెంచుకున్నారు. అరుదుగా వచ్చిన అవకాశాలు అంది పుచ్చుకుంటూ ఒక్కో మెట్టూ ఎక్కసాగారు. పదిహేడేళ్ల క్రితం భాగ్యనగరానికెళ్లిన మన అనకాపల్లి మనువడు పొట్నూరు గ్రామస్తుడు..నక్కిన త్రినాథ్ సంక్రాంతి సందర్భంగా అమ్మమ్మ ఇంటికొచ్చి మనతో మాట్లాడారు. సందర్భానుసారంగా లోకల్ టచ్‌ను జోడిస్తూ తన దైన శైలిలో ‘నేను లోకల్’తో ముందుకొచ్చారు. పట్టణంలోని మిత్రుడు మళ్ల సురేంద్రతో పాటు తన బంధువైన ఉపాధ్యాయుడు శీలా జగన్నాథరావు ఇంట్లో ‘సాక్షి’తో మన లోకల్ త్రినాథ్ ముచ్చట్లు..
సాక్షి: సినిమా రంగంలో మీ అరంగ్రేట్ర ఎప్పుడు?
త్రినాథ్: డీవీఎన్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నప్పుడే నేను వేసిన నాటకంలోని నూకరాజు పాత్రకు మా కళాశాల ప్రిన్సిపాల్ నుంచి ప్రశంసలు అందుకున్నారు. నువ్వు సినిమా రంగంలోకి వెళ్తే మంచి స్థాయికొస్తావ్ అంటూ ఆయన అనడంతో 2000లో హైదరాబాద్‌కు వెళ్లాను. పదేళ్లపాటు ఎన్నో కష్టాలు పడి బీఎస్సీ మేథ్స్ చదివి ట్యూషన్ చెబుతూ 2012లో మొదటిసారిగా ‘మేం వయసుకు వచ్చాం ’సినిమాకు దర్శకత్వం వహించే అవకాశాన్ని దక్కించుకున్నాను.
సాక్షి: దర్శకునిగా ప్రస్థానం?
త్రినాథ్: మొదటి సినిమా తర్వాత వరుణ్‌సందేశ్‌తో ‘ప్రియతమా నీవచట కుశలమా’, ‘నువ్వలా నేనిలా ’సినిమాలకు దర్శకత్వం వహించాను. ఆ తర్వాత ‘సినిమా చూపిస్తా మావ ’కు మంచి గుర్తింపు రావడంతో నాని హీరోగా ‘నేను లోకల్’కు దర్శకత్వం వహిం చాను. ఇది నాకు స్టార్‌డమ్‌ను తీసుకొచ్చింది.
సాక్షి: ‘నేను లోకల్ ’హిట్ తర్వాత మీకు అత్యంత ఆనందం కలిగించిన ప్రశంస ఏది?
త్రినాథ్: ఆ సినిమాను చూసాక రాఘవేంద్రరావుగారు నాకు ఫోన్ చేసి చాలా బాగుందని ప్రశంసించారు. ఈ ఒక్క ప్రశంస నాకు చాలా ప్రోత్సాహాన్నిచ్చింది.
సాక్షి: అనకాపల్లితో సినీ పరిశ్రమకున్న అనుబంధంపై మీ వ్యాఖ్య..?
త్రినాథ్: ఇక్కడి కళాకారులు ఎందరో సినిమా రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నేను ‘పెళ్లిసందడి ’సినిమాను స్థానికంగా ఉన్న ఓ థియేటర్‌లో చూశాను. ఆ సినిమాలో ఎందరో ప్రఖ్యాత కమీడియన్లు పండించిన హాస్యం అందరినీ మైమరిపించింది. నాకూ అనుబంధం ఉన్నందుకు ఆనదంగా ఉంది.
సాక్షి: మీ భవిష్యత్ ప్రణాళికలేమిటి...?
త్రినాథ్: ప్రస్తుతానికి ఐదు సినిమాలు చేశాను. మంచి దర్శకునిగా గుర్తింపు తెచ్చుకోవాలనేది అభిలాష. అలాగని పెద్దహీరోలతో చేయాలని కాదు. మంచి కథలు అందించాలి. త్వరలో దిల్‌రాజు నిర్మాణంలో రామ్ హీరోగా మార్చిలో ఓ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. మెగా ఫ్యామిలీ నుంచి ఒకరు సినిమాకు దర్శకత్వం చేయమని అడిగారు.
Comments
Please login to add a commentAdd a comment