అనకాపల్లి: అంతన్నారింతన్నారు.. చివరకు ఉద్యోగాలు ఊడగొట్టారు.. తుమ్మపాల చక్కెర కర్మాగారంలో పనిచేస్తున్న ఎన్‌ఎంఆర్ కార్మికులను ఇక నుంచి విధులకు హాజరు కాకుండా నిలిపివేయాలని అధికార యంత్రాంగం నిర్ణయించడంతో ఒక్కసారిగా స్తబ్ధత నెలకొంది. కర్మాగారంలో ప్రస్తుతం 140 మంది ఎన్‌ఎంఆర్ కార్మికులు పనిచేస్తున్నారు. వీరందరికీ 40 నెలల నుంచి జీతాలు ఇవ్వడంలేదు. వీరితోపాటు రెగ్యులర్ కార్మికులు 31 మంది పనిచేస్తుండగా వారికి ఒన్‌టైం సెటిల్‌మెంట్ కింద చెల్లిస్తామని సుగర్‌కేన్ రాష్ట్ర అధికారుల నుంచి గతంలో ప్రతిపాదనలు వచ్చినా ఆ లెక్క తేలడంలేదు. తాజాగా ఎన్‌ఎంఆర్ కార్మికులను తొలగించాలని సంబంధిత శాఖ నిర్ణయించడంతో వారందరికీ భవితవ్యం అయోమయంగా మారింది. అంతేకాకుండా కర్మాగారం పరిధిలో పని చేసిన రిటైర్డ్ కార్మికులకు గ్రాట్యుటీ చెల్లించే విషయంలో కోర్టులో కేసు నడుస్తోంది. దీంతో కర్మాగారంలో ఉన్న ఉద్యోగులందరి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై మరింత స్పష్టత రెండు రోజుల్లో తేలనుంది. బకాయిలన్నీ త్వరలో సెటిల్ చేస్తామని జేసీ సృజన సహా పలు సందర్భాంల్లో అధికారులు, నేతలు హామీ ఇవ్వడంతో మంచి రోజులు వస్తాయని ఎదురుచూస్తున్న కార్మికులు తాజా పరిణామంతో ఖిన్నులయ్యారు.
జేసీ అనుమతితో ఉత్తర్వులు
కర్మాగార పర్సన్ ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్న జేసీ అనుమతి మేరకు ఎన్‌ఎంఆర్ ఉద్యోగులను రేపటి నుంచి విధుల్లోకి రావద్దని కర్మాగార ఎండీ సన్యాసినాయుడు పేరున నోటీసులు విడుదలయ్యాయి. 2014 ఎన్నికల ముందు బాబు వస్తే ఉద్యోగాలొస్తాయని తెలుగుదేశం పార్టీ ప్రధాన మేనిఫెస్టోగా చేరుస్తూ ప్రచారం చేసుకొని అధికారం చేపట్టాక జాబుల మాట దేవుడెరుగు కాని ఉన్న ఉద్యోగులను ఇంటికి పంపించే పనిలో పడింది.
ఇటీవల ఐసీడీఎస్‌లో పలు సేవలందిస్తున్న లింకువర్కర్లకు మంగళం పాడగా ఇప్పుడేమో సహకార రంగంలో కొనసాగుతున్న తుమ్మపాల సుగర్ ఫ్యాక్టరీలో విధుల్లో ఉన్న 140 మంది ఎన్‌ఎంఆర్ కార్మికులకు నీళ్లొదిలింది. దీంతో దేశం పార్టీ అధికారం చేపట్టినప్పుడల్లా సుగర్ ఫ్యాక్టరీపై నీలినీడలు అలుముకుంటూ వస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన ఏడాదికే ఫ్యాక్టరీ మూతపడడంతో ఆకలికేకలతో పదిమంది కార్మికులు మృత్యువాత పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment