మేం పండగ చేసుకోవద్దా? | police department working in all festival | Sakshi
Sakshi News home page

మేం పండగ చేసుకోవద్దా?

Published Sun, Jan 14 2018 12:30 PM | Last Updated on Thu, May 3 2018 3:20 PM

police department working in all festival - Sakshi

సాక్షి, పెదవాల్తేరు(విశాఖతూర్పు): పోలీసుశాఖలో విభజించి పాలించు చందంగా పాలన నడుస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలుగునాట పెద్ద పండగ సంక్రాంతి. ఇటువంటి ముఖ్యమైన పండగకు పోలీసులకు సెలవులు లేకుండా పోయాయి. ఈ మేరకు సెలవులు అడగొద్దంటూ నగరంలోని పోలీస్‌స్టేషన్లలో నోటీస్‌బోర్డులు సైతం ఏర్పాటు చేయడం గమనార్హం. మరోవైపు పోలీసులలో క్రైస్తవులు, ముస్లింలకు క్రిస్మస్, రంజాన్‌ పర్వదినాలలో సెలవులు ఇస్తున్నారు. నగరంలోని పోలీసులలో క్రైస్తవులు 10 శాతం, ముస్లింలు 5శాతం ఉన్నారు. మిగిలిన 85శాతం మంది పోలీసులు హిందువులే కావడం విశేషం. మరి మిగిలిన వారికి వారి పర్వదినాలలోసెలవులు ఇస్తున్న ప్రభుత్వం హిందువులైన పోలీసులకు సెలవులు ఇవ్వకపోవడం తగదని పలువురు పేర్కొంటున్నారు.

నగర పోలీస్‌కమిషనరేట్‌ పరిధిలో గల 23 పోలీస్‌స్టేషన్లలో 3,300మంది అధికారులు, కానిస్టేబుళ్లు పనిచేస్తున్నారు. అలాగే, విశాఖ రూరల్‌జిల్లా పరిధిలో 47పోలీస్‌స్టేషన్లలో 2వేల మంది వరకు పోలీసులు పనిచేస్తున్నారు. విశాఖ పోలీసులలో చాలామంది శ్రీకాకుళం, విజయనగరం, ఉభయగోదావరి, తదితర జిల్లాలకు చెందిన వారు ఉన్నారు. వీరి బంధువులు సైతం ఇతర రాష్ట్రాలు, విదేశాలనుంచి పండగకు స్వస్థలాలకు వస్తారు. ఈ నేపథ్యంలో పోలీసులు మాత్రం సెలవులు లేని కారణంగా అయినవారిని కలుసుకోలేని దుస్థితి ఎదుర్కుంటున్నారు. 

ఇదీ కారణంగా చెబుతున్నారు...
పండగకు సెలవులు ఇస్తామంటే అందరూ సెలవులు పెట్టేస్తారని పోలీసు అధికారులు చెబుతున్నారు. కాని,ఆరోగ్యం బాగోకపోయినా, ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం చేసిన సందర్భాలలో మాత్రం సెలవులు మంజూరు చేస్తున్నామని చెబుతున్నారు. ఇక సంక్రాంతి సీజన్‌ అంటే అన్ని జిల్లాలకు వీవీఐపీల తాకిడి ఎక్కువగా వుంటుంది. ఇక ఈ సీజన్‌లో దొంగతనాలు కూడా ఎక్కువగా జరుగుతాయి. ఇతర జిల్లాల నుంచి విశాఖ వలస వచ్చిన ప్రజలంతా దాదాపుగా పెద్ద పండగకు ఊళ్లకు వెళుతుంటారు. ఆయా ప్రాంతాలలో అధికశాతం ఇళ్లకు తాళాలు వేసి వుంటాయి. ఇదే అదనుగా దొంగలు చెలరేగిపోయే అవకాశం వున్నందునే సెలవులు ఇవ్వడం లేదని అధికారులు అంటున్నారు.

పోలీసుల ఆందోళన
అందరూ ఊర్లు వెళ్లిపోతుంటే పోలీసులు మాత్రం స్టేషన్లకు, బందోబస్తుకు పరిమితం కావల్సిన పరిస్థితి నెలకొంది. ఏడాదిపొడుగునా వీఐపీలు, వీవీఐపీల బందోబస్తు, నేరాల నివారణ,దర్యాప్తు, సమన్ల జారీ, స్టేషన్‌డ్యూటీ, నైట్‌పెట్రోలింగ్‌ వంటి విధులతో నిత్యం సతమమతమవుతున్నారు. ఇక రాష్ట్ర విభజన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విశాఖలో పర్యటనలు ఎక్కువగా చేయడం తెలిసిందే. విశాఖలో జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, సమ్మిట్‌ల సంగతి సరేసరి. దీనితో పోలీసులు ఊపిరిసలపనంత పనులు చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. దీంతో పోలీసులు తీవ్ర మానసిక ఒత్తిళ్లకు లోనవుతున్నారు. ఈ నేపథ్యంలో సంక్రాంతికి సరదాగా కుటుంబ సభ్యులతో స్వస్థలాలకు వెళ్లి ప్రశాంతంగా గడిపే అవకాశం లేకపోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికైనా పోలీస్‌శాఖ ,ప్రభుత్వం వైఖరి మార్చుకోవాలని పలువురు కోరుతున్నారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement