ములుగు: మహాజాతరలో ప్రధాన సేవలు అందించే వైద్య ఆరోగ్యశాఖ విధులు ఖరారయ్యాయి. జాతరకు వచ్చే అన్ని రూట్లలో సేవలందించేందుకు ఆ శాఖ 1,050 సిబ్బందితో పక్కా ప్రణాళికతో ముందుకుసాగుతోంది. వరంగల్ రూరల్ జిల్లా గూడెప్పాడ్ నుంచి పస్రా వరకు, కాల్వపల్లి నుంచి కాటారం వరకు, వెంకటాపురం (ఎం) మండల కేంద్రంలోని ఆర్ అండ్‌బీ గెస్ట్‌హౌస్ నుంచి ఆకులవారిఘణపురం వరకు, బ్రాహ్మణపల్లి నుంచి మంగపేట, బీరెల్లి నుంచి తాడ్వాయి వరకు అన్ని వైపులా ఉన్నా.. జాతీయ రహదారి వెంబ డి 41 వైద్య శిబిరాలు, జాతర పరిసర ప్రాంతాల్లో మరో 15 శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో శిబిరంలో వైద్యుడు, ఆయా పరిసరాల్లో ఎన్‌ఎన్‌ఎంలు, ఇతర సిబ్బంది ఉంటారు. టీటీడీ కల్యాణ మండపంలో 50 పడకల తాత్కాలిక ఆస్పత్రిని సైతం ఏర్పాటు చేస్తున్నారు. శాఖ తరఫున 5 లక్షల మాస్క్‌లను భక్తులకు అందించనున్నారు.
1,050 మంది సిబ్బంది...
జాతరలో వైద్యశాఖ తరఫున మొత్తం 1,050 మంది విధులు నిర్వర్తించనున్నారు. ఇందులో 150 మంది ఆయా పీహెచ్‌సీల మెడికల్ ఆఫీసర్లు, 82 మంది స్టాఫ్ నర్సులు, 307 మంది ఏఎన్‌ఎంలు, 100 మంది ఆశ కార్యకర్తలు, 36 మంది ఫార్మసిస్టులు, 15 మంది ల్యాబ్ టెక్నీషియన్లతో పాటు హెచ్‌ఈలు, సూపర్‌వైజర్, హెల్త్ అసిస్టెంట్లకు డ్యూటీలు వేశారు.
రహదారి వెంట శిబిరాలు...
మేడారానికి వచ్చే దారులన్నీంటిలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. గుడెప్పాడ్, కటాక్షపూర్, గట్టమ్మ ఆలయం, జంగాలపల్లి క్రాస్ రోడ్డు , చల్వాయి క్రాస్ (లక్నవరం వైపు), పస్రా, తాడ్వాయి ఆర్చీ వద్ద, బీరెల్లి, కొత్తూరు, కాటాపూర్, కాల్వపల్లి, రేగులగూడెం, పెగడపల్లి, యామన్‌పల్లి, బోర్లగూడెం, కాటారం, ఆలకువారి ఘనపురం, ములకట్ల బ్రిడ్జి, జగన్నాథపురం క్రాస్ రోడ్, చీకుపల్లి, టేకులగూడెం, వెంకటాపురం (ఎం) ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్, మంగపేట, మల్లూరు, రాజుపేట, చుంచుపల్లి, బ్రాహ్మణపల్లి, ఊరట్టం, కన్నెపల్లి, కొత్తూరు, నార్లాపూర్ క్రాస్, బయ్యక్కపేట, దూదేకులపల్లి, రాంపూర్ క్రాస్, మేడారం క్రాస్ (భూపాలపల్లి వైపు), రామప్ప, గుర్రంపేట, గణపురం క్రాస్ రోడ్‌లో శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు.
జాతర పరిసరాల్లో...
ఇక జాతర పరిసరాల్లో సైతం మరో 15 శిబిరాలు ఏర్పాటు చేసేందుకు అధికారులు నిర్ణయించారు. మేడారం పెద్ద చెరువు, ఆర్టీసీ బస్‌స్టాండ్, చిలుకలగుట్ట, ఊరట్టం కాజ్‌వే, రెడ్డిగూడెం క్రాస్ (పౌల్ట్రీ పక్కన), జంపన్న వాగు (కన్నెపల్లి వైపు), రెడ్డిగూడెం (జంపన్న వాగు దగ్గర), కన్నెపల్లి ఆర్చీ, కాల్వపల్లి క్రాస్ రోడ్, చింతల్ క్రాస్ రోడ్, పడిగాపురం, రెడ్డిగూడెం విలేజ్, ఇంగ్లిష్ మీడియం స్కూల్, పోలీస్ క్యాంప్ పరిసరాల్లో ఈ శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు.
50 పడకలతో తాత్కాలిక ఆస్పత్రి...
అమ్మవార్ల గద్దెల పక్కన ఉన్న టీటీడీ కల్యాణ మండపంలో 50 పడకల తాత్కాలిక ఆస్పత్రి ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం ఎంజీఎం నుంచి షిప్ట్‌ల వారీగా అన్ని రకాల సర్జన్లను నియమించారు. వీరంతా ప్రధాన జాతర జరిగే జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు విధులు నిర్వహిస్తారు. జనరల్ ఫిజిషీయన్–01, జనరల్ సర్జన్–01, ఈఎన్‌టీ సర్జన్, ఆర్దోపెడిక్ సర్జన్–01, కంటి వైద్య నిపుణుడు–01, అనస్థీయాలజిస్ట్–01, డెంటల్ సర్జన్–01, పిడియాట్రిషియన్–01, రేడియాలజిస్ట్–01, గైనకాలజిస్ట్ ఒకరు ఉంటారు. దీంతో పాటు ఇండియన్ మెడికల్ అసోషియేషన్ తరుపున వెంటిలేటర్, అపస్మారక స్థితిలో శ్వాస తీసుకోవడం ఇబ్బంది ఉన్న సమయంలో చాతిపై ప్రయోగించే ఎలక్ట్రికల్ మిషన్లు అందుబాటులో ఉంచనున్నారు.
కాగా, ప్రధాన శిబిరంలో కార్డియాలజిస్ట్‌ను కేటాయించాలని జిల్లా వైద్య యంత్రాంగం ఐఎంఏను కోరింది. క్యాంప్‌ల్లో పరిస్థితి అదుపులోకి రాని పక్షంలో రోగులకు ములుగు ఏరియా ఆస్పత్రి, ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రి, ఎంజీఎంకు తరలించడానికి 108 అంబెలెన్స్‌లు 20, మినీ అంబులెన్స్‌లు 10 అందుబాటులో ఉంచనున్నారు. కాగా, క్యాంప్ ఇన్‌చార్జిలుగా డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు క్రాంతికుమార్, మధుసూదన్, ఎపిడమిక్ అధికారి శ్రుతి ఉంటారు. డీఎంహెచ్‌ఓ అల్లెం అప్పయ్య పూర్తి పర్యవేక్షణ చేయనున్నారు.
అనుభవం ఉన్న వారిని ఆహ్వానించాం..
వైద్యశాఖ తరపున గత జాతరలో విధులు నిర్వర్తించిన డీఎంహెచ్‌ఓలు సాంబశివరావు, దయానందస్వామి, శ్రీరాం, హరీష్‌రాజ్‌ను ఆహ్వానించాం. వారి అనుభవా లు సాయంగా తీసుకుంటాం. 50 పడకల ఆస్పత్రిలో 10 మంది సర్జన్లు ఉంటారు. వీరితో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆయా పీహెచ్‌సీల వైద్యులు, సిబ్బంది విధులు నిర్వర్తిస్తారు. భక్తులకు ఆరోగ్య పరంగా ఎక్కడ చిన్న ఇబ్బంది కలిగినా తక్షణమే వైద్య శిబిరాలకు తరలించి వైద్యం అందిస్తాం.
Comments
Please login to add a commentAdd a comment