1/8
పాత సినిమా పాట మొదటి పదాలు ఇవి. మిగలిన భాగం సంగతి కాసేపు పక్కనపెట్టేదాం. అందమైన లోకం దాని రంగులకే పరిమితం అవుదాం. లండన్‌లోని నేచురల్ హిస్టరీ మ్యూజియం అరవై ఏళ్లుగా నిర్వహిస్తున్న వైల్డ్ లైఫ్ ఫొటోగాఫర్ ఆఫ్ ద ఇయర్ తాజా పోటీల్లో విజేతలుగా నిలిచినా.. అందరినీ అకట్టుకున్న అత్యద్భుత ఛాయాచిత్రాల సమాహారం కింద కనిపిస్తోంది. చూసేయండి.. ఆనందించండి.. ‘‘చలిచీమల చేత చిక్కి చావదె సుమతి’’ అన్న పాత తెలుగు పద్యాన్ని గుర్తు చేస్తుందీ ఫొటో. ఎర్ర గండుచీమలన్నీ కలిసికట్టుగా ఒక కీటకాన్ని చంపేస్తూంటే.. వాటిల్లో ఒకటి దానిపైకి ఎక్కిన దృశ్యాన్ని జర్మనీ ఫొటోగ్రాఫర్ ఇంకో ఆర్న్‌ట్ తీశాడు. ఫొటోకు పెట్టిన పేరు..‘డెమొలిషన్ స్క్వాడ్’!
2/8
అంటార్కిటికాలోని పారడైజ్ హార్బర్‌లో మంచుపొరల కింద.. సముద్రంలో తిరుగుతున్న సీల్ ఫొటో ఇది. ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ స్మిత్ తీశారు. అండర్‌వాటర్ కేటగిరిలో బహుమతి సాధించిందీ ఫొటో!
3/8
మనిషి స్వార్థానికి జంతువులను వాడుకునే కుత్సిత క్రీడకు తార్కాణం ఈ ఫొటో. ఎంచక్కా చక్కగా డ్రస్ వేసుకుని కనిపిస్తున్న ఈ ఒరాంగ్ ఊటాన్ వెనుక దయనీయమైన కథ ఉంది. కొన్ని దేశాల్లో వీటితో బాక్సింగ్ పోటీలు నిర్వహిస్తారు. ఫ్రెండ్లీ పోటీలైతే ఫర్వాలేదు కానీ.. సరిగ్గా ఆడకపోతే ఈ అమాయక ప్రాణుల కడుపు మాడుస్తారు. లేదంటే హింసిస్తారు. ఈ విషయాన్ని ప్రపంచం దృష్టికి తెచ్చే ఉద్దేశంతోనే తానీ ఫొటో తీసినట్లు యూకే ఫొటోగ్రాఫర్ ఆరన్ గెకోస్కీ చెబుతున్నారు. బాక్సింగ్ మ్యాచ్ తాలూకూ ఉద్వేగాలన్నీ సమసిపోయి ఇలా పోజిచ్చేందుకు ఆ ఒరాంగ్ ఊటాన్ చాలా సమయమే తీసుకుందని అంటున్నారు.
4/8
మీకు తెలుసా? ఏనుగులు ఎప్పుడూ కుటుంబ సమేతంగా గుంపులుగానే తిరుగుతాయి అని! తమిళనాడులోని అన్నామలై టైగర్ రిజర్వ్‌లో ఎంచక్కా ఏనుగు తల్లి తన గున్న ఏనుగులతో ఇలా విశ్రాంతిగా పడుకున్న చిత్రాన్ని డ్రోన్ సాయంతో ధను పరన్ చిత్రీకరించారు. డ్రోన్‌ను ఎగరేయడం.. ఫొటోలు తీయడం.. అంతా ఇరవై నిమిషాల్లోనే జరిగిపోయిందట.
5/8
నిశిరాతిరి చీకట్లో తీతువు పిట్ట చందంగా కనిపిస్తోంది కానీ.. వాస్తవానికి ఇదో నీటి మడుగుపై తీసిన చిత్రం.. జర్మనీ ఫొటోగ్రాఫర్ జాన్ లెమాన్ తీశారు. బ్రిడ్జిపై నుంచి తీసిన ఈ ఛాయాచిత్రంలో నీటిలో ప్రతిబింబిస్తున్న సూర్యుడితోపాటు మధ్యలో ఓ పక్షి నీడ ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాయో!
6/8
అంతగా ఆకట్టుకోని.. ఇతరులు ఎవరూ పట్టించుకోని జంతు జాతుల ఫొటోలు తీయాలన్నది థియో బాస్‌బూమ్ లక్ష్యం. అందుకే ఈయన నెదర్లాండ్స్‌లోని సముద్రతీరంలో అలల తాకిడికి కొట్టుకుపోకుండా ఉండేందుకు కలిసికట్టుగా పెరిగిన నత్తగుల్లలను ఇలా తన కెమెరాతో బంధించాడు!
7/8
అడవికి రారాజు సింహమే కానీ.. పెళ్లాం ముందు అందరూ పిల్లులన్నట్టుగా ఉందీ చిత్రం. సెరెంగెటి నేషనల్ పార్క్‌లో విలియం ఫోర్ట్‌స్క్యూ (యూకే) తీసిన ఈ ఫొటోలో ఆడ, మగ సింహాలు సీరియస్ వాదులాటలో ఉన్నాయి. పునరుత్పత్తి కార్యక్రమం మధ్యలో తెంపేసుకుందట ఆడ సింహం. మగ సింహం కోపం చూడండి!!
8/8
సీతాకోక చిలుకల్లో మోనార్క్ బట్టర్‌ఫ్లైస్‌ది ప్రత్యేక స్థానం. భారీ కాయం, అందమైన రంగులు వీటి సొంతం. మెక్సికోలోని బయోస్ఫియర్ సంగ్రహాలయంలో ఇలా గుంపులు గుంపులగా అతుక్కువపోయిన మొనార్క్ బటర్‌ఫ్లైలను హృద్యంగా తన కెమెరా కంటితో బంధించాడు.. స్పెయిన్ ఫొటోగ్రాఫర్ జేమ్స్ రోజో! ఈ ఫొటోకు ఓ పేరు కూడా ఉంది.. ‘‘ఓపెన్ అండ్ షట్’’!