కామన్ సర్వీస్ సెంటర్
సాక్షి, విశాఖపట్నం: రోడ్డు రవాణా శాఖ (ఆర్టీఏ) ఇక అన్ని సేవలను ఆన్‌లైన్ ద్వారానే అందించనుంది. డిజిటల్ ఇండియాలో భాగంగా ఇకపై గ్రామస్థాయిలోనూ డిజిటల్ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. కొన్నాళ్ల నుంచి మీసేవ కేంద్రాల ద్వారా పూర్తిస్థాయి ఆర్టీఏ సేవలు పొందడానికి సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఫలితంగా వినియోగదార్లు ఇబ్బందులు పడుతున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఓన్డ్ కామన్ సర్వీస్ సెంటర్ (సీఎస్‌సీ)లను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తోంది. సీఎస్‌సీలు ఏర్పాటు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మీ–సేవ కేంద్రాల ద్వారా రవాణా శాఖ అందించాలనుకున్న సేవలను ఉపసంహరించుకుంది. వాటి స్థానంలో కొత్తగా అత్యాధునిక పరిజ్ఞానంతో అందుబాటులోకి వచ్చిన సీఎస్‌సీలను ఇందుకోసం వినియోగించనుంది. ఉత్తరాంధ్రతో పాటు పొరుగున ఉన్న తూర్పు గోదావరి జిల్లాతో వెరసి 2500 వరకు సీఎస్‌సీలు నడుస్తున్నాయి. విశాఖ జిల్లాలో 970, శ్రీకాకుళం 469, విజయనగరం 450, తూర్పు గోదావరి జిల్లాలో 611 సీఎస్‌సీలున్నాయి. ప్రస్తుతం ఈ సెంటర్ల ద్వారా పాన్‌కార్డులు, ఓటరు కార్డులు, డిజిటల్ బ్యాంకింగ్, టెలికాం బిల్లుల చెల్లింపు, వివిధ సర్టిఫికెట్లు పొందడం వంటి సేవలను వినియోగించుకుంటున్నారు.
తాజాగా వాటి జాబితాలోకి ఆర్టీఏ సేవలను కూడా చేర్చారు. గ్రామస్థాయిలో ఉన్న వీటి ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆర్టీఏ సేవలు చేరువవుతాయి. ఇవి అందుబాటులోకి వస్తే డ్రైవింగ్ లైసెన్సులకు స్లాట్‌ల బుకింగ్, లెర్నింగ్ (ఎల్‌ఎల్‌ఆర్)/డ్రైవింగ్ లైసెన్స్‌లు పొందడం, రెన్యూవల్ (నవీకరణ) చేయించుకోవడం, వాహనాల ఓనర్‌షిప్‌ల బదిలీలు, చిరునామా మార్పు, డూప్లికేట్లకు దరఖాస్తు చేసుకోవడం వంటి వాటి కోసం ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం రాదు. అందుబాటులో ఉన్న సీఎస్‌సీల ద్వారానే ఈ ఆర్టీఏ సేవలను తేలికగా పొందవచ్చు. ఇన్నాళ్లూ వీటి కోసం విశాఖ ఏజెన్సీలోని దూరప్రాంతాల నుంచి అనకాపల్లి ఆర్టీఏ కార్యాలయానికి వచ్చేవారు. వారు ఆ కార్యాలయానికి చేరుకునే సరికి సమయం (మధ్యాహ్నం రెండు గంటలు) మించిపోయేది. దీంతో మళ్లీ మర్నాడో, మరో రోజో రావలసి వచ్చేది. ఇకపై సీఎస్‌సీలకే ఆర్టీఏ సేవలను అనుసంధానం చేయడం వల్ల వారికి సమీపంలోని కేంద్రాలకు వెళ్లి ఆర్టీఏ సేవలు పొందడానికి వీలవుతుంది.
అంతేకాదు.. ఆర్టీఏ కేంద్రాల్లో ఉదయం 10.30 నుంచి మధ్నాహ్నం రెండు గంటల వరకే సేవలు పొందడానికి అనుమతిస్తారు. అదే సీఎస్‌సీల్లో అయితే ఉదయం నుంచి సాయంత్రం ఆరు, ఏడు గంటల వరకు, సెలవు రోజుల్లోనూ తెరిచే ఉంచుతారు. వీటి నిర్వహణపై సంబంధిత సీఎస్‌సీ ఆపరేటర్లకు విశాఖ నగరంలోనూ, జిల్లాలోని అనకాపల్లిల్లోనూ శిక్షణ ఇస్తున్నట్టు డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ వెంకటేశ్వరరావు ‘సాక్షి’కి చెప్పారు. మార్చి నెల నుంచి సీఎస్‌సీల ద్వారా ఆన్‌లైన్‌లో ఆర్టీఏ సేవలు పూర్తిస్థాయిలో వినియోగంలోకి రానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment