
దేశ రాజధాని ఢిల్లీలో పెను విషాదం జరిగింది. ఉత్తరప్రదేశ్‌లో కొనసాగుతున్న మహాకుంభమేళా (Kumbh Mela)లో పాల్గొనేందుకు వెళ్తున్న భక్తులతో కిక్కిరిసిన న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో (New Delhi Railway Station) తొక్కిసలాట జరిగింది.

ఈ తొక్కిసలాటలో మొత్తం 18 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. 30మంది తీవ్రంగా గాయపడ్డారు.

గాయపడిన వారిలో మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో 11 మంది మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నారు.

న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో కుంభమేళాకు వెళ్లాల్సిన రెండు రైళ్లు ఆలస్యం కావడంతో ఈ విషాదం చోటు చేసుకున్నట్లు సమాచారం.

శనివారం రాత్రి 8 గంటల సమయంలో 14,15 ఫ్లాట్‌ఫామ్‌లలో ప్రయాణికులు ప్రయాగ్‌రాజ్‌కు రైళ్లను ఎక్కేందుకు వేచి ఉండటంతో గందరగోళ పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది.

న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ పెను విషాదంపై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా ద్రిగ్భాంతిని వ్యక్తం చేశారు.

‘న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట ఘటనతో ఆందోళనకు గురయ్యాను.

క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేస్తున్నారు’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.






