బలరాం ప్రసాద్ ఫిర్యాదుపై సంబంధిత అధికారులను ప్రశ్నిస్తున్న కలెక్టర్ కె.భాస్కర్
ఏలూరు (మెట్రో): అనేక సంవత్సరాలు సేవలందించిన ఉద్యోగి అనారోగ్యానికి గురైతే ఇబ్బంది పెట్టడం దేనికని, తోటి ఉద్యోగులకి మానవత్వం లేకుండా పోతోందని కలెక్టర్ కాటంనేని భాస్కర్ అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన వినతులు, ఫిర్యాదులను కలెక్టర్ స్వయంగా తెలుసుకుని వాటి పరిష్కారానికి ఆయా శాఖల అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ సందర్భంగా వచ్చిన ఒక ఫిర్యాదుపై భూగర్భ జల వనరుల శాఖ అధికారులను కలెక్టర్ తిట్లతో తలంటారు. ఆ శాఖలో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగి డీ.బలరాంప్రసాద్ మెడికల్ బిల్లులను నిలుపుదల చేయడాన్ని కలెక్టర్ ప్రశ్నించారు. మెడికల్ బిల్స్ చెల్లింపులో అనేకసార్లు కార్యాలయం చుట్టూ సంబంధిత అధికారులు తిప్పుకుంటున్నారని కలెక్టర్‌కు బాధితుడు విన్నవించారు. బిల్లులను తీసుకోవాలని ప్రాథేయపడినా కనీసం బిల్లుల స్వీకరణకు కూడా స్పందించలేదని ఆవేదన చెందగా కలెక్టర్ తీవ్రంగా స్పందించారు.
తక్షణమే బలరాం ప్రసాద్‌కు ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు చెల్లించాలని అధికారులను ఆదేశించారు. భీమవరం మండలం కొమరాడ దళితవాడకు చెందిన ఎస్.పోతురాజు, జీ.మేరీసుధ, టీ.రఘురాజు మరికొంత మంది డంపింగ్‌యార్డు నిర్మాణ ప్రదేశాన్ని వేరే ప్రాంతానికి మార్చాలని కోరారు. కలెక్టరు స్పందిస్తూ గ్రామాల్లో పరిశుభ్ర వాతావరణం ఉండాలంటే చెత్తను తొలగించి డంపింగ్‌యార్డులకు తరలించా లని అటువంటి నిర్మాణాలను వద్దనడం సరికాదన్నారు. కార్యక్రమంలో జేసీ పి.కోటేశ్వరరావు, ఏజేసీ ఎంహెచ్ షరీఫ్, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాసులు, డ్వామా పీడీ గణేష్‌కుమార్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ సీహెచ్ అమరేశ్వరరావు, డీఈఓ సీవీ రేణుక, డీపీఓ ఎం.వెంకటరమణ, పంచాయతీరాజ్ ఎస్‌ఈ మాణిక్యం, ఇరిగేషన్ ఎస్‌ఈ రఘునాథ్, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ నిర్మల, డీఎంహెచ్‌ఓ డాక్టర్ బి.సుబ్రహ్మణ్యేశ్వరి, డీసీహెచ్‌ఎస్ కె.శంకరరావు పాల్గొన్నారు.
ఆస్తుల ఆక్రమణలపై విచారణ
దేవాదాయశాఖ ఆస్తుల అన్యాక్రాంతంపై సమగ్ర విచారణ చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో ప్రజల నుంచి ఫోన్‌ద్వారా వచ్చిన పలు సమస్యలను, ఫిర్యాదులను కలెక్టర్ విని వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వీరవాసరం నుంచి మద్దాల రామకృష్ణ మాట్లాడుతూ వీరవాసరంలోని గ్రూపు దేవాలయాలకు సంబంధించి సుమారు పది ఎకరాల సంగీతమాన్యం భూమి అన్యాక్రాంతమయ్యిందని ఫిర్యాదు చేశారు. ఘటనపై విచారణ నిర్వహించాలని దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్‌ను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment