

భారత వెటరన్ షట్లర్ సైనా నెహ్వాల్ త్వరలోనే రిటైర్మెంట్‌పై నిర్ణయం వెలువరిస్తానని చెప్పింది.

చాన్నాళ్లుగా పోటీలకు దూరంగా ఉంటున్న సైనా అర్థరైటిస్ (కీళ్ల నొప్పుల) నుంచి ఇబ్బంది పడుతోంది.


దీనివల్ల రెగ్యులర్ ప్రాక్టీస్, పోటీలు కుదరడం లేదని 34 ఏళ్ల ఈ ప్రపంచ మాజీ నంబర్‌వన్ ప్లేయర్ చెప్పింది.

ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది చివరికల్లా తన బ్యాడ్మింటన్ భవిష్యత్తుపై తుది నిర్ణయం తీసుకుంటానని ఆమె వెల్లడించింది.

మాజీ షూటర్, పారిస్‌లో భారత జట్టుకు చెఫ్ డి మిషన్‌గా వ్యవహరించిన గగన్ నారంగ్ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ‘మోకాలు ఏమాత్రం సహకరించడం లేదు.


తీవ్రమైన కీళ్లనొప్పుల సమస్య వెంటాడుతోంది. గంటల తరబడి ప్రాక్టీస్ చేయలేకపోతున్నా.

కాబట్టే పోటీల బరిలోనూ దిగడం లేదు. రెండు గంటల ట్రెయినింగ్‌తో ప్రపంచ మేటి షట్లర్లతో ఢీకొట్టడం ఎలా సాధ్యమవుతుంది. క్రీడాకారులకు రిటైర్మెంట్ అనేది తప్పదు.

అయితే ఈ రిటైర్మెంట్ నాపై ఎలాంటి ప్రభావం చూపిస్తోందననే ఆలోచిస్తున్నా.

ఆటకు టాటా చెప్పడం బాధగానే ఉంటుంది. కానీ... ఎప్పుడో ఒకప్పుడు వీడ్కోలు చెప్పాల్సిందే’ అని వివరించింది.

సాధారణంగా ఓ క్రీడాకారుడి కెరీర్ చాలా చిన్నదని, తను 9 ఏళ్ల వయస్సు నుంచే షటిల్ ఆడటం మొదలుపెట్టానని, వచ్చే ఏడాది 35 ఏళ్లకు చేరుకుంటానని... సుదీర్ఘ కాలంపాటు దేశానికి ప్రాతినిధ్యం వహించడం గౌరవంగా భావిస్తానని చెప్పింది.


‘నేను ఆట కోసం అంకితభావంతో చెమటోడ్చాను. అందుకే మూడు ఒలింపిక్స్‌లు ఆడగలిగాను. పతకం కోసం వందశాతం కృషి చేశాను. ఓ అగ్రశ్రేణి క్రీడాకారులుగా ఎదిగాక మనపై చాలా అంచనాలుంటాయి.

ముఖ్యంగా స్పాన్సర్లు, కుటుంబసభ్యులు, కోచ్‌లు, స్నేహితులు ఇలా అందరూ మనం బాగా ఆడాలని ఆశిస్తారు.

అథ్లెట్ల కెరీర్ తక్కువ. ఇలాంటపుడు నాలుగేళ్ల విరామం చాలా సుదీర్ఘమైంది. అలాగే కష్టమైంది కూడా! ఇంత గ్యాప్ తర్వాత మళ్లీ అత్యుత్తమ ప్రదర్శన దాదాపు అసాధ్యంగానే మారుతుంది.

ఓ అంతర్జాతీయ చాంపియన్‌గా అవతరించాలనుకుంటే ఎల్లప్పుడు కఠిన నిర్ణయాలకు సిద్ధంగా ఉండాలి’ అని 34 ఏళ్ల సైనా పేర్కొంది.

2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన ఆమె 2010, 2018 కామన్వెల్త్ క్రీడల్లో చాంపియన్‌గా నిలిచింది.