Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

High Court once again expresses strong anger against AP police1
చట్టం అంటే లెక్క లేదా?

అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది? చట్టాన్ని బేఖాతర్‌ చేస్తున్న పోలీసులను ఇలాగే వదిలేస్తే రేపు మనం అందరం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వ్యక్తి స్వేచ్ఛకు మించి మాకు ఏదీ ముఖ్యం కాదు. ఈ విషయాన్ని పలుమార్లు పునరుద్ఘాటించినా పోలీసులు కోర్టుల ఆదేశాలను లెక్కచేయడం లేదు. పోలీసులై ఉండి చట్టాన్ని ఎలా ఉల్లంఘిస్తారు? మీరుండేది చట్టాన్ని, న్యాయాన్ని కాపాడటానికా? లేక దాన్ని ఉల్లంఘించడానికా? పిల్లలు తప్పు చేశారంటూ తల్లిదండ్రులను వేధిస్తారా? తెలియని విషయాలను చెప్పాలని ఒత్తిడి చేస్తారా? ఇలా చేయమని ఏ చట్టం మీకు చెబుతోంది? పౌరుల పట్ల వ్యవహరించాల్సిన తీరు ఇదేనా? – హైకోర్టుసాక్షి, అమరావతి: రెడ్‌బుక్‌ అరాచకాలకు కొమ్ము కాస్తూ రాజ్యాంగం ప్రసాదించిన ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలకు తూట్లు పొడుస్తున్న పోలీసు ఉన్నతాధికారులు, సిట్‌ అధికారుల తీరుపై హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది? చట్టాన్ని బేఖాతర్‌ చేస్తున్న పోలీసులను ఇలాగే వదిలేస్తే రేపు మనం అందరం ఇబ్బందులు పడాల్సి వస్తుందంటూ వ్యాఖ్యలు చేసింది. వ్యక్తి స్వేచ్ఛకు మించి తమకు ఏదీ ముఖ్యం కాదని, ఈ విషయాన్ని పలుమార్లు పునరుద్ఘాటించినా పోలీసులు కోర్టుల ఆదేశాలను లెక్కచేయడం లేదని మండిపడింది. ‘‘పోలీసులై ఉండి చట్టాన్ని ఎలా ఉల్లంఘిస్తారు? మీరుండేది చట్టాన్ని, న్యాయాన్ని కాపాడటానికా? లేక దాన్ని ఉల్లంఘించడానికా? పిల్లలు తప్పు చేశారంటూ తల్లిదండ్రులను వేధిస్తారా? తెలియని విషయాలను చెప్పాలని ఒత్తిడి చేస్తారా? ఇలా చేయమని ఏ చట్టం మీకు చెబుతోంది? పౌరుల పట్ల వ్యవహరించాల్సిన తీరు ఇదేనా? దర్యాప్తు అధికారినే మా ముందుకు రమ్మనండి.. చట్టం ఏం చెబుతుందో ఆయన్ను అడిగి తెలుసుకుంటాం. సిట్‌లోని అధికారులు వారికి వారు చాలా పెద్దవాళ్లం.. శక్తిమంతులం అని అనుకుంటున్నారు. శక్తిమంతులం కాబట్టి ఏం చేసినా చెల్లుతుందని భావిస్తున్నారు. చట్టం అవసరం లేదు.. అధికారమే ముఖ్యమని అనుకుంటున్నారు. ఒంటిపై యూనిఫాం ఉంది కదా ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే ఆలోచనలో ఉన్నారు. సిట్‌ అదనపు ఎస్పీ ఎవరు కావాలంటే వారిని తీసుకొచ్చేస్తారా? పోలీసుల వ్యవహారశైలి అత్యంత దురదృష్టకరం’’ అని సోమవారం ఓ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సాక్షిగా ఓ వృద్ధుడిని విచారించాలంటే చట్టం ఏం చెబుతుందో మీకు తెలియదా? అని సూటిగా ప్రశ్నించింది. ఆయన్ను సిట్‌ అదనపు ఎస్పీ తిరుపతి నుంచి విజయవాడకు ఎందుకు పిలిపించాల్సి వచ్చిందో స్పష్టమైన వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ వ్యాజ్యంలో దర్యాప్తు అధికారి శ్రీహరిబాబుని సుమోటోగా ప్రతివాదిగా చేరుస్తూ తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ రావు రఘునందన్‌రావు, డాక్టర్‌ జస్టిస్‌ కుంభజడల మన్మథరావుల ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. సిట్‌ దర్యాప్తు అధికారిపై నిప్పులు.. రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలవుతున్న తీరు, పోలీసుల దుర్మార్గ పోకడను తిరుపతికి చెందిన 60 ఏళ్ల వృద్ధుడు, విశ్రాంత పోలీసు అధికారి సుబ్రహ్మణ్యంరెడ్డి హైకోర్టుకు పూసగుచి్చనట్లు నివేదించారు. కేసు ఏమిటి? నేరం ఏమిటి? అనే విషయాలను చెప్పకుండా తనను అర్ధరాత్రి తిరుపతి నుంచి విజయవాడకు ఆగమేఘాలపై తరలించిన పోలీసులు విచారణ పేరుతో దారుణంగా వ్యవహరించారని హైకోర్టుకు మొర పెట్టుకున్నారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న తన భార్యకు కనీసం మందులు కొనేంత వరకైనా ఆగాలని ప్రాథేయపడినా వినకుండా బలవంతంగా తరలించారంటూ కన్నీటిపర్యంతమయ్యారు. పదోన్నతి కూడా వద్దనుకుని భార్యకు సపర్యలు చేస్తూ ఇంటి వద్ద ఉంటున్న తన పట్ల పోలీసులు అమానుషంగా వ్యవహరించారన్నారు. తానేదో నేరం చేసినట్లు ఇంటి వద్ద మోహరించారన్నారు. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) అధికారులు ముఖ్యంగా దర్యాప్తు అధికారి (ఐవో) విచారణ పేరుతో తనను బంధించి చిత్రహింసలు పెట్టారని కోర్టు దృష్టికి తెచ్చారు. సినిమాల్లో మాదిరిగా ప్రవర్తించి తనను తీవ్ర భయభాంత్రులకు గురి చేశారన్నారు. ఎవరు.. ఎప్పుడు.. ఎక్కడి నుంచి వచ్చి తన వెంటపడతారోనని భయంగా ఉందన్నారు. సుబ్రహ్మణ్యంరెడ్డి చెప్పిన వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు సిట్‌ దర్యాప్తు అధికారి, అదనపు ఎస్‌పీతో పాటు ఇతర పోలీసులపై నిప్పులు చెరిగింది. ‘అసలు ఏం కేసు ఉందని సుబ్రహ్మణ్యంరెడ్డిని తిరుపతి నుంచి విజయవాడకు పిలిపించారు. ఆయన ఏ కేసులోనూ నిందితుడు కారు. అలాంటప్పుడు ఆయన పట్ల దురుసుగా ఎందుకు ప్రవర్తించినట్లు? అధికారం ఉంది కాబట్టి చేశామంటారా? అదే విషయం చెప్పండి.. ఏం చేయాలో మాకు బాగా తెలుసు...’ అని న్యాయస్థానం మండిపడింది. బాలసుబ్రహ్మణ్యంరెడ్డిని గుర్తు తెలియని పోలీసులు ఈ నెల 16వ తేదీ రాత్రి 11.50 గంటలకు తిరుపతిలోని ఆయన ఇంటి నుంచి తీసుకెళ్లడంపై వైఎస్సార్‌సీపీ నేత మేకా వెంకటరామిరెడ్డి గత వారం హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం ఆదేశాల మేరకు బాలసుబ్రహ్మణ్యంరెడ్డి స్వయంగా కోర్టు ముందు హాజరై వాస్తవాలను నివేదించారు. ‘పోలీసు వాహనంలో నన్ను విజయవాడ కమిషనర్‌ వద్దకు తరలించి నా మొబైల్‌ లాక్కున్నారు. సిట్‌ అదనపు ఎస్‌పీ నన్ను దూషించారు. బంధించి హింసలు పెట్టారు. ముందు రోజే నోటీసులు ఇచి్చనట్లు ఆ తేదీ వేసి నన్ను సంతకం చేయమన్నారు. కాపీ మాత్రం ఇవ్వలేదు. తెల్ల కాగితాలపై నా సంతకాలు తీసుకున్నారు..’ అని కోర్టుకు విన్నవించారు.ఆటిట్యూడ్‌ చూపితే ఏం చేయాలో తెలుసు...బాలసుబ్రహ్మణ్యంరెడ్డి చెప్పిన వివరాలన్నింటినీ అఫిడవిట్‌ రూపంలో కోర్టు ముందుంచితేనే వాటికి సమాధానం ఇవ్వడం సాధ్యమవుతుందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) పేర్కొనటంపై ధర్మాసనం తీవ్రంగా మండిపడింది. ప్రభుత్వ న్యాయవాది నుంచి తాము ఇలాంటి తీరును ఆశించడం లేదని స్పష్టం చేసింది. అఫిడవిట్‌ దాఖలు చేస్తేనే స్పందిస్తామంటే ఆ దిశగా ఆదేశాలు ఇస్తామని, ఆ అఫిడవిట్‌కు వెంటనే కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదికి తేల్చి చెప్పింది. ఇలాంటి ఆటిట్యూడ్‌ చూపిస్తే ఏం చేయాలో తమకు తెలుసునంది. బాలసుబ్రహ్మణ్యంరెడ్డి ఇంటి వద్ద ఉన్న పోలీసులెవరని ప్రశ్నించగా ఎస్‌జీపీ వారి పేర్లను తెలిపారు. అసలు ఇదంతా చేయమని వెనకుండి ఎవరు చెబుతున్నారో వారిని ముందుకు రమ్మనండని, చట్టం గురించి వారితోనే మాట్లాడతామని ధర్మాసనం స్పష్టం చేసింది. అవసరమైతే ఈ కేసులో తామే ట్రయల్‌ కూడా నిర్వహిస్తామని, సుబ్రహ్మణ్యంరెడ్డి చెప్పిన వివరాలను వాంగ్మూలంగా తామే నమోదు చేస్తామంది. ఈ సమయంలో పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది సుబ్రహ్మణ్యం శ్రీరామ్‌ స్పందిస్తూ, బీఎన్‌ఎస్‌ఎస్‌ సెక్షన్‌ 179ని చదివి వినిపించారు. ఈ సెక్షన్‌ ప్రకారం 60 ఏళ్ల పైబడిన వారిని వారి ఇంటి వద్దనే విచారించాల్సి ఉంటుందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. పోలీసులు దురుద్దేశంతో, బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని వివరించారు. చట్టం అంటే గౌరవమే లేదని, చట్ట నిబంధనలను చాలా తేలిగ్గా తీసుకుంటున్నారని పోలీసులను ఉద్దేశించి ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. దర్యాప్తు పేరుతో ఎలా పడితే అలా వ్యవహరిస్తామంటే కుదరదని స్పష్టం చేసింది. 18-12-2024..మెదడు ఉపయోగించకుండా యాంత్రికంగా రిమాండ్‌ ఉత్తర్వులు..‘సోషల్‌ మీడియా పోస్టులను వ్యవస్థీకృత నేరంగా పరిగణిస్తూ బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 111 కింద దర్యాప్తు అధికారి కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో ఎలాంటి ఆధారాలు చూపలేదు. అయినా కింది కోర్టు మెజిస్ట్రేట్‌ ఆధారాలున్నా­యనడం తప్పు. మెజిస్ట్రేట్‌ మెదడు ఉపయోగించకుండా, యాంత్రికంగా రిమాండ్‌ ఉత్తర్వులిచ్చారు. పోలీసులు ఇచ్చిన నోటీసుల్లో అరెస్ట్‌కు గల కారణాలను చెప్పలేదు..’ – సోషల్‌ మీడియా పోస్టులకు సంబంధించి తన కుమారుడు వెంకట రమణారెడ్డికి వినుకొండ కోర్టు విధించిన రిమాండ్‌ను రద్దు చేయాలని కోరుతూ పప్పుల చెలమారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సమయంలో హైకోర్టు వ్యాఖ్యలు.06-01-2025కోర్టుల కన్నా ఎక్కువ అనుకుంటున్నారా..?‘సోషల్‌ మీడియా యాక్టివిస్టు వర్రా రవీంద్రరెడ్డి నిర్బంధానికి సంబంధించి మేం అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధా­నాలు ఇవ్వాలి. రవీంద్రరెడ్డిని ఎప్పుడు నిర్బంధంలోకి తీసుకున్నారు? ఎప్పుడు అరెస్ట్‌ చూపారు? ఆయనపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారా..? ఈ ప్రశ్నలకు సూటిగా సమాధా­నాలు కావాలి. ఈ కేసులో పోలీసులు మొదటి నుంచి మా ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి తీరును సహించేది లేదు. కోర్టులకన్నా ఎక్కువ అనుకుంటున్నారా? కడప ఎస్పీ తీరు చూస్తుంటే అలాగే ఉంది. ఆరోపణలు నిజమని తేలితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి..!’ – వర్రా రవీంద్రరెడ్డి అక్రమ నిర్బంధంపై ఆయన భార్య కళ్యాణి దాఖలు చేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌పై విచారణ సమయంలో హైకోర్టు వ్యాఖ్యలు18-02-2025..లోపలేయడం మినహా మీరేం చేస్తున్నారు?‘వ్యక్తులపై కేసులు పెట్టడం.. వారిని కొట్టడం.. లోపలేయ­డం మినహా మీరేం చేస్తున్నారు? కేసులు పెట్టి లోపల వేయడం మినహా ఏ కేసులోనూ దర్యాప్తు చేయ­డం లేదు. కోర్టు ఆదేశా­లను పోలీసులు చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. ఇలాంటి తీరును సహించేది లేదు. బొసా రమణ అనే వ్యక్తి అరెస్ట్‌ విషయంలో దర్యాప్తు చేసి ఉంటే ఆ వివరాలను మా ముందు ఉంచేవారు. దర్యాప్తు చేయలేదు కాబట్టే ఏ వివరాలను సమర్పించలేదు. అతడిపై 27 కేసులున్నా­యని చెబుతున్నారు. కానీ ఆ కేసుల దర్యాప్తు వివరాలను మా ముందు ఉంచడంలేదు. మా ఆదేశాలపై డీజీపీ ఏ చర్యలు తీసుకున్నారు..?’ – విశాఖకు చెందిన బొసా రమణ అరెస్టుపై ఆయన భార్య దాఖలు చేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌పై విచారణ సమయంలో హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలు25-02-2025పోలీసులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు..‘పోలీసులు వాస్తవాలను దాచి పెడుతూ తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. బొసా రమణ అరెస్టు విషయంలో డీజీపీ నివేదిక ఇస్తారని ఆశించాం. కానీ ఎలాంటి నివేదిక రాలేదు. కేసు సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుని డీజీపీని నివేదిక కోరాం. డీజీపీ పోస్టుపై ఉన్న గౌరవంతో వ్యక్తిగత హాజరుకు ఆదేశాలు ఇవ్వలేదు. రాతపూర్వకంగా ఆదేశాలు ఇస్తేనే నివేదిక ఇస్తామని డీజీపీ భావిస్తే అలాగే ఆదేశాలు ఇస్తాం. రమణ అరెస్టు విషయంలో విశాఖ పోలీస్‌ కమిషనర్, ప్రకాశం జిల్లా కలెక్టర్‌ నివేదికలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి...’ – బొసా రమణ భార్య దాఖలు చేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌పై విచారణ సమయంలో హైకోర్టు వ్యాఖ్యలు.11-03-2025‘పౌరుల స్వేచ్ఛను హరిస్తే ఊరుకోం..‘పౌరుల స్వేచ్ఛను హరిస్తామంటే ఊరుకోం. ఎలా పడితే అలా అరెస్ట్‌ చేస్తామంటే కుదరదు. రుజువు లేకుండా ఊహల ఆధారంగా అరెస్ట్‌ చేస్తారా? తాము చట్టం కంటే ఎక్కువని పోలీసులు భావిస్తున్నారు. చిన్న తప్పులేనని వదిలేస్తే.. రేపు కోర్టులకు వచ్చి మరీ అరెస్టు చేస్తారు. ప్రతి దశలోనూ పోలీసులు చట్ట ఉల్లంఘనలకు పాల్పడ్డారు..’– సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌ అవుతు శ్రీధర్‌రెడ్డికి కింది కోర్టు విధించిన రిమాండ్‌ చట్ట విరుద్ధమని కొట్టివేసిన సందర్భంలో హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలు25-03-2025హద్దు మీరొద్దు ‘తప్పు చేస్తే.. కేసు పెట్టడం, అరెస్ట్‌ చేయడం తప్పు కాదు. కానీ అరెస్ట్‌ చేయడానికే కేసు పెడితేనే సమస్య. మీ తప్పులను ఎన్నని ఎత్తి చూపాలి? ఎలా పడితే అలా వ్యవహరించే ముందు బాగా ఆలోచించుకోండి. పోలీసులు పరిధి దాటి వ్యవహరించడంపై మాకు చాలా విషయాలు తెలుసు. మేం కోర్టుల్లో ఉంటాం కాబట్టి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో తెలియదని ఎంత మాత్రం అనుకోవద్దు. పోలీసుల తీరు చూస్తుంటే మాకు బీపీ పెరుగుతోంది. – మాదిగ మహాసేన అధ్యక్షుడు ప్రేమ్‌కుమార్‌ అరెస్ట్‌పై హైకోర్టు వ్యాఖ్యలు10-04-2025ఇది ధిక్కారమే... హైకోర్టు ఆదేశాలంటే పోలీసులకు లెక్కే లేకుండా పోయింది. సెక్షన్‌ 111ను ఎప్పుడు, ఎలాంటి సందర్భాల్లో వాడాలో స్పష్టంగా చెప్పాం. అయినా ఆ సెక్షన్‌ కింద కేసులు నమోదు చేయడమంటే మా ఆదేశాలను ధిక్కరిస్తున్నట్లే. ఎప్పుడో నమోదు చేసిన కేసులో మీ ఇష్టం వచ్చినట్లు ఇప్పుడు అదనపు సెక్షన్లు ఎలా చేరుస్తారు? అంటే ఉద్దేశ పూర్వకంగా చేస్తున్నట్లు కాదా?’ – పోసాని కృష్ణ మురళిపై కేసు విచారణలో హైకోర్టు న్యాయమూర్తి

YS Jagan to Hold Key Talks with PAC Members2
నేడు పార్టీ పీఏసీ సభ్యులతో వైఎస్‌ జగన్‌ సమావేశం

తాడేపల్లి,సాక్షి: వైఎస్సార్‌సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు (మంగళవారం) అధ్యక్షతన నేడు ఉదయం 10.30 గంటలకు తాడేపల్లి­లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ పొలిటికల్‌ అడ్వైజరీ కమిటీ (పీఏసీ) తొలి సమా­వేశం జరగనుంది. ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు పార్టీ భవిష్యత్ కార్యచరణపై వైఎస్‌ జగన్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇటీవల, వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు పార్టీ పొలిటికల్‌ అడ్వైజరీ కమిటీని పూర్తిస్థాయిలో పునర్వ్యవస్థీకరించిన సంగతి తెలిసిందే. 33 మందిని పీఏసీ సభ్యులుగా నియమించారని, పార్టీ స్టేట్‌ కో–ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి పీఏసీ కో–ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తారని పార్టీ కేంద్ర కార్యాలయం పేర్కొంది.పీఏసీ సభ్యులుగా మాజీ స్పీకర్‌ తమ్మినేని సీతారామ్, మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు, మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, మాజీ ఎమ్మెల్యే పుప్పాల శ్రీనివాసరావు (వాసుబాబు), మాజీ మంత్రులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు, కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని)..వెలంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్, విడదల రజిని, మాజీ డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, ఎంపీ ఆళ్ల అయోధ్యరావిురెడ్డి, మాజీ ఎంపీ నందిగం సురేష్‌బాబు, మాజీ మంత్రులు డాక్టర్‌ ఆదిమూలపు సురేష్, డాక్టర్‌ పోలుబోయిన అనిల్‌కుమార్‌ యాదవ్, మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి..మాజీ మంత్రి ఆర్‌కే రోజా, ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, మాజీ మంత్రులు షేక్‌ బెపారి అంజాద్‌ బాషా, బుగ్గన రాజేంద్రనాథ్, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్‌ హఫీజ్‌ఖాన్, మాజీ మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ, మాజీ ఎంపీ తలారి రంగయ్య, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, మహాలక్ష్మి శ్రీనివాస్, మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌లను నియమించారు. పార్టీ రీజనల్‌ కో–ఆర్డినేటర్లు పీఏసీ శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారు.

CM Revanth Reddy team participating in World Expo in Osaka3
కొత్త ప్రపంచాన్ని నిర్మిద్దాం: సీఎం రేవంత్‌

సాక్షి, హైదరాబాద్‌: ఒసాకా బేలో సూర్యోదయం లాంటి కొత్త అధ్యాయం తెలంగాణలో ప్రారంభమవుతోందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. తెలంగాణ, ఒసాకా, ప్రపంచం కలిసికట్టుగా అద్భుతమైన భవిష్యత్తును నిర్మిద్దామని పిలుపునిచ్చారు. ‘తెలంగాణకు జపాన్‌ మధ్య చక్కటి సంబంధాలున్నాయి. హైదరాబాద్‌కు రండి.. మీ ఉత్పత్తులు తయారు చేయండి.. భారత మార్కెట్‌తో పాటు ప్రపంచంలోని వివిధ దేశాలకు ఎగుమతి చేసేందుకు తెలంగాణను గమ్యస్థానంగా ఎంచుకోండి. కలిసి పనిచేద్దాం.. నవ ప్రపంచాన్ని నిర్మిద్దాం..’అంటూ జపాన్‌ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం పలికారు. జపాన్‌ పర్యటనలో ఉన్న రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్‌ ప్రతినిధి బృందం సోమవారం ఒసాకాలో జరిగిన వరల్డ్‌ ఎక్స్‌పోలో పాలుపంచుకుంది. వివిధ రంగాలకు చెందిన వ్యాపార వేత్తలు, పారిశ్రామికవేత్తలతో విడివిడిగా సమావేశమైంది. తెలంగాణలో వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను సీఎం వివరించారు. ‘ఒసాకాలో జరుగుతున్న వరల్డ్‌ ఎక్స్‌పోలో దేశంలోనే మొదటి రాష్ట్రంగా తెలంగాణ పాలుపంచుకోవటం గర్వంగా ఉంది. తెలంగాణ, జపాన్‌ల మధ్య ఉన్న చారిత్రక స్నేహాన్ని దీర్ఘకాల భాగస్వామ్యంగా మార్చుకుందాం. కొత్త ఆవిష్కరణలతో భవిష్యత్‌ ప్రణాళికల రూపకల్పనకు కలిసి పనిచేద్దాం. మా ప్రభుత్వం స్థిరమైన, సులభతర పారిశ్రామిక విధానాన్ని అనుసరిస్తోంది. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు తెలంగాణలో ఉన్నాయి..’అని సీఎం చెప్పారు. బయో, ఐటీ రంగాల్లో గుర్తింపు: శ్రీధర్‌బాబు ఐటీ, బయో టెక్నాలజీ రంగాల్లో తెలంగాణ ఇప్పటికే ప్రత్యేకమైన గుర్తింపు సాధించిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. వీటితో పాటు ఏరోస్పేస్, ఎల్రక్టానిక్స్, టెక్స్‌టైల్‌ పరిశ్రమలకు ఉన్న అనుకూలతలను వివరించారు. హైదరాబాద్‌లో 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్‌ సిటీని నిర్మిస్తున్నామని, ఎకో, ఎనర్జీ, స్మార్ట్‌ మొబిలిటీ, సర్క్యులర్‌ ఎకానమీపై ఈ నగరం ఆధారపడుతుందని పేర్కొన్నారు. జపాన్‌కు చెందిన మరుబెని కార్పొరేషన్‌తో ఫ్యూచర్‌ సిటీలో ఇండస్ట్రియల్‌ పార్కులు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్‌ చుట్టూ 370 కిలోమీటర్ల రీజనల్‌ రింగ్‌ రోడ్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌)తో పాటు రేడియల్‌ రోడ్లు నిర్మిస్తున్నామని, ఆర్‌ఆర్‌ఆర్‌కు ఔటర్‌ రింగ్‌ రోడ్‌ (ఓఆర్‌ఆర్‌)కు మధ్య ఉన్న జోన్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాలు, ఎనర్జీ స్టోరేజ్, ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్, ఏరోస్పేస్‌ పరిశ్రమలకు అనువైన వాతావరణం ఉందని మంత్రి తెలిపారు. నైపుణ్యాల అభివృద్ధికి శిక్షణతో పాటు నాణ్యత, క్రమశిక్షణకు అద్దం పట్టేలా యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్‌ రంజన్‌ చెప్పారు. తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబంగా పెవిలియన్‌ ఒసాకాలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ‘ఒసాకా ఎక్స్‌పో’లో తెలంగాణ తన ప్రత్యేకపెవిలియన్‌ను ఏర్పాటు చేసింది. సీఎం రేవంత్‌రెడ్డి..మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి సోమవారం దీనిని ప్రారంభించారు. ప్రతి ఐదేళ్లకో మారు ఒసాకా ఎక్స్‌పో నిర్వహిస్తారు. అయితే ఈ ఎక్స్‌పోలో భారతదేశం నుంచి పాల్గొన్న తొలిరాష్ట్రం తెలంగాణ కావడం విశేషం. కిటాక్యుషు నుంచి సీఎం బృందం ఒసాకా చేరుకుంది. కాగా ఒసాకా ఎక్స్‌పో వేదికపై తెలంగాణ తన వైవిధ్యమైన సంస్కృతి, అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక అనుకూల వాతావరణం, సాంప్రదాయ కళలు, పర్యాటక ఆకర్షణలను ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే సందర్శకులకు చాటి చెప్పనుంది. తెలంగాణ పెవిలియన్‌లో రాష్ట్ర సాంకేతిక పురోగతి, సాంస్కృతిక వారసత్వం, పర్యాటక సంపదను ప్రతిబింబించే ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఈ వేదిక ద్వారా అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు, సాంస్కృతిక సహకారాన్ని పెంపొందించే దిశగా రాష్ట్రం అడుగులు వేయనుంది.

Sakshi Guest Column On Indian Govt method of negotiating with USA4
ఇండియా విధానం సరైనదేనా?

భారత ప్రభుత్వం సుంకాల విషయమై అమెరికాతో చర్చిస్తున్న పద్ధతిని కొందరు సమర్థిస్తుండగా, కొందరు విమర్శిస్తున్నారు. విలువైన అంశాలు రెండింటిలోనూ ఉన్నాయి. కానీ ఈ చర్చలన్నీ తక్షణ అంశాల చుట్టూ తిరుగుతున్నాయి. అవి అవసరమే. అదే సమయంలో మరికొంత లోతుకు వెళ్లటం, దీర్ఘకాలిక దృష్టి తీసుకోవటం కూడా చేస్తే తప్ప ఇంత ముఖ్యమైన విషయమై సమగ్రమైన అవగాహన ఏర్పడదు. ఇతర దేశాల నుంచి దిగుమతులపై తాము స్వల్పమైన సుంకాలు విధిస్తున్నామనీ, తమ ఎగుమతులపై మాత్రం వారు భారీ సుంకాలు వేస్తున్నారనీ, ఆ విధంగా తాము రెండు విధాలుగానూ నష్టపోతున్నామన్నది అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అంటున్నమాట. కేవలం గణాంకాలకు పరిమితమైతే అది నిజమే. కానీ, అందులో అనేక మతలబులున్నాయి. అమెరికాలో ఒకప్పుడు విస్తారంగా ఉండిన ఉత్పత్తుల రంగాన్ని కుదించి, పరిశ్రమలను ఇతర దేశాలకు తరలించింది అక్కడి ప్రభుత్వమే గదా? అసలు వివిధ అంతర్జాతీయ ఆర్థిక, వాణిజ్య సంస్థలను ఉనికిలోకి తెచ్చి స్వేచ్ఛా వాణిజ్యాన్ని ప్రోత్సహించిందే అమెరికా. ఒకవేళ 90 రోజుల వాయిదా కాలంలో చర్చల ద్వారా కొన్ని సర్దుబాట్లు జరిగినా కొంత నష్టం మిగిలే ఉంటుంది. ఈ పరిణామాలన్నింటి ప్రభావంతో అమెరికా పట్ల ప్రపంచానికి ఇంత కాలం ఉండిన విశ్వాసం తగ్గుతుందనే సందేహం ఉంది. అది జరిగినపుడు ఇప్పటికే గల బహుళ ధ్రువ ప్రపంచ ధోరణులు మరింత బలపడగలవనే అభిప్రాయాలు ఎక్కువవుతున్నాయి.నాలుగు ధోరణులుఇండియాతో అమెరికా వాణిజ్య లోటు 2024–25లో 41.18 బిలి యన్‌ డాలర్లు. మన దిగుమతులపై అమెరికా సుంకాల రేటు సగటున 2.7 శాతం. అమెరికా నుంచి దిగుమతులపై మన సుంకాల రేటు సగ టున 12 శాతం కాగా, కొన్ని సరుకులపై 48 శాతం వరకు ఉంది. ఈ లెక్కలను బట్టి అమెరికా అధ్యక్షుడు అన్ని దేశాలతో గల వాణిజ్య లోటులో 50 శాతం మేర సుంకాలు పెంచిన ప్రకారం భారత ఎగుమతులపై రేటును 26 శాతంగా ప్రకటించారు. ఏప్రిల్‌ 2న ఈ కొత్త రేట్లు ప్రకటించటానికి ముందే చేసిన హెచ్చరికలను బట్టి భారత ప్రభుత్వం అమెరికన్‌ మోటార్‌ సైకిళ్లు వగైరాపై సుంకాలు తగ్గించటం తెలిసిందే. అయినప్పటికీ కొత్త రేట్లు యథావిధిగా పెరిగాయి.ఈ పరిస్థితుల దృష్ట్యా భారత్‌ ఏమి చేయాలన్నది ప్రశ్న. ప్రపంచ దేశాలు చేస్తున్నదేమిటని చూడగా నాలుగు ధోరణులు కనిపిస్తు న్నాయి. కొన్ని చిన్న ఆర్థిక వ్యవస్థలు పూర్తిగా లొంగి పోతున్నాయి. అమెరికా నుంచి దిగుమతులపై సుంకాలు నూరు శాతం రద్దు చేస్తు న్నాయి. ఇందుకు ఒక ఉదాహరణ జింబాబ్వే. కొన్ని సామరస్య ధోర ణితో ఇచ్చిపుచ్చుకునే మార్గాన్ని అనుసరిస్తున్నాయి. జపాన్‌ అందు కొక ఉదాహరణ. కొన్ని ఎదురు సుంకాలతో ప్రతిఘటిస్తూ అమెరికా తగ్గితే తాము తగ్గుతామంటున్నాయి. కెనడా, యూరోపియన్‌ దేశాలు ఈ కోవలోకి వస్తాయి. చైనా ఒక్కటి భిన్నంగా కనిపిస్తున్నది. పోరాడు తాము తప్ప లొంగే ప్రసక్తి లేదని స్పష్టం చేస్తున్నది.ఈ నాలుగింటిలో ఇండియా ప్రయోజనాలకు ఉపయోగపడ గలది ఏది? చైనా వలె పూర్తిగా ధిక్కరించటమన్నది అభిలషణీయం కాదు, కావాలనుకున్నా సాధ్యమయ్యేదీ కాదు. వారిది రెండవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ. భారత దేశం కన్నా అయిదు రెట్లు పెద్దది.క్రమంగా అమెరికాను మించిపోయి అగ్రస్థానానికి చేరాలన్నది చైనా లక్ష్యం. మన స్థితిగతులుగానీ, లక్ష్యాలుగానీ వీలైనంత అభివృద్ధి చెందటమే తప్ప చైనా వంటివి కావు. కనుక ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కొనేందుకు అటువంటి వైఖరి తీసుకోవటమన్న ఆలోచనే అసందర్భం. ఇదంతా అర్థమయ్యో, కాకనో కొందరు భారత ప్రభుత్వాన్ని ఆక్షేపిస్తున్నారు. జపాన్‌ మార్గంఇక మిగిలినవి జపాన్, కెనడా ప్లస్‌ యూరోపియన్‌ మార్గాలు. ఈ రెండింటిలో రెండవది కూడా ఇండియాకు అనుకూలించగలది కాదు. అందుకు ఒక కారణం యూరోపియన్‌ దేశాలన్నీ ఒక బృందం వలె నిలిచి ఉన్నాయి. అది గాక సైనికంగా, భౌగోళిక వ్యూహాల రీత్యా అమెరికా, కెనడా, యూరప్‌ల సాన్నిహిత్యం భిన్నమైనది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నందువల్లనే అమెరికా ట్యారిఫ్‌లను వారు బలంగా ఎదుర్కొంటూ, ఆ దేశం దిగి రావలసిందేనని స్పష్టం చేస్తు న్నారు. ఇదంతా భారతదేశానికి సాధ్యమయ్యేది కాదు.అందువల్ల స్థూలంగా జపాన్‌ నమూనా ఒక్కటే మిగులుతున్నది. దక్షిణ కొరియా, మెక్సికో మొదలైన వాటి వైఖరి కూడా ఇంచుమించు ఇదే విధంగా కనిపిస్తున్నది. ఈ పద్ధతి ఇంకా ఇదమిత్థంగా రూపు తీసుకోలేదు. చర్చలు జరిగే కొద్దీ ఇందుకొక రూపం రాగలదని భావించవచ్చు. భారత్‌ స్థూలంగా జపాన్‌ తరహా వైఖరిని తీసుకుంటున్నట్లు కని పిస్తున్నది. ఇందులోనూ ఒక ఆకు తక్కువే. అమెరికాతో జపాన్‌కు గల వ్యూహాత్మక భాగస్వామ్యం వేరు. అందుకే ‘స్థూలంగా’ అనే మాటను ఉపయోగించటం. ఇవన్నీ చెప్పుకున్న తర్వాత, భారతదేశం గురించి మాట్లాడుకోవలసిన మౌలికమైన విషయాలు రెండున్నాయి. భారత అభివృద్ధి స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి? కొత్త అభివృద్ధి లక్ష్యాల సాధనకు అనుసరించవలసిన మార్గం ఏమిటని ప్రభుత్వం భావిస్తున్నది? సుంకాల యుద్ధంపై తీసుకోగల వైఖరికి ఈ ప్రశ్నలతో సంబంధం ఉంటుంది.దేశ ప్రయోజనాలే ముఖ్యం!ఆర్థికాభివృద్ధి రీత్యా ఇండియా ఇంకా వర్ధమాన దేశమే. అభివృద్ధి చెందుతున్నా, ఆ వేగం ఉండవలసినంతగా లేదు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే అంతర్గతంగా జరగవలసింది చాలా ఉండటంతో పాటు, అభివృద్ధి చెందిన దేశాల నుంచి, ఇంచు మించు తన స్థాయిలో గల వర్ధమాన దేశాల నుంచి, అవసరమైన వనరులు గల దేశాల నుంచి సహకారం అవసరం. అందుకోసం ఈ కూటమి, ఆ కూటమి అనే ఒకప్పటి రాజకీయాలతో సంబంధం లేకుండా అన్ని వైపుల నుంచి సహకారం కోసం సమ సంబంధాలు పాటించాలి. దేశ ప్రయోజనాలే దేనికైనా గీటురాయి కావాలి. శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులంటూ ఉండరు. పరిస్థితులు, ఫిలాసఫీ రెండూ ఇవే. ఇదంతా ఇప్పుడు మనం సుంకాల సమస్యల సందర్భంలో కొత్తగా సూత్రీకరిస్తున్నది కాదు. విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ ‘ది ఇండియా వే, స్ట్రాటజీస్‌ ఫర్‌ యాన్‌ అన్‌సర్టెన్‌ వరల్డ్‌’ (2020) పేరిట రాసిన పుస్తకంలో ఈ సూత్రీ కరణలన్నీ కనిపిస్తాయి. శీర్షిక దానికదే ఎంతో అర్థవంతమైనది. ‘మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా జీవించటమే వివేకం’ అనే తిరు వళ్ళువర్‌ బోధనతో ఆయన తన పుస్తకాన్ని ప్రారంభించారు. బ్రిటిష్‌ పాలకులు వచ్చిపడుతుండగా చదరంగంలో మునిగి రాజ్యం పోగొట్టుకున్న బెంగాల్‌ నవాబుల ఉదంతంతో ‘షతరంజ్‌ కే ఖిలాడీ’ సినిమా తీసిన సత్యజిత్‌ రే హెచ్చరిక, అమెరికా బలహీనపడుతుండగా ముందుకు దూసుకుపోతున్న చైనాల గురించి చర్చిస్తూ, ‘ఇప్పుడు భారతదేశం తనను తాను నిర్వచించుకుంటుందా? లేక ఇంకో ప్రపంచమే నిర్వచిస్తుంటుందా?’ అని ప్రశ్నిస్తారు. స్వయంగా అమెరికా, చైనాలలో రాయబారిగా పనిచేసిన జైశంకర్‌ సూత్రీకర ణలు, రూపొందిస్తున్న విదేశాంగ విధానాలు ప్రస్తుత క్లిష్ట పరిణా మాలకు తగినవే.టంకశాల అశోక్‌ వ్యాసకర్త సీనియర్‌ సంపాదకుడు

TJR Sudhakar Babu Sensational Comments on TDP govt5
కూటమి పాలనలో దళితులపై పెచ్చరిల్లుతున్న దాడులు

సాక్షి, అమరావతి: కూటమి పాలనలో దళితులపై అత్యాచారాలు, హత్యలు పెచ్చరిల్లుతున్నాయని దళిత నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. దళితుల ఆత్మగౌరవం నిలబడాలంటే వైఎస్‌ జగన్‌ను మరోసారి సీఎం చేసుకోవాలని పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగం రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశం సోమవారం జరిగింది. ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు టీజేఆర్‌ సుధాకర్‌బాబు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కొమ్మూరి కనకారావు మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌ పాలనలో ఎస్సీలకు న్యాయం జరిగిందన్నారు.కూటమి పాలనలో దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. పవన్‌కళ్యాణ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో దళితులను అంటరాని వారిగా చూస్తున్నారని చెప్పారు. అణగారిన వర్గాలకు పూర్తిగా న్యాయం చేసిన ఘనత మాజీ సీఎం వైఎస్‌ జగన్‌దేనన్నారు. డిప్యూటీ సీఎంతో పాటు ఐదుగురు దళితులకు క్యాబినెట్‌లో చోటు కలి్పంచిన ఘనత జగన్‌ది అన్నారు. మాల, మాదిగలు కలిసే ఉన్నారు రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు మాట్లాడుతూ మాల, మాదిగలు విడిపోయారని కూటమి నేతలు పగటి కలలు కంటున్నారని, కాని కలిసే ఉన్నారని చెప్పారు. ఇకపై మాల, మాదిగలు కలిసి వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో పేదల ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు వైఎస్సార్‌సీపీ సంస్థాగత నిర్మాణంలో తీసుకోవాల్సిన చర్యలు, అనుసరించాల్సిన పద్ధతులపై ప్రసంగించారు. మాజీ ఎంపీ నందిగం సురేష్‌ మాట్లాడుతూ.. జగనన్న అణ­గారిన వర్గాలకు అండగా ఉంటే.. చంద్రబాబు మాత్రం అణగదొక్కుతున్నారన్నారు.మా­జీ హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ గత ప్రభుత్వంలో దళితులకు దక్కిన గౌరవాన్ని జీరి్ణంచుకోలేక కూటమి పార్టీలు అసత్య ప్రచారం చేశాయని, దళితులకు అత్యున్నత గౌరవం ఇచ్చిన వైఎస్సార్‌సీపీని బలోపేతం చేసుకుందామన్నారు. మాజీ మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ ఎస్సీల జీవితాలు మార్చడానికి జగనన్న తీసుకొచ్చిన సంస్కరణలు ఎవరూ మరిచిపోరన్నారు. విజయవాడలో అంబేడ్కర్‌ స్మృతివనాన్ని ప్రైవేటీకరించేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై దళిత నాయకులంతా ఆగ్రహం వ్యక్తం చేశారు.మాజీ మంత్రులు ఆదిమూలపు సురేష్, గొల్లపల్లి సూర్యారావు, ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు, మాజీ ఎమ్మెల్యేలు కంబాల జోగులు, తలారి వెంకట్రావు, కిలివేటి సంజీ­వయ్య, వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వేల్పుల రవికుమార్, మాజీ ఎమ్మెల్యేలు కొరముట్ల శ్రీనివాసులు, కైలే అనిల్‌కుమార్, అలజంగి జోగారావు, పార్టీ అధికార ప్రతినిధి కాకుమాను రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే జగన్‌మోహన్‌రావు మాట్లాడారు. ఈ సమావేశంలో పలు తీర్మానాలు ప్రవేశపెట్టగా ఏకగ్రీవంగా ఆమోదించారు. జనం మధ్య ఉందాం: సజ్జల సమావేశానికి హాజరైన వైఎస్సార్‌సీపీ స్టేట్‌ కో–ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. సమాజం అంటే అందరికీ సమాన అవకాశాలు కల్పించాలనే విధంగా వైఎస్‌ జగన్‌ పాలన చేశారని గుర్తు చేశారు. కలలు కనడం కాదని, వాటిని ఆచరణలోకి తీసుకురావాలని ఒక్క జగన్‌ మాత్రమే భావించారని, అసమానతలు ఉన్న సమాజాన్ని ఐదేళ్లలో సమాన స్థాయికి తీసుకొచ్చారన్నారు. వైఎస్సార్‌సీపీ పేదల పక్షమని గుండెమీద చెయి వేసుకుని చెప్పగలిగిన ధైర్యాన్ని అందరికీ ఇచ్చారన్నారు. కూటమి ప్రభుత్వ అరాచకాలను అడ్డుకోవడం, సంస్థాగతంగా బలోపేతం అవడంపై దృష్టి పెడదామని పిలుపునిచ్చారు.

Sakshi Editorial On Maharashtra govt Hindi Language Mandatory6
ఈసారి ‘మహా’ వంతు!

ఏదేమైనా హిందీని అందరికీ నేర్పించి తీరాలన్న సంకల్పం ఎలాంటి మలుపులు తిరుగుతుందో మహారాష్ట్రలో తాజాగా రాజుకుంటున్న వివాదాన్ని చూసైనా బీజేపీ తెలుసుకోవాలి. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కావొచ్చు... దూకుడు ప్రదర్శిస్తున్న బీజేపీని ఇరకాటంలో పెట్టాలని కావొచ్చు హిందీని బలవంతంగా రుద్దే విధానాన్ని అంగీకరించబోమని ప్రకటించి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ దక్షిణాదిన దుమారం రేపారు. స్థానిక భాషతోపాటు ఇంగ్లిష్, మరేదైనా భాష ప్రాథమిక స్థాయిలో తప్పనిసరి చేసే నూతన విద్యావిధానాన్ని కేంద్రం తీసుకొచ్చిన నేపథ్యంలో స్టాలిన్‌ దాన్ని తప్పుబట్టారు. అదింకా పూర్తిగా చల్లారక మునుపే మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒకటో తరగతి నుంచి అయిదో తరగతి వరకూ మూడో భాషగా హిందీని తప్పనిసరి చేయటమే ఆ నిర్ణయం సారాంశం. ఇంతవరకూ ప్రాథమిక స్థాయిలో తప్పనిసరి భాషలు మరాఠీ, ఇంగ్లిష్‌ మాత్రమే. కానీ జాతీయ విద్యావిధానం చెబుతున్నట్టు ‘ఏదైనా మరో భాష’ కూడా తప్పనిసరి గనుక హిందీని ఆ రెండింటితో జత చేశామని ప్రభుత్వం అంటున్నది. సహజంగానే మహారాష్ట్రలో ఇది వివాదాన్ని రేకెత్తించింది. ‘మేం హిందువు లమేగానీ... హిందీ అవసరం లేద’ంటూ మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్‌) ముంబై నగరంలో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టింది. నిజానికి ఎంఎన్‌ఎస్‌ అయినా, మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) అయినా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయంగా అయోమ యంలో పడ్డాయి. ఎంఎన్‌ఎస్‌ ఏర్పడి ఇరవయ్యేళ్లు కావొస్తున్నా ఇంతవరకూ ఆ పార్టీ అసెంబ్లీలోకి అడుగుపెట్టలేకపోయింది. యూబీటీగా చీలకముందు శివసేన నాయకుడు ఉద్ధవ్‌ ఠాక్రే కాంగ్రెస్, ఎన్సీపీలతో కూటమి ప్రభుత్వాన్ని నడిపారు. కానీ ఏక్‌నాథ్‌ షిండే రూపంలో వచ్చిపడిన విపత్తుతో పార్టీ నిలువునా చీలిపోవటమే కాక, అధికారాన్ని కూడా కోల్పోయింది. జనం సానుభూతి చూపిస్తా రనుకుంటే అదీ జరగలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడి నిండా ఆర్నెల్లు కాలేదు. కనుక విపక్షాలు ఏం చేయటానికీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మహారాష్ట్ర సర్కారు విపక్షాలకు ఆయుధాన్ని అందించింది.తమిళనాడులో స్టాలిన్‌ హిందీ వివాదాన్ని రేకెత్తించినప్పుడు కేంద్రం తన విధానాన్ని గట్టిగా సమర్థించుకుంటూ ఒక మాట చెప్పింది. మూడో భాషగా హిందీయే నేర్పాలని తాము పట్టుబట్టడం లేదని, దేశ భాషల్లో దేన్నయినా ఎంపిక చేసుకోవచ్చని అన్నది. కానీ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ ఇస్తున్న వివరణ చూస్తే అందుకు భిన్నంగావుంది. నూతన విద్యావిధానంలో భాగంగా స్థానిక భాష, ఇంగ్లిష్‌తోపాటు హిందీని కేంద్రం తప్పనిసరి చేసిందని, దాన్నే తాము అమలు చేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. ఈ వివరణ సహజంగానే తమిళనాడులో పాలక డీఎంకేకు అందివచ్చింది. మూడో భాషగా ‘మరేదైనా’ నేర్చుకోవచ్చన్న నిబంధన ఆంతర్యమేమిటో మహా రాష్ట్ర నిర్ణయం బట్టబయలు చేసిందని ఆ పార్టీ అంటున్నది. దేశంలో హిందీని ఏదో విధంగా దొడ్డిదోవన అనుసంధాన భాషగా చేయాలన్నదే కేంద్రంలోని ఎన్డీయే పాలకుల ఉద్దేశమని విమర్శి స్తోంది. యూపీఏ ప్రభుత్వ హయాంలో కూడా కేంద్రంనుంచి ఇలాంటి ప్రయత్నాలే జరిగాయి. వాటిని ఎప్పటికప్పుడు దక్షిణాది రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా తమిళనాడు వ్యతిరేకిస్తూనే వచ్చాయి.తమిళనాడు మాదిరే మహారాష్ట్రలో కూడా భాషాభిమానం బాగా ఎక్కువ. దాన్ని అన్నివిధాలా ఉపయోగించుకుందామని ఠాక్రే సోదరులు భావిస్తున్నట్టు కనబడుతోంది. సొంత అన్నదమ్ములు కాకపోయినా ఇద్దరూ శివసేనలో కలిసి పనిచేసేవారు. 2005లో వారిమధ్య పొరపొచ్చాలు బయల్దే రాక పార్టీ అధినేత బాల్‌ ఠాక్రే ఇద్దరి మధ్యా రాజీకి ప్రయత్నించారు. కానీ అది ఫలించలేదు. 2006లో రాజ్‌ ఠాక్రే ఎంఎన్‌ఎస్‌ స్థాపించారు. మొదట్లో యూపీ, బిహార్‌లనుంచి వలస వచ్చేవారి వల్ల స్థానికుల ఉపాధి దెబ్బతింటున్నదని, వారు దాదాగిరీ చలాయిస్తున్నారని ఆరోపిస్తూ నడిపిన ఉద్యమం హింసాత్మకంగా మారింది. ఆ తర్వాత దుకాణాల బోర్డులన్నీ మరాఠిలో ఉండాలంటూ సాగించిన ఉద్యమం కూడా ఆ తోవలోనే నడిచింది. ఇవిగాక మరాఠీ ఆత్మగౌరవం పేరిట చాలా ఉద్యమాలు నడిపినా రాజ్‌ ఠాక్రేకు కలిసిరాలేదు. ఇప్పుడు బలవంతంగా హిందీ రుద్దుతున్నారన్న అంశంపై సాగించే ఉద్యమానికి స్పందన ఏమాత్రం వస్తుందన్నది చూడాలి. మహారాష్ట్రకు రావా ల్సిన ప్రాజెక్టులను గుజరాత్‌కు తన్నుకుపోవటాన్ని తప్పుబడుతూ నిరుడు లోక్‌సభ ఎన్నికల సమ యంలో తాను నిలదీసినప్పుడు రాజ్‌ కలిసిరాలేదని, అదే జరిగుంటే ఇవాళ కేంద్రంలో ఎన్డీయే సర్కారు ఉండేది కాదని ఉద్ధవ్‌ వాదన. తమ మధ్య కేవలం చిన్న చిన్న అపోహలు మాత్రమే ఉండే వని ఉద్ధవ్‌ అంటుంటే... అసలు సోదరులిద్దరూ విడిపోయిందెక్కడని యూబీటీ ఎంపీ సంజయ్‌ రౌత్‌ ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఠాక్రే సోదరుల ప్రకటనలు వారిద్దరూ మళ్లీ కలిసి పనిచేయబోతు న్నారన్న సంకేతాలిస్తున్నాయి. అది బీజేపీ మనుగడను దెబ్బతీస్తుందా లేదా అన్నది చూడాలి. అయితే పాలకులు మేల్కొనాల్సిన సమయం వచ్చింది. 1963 నాటి అధికార భాషల చట్టం, దానికి 1967లో తీసుకొచ్చిన సవరణలు గమనించి మసులుకుంటే భాషా వివాదం తలెత్తదు. అధి కార లావాదేవీలన్నిటా ఇంగ్లిష్, హిందీ వినియోగించాలని, హిందీ మాతృభాషగా లేని రాష్ట్రాలతో ఇంగ్లిష్‌లోనే ఉత్తర ప్రత్యుత్తరాలు సాగించాలని చట్టం స్పష్టంగా చెబుతున్నప్పుడు అందరూ హిందీ నేర్చుకు తీరాలని శాసించటం సరికాదు. దేశ సమైక్యత, సమగ్రత పేరిట దాన్ని తలకెత్తుకుంటే అందుకు విరుద్ధమైన ఫలితాలొస్తాయి. మహారాష్ట్ర పరిణామాలు ఆ సంగతిని చాటుతున్నాయి.

IPL 2025: Gujarat Titans beats Kolkata Knight Riders7
చితక్కొట్టిన శుబ్‌మన్.. కేకేఆర్‌పై గుజరాత్ గ్రాండ్ విక్టరీ

ఐపీఎల్‌-2025లో గుజరాత్ టైటాన్స్ తమ జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. ఈ ​మెగా ఈవెంట్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 39 పరుగుల తేడాతో ఘన విజయాన్ని గుజరాత్ అందుకుంది. 199 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 159 పరుగులు మాత్రమే చేయగల్గింది.కేకేఆర్ బ్యాటర్లలో కెప్టెన్ అజింక్య రహానే(50)టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. ఆఖ‌రిలో ర‌ఘువ‌న్షి(27) ప‌ర్వాలేద‌న్పించాడు. మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్‌, ప్రసిద్ద్ కృష్ట తలా రెండు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్‌, సుందర్‌, ఇషాంత్ శ‌ర్మ‌ సాయికిషోర్ చెరో వికెట్ పడగొట్టారు.చితక్కొట్టిన శుబ్‌మన్‌..ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల న‌ష్టానికి 198 ప‌రుగులు చేసింది. గుజ‌రాత్ బ్యాట‌ర్ల‌లో కెప్టెన్ శుబ్‌మ‌న్ గిల్ విధ్వంసం సృష్టించాడు. తన సూపర్ బ్యాటింగ్‌తో ఈడెన్‌లో బౌండరీలు వర్షం కురిపించాడు. 55 బంతులు ఎదుర్కొన్న గిల్‌.. 10 ఫోర్లు, మూడు సిక్స్‌ల‌తో 90 ప‌రుగులు చేశాడు. గిల్‌తో పాటు సాయిసుద‌ర్శ‌న్‌(52), బ‌ట్ల‌ర్‌(41) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. కేకేఆర్ బౌల‌ర్ల‌లో వైభ‌వ్ ఆరోరా, హ‌ర్షిత్ రాణా, ర‌స్సెల్ త‌లా వికెట్ సాధించారు. ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన గుజరాత్ 6 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో కొనసాగుతోంది.

I was not at home at the time  Omprakash Son Karthikesh8
‘నేను లేని టైమ్ చూసి నాన్నను చంపేశారు’

బెంగళూరు: ఓ రాష్ట్రానికి డీజీపీగా పని చేసిన వ్యక్తి దారుణంగా హత్య గావించబడటం చాలా విచారకరం. అది కూడా భార్య, కూతురు కలిసి చేసిన మాస్టర్ ప్లాన్ కు బలికావడం ఇంకా దురదృష్టకరం. కర్ణాటక రాష్ట్ర మాజీ డీజీపీ ఓమ్ ప్రకాష్ హత్య అనంతరం అనేక విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భార్య పల్లవి బాధ పడలేక తన సోదరి సరితా కుమారి ఇంటి వద్దే ఉంటున్న ఓమ్ ప్రకాష్ ను ఇంటికి రప్పించి మరీ హత్య చేయడం సమాజంలోని పరిస్థితులు ఇంతలా దిగజారిపోవడానికి అద్దం పడుతోంది. నేను ఇంట్లో లేని సమయంలోనే నాన్న హత్యఅయితే ఈ విషయంలో కుమారుడు కార్తీకేష్ ఇచ్చిన ఫిర్యాదులో మాత్రం తల్లి, సోదరి పాత్రలను ప్రముఖంగా ప్రస్తావించాడు. గత కొంతకాలంగా తల్లి పల్లవి.. నాన్నను చంపుతానంటూ బెదిరిస్తోందనే విషయాన్ని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే గతంలో నాన్నపై హత్యాయత్నం చేయడానికి అమ్మ యత్నించిందన్నాడు. పెద్ద రాయి తీసుకుని తలపై కొట్టి చంపాలని చూసిందన్నాడు.‘ మా తండ్రిని చంపుతానని పదే పదే అమ్మ బెదిరిస్తూ వస్తోంది. ఈ బెదిరింపులతో మా నాన్న కూడా ఇంట్లో నుంచి వెళ్లిపోయి బయటే ఉంటున్నారు. నాన్న సోదరి( మా అత్త) సరితా కుమారి ఇంటికి వెళ్లిపోయి అక్కడే ఉంటున్నారు. అయితే రెండు రోజుల క్రితం నా సోదరి కృతి.. నాన్న వద్దకు వెళ్లింది. ఇంటికి తిరిగి రావాలని పట్టుబట్టింది. నేను రానని నాన్న చెప్పినా పట్టుబట్టుకుని కూర్చొంది. దాంతో నాన్న తిరిగి ఇంటికి వచ్చారు.నాన్నను వెంట తీసుకునే వచ్చింది కృతి. ఇష్టంలేకుండానే నాన్న ఇంటికి వచ్చారు. ఇంతలోనే ఈ దారుణం జరిగిపోయింది. నేను ఇంట్లో లేని సమయం చూసి వాళ్లిద్దరూ కలిసి నాన్నను హత్య చేశారు. నాకు ఓ స్నేహితుడు ఫోన్ చేసి చెప్పాడు. మీ నాన్నకు ఇలా అయ్యిందనే విషయాన్ని చెప్పాడు. నేను సరిగ్గా నిన్న సాయంత్రం(ఆదివారం) గం. 5.45 ని.లకు ఇంటికి తిరిగి వచ్చేశాను. అప్పటికే మా ప్రాంగణమంతా పోలీసులు, చుట్టుపక్కల వారితో నిండిపోయి ఉంది. నేను మా నాన్న రక్తమడుగులో పడి ఉండటం చూశాం. ఆయన శరీరమంతా గాయాలతో నిండిపోయింది. నాన్న శరీరంలో పగిలిన బాటిల్, కత్తి ఉండటాన్ని గమనించాను. అప్పుడు సెయింట్ జాన్స్ హాస్పిటల్ప్ కి నాన్నని తీసుకెళ్లాం. మా అమ్మ, చెల్లి కూడా పూర్తి డిప్రెషన్ లో ఉన్నారు. అమ్మా, సోదరి కలిసే నాన్నను హత్య చేశారనే విషయాన్ని బలంగా నమ్ముతున్నా’ అని పోలీస్ లకు ఇచ్చిన స్టేట్ మెంట్ లో కార్తీకేష్ చెప్పుకొచ్చాడు.12 ఏళ్లుగా.. భయం భయంగానే?

Gold hits all time high 10 grams price toches Rs 1 lakh9
రూ.ల‌క్ష‌కు చేరిన బంగారం ధ‌ర‌.. ఆల్ టైం హై

దేశంలో బంగారం ధరలు ఆల్‌టైమ్‌ హైకి చేరాయి. భారత లైవ్‌ మార్కెట్‌లో సోమవారం సాయంత్రానికి (April 21) తులం బంగారం ధర రూ. లక్షను తాకినట్లు ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈరోజు 10 గ్రాముల బంగారం రూ.2,350 పెరిగింది. అంతర్జాతీయంగా జౌన్స్‌ బంగారం 3400 డాలర్లు దాటింది.ప్రస్తుత ధరలు👉హైదరాబాద్‌లో 24 కేరట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.99,660 వద్ద ఉంది. 👉బెంగళూరులో రూ.99,860👉విశాఖపట్నంలో రూ.99,770👉చెన్నైలో రూ.99,740👉ఢిల్లీలో రూ.99,555ఈ ధరల పెరుగుదలకు గ్లోబల్ ఆర్థిక అనిశ్చితులు, అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు, అమెరికన్ డాలర్ బలహీనత, సురక్షిత ఆస్తుల కొనుగోలు పెరగడం కారణాలుగా ఉన్నాయి. అంతర్జాతీయ స్పాట్ బంగారం ధరలు ఔన్స్‌కు 3,391-3,404 డాలర్ల వద్ద ఉన్నాయి.కాగా ఈరోజు ఉదయం దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 90,150 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 98,350 వద్ద నిలిచాయి. నిన్న స్థిరంగా ఉన్న పసిడి రేటు ఈ రోజు కూడా రూ. 700 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 770 (24 క్యారెట్స్ 10గ్రా) పెరిగింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.👉ఇది చదివారా? ఆ బంగారం మర్చిపోండి.. ఈ లోహమే ‘భవిష్యత్‌ బంగారం’చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 700, రూ. 770 పెరిగింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 90,150 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 98,350 వద్ద ఉంది.దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 9030 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 98,500 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 700, రూ. 770 ఎక్కువ. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్‌టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).

Tension at Mangalagiri state TDP office10
మంగళగిరి రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో ఉద్రిక్తత.. లోకేష్‌కు చెప్పినా లాభం లేదని..

గుంటూరు,సాక్షి: మంగళగిరి రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దెందులూరులో మట్టి మాఫియా వేధింపులు భరించలేక మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్‌ విగ్రహం ఎదుట దాసరి బాబురావు అనే వ్యక్తి ఆత్మ హత్యాయత్నానికి పాల్పడ్డారు. మట్టి మాఫియా వేధింపులతో మనస్తాపం చెంది బ్లేడుతో చేయి కోసుకున్నారు. అప్రమత్తమైన టీడీపీ పార్టీ సిబ్బంది బాబురావును అత్యవసర చికిత్స నిమిత్తం మణిపాల్‌ ఆస్పత్రికి తరలించారు. తమ భూముల్ని కబ్జా ప్రయత్నం జరుగుతోందని, మంత్రి లోకేష్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని, అందుకే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని బాధితురాలి భార్య మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. దాసరి బాబురావు ఆత్మహత్యయత్నంపై ఆమె భార్య దాసరి దాసరి నాగలక్ష్మి మీడియాతో మాట్లాడారు. ‘మాకు దెందులూరి మండలం చల్ల చింతల పూడిలో పొలం ఉంది. మా పొలంలో జేసీబీలతో మట్టి తవ్వి ట్రాక్టర్లతో అక్రమంగా తరలిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే మేం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ మనుషులం అని బెదిరిస్తున్నారు. ఇదే విషయం గురించి చింతమనేనితో మా బంధువులు మాట్లాడితే మట్టి మాఫియాతో సెటిల్ చేసుకోమని చెప్తున్నారు. మేం మట్టి మాఫియాని అడ్డుకోడానికి ప్రయత్నించాం. సాధ్యం కాలేదు. మట్టి మాఫియా గురించి అధికారులు అందరికీ ఫిర్యాదు చేశాం ఎవరూ పట్టించుకోవట్లేదు. బెదిరింపులకు పాల్పడుతున్నారు. పైగా మధ్యవర్తులు కలగజేసుకుని రూ.90లక్షలు తీసుకుని, రూ.2కోట్లు తీసుకురమ్మని మని అంటున్నారు. లేదా మీ పొలం మాకు అమ్ముతున్నట్లు సంతకాలు చేయమని బెదిరిస్తున్నారు. ఆ బెదిరింపులు,ప్రాణభయంతో ఇల్లు వదిలి పారిపోయి వచ్చాం. పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాం. కనీసం మా ఫిర్యాదు కూడా తీసుకోలేదు. చివరికి ఎస్పీ కార్యాలయానికి కూడా మమల్ని రానివ్వట్లేదు. పోలీసులు మమ్మల్ని మట్టి మాఫియాతో సెటిల్ చేసుకోమని సలహా ఇస్తున్నారు. మంత్రి లోకేష్‌ను కలిసి మా బాధ చెప్పుకున్నాం. మట్టి మాఫియా చివరకు లోకేష్ మాటను కూడా లెక్క చేయలేదు.ఇంకా ఎక్కడికి వెళ్లినా ఉపయోగం లేదని ఉదయం టీడీపీ కార్యాలయానికి వచ్చాం. మట్టి మాఫియా వేధింపులతో మనస్థాపం చెందిన నా భర్త చేయి కోసుకున్నారు. పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు’ అని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement