ప్రాణాలు కాపాడిన.. అధికారుల ముందుచూపు | Truck driver cleaner saved by huge net in China | Sakshi
Sakshi News home page

ప్రాణాలు కాపాడిన.. అధికారుల ముందుచూపు

Published Tue, Jul 31 2018 10:54 AM | Last Updated on Tue, Jul 31 2018 4:33 PM

Truck driver cleaner saved by huge net in China - Sakshi

బీజింగ్‌ :  చైనా పోలీసుల ముందుచూపుతో ఇద్దరు వ్యక్తులు మరణం అంచు నుంచి తప్పించుకోగలిగారు. దక్షిణ చైనాలోని యువాన్‌ ప్రావిన్స్‌లోని కున్‌మింగ్‌-మోహన్‌ రహదారి ఎత్తైన కొండల గుండా వెళుతుంది. ఎత్తైన కొండ నుంచి కింది వైపుకి ఉన్న కున్‌మో ఎక్స్‌ప్రెస్‌ హైవేలో దాదాపు 27 కిలో మీటర్ల దూరం అత్యంత ప్రమాదకరమైంది. దీనికి స్లోప్‌ ఆఫ్‌ డెత్‌ గా పేరు కూడా ఉంది. తరుచూ ప్రమాదాలు జరిగే కొన్ని ప్రాంతాలను గుర్తించి, ఒక వేళ ప్రమాదం జరిగితే ప్రాణ నష్టం జరగకుండా ఉండాలంటే ఏం చేయాలని, ఇంజినీర్ల సహాయంతో 2015లో స్థానిక పోలీసులు కొన్ని నిర్మాణాలను చేపట్టారు. వాహనాలు లోయలో పడిపోకుండా ఏటవాలుగా కొద్దిదూరం రోడ్డును నిర్మించి కంకరతో నింపారు. అంతేకాకుండా కొండపైన రోడ్డు అంచునుంచి కిందకి పడిపోకుండా భారీ వలను కూడా ఏర్పాటు చేశారు. 

అయితే సోమవారం ఓ భారీ లారీ కున్‌మో ఎక్స్‌ప్రెస్‌ హైవేపై ఉన్న మూలమలుపు వద్ద అదుపుతప్పింది. భారీ వాహనం కావడం, అది కూడా అతివేగంగా వెళ్లడంతో కంకరను సైతం దాటుకొని రోడ్డు అంచున ఆగిపోయింది. లారీ వెనక భాగం రోడ్డుపైనే నిలిచిపోగా.. క్యాబిన్‌ రోడ్డు అంచును దాటుకొని ముందుకు వాలిపోయింది. దీంతో లారీ అద్దాల్లో నుంచి డ్రైవర్‌, క్లీనర్‌లో బయటివైపు పడిపోయారు. అయితే అధికారులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నిర్మించిన వల ఉండటంతో అందులో పడి ప్రాణాలు దక్కించుకున్నారు. ప్రమాదాల నివారణ కోసం స్థానిక పోలీసులు 2015లో మూల మలుపు వద్ద చేపట్టిన నిర్మాణాకి అంచున వలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఆ నిర్మాణం వల్ల ఐదుగురు వ్యక్తులు ప్రాణాలను కాపాడుకోగలిగారు. ఆ భారీ వల లేకపోతే దాదాపు330 అడుగుల ఎత్తు నుంచి కిందకు పడిపోయి, ఈ పాటికి చనిపోయి ఉండేవాళ్లమని, అధికారులకు డ్రైవర్‌ కృతజ్ఞతలు తెలిపాడు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement