దత్తిరాజేరు: మండలంలోని కోమటిపల్లి జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం ఆటో స్టాండ్ వద్ద జరిగిన ప్రమాదంలో 14 మంది గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పెదమానాపురం పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే...గరివిడి మండలం లవిడాం గ్రామం నుంచి శంభర పోలమాంబను దర్శించుకోవాడానికి వస్తున్న టాటా మ్యాజిక్ వ్యాన్‌ను సాలూరు నుంచి విజయనగరం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. లవిడాం నుంచి వస్తున్న వ్యాన్ జాతీయ రహదారిపైకి ఎక్కే సమయంలో వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఆటో స్టాండ్ వద్ద ఢీకొనడంతో వ్యాన్ బోల్తా పడింది.
స్థానికులు స్పందించి అందులో ఉన్న 14 మందిని బయటకు తీసి 108లో విజయనగరం మహరాజా ఆసుపత్రికి తరలించారు. వీరిలో గుంట లక్ష్మి పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. గొర్లె వరలక్ష్మి, లండ మంగమ్మ, గొర్లె రామలక్ష్మి, గొర్ల కొండమ్మ తీవ్రంగా గాయపడ్డారు. ఆర్టీసీ బస్సు డ్రైవరు అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. ఇదే ప్రమాదంలో గజపతినగరం మండలం పురిటిపెంట నుంచి శంబర వెళ్తున్న టి.పైడిరాజు అనే మహిళ రెండు వాహనాలను తప్పించుకొని ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపడింది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ నాయుడు తెలిపారు.
ఘటనా స్థలం వద్ద డీఎస్పీ
విజయనగరంలో జరగనున్న క్రైం మీటింగ్‌కు హాజరయ్యేందుకు బొబ్బిలి నుంచి వస్తున్న డీఎస్పీ సౌమ్యలత సంఘటన స్థలం వద్ద తన వాహనాన్ని నిలిపి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. జాతీయ రహదారికి ఆనుకొని టీడీపీ నాయకులు ఫ్లెక్సీలు ఉండడంతో వాహన రాకపోకలు కనిపించకపోవడంతోనే ప్రమాదం జరిగినట్టు స్థానికులు ఆమెకు తెలిపారు. దీనిపై స్పందించిన డీఎస్పీ పెదమానాపురం పోలీసులను వాటిని తొలగించాలని ఆదేశించడంతో వీఆర్ వాటిని తొలగించారు.
Comments
Please login to add a commentAdd a comment