Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

TTD Goshala Row: Case Filed against TTD Ex Chairman Bhumana1
Goshala Row: ఎవరిది అసత్య ప్రచారం?.. ప్రశ్నిస్తే కేసులే!

తిరుపతి, సాక్షి: శ్రీవారి గోశాలలో గోమాతల మరణాల వ్యవహారంలో ఊహించిందే జరిగింది. వైఎస్సార్‌సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి(Bhumana Karunakar Reddy)పై కూటమి ప్రభుత్వం కేసు నమోదు చేయించింది. గోమాతల మరణాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చర్చకు రావాలంటూ టీడీపీ నేతలే ఆయనకు సవాల్‌ విసిరారు. అదే టైంలో.. పోలీసుల సాయంతో భూమనను నిర్భందించి ఇబ్బంది పెట్టడంతో నిన్నంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తాజాగా.. గోశాలలో గోవుల మృతిపై ప్రశ్నించిన టీటీడీ మాజీ చైర్మన్(TTD Ex Chairman) భూమన కరుణాకరరెడ్డి పై కేసు బనాయించింది కూటమి ప్రభుత్వం. గోశాలపై అతస్య ప్రచారం చేస్తూ మీడియాను తప్పుదోవ పట్టించారని, భక్తుల మనోభావాలు దెబ్బ తీశారంటూ టీటీడీ పాలకమండలి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో భూమనపై కేసు నమోదు అయ్యింది. గురువారం రాత్రి 8 గంటలకు ఫిర్యాదు నమోదు కాగా.. పోలీసులు ఆగమేఘాల మీద కేసు నమోదు చేశారు. బీఎన్‌ఎస్‌ యాక్ట్ 353(1), 299, 74 ఆఫ్ ఐటీ యాక్ట్ సెక్షన్ లు ఈ కేసులో నమోదు అయినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. శ్రీవారి ఎస్వీ గోశాలలో గోమాతల విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే గోమాతలు చనిపోతున్నాయి. గోశాలలో 191 ఆవులు ఏడాది కాలంలో చనిపోయాయి అంటూ గోశాల అధికారులే స్పష్టం చేయడం తెలిసిందే. అయినా కూడా గోవులు మృతి చెందలేదంటున్న పాలకమండలి వాదిస్తుండడం కొసమెరుపు.

Florida University Mass Shooting Live updates2
FSU: అమెరికా యూనివర్సిటీలో కాల్పులు.. ఇద్దరి మృతి

సాక్రమెంటో: అగ్రరాజ్యం మరోసారి కాల్పుల ఘటనతో ఉలిక్కి పడింది. ఫ్లోరిడా స్టేట్‌ యూనివర్సిటీ(Florida state University)లో ఓ సాయుధుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, ఐదుగురు గాయపడ్డారు. పోలీసులు దుండగుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కాల్పులకు గల కారణాలు తెలియరావాల్సి ఉంది.తొలుత.. తల్లహస్సి క్యాంపస్‌లోని స్టూడెంట్‌ యూనియన్‌లో యాక్టివ్‌ షూటర్‌ ఉన్నట్లు తొలుత సమాచారం రావడంతో యూనివర్సిటీ వెంటనే అలర్ట్‌ జారీ చేసింది. విద్యార్థులు, ఫ్యాకల్టీ, సిబ్బంది వెంటనే యూనివర్సిటీని వీడాలని, సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని హెచ్చరించింది. అనంతరం పోలీసులు, ఇతర ఏజెన్సీలు కాల్పులు చోటుచేసుకున్న ప్రాంతానికి వచ్చి సహాయ చర్యలు చేపట్టాయి. ఈ ఘటనతో క్యాంపస్‌ లాక్‌డౌన్‌(Lock Down)లోకి వెళ్లింది. ఈ రోజు జరగాల్సిన క్లాస్‌లు, స్పోర్ట్స్‌ ఈవెంట్స్, ఇతర కార్యక్రమాలను రద్దు చేశారు. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని తల్లహస్సి మెమోరియల్‌ హెల్త్‌కేర్‌ ప్రతినిధి తెలిపారు. అధ్యక్షుడు ట్రంప్‌నకు ఈ విషయాన్ని అధికారులు చేరవేశారు. ఈ ఘటనపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇదొక భయంకర సంఘటన అని ట్రంప్‌ పేర్కొన్నారు. ఓ యువకుడు తుపాకీతో కాల్పులు జరుపుతున్నట్లుగా ఫుటేజీ ఒకటి వెలుగులోకి వచ్చింది. నిందితుడు యూనివర్సిటీ విద్యార్థిగానే తెలియగా.. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. మరోవైపు.. ఐదుగురు మృతి చెందినట్లు కథనాలు వెలువడుతున్నప్పటికీ అధికారికంగా ధృవీకరణ కావాల్సి ఉంది. #Shooting at American universityMedia report that over 30 shots were fired on the campus of #Florida State #University.At least 5 people were killed and 4 others injured in the incident. pic.twitter.com/49nBiC6SLv— Tamadon News - English (@TamadonTV_EN) April 18, 2025

Texas Hit and Run Case: Telugu Student Deepthi No More3
Texas: మృత్యువుతో పోరాడి ఓడిన దీప్తి

ఆస్టిన్‌: అమెరికా టెక్సాస్‌లో తెలుగు విద్యార్థిని హిట్‌ అండ్‌ రన్‌ కేసు విషాదాంతంగా ముగిసింది. తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వంగవోలు దీప్తి(Deepthi Vangavolu)కన్నుమూశారు. ఈ విషయాన్ని అక్కడి అధికారులు ఇచ్చిన సమాచారం ద్వారా కుటుంబ సభ్యులు ధృవీకరించారు. దీంతో గుంటూరులోని ఆమె స్వస్థలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీప్తి(23) తండ్రి హనుమంత రావు చిరువ్యాపారి. ఆమె కుటుంబం గుంటూరు(Guntur) రాజేంద్రనగర్‌ రెండో లైనులో నివాసం ఉంటోంది. టెక్సాస్‌లోని డెంటన్‌ సిటీలో యూనివర్సిటీ ఆఫ్‌ నార్త్‌ టెక్సాస్‌లో ఎంఎస్‌ చేసేందుకు వెళ్లారు. మరో నెల రోజుల్లో కోర్సు పూర్తి కావాల్సి ఉంది. అయితే ఈలోపు రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు ఆమెను కబళించింది. ఈ నెల 12వ తేదీన స్నేహితురాలైన మేడికొండూరుకు చెందిన స్నిగ్ధతో కలిసి రోడ్డుపై నడచి వెళ్తుండగా వేగంగా ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. దీప్తి తలకు తీవ్ర గాయమైంది. స్నిగ్ధకు కూడా గాయాలయ్యాయి. దీప్తి స్నేహితురాళ్లు ప్రమాద విషయాన్ని ఆమె తండ్రి హనుమంతరావుకు తెలిపారు. క్రౌడ్‌ ఫండింగ్‌(Crowd Funding) ద్వారా ఆమె చికిత్స కోసం ప్రయత్నాలు కొనసాగగా.. మంచి స్పందన లభించింది. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ నెల 15న దీప్తి చికిత్స పొందుతూ కన్నుమూసింది. శనివారం(ఏప్రిల్‌ 19) నాటికి మృతదేహం గుంటూరుకు వచ్చే అవకాశం ఉంది. మరో బాధితురాలు స్నిగ్ధ ప్రస్తుతం అక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని సమాచారం. అవే ఆమె చివరి మాటలు..దీప్తి మృతి వార్త విని ఆ తల్లిదండ్రులు గుండెలు అవిసెలా రోదిస్తున్నారు. చదువులో చాలా చురుకైన విద్యార్థిని అని, అందుకే పొలం అమ్మి మరీ అమెరికాకు పంపించామని చెప్పారు. నెల రోజుల్లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి కావాల్సి ఉందని, ఆ టైంకి మమ్మల్ని అమెరికాకు రావాలని ఆమె కోరిందని, అందుకు ఏర్పాట్లలో ఉండగానే ఇలా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 10వ తేదీన దీప్తి చివరిసారిగా తమతో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిపారు. కాలేజీకి టైం అవుతోందని.. ఆదివారం మాట్లాడతానని చెప్పి హడావిడిగా ఫోన్‌ పెట్టేసిందని.. అవే తమ బిడ్డ మాట్లాడిన చివరి మాటలని గుర్తు చేసుకుని బోరున విలపించారు.

Telangana: Marubeni Corporation to establish Industrial Park in Future City4
ఫ్యూచర్‌ సిటీలో ‘మరుబెని’ పార్కు

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ ఫ్యూచర్‌ సిటీలో అభివృద్ధి చేయనున్న మొట్టమొదటి నెక్ట్స్‌ జెన్‌ ఇండ్రస్టియల్‌ పార్కులో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 30 వేలకు పైగా ఉద్యోగాలు లభిస్తాయని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి చెప్పారు. దేశంలోనే మొట్టమొదటి నెట్‌ జీరో సిటీగా ఫ్యూచర్‌ సిటీ అభివృద్ధి చెందుతుందన్నారు. తెలంగాణలో వ్యాపారానికి అనువైన అవకాశాలు ఉన్నాయని, పెట్టుబడులతో రాష్ట్రానికి వచ్చే వారికి తమ ప్రభుత్వం తరఫున మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.జపాన్‌ పర్యటనలో ఉన్న సీఎం నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో అక్కడి వ్యాపార దిగ్గజ సంస్థ ‘మరుబెని’ప్రతినిధులు గురువారం టోక్యోలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ ఫ్యూచర్‌ సిటీలో అత్యంత అధునాతన వసతులతో కూడిన (నెక్ట్స్‌ జెన్‌) పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేసేందుకు ‘మరుబెని’సంసిద్ధత వ్యక్తం చేసింది. 600 ఎకరాల విస్తీర్ణంలో ఈ పార్కును దశల వారీగా అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వంతో కీలక పెట్టుబడుల ఒప్పందం కుదుర్చుకుంది. పార్కు ఏర్పాటుకు సంబంధించిన ‘లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌’పై సీఎం రేవంత్‌ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ‘మరుబెని’ప్రతినిధులు సంతకాలు చేశారు. రూ.1,000 కోట్ల ప్రారంభ పెట్టుబడితో సంస్థ ఈ ప్రాజెక్టును చేపడుతుంది. తయారీ రంగంలో విదేశీ పెట్టుబడులకు చాన్స్‌ జపాన్‌కు చెందిన కంపెనీలతో పాటు ఇతర బహు ళ జాతి కంపెనీలు హైదరాబాద్‌లో తమ తయారీ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు వీలుగా అభివృద్ధి చేసే ఈ పార్కు రూ.5 వేల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షిస్తుందని అంచనా వేస్తున్నారు. ఎలక్ట్రానిక్స్, గ్రీన్‌ ఫార్మా, ప్రెసిషన్‌ ఇంజనీరింగ్, ఏరోస్పేస్, డిఫెన్స్‌ రంగాలపై ఈ పార్కు దృష్టి పెడుతుంది. అధునాతన తయారీ రంగాల్లో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు నైపుణ్యంతో కూడిన ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు ఈ ప్రాజెక్టు దోహదపడుతుంది. తెలంగాణ అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి దూరదృష్టితో వ్యవహరిస్తున్నారని ‘మరుబెని’బిజినెస్‌ ఎగ్జిక్యూటివ్‌ అధికారి దై సకాకురా అభినందించారు. 65 దేశాల్లో ‘మరుబెని’కార్యకలాపాలు మరుబెని కంపెనీ 65 దేశాల్లో 410 కంపెనీల ద్వారా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆహారం, వ్యవసాయ ఉత్పత్తులు, లోహాలు, గనులు, ఇంధనం, విద్యుత్తు, కెమికల్స్, మౌలిక సదుపాయాలు, ఫైనాన్స్‌ లీజింగ్, రియల్‌ ఎస్టేట్, ఏరోస్పేస్, మొబిలిటీ రంగాలలో ఈ కంపెనీ అగ్రగామిగా ఉంది. ఈ సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా 50 వేలకు పైగా ఉద్యోగులున్నారు. సోనీ కార్యాలయాన్ని సందర్శించిన సీఎం సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్‌ ప్రతినిధి బృందం గురువారం ఎలక్ట్రానిక్‌ దిగ్గజ సంస్థ ‘సోనీ’ప్ర«దాన కార్యాలయాన్ని సందర్శించింది. సోనీ కార్పొరేషన్‌ తయారు చేస్తున్న కొత్త ఉత్పత్తులు, చేపడుతున్న కొత్త కార్యక్రమాల గురించి వీరికి కంపెనీ ప్రతినిధులు వివరించారు. సోనీ కంపెనీ యానిమేషన్‌ అనుబంధ సంస్థ ‘క్రంచైరోల్‌’పై ప్రతినిధులతో జరిగిన చర్చల్లో.. యానిమేషన్, వీఎఫ్‌ఐ, గేమింగ్‌ రంగాలకు హైదరాబాద్‌లో ఉన్న అవకాశాలు, అనుకూలతలను తెలంగాణ ప్రతినిధి బృందం వివరించింది. ఎండ్‌ టు ఎండ్‌ ప్రొడక్షన్‌ సామర్థ్యాన్ని కలిగి ఉండే అత్యాధునిక ఫిల్మ్‌ సిటీ ఏర్పాటు చేయాలనే తన ఆలోచనలను ‘క్రంచైరోల్‌’ప్రతినిధులతో ముఖ్యమంత్రి పంచుకున్నారు. మెట్రో సహా అభివృద్ధి పనులకు నిధులపై ‘జైకా’తో చర్చలు జపాన్‌ ఇంటర్నేషనల్‌ కో ఆపరేషన్‌ ఏజెన్సీ (జైకా) ఉన్నత స్థాయి యాజమాన్య బృందంతో కూడా ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. రాష్ట్రంలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు నిధుల సమీకరణపై చర్చించారు. ముఖ్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రూ.24,269 కోట్ల అంచనాలతో చేపట్టనున్న మెట్రో రైలు రెండో దశ ప్రతిపాదనలు ఇప్పటికే కేంద్రం తుది పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు అవసరమమ్యే వ్యయంలో 48 శాతం అనగా రూ.11,693 కోట్లు రుణంగా ఇవ్వాలని కోరారు.ప్రపంచ పెట్టుబడుల గమ్య స్థానంగా, అత్యంత ఆకర్షణీయమైన నగరంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేసేందుకు చేపట్టిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల గురించి ప్రస్తావించారు. ప్రపంచ స్థాయి నగరాలైన న్యూయార్క్, టోక్యోతో సమానంగా నగరాన్ని అభివృద్ది చేసే యోచనలో తమ ప్రభుత్వం ఉందని చెప్పారు. మెట్రో రైలు రెండో దశతో పాటు మూసీ పునరుజ్జీవనం, రీజనల్‌ రింగ్‌ రోడ్డు నుంచి అవుటర్‌ రింగ్‌ రోడ్డుకు అనుసంధానించే రేడియల్‌ రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కూడా ఆర్థిక సాయం అందించాలని కోరారు.కాగా జైకా, తెలంగాణ నడుమ అనేక ఏళ్లుగా సంబంధాలు ఉన్నాయని జైకా సీనియర్‌ ప్రెసిడెంట్‌ షోహెయ్‌ హరా వ్యాఖ్యానించారు. ప్రాజెక్టులకు జైకా నుంచి ఆర్థిక సాయం పొందేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని సూచించారు. సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్‌ రంజన్, సీఎం ముఖ్య కార్యదర్శి వి.శేషాద్రి, మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Is Vijayasais testimony valid In AP liquor scam probe5
విజయసాయి సాక్ష్యం చెల్లుబాటు అవుతుందా?

వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త లిక్కర్ పాలసీ(New Liquor Policy) తీసుకురావడం ద్వారా.. విక్రయాల్లో పారదర్శకతకు పెద్దపీట వేశారు. విక్రయాలు ప్రభుత్వం చేతిలోనే ఉండడం వల్ల, బెల్టు షాపులను నూరుశాతం కట్టడి చేయడం అప్పట్లో సాధ్యం అయింది. అయితే చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచార సమయం నుంచి కూడా.. లిక్కర్ అమ్మకాల్లో పెద్ద స్కామ్ జరుగుతున్నట్టుగా దుష్ప్రచారం ప్రారంభించారు. .. దాదాపు 50వేల కోట్ల దాకా స్వాహా పర్వం జరిగినట్టుగా పదేపదే గోబెల్స్ ప్రచారం చేస్తూ ప్రజలను బురిడీ కొట్టించి అధికారంలోకి వచ్చారు. తీరా గద్దె ఎక్కిన తర్వాత.. అన్ని ఆరోపణలు చేసిన లిక్కరు విక్రయాల విషయంలో ఏదో ఒకటిచేయకపోతే పరువు పోతుందనే భయంతో.. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. 50వేల కోట్ల అవినీతి అనే ఆరోపణల స్థానంలో.. 3వేల కోట్ల అవినీతి జరిగిందని ఆ సిట్ గణాంకాలను తయారుచేసింది. ఇక విచారణలు ప్రారంభించారు. జగన్‌ మోహన్‌రెడ్డి(Jagan Mohan Reddy) ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని నిందితుడిగా చేర్చారు. ఆయనను విచారించాలంటే నోటీసులు ఇవ్వడానికి అందుబాటులో లేరని తేల్చారు. ఐటీ సలహాదారుగా అప్పట్లో ఉన్న తనను మద్యం స్కామ్ లో ఎందుకు విచారణకు పిలుస్తారంటూ ఆయన ఇచ్చిన మెయిల్ కు జవాబు లేదు. ఈలోగా.. వైఎస్సార్‌సీపీ రాజీనామా చేసిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి(Vijaya Sai Reddy)ని సాక్ష్యంగా విచారణకు పిలిచారు. ఈ నేపథ్యంలో.. అసలు విజయసాయిరెడ్డి సాక్ష్యం చెప్పడానికి ఏ రకంగా అర్హుడు? ఆయన సాక్ష్యానికి చట్టబద్ధత ఉంటుందా? చెల్లుబాటు అవుతుందా? అనే సందేహాలు ప్రజల్లో కలుగుతున్నాయి. సాధారణంగా ఒక కుంభకోణం(Scam) జరిగిందని ప్రభుత్వం భావిస్తే దానితో ప్రత్యక్షంగా సంబంధం ఉన్నవారినే విచారణకు పిలవాలి. ఎవరైతే నేరం చేశారని అనుకుంటున్నారో వారిని విచారించడానికి నోటీసులు ఇచ్చే తరహాలోనే.. దానితో సంబంధం ఉందనిపించిన వారిని సాక్షిగా పిలిచి ధ్రువీకరించుకోవచ్చు. మద్యం డిస్టిలరీల నుంచి భారీగా సొమ్ములు తీసుకోవడం ద్వారా అవినీతికి పాల్పడ్డారనేది ఇక్కడ ఆరోపణ. మహా అయితే డిస్టిలరీల యజమానులను పిలిచి విచారించడానికి అవకాశం ఉంది. అయితే ఈ వ్యవహారంతో ఏ మాత్రం సంబంధం లేని విజయసాయిరెడ్డిని ఏ కారణం చేత సాక్షిగా వివరాలు చెప్పాలని పిలుస్తున్నారో ప్రజలకు అర్థం కావడం లేదు.విజయసాయిరెడ్డి వైఎస్సార్‌సీపీ(YSRCP)కి రాజీనామా చేశారు. బయటకు వెళ్లిన తర్వాత పార్టీ మీద ఇప్పుడు రకరకాల నిందలు వేస్తున్నారు. ఇటీవల లిక్కర్ స్కామ్ జరిగిందని ఆయన ధ్రువీకరిస్తూ.. ఆ స్కామ్ కు కర్త కర్మ క్రియ అన్నీ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని అన్నారు. ఎవరో మూడో వ్యక్తి.. హఠాత్తుగా తెరమీదకు వచ్చి. ‘ఫలానా స్కామ్ లో ఫలానావాళ్లు అవినీతి చేశారు.. నేను చెబుతున్నాను’ అని చెబితే అది చెల్లుబాటు అవుతుందా? ఈ లెక్కన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో విభేదించి బయటకు వెళ్లిన నాయకులు ఇంకా అనేక మంది ఉన్నారు. వారందరినీ అధికార కూటమి ప్రలోభపెట్టి, బెదిరించి, మభ్యపెట్టి ఏదో ఒక విధంగా.. వైఎస్సార్‌సీపీ నేతల మీద బనాయించిన రకరకాల కేసుల్లో సాక్షులుగా మార్చేస్తే దాని పర్యవసానాలు చాలా ఘోరంగా ఉంటాయి కదా అనేది పలువురు అభ్యంతరంగా ఉంది. వైఎస్సార్‌సీపీ నుంచి బయటకు వచ్చిన వారిని, ఏమాత్రం సంబంధం లేని కేసుల్లో కూడా సాక్షులుగా మార్చేసుకోవడం ఒక సాంప్రదాయంగా మారిందంటే గనుక.. అది అనేక విపరిణామాలకు దారితీస్తుంది. అధికారంలోకి వచ్చిన ప్రతిపార్టీ తమ ప్రత్యర్థుల్ని వేధించడానికి ఒక అడ్డదారిని ఎంచుకున్నట్టుగా అవుతుంది. విజయసాయిరెడ్డి సిట్ ముందు హాజరైనా సరే.. ఎవరిమీదనైనా నిందలు వేయగలరు. కానీ..ఆ సమాచారం తనకు ఎలా తెలిసిందో సహేతుకంగా నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆయనకు ఉంటుంది. ఆయన చెప్పే సాక్ష్యం మూలాలను కూడా నిర్ధారించుకుంటే తప్ప సిట్ పోలీసులు సమర్థంగా వ్యవహరించినట్టు కాదు.. అని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.:::ఎం. రాజ్యలక్ష్మి

Telangana: Two Sons And Mother Lost Their Lives In Gajularamaram6
ఇద్దరు కొడుకుల గొంతుకోసి చంపి.. తల్లి ఆత్మహత్య

జీడిమెట్ల: కడుపున పుట్టిన ఇద్దరు కొడుకుల గొంతుకోసి చంపింది ఓ తల్లి. ఆపై తను కూడా అపార్ట్‌మెంట్‌లోని 5వ అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గాజులరామారంలోని బాలాజీ లేఅవుట్‌లో చోటు చేసుకుంది. బాలానగర్‌ డీసీపీ కె.సురేష్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పరిధిలోని చోడవరం గ్రామానికి చెందిన గాండ్ర వెంకటేశ్వరరెడ్డి భార్య తేజస్విని(35), ఇద్దరు కుమారులు ఆశిష్ రెడ్డి(7), హర్షిత్‌రెడ్డి(5)లతో కలిసి బాలాజీ లేఅవుట్‌లోని సహస్ర మహేష్‌ హెయిట్స్‌ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌నంబర్‌ 204లో ఉంటున్నారు.వెంకటేశ్వరరెడ్డి బొంతపల్లిలోని ఓ పరిశ్రమలో నాలుగేళ్లుగా పనిచేస్తున్నాడు. పిల్లలిద్దరూ స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో 1వ తరగతి, నర్సరీ చదువుతున్నారు. గురువారం ఉదయం వెంకటేశ్వరరెడ్డి డ్యూటీకి వెళ్లగా, ఇంట్లో తేజస్విని, పిల్లలు ఉన్నారు. మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో తేజస్విని అపార్ట్‌మెంట్‌ పైనుంచి దూకడంతో పెద్ద శబ్దం వచ్చింది. ఇది విన్న అపార్ట్‌మెంట్‌ వారు వెళ్లి చూడగా, తేజస్విని అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. వెంటనే అపార్ట్‌మెంట్‌ వాసులు సెకండ్‌ ఫ్లోర్‌లోని తేజస్విని ఇంట్లోకి వెళ్లి చూడగా, కిచెన్‌లో ఆశిష్ రెడ్డి అప్పటికే మృతి చెంది రక్తపుమడుగులో పడి ఉండగా, హర్షిత్‌రెడ్డి కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నాడు.వెంటనే అపార్ట్‌మెంట్‌ వారు హర్షిత్‌ను షాపూర్‌నగర్‌లోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. సంఘటన జరిగిన పరిసరాలను పరిశీలిస్తే...తేజస్విని తన ఇద్దరు కొడుకులను విచక్షణారహితంగా చంపినట్టు ఉందని స్థానికులు చెప్పారు. విషయం తెలుసుకొని సంఘటన స్థలానికి వచ్చిన బాలానగర్‌ డీసీపీ సురేష్ కుమార్, అడిషనల్‌ డీసీపీ హన్మంత్‌రావు, జీడిమెట్ల ఇన్‌స్పెక్టర్‌ గడ్డం మల్లేశ్‌లు వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టమ్‌ నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించగా, పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.8 పేజీల లేఖ స్వాధీనంతేజస్విని ఉంటున్న ఫ్లాట్‌లో పోలీసులకు 8 పేజీల ఓ లేఖ దొరికింది. అందులో తన ఇద్దరు పిల్లలకు కంటి సమస్య ఉందని, రెండు గంటలకు ఒకసారి కంట్లో మందు వేయకుంటే పిల్లలు నొప్పితో ఏడుస్తారని...దేవుడా నా పిల్లలకు ఎందుకు ఇంత బాధను ఇచ్చావు అని రాసి ఉంది. తనను అందరూ పిచ్చిది అంటున్నారని, ఆ మాటలు భరించలేకపోతున్నానంటూ ఆ లేఖలో పేర్కొంది. కాగా తేజస్విని మానసిక పరిస్థితి సరిగ్గా లేదని, అపార్ట్‌మెంట్‌లోనూ ఎవరితో మాట్లాడదని స్థానికులు అంటున్నారు.

Shiva Rajkumar Comments On Kamal Haasan7
నేనే అమ్మాయినైతే.. శివరాజ్‌ కుమార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

కన్నడ సూపర్‌ స్టార్‌ శివరాజ్‌ కుమార్( Shiva Rajkumar), రియల్‌ స్టార్‌ ఉపేంద్ర కలిసి నటించిన తాజా చిత్రం 45. ఎస్పీ స్వరాజ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై సుమతి ఉమా రమేష్‌రెడ్డి, ఎం. రమేష్‌ రెడ్డి కలిసి నిర్మించిన ఈ చిత్రం ద్వారా ప్రముఖ సంగీత దర్శకుడు అర్జున్‌ జాన్య దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 15న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్ర తమిళ్‌ వెర్షన్‌ టీజర్‌ను చెన్నైలో విడుదల చేశారు. స్థానిక రాయపేటలోని పీవీఆర్‌ సత్యం థియేటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో నటుడు శివరాజ్‌ కుమార్‌, ఉపేంద్ర, నిర్మాత రమేష్‌ రెడ్డి, చిత్ర దర్శకుడు అర్జున్‌ జన్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా నటుడు శివరాజ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. తాను చెన్నైకి ఎప్పుడు వచ్చినా సంతోషం కలుగుతుందన్నారు తాను పుట్టింది, పెరిగింది, చదివింది ఇక్కడే అన్నారు. తనకు నటుడుగా తొలి అవకాశం వచ్చింది కూడా ఇక్కడే అని పేర్కొన్నారు. అలా పలు మధురమైన జ్ఞాపకాలు తనకు చెన్నైతో ముడిపడి ఉన్నాయని అన్నారు. కాగా తాను ఎప్పుడు హీరో కావాలని కోరుకోలేదని హీరో అంటే కమలహాసన్‌ ,అమితాబచ్చన్‌లో మాదిరి ఉండాలని అనుకునేవాడినని అన్నారు. వారే తన ఫేవరెట్స్‌ అని పేర్కొన్నారు. ముఖ్యంగా నటుడు కమలహాసన్‌ తనకు స్ఫూర్తి అని ,తానే గనుక అమ్మాయినైతే ఆయన్ని ప్రేమించి పెళ్లి చేసుకునే దానినని ఆయనది అంత అందం అని పేర్కొన్నారు. తాను నటుడుగా మారిన తర్వాత చాలా జయాపజయాలను చవి చూశానన్నారు. అయినప్పటికీ వాటిని ఎప్పుడు తలకెక్కించుకోలేదని చెప్పారు. అదేవిధంగా జీవితంలో పలు మరణాలను, దుఃఖాలను ఎదుర్కొన్నానని, తనకు తలలో సర్జరీ జరిగిందని, అదేవిధంగా ఇటీవల క్యాన్సర్‌ వ్యాధి నుంచి బయటపడ్డానని చెప్పారు. ఇకపోతే 45 చిత్రంలో నటించడం సంతోషకరమన్నారు. దర్శకుడు అర్జున్‌ జాన్య కథ చెప్పగానే నచ్చిందన్నారు. ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాగా ఇంతకుముందు ఎప్పుడూ రానటువంటి వినూత్న కథాంశంతో రూపొందిన చిత్రం 45 అని, ఇది ఏ ఒక్క భాషకు చెందింది కాదని ఇండియన్‌ సినిమా అని నిర్మాత ఎం. రమేష్‌ రెడ్డి పేర్కొన్నారు.

Rasi Phalalu: Daily Horoscope On 18-04-2025 In Telugu8
ఈ రాశి వారికి భూలాభాలు.. వ్యాపారాలు విస్తరిస్తారు

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: బ.పంచమి ప.1.13 వరకు, తదుపరి షష్ఠి, నక్షత్రం: మూల పూర్తి (24 గంటలు), వర్జ్యం: ప.1.39 నుండి 3.21 వరకు, తదుపరి తె.4.52 నుండి 6.33 వరకు (తెల్లవారితే శనివారం),దుర్ముహూర్తం: ఉ.8.15 నుండి 9.05 వరకు, తదుపరి ప.12.24 నుండి 1.14 వరకు, అమృత ఘడియలు: రా.11.03 నుండి 2.50 వరకు; రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు, యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు, సూర్యోదయం: 5.47, సూర్యాస్తమయం: 6.12.మేషం: వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ప్రయాణాలలో మార్పులు. ఆలయ దర్శనాలు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి. వృషభం: ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు ఎదురవుతాయి.మిథునం: పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. భూలాభాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో సత్తా చాటుకుంటారు.కర్కాటకం: చిత్రవిచిత్ర సంఘటనలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యవహారాలలో విజయం. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.సింహం: మిత్రులతో కలహాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తులు వివాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.కన్య: మిత్రులే శత్రువుల్లా మారతారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా కొనసాగుతాయి.తుల: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పరిచయాలు విస్తృతమవుతాయి. వాహనయోగం. కీలక సమాచారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రగతి.వృశ్చికం: రుణాలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు కలసిరావు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు చిక్కులు.ధనుస్సు: సన్నిహితులతో సఖ్యత. ఇంటాబయటా ప్రోత్సాహం. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. వస్తులాభాలు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి.మకరం: అనుకున్న వ్యవహారాలు నిదానిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా వేస్తారు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు. ఉద్యోగాలలో కొన్ని ఒడిదుడుకులు.కుంభం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పనులలో పురోగతి. బంధువుల ద్వారా ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.మీనం: పనులలో ఆటంకాలు తొలగుతాయి. ఆప్తులు, శ్రేయోభిలాషుల సలహాలు స్వీకరిస్తారు. శుభవార్తలు అందుతాయి. పోటీపరీక్షల్లో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.

Mumbai beat Sunrisers Hyderabad by 4 wickets9
రైజర్స్‌ ఓటమి బాట

ఐదు రోజుల క్రితం అద్భుత ఆటతో 245 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇప్పుడు సమష్టి వైఫల్యంతో మరో పరాజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. నాలుగు వరుస ఓటముల తర్వాత గత మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఖాతాలో మళ్లీ ఓటమి చేరింది. బ్యాటింగ్‌లో మెరుపులు కనిపించక టీమ్‌ సాధారణ స్కోరుకే పరిమితమైంది. ఆ తర్వాత ఛేదనలో ముంబై ఇండియన్స్‌ కొంత తడబడినా... మరో 11 బంతులు మిగిలి ఉండగా లక్ష్యాన్ని అందుకోవడంలో సఫలమైంది. ముంబై: ఐపీఎల్‌లో ఐదుసార్లు చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ కీలక విజయాన్ని అందుకుంది. గురువారం జరిగిన పోరులో ముంబై 4 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఓడించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. అభిషేక్‌ శర్మ (28 బంతుల్లో 40; 7 ఫోర్లు), హెన్రిచ్‌ క్లాసెన్‌ (28 బంతుల్లో 37; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. అనంతరం ముంబై 18.1 ఓవర్లలో 6 వికెట్లకు 166 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ద మ్యాచ్‌’ విల్‌ జాక్స్‌ (26 బంతుల్లో 36; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), ర్యాన్‌ రికెల్టన్‌ (23 బంతుల్లో 31; 5 ఫోర్లు) కీలక పరుగులు సాధించారు. కనిపించని దూకుడు... ఇన్నింగ్స్‌ తొలి బంతికే అభిషేక్‌కు అదృష్టం కలిసొచ్చింది. దీపక్‌ చహర్‌ వేసిన బంతి అభిక్‌ బ్యాట్‌ ఎడ్జ్‌ను తీసుకొని స్లిప్‌ వైపు దూసుకెళ్లగా విల్‌ జాక్స్‌ దానిని అందుకోలేకపోయాడు. అనంతరం అతను కొన్ని చక్కటి షాట్లతో పరుగులు రాబట్టారు. మరోవైపు ట్రవిస్‌ హెడ్‌ (29 బంతుల్లో 28; 3 ఫోర్లు) బ్యాటింగ్‌లో సహజమైన ధాటి కనిపించలేదు. చహర్‌ ఓవర్లో అభిషేక్‌ వరుసగా మూడు ఫోర్లు కొట్టడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 46 పరుగులకు చేరింది. ఆ తర్వాత ఒక్కసారిగా ముంబై బౌలర్ల ఆధిపత్యం మొదలైంది. కట్టుదిట్టమైన బంతులతో వారు రైజర్స్‌ను నిలువరించారు. తొలి వికెట్‌కు 59 పరుగుల భాగస్వామ్యం (45 బంతుల్లో) తర్వాత అభిషేక్‌ను పాండ్యా వెనక్కి పంపాడు. 24 పరుగుల వద్ద క్యాచ్‌ ఇచ్చినా... నోబాల్‌తో బతికిపోయిన హెడ్‌ దానిని వాడుకోలేకపోయాడు. ఇషాన్‌ కిషన్‌ (2) మళ్లీ విఫలం కాగా, నితీశ్‌ కుమార్‌ రెడ్డి (21 బంతుల్లో 19; 1 ఫోర్‌) మరోసారి ప్రభావం చూపలేకపోయాడు. పవర్‌ప్లే ముగిసిన తర్వాత 7–17 ఓవర్ల మధ్యలో రైజర్స్‌ 5 ఫోర్లు మాత్రమే కొట్టగా... ఇన్నింగ్స్‌లో 17వ ఓవర్‌ వరకు ఒక్క సిక్స్‌ కూడా రాలేదు. చివర్లో 2 ఓవర్ల కారణంగా (మొత్తం 43 పరుగులు) రైజర్స్‌ స్కోరు 160 దాటింది. చహర్‌ వేసిన 18వ ఓవర్లో క్లాసెన్‌ వరుసగా 6, 4, 4, 6 బాదగా... పాండ్యా వేసిన ఆఖరి ఓవర్లో అనికేత్‌ 2 సిక్స్‌లు, కమిన్స్‌ ఒక సిక్స్‌ కొట్టారు. కీలక భాగస్వామ్యం.. ఎప్పటిలాగే ఫటాఫట్‌ షాట్లతో ఛేదనను మొదలు పెట్టిన రోహిత్‌ శర్మ (16 బంతుల్లో 26; 3 సిక్స్‌లు) మరోసారి తక్కువ స్కోరుకే పరిమితమయ్యాడు. ఐదు బంతుల వ్యవధిలో అతను మూడు సిక్సర్లు బాదాడు. మలింగ ఓవర్లో రికెల్టన్‌ మూడు ఫోర్లు కొట్టగా, 4 పరుగుల వద్ద జాక్స్‌ ఇచ్చిన క్యాచ్‌ను హెడ్‌ వదిలేశాడు. రికెల్టెన్‌ అవుటైన తర్వాత జాక్స్, సూర్యకుమార్‌ (15 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మూడో వికెట్‌కు 29 బంతుల్లో 52 పరుగులు జోడించి జట్టు విజయానికి బాటలు వేశారు. వీరిద్దరు ఏడు పరుగుల తేడాతో వెనుదిరిగినా... కెప్టెన్ హార్దిక్‌ పాండ్యా (9 బంతుల్లో 21; 3 ఫోర్లు, 1 సిక్స్‌), తిలక్‌ వర్మ (17 బంతుల్లో 21 నాటౌట్‌; 2 ఫోర్లు) కలిసి గెలుపు దిశగా నడిపించారు. స్కోరు వివరాలు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: అభిషేక్‌ శర్మ (సి) (సబ్‌) బావా (బి) పాండ్యా 40; హెడ్‌ (సి) సాంట్నర్‌ (బి) జాక్స్‌ 28; ఇషాన్‌ కిషన్‌ (స్టంప్డ్‌) రికెల్టన్‌ (బి) జాక్స్‌ 2; నితీశ్‌ కుమార్‌ రెడ్డి (సి) తిలక్‌ వర్మ (బి) బౌల్ట్‌ 19; క్లాసెన్‌ (బి) బుమ్రా 37; అనికేత్‌ వర్మ (నాటౌట్‌) 18; కమిన్స్‌ (నాటౌట్‌) 18; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 162. వికెట్ల పతనం: 1–59, 2–68, 3–82, 4–113, 5–136. బౌలింగ్‌: దీపక్‌ చహర్‌ 4–0–47–0, బౌల్ట్‌ 4–0–29–1, బుమ్రా 4–0–21–1, విల్‌ జాక్స్‌ 3–0–14–2, హార్దిక్‌ పాండ్యా 4–0–42–1, సాంట్నర్‌ 1–0–8–0. ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: రికెల్టన్‌ (సి) హెడ్‌ (బి) హర్షల్‌ పటేల్‌ 31; రోహిత్‌ (సి) హెడ్‌ (బి) కమిన్స్‌ 26; విల్‌ జాక్స్‌ (సి) అన్సారీ (బి) కమిన్స్‌ 36; సూర్యకుమార్‌ (సి) అన్సారీ (బి) కమిన్స్‌ 26; తిలక్‌ వర్మ (నాటౌట్‌) 21; పాండ్యా (సి) ఇషాన్‌ కిషన్‌ (బి) మలింగ 21; నమన్‌ (ఎల్బీ) (బి) మలింగ 0; సాంట్నర్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (18.1 ఓవర్లలో 6 వికెట్లకు) 166. వికెట్ల పతనం: 1–32, 2–69, 3–121, 4–128, 5–162, 6–162. బౌలింగ్‌: షమీ 3–0–28–0, కమిన్స్‌ 4–0–26–3, ఇషాన్‌ మలింగ 4–0–36–2, అన్సారీ 3.1–0–35–0, హర్షల్‌ 3–0–31–1, రాహుల్‌ చహర్‌ 1–0–9–0. అనూహ్య ‘నోబాల్‌’ క్యాచ్‌ను అందుకునే లేదా స్టంపింగ్‌ ప్రయత్నంలో వికెట్‌ కీపర్‌ గ్లవ్స్‌ స్టంప్స్‌ ముందుకు రాకూడదు. ఇది అందరికీ తెలిసిన, చాలా కాలంగా అమల్లో ఉన్న నిబంధనే. కానీ గురువారం అనూహ్య ఘటన చోటు చేసుకుంది. అన్సారీ వేసిన బంతిని రికెల్టన్‌ ఆడి కమిన్స్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. అయితే దీనిని ‘నోబాల్‌’గా ప్రకటిస్తూ అంపైర్లు నాటౌట్‌గా ప్రకటించారు. జరిగిందేమిటంటే రికెల్టన్‌ షాట్‌ ఆడక ముందే క్లాసెన్‌ గ్లవ్స్‌ ముందుకు వచ్చాయి. ఇది ఐసీసీ రూల్స్‌ 27.3.1కు విరుద్ధం. అందుకే నోబాల్‌ ఇచ్చారు. క్లాసెన్‌ కూడా తాను చేసిన తప్పును వెంటనే అంగీకరిస్తూ సైగ చేయడం గమనార్హం. ఐపీఎల్‌లో నేడుబెంగళూరు X పంజాబ్‌ వేదిక: బెంగళూరురాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

Chandrababu Naidu has committed massive irregularities in the liquor policy10
మద్యం మాఫియా మూలవిరాట్టు బాబే

సాక్షి, అమరావతి: మద్యం విధానంపై కూటమి సర్కారు సారథి, సీఎం చంద్రబాబు శ్రీరంగ నీతులు చెబుతుండడం దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నంత విడ్డూరంగా ఉంది. ఎందుకంటే.. రాష్ట్రంలో మద్యం మాఫియా సృష్టికర్త చంద్రబాబే. మద్యం మాటున మహా దోపిడికీ బ్రాండ్‌ అంబాసిడర్‌ ఈ 40 ఇయర్స్‌ ఇండస్ట్రీనే అన్నది బహిరంగ రహస్యం. అయినప్పటికీ.. రెడ్‌బుక్‌ కుట్రలో భాగంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాం నాటి మద్య విధానంపై అక్రమ కేసు నమోదు చేసింది. ఐదేళ్ల పాటు పాదర్శకంగా అమలు చేసిన విధానంపై టీడీపీ వీరవిధేయ పోలీసు అధికారులతో సిట్‌ ఏర్పాటు చేసింది. దర్యాప్తు పేరుతో అబద్ధపు వాంగ్మూలాల నమోదు, తప్పుడు సాక్ష్యాల సృష్టికి కూటమి ప్రభుత్వం కుతంత్రాలు పన్నుతోంది. ఈ హడావుడి అంతా.. అసలు మద్యం దందా ఘనాపాఠి చంద్రబాబే అన్నది మరుగునపరచాలన్నది పన్నాగం. కానీ, టీడీపీ మద్యం సిండికేట్‌ మహా దోపిడీ దాచేస్తే దాగేది కాదు. తన బినామీలు, సన్నిహితులకు డిస్టిలరీల లైసెన్సులు ఇచ్చి.. టీడీపీ ప్రజాప్రతినిధులతో మద్యం సిండికేట్‌ ఏర్పాటు చేసి.. ఊరూరా బెల్ట్‌ దుకాణాలు తెరిచి.. ఊరూపేరు లేని బ్రాండ్లను ప్రవేశపెట్టి.. మూడు బార్లు ఆరు దుకాణాలుగా రాష్ట్రమంతా మద్యం ఏరులై పారించిన ఘనత చంద్రబాబుదే. ఈ క్రమంలో చీకటి జీవోలతో కనికట్టు చేశారు.. 2014–19 మధ్య ప్రభుత్వ ఖజానాకు రూ.5 వేల కోట్ల పన్ను రాబడికి గండికొట్టారు. సిండికేట్‌ ద్వారా రూ.20 వేల కోట్లు కొల్లగొట్టారు. చంద్రబాబు పాలనకు పూర్తి విరుద్ధంగా మద్యం విధా­నంపై వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వినూత్న సంస్కరణలు తీసుకువచ్చింది. ప్రైవేటు దుకాణాలను రద్దు చేసి సిండికేట్‌ను రూపుమాపింది. దశలవారీ మద్య నియంత్రణను సమర్థంగా అమలు చేసింది. కొత్తగా ఒక్క డిస్టిలరీకీ అనుమతినివ్వ లేదు. దీంతో టీడీపీ ప్రభుత్వ హయాంతో పోలిస్తే వైఎస్సార్‌సీపీ పాలనలో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. మద్యం అమ్మకాలు పెరిగితే డిస్టిలరీలు కమీషన్లు ఇస్తాయి. కానీ, తగ్గితే కమీషన్లు ఇవ్వవన్నది ఎవరైనా ఠక్కున చెప్పే వాస్తవం. కానీ, కుట్రపూరితంగానే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కమీషన్లు తీసుకున్నారని కూటమి ప్రభుత్వం అక్రమ కేసు నమోదు చేసింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పాతిపెట్టిన ప్రైవేట్‌ మద్యం సిండికేట్‌ భూతాన్ని చంద్రబాబు ప్రభుత్వం తవ్వి తీసి ప్రజలపైకి వదిలింది. యథేచ్ఛగా దోపిడీకి బరితెగిస్తోంది. అందుకే.. ప్రజలకు వాస్తవాలను వివరించేందుకు.. చంద్రబాబు మద్యం దోపిడీ సమగ్ర కుట్రను చాటేందుకు.. మద్యం మాఫియాను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సమర్థంగా కట్టడి చేసిన విధానాన్ని చెప్పేందుకు.. ప్రస్తుతం మళ్లీ పేట్రేగుతున్న మద్యం దందాను తెలియజేస్తోంది ‘సాక్షి’. » 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు తన బినామీలు, సన్నిహితుల మద్యం కంపెనీల ముసుగులో ఖజానాకు భారీగా గండికొట్టారు. నిబంధనలకు విరుద్ధంగా.. వారి కంపెనీలకు అడ్డగోలు లబ్ధి కలిగించారు. సీఎం హోదాలో చంద్రబాబు స్వయంగా సంతకాలు చేసి మరీ కుంభకోణానికి పాల్పడ్డారు. తద్వారా ఖజానాకు ఏటా రూ.1,300 కోట్ల మేర గండి కొట్టారు. ఈ విషయమై.. రాజ్యాంగబద్ధ సంస్థ కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) ఆధ్వర్యంలో స్వతంత్రంగా విధులు నిర్వర్తించే ప్రిన్సిపల్‌ అకౌంటెంట్‌ జనరల్‌ తన అభ్యంతరాలను స్పష్టంగా నివేదించారు కూడా. » చంద్రబాబు ముఠా బాగోతం ఆధారాలతో సహా బయటపడటంతో 2023లోనే సీఐడీ కేసు నమోదు చేసింది. 2014–19 మధ్య సీఎంగా ఉన్న చంద్రబాబు, ఎక్సైజ్‌ కమిషనర్‌గా వ్యవహరించిన ఐఎస్‌ నరేష్, అప్పటి ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, తదితరులపై ఐపీసీ సెక్షన్లు: 166, 167, 409, 120(బి) రెడ్‌ విత్‌ 34, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు: 13(1),(డి), రెడ్‌ విత్‌ 13(2) కింద సీఐడీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. 5 డిస్టిలరీల నుంచే.. ముసుగులో చంద్రబాబు దందా డిస్టిలరీలతో కుమ్మక్కయి కొన్ని ఉత్పత్తులకు కృత్రిమ డిమాండ్‌ను సృష్టించి దోపిడీకి తెరతీసింది చంద్రబాబు ప్రభుత్వం. 2015–19 మధ్య ఇలా కేవలం ఐదు డిస్టిలరీలకే లబ్ధి చేకూరింది. వీరి నుంచే 50 శాతానికిపైగా కొనుగోళ్లు చేశారు. అందుకు కొన్ని తార్కాణాలు ఇవిగో... » 2017–18లో టీడీపీ ప్రభుత్వం మొత్తం రూ.8,106 కోట్ల మద్యం కొనుగోలు ఆర్డర్లు ఇచ్చింది. వాటిలో రూ.4,122.28 కోట్లు ఐదు డిస్టిలరీలలకే ఇవ్వడం గమనార్హం. పెర్ల్‌ డిస్టిలరీకే రూ.1,374.79 కోట్ల మద్యం ఆర్డర్లు ఇవ్వగా.. పెర్నోడో రిచర్డ్‌ ఇండియా లిమిటెడ్‌కు రూ.548.03కోట్లు, ఎస్వీఆర్‌ డిస్టిలరీస్‌కు రూ.395.1 కోట్లు, అలైడ్‌ బ్లెండర్స్‌–డిస్టిలరీస్‌కు రూ.457.86కోట్లు, ఎస్వీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌కు రూ.319.57కోట్ల మద్యం ఆర్డర్లు ఇచ్చారు. » 2018–19లో టీడీపీ ప్రభుత్వం మొత్తం రూ.4,765.75 కోట్ల మద్యం ఆర్డర్లు ఇచ్చింది. వాటిలో కేవలం మూడు డిస్టిలరీలకే ఏకంగా రూ.2,244.44కోట్ల మద్యం ఆర్డర్లు ఇవ్వడం గమనార్హం. » పెర్ల్‌ డిస్టిలరీస్‌కు అత్యధికంగా రూ.1,462.41కోట్ల మద్యం ఆర్డర్లు ఇవ్వగా.. సెంటిని బయో ప్రొడక్ట్స్‌కు రూ.638.52కోట్లు, ఎస్పీవై ఆగ్రో ప్రొడక్ట్స్‌ రూ.143.51 కోట్ల ఆర్డర్లు ఇచ్చారు. తద్వారా కేవలం ఈ మూడు డిస్టిలరీల నుంచే రూ.47.09 శాతం మద్యం కొనుగోలు చేశారు. బార్లలోనూ అదే బరితెగింపు.. చంద్రబాబు ఆదేశాలతో బార్లపై ప్రివిలేజ్‌ ఫీజును రద్దు చేసేందుకు ఎక్సైజ్‌ చట్టం 10(ఏ) నిబంధన తొలగించాలంటూ ఎక్సైజ్‌ కమిషనర్‌ 2015 సెప్టెంబరు 1న సర్క్యులర్‌ ఇచ్చారు. ప్రివిలేజ్‌ ఫీజు రద్దుపై 2015 సెప్టెంబరు 9న బార్ల యజమానులు వినతిపత్రం సమర్పించినట్లు రికార్డుల్లో చూపారు. సెపె్టంబరు 9న వినతిపత్రం సమర్పిస్తే దానికి 9 రోజులు ముందుగానే సెపె్టంబరు 1నే ప్రివిలేజ్‌ ఫీజు రద్దు చేయాలని ఎక్సైజ్‌ కమిషనర్‌ సర్క్యులర్‌ ఎలా ఇచ్చారన్నది చంద్రబాబే చెప్పాలి. బార్లకు ప్రివిలేజ్‌ ఫీజు రద్దుపై కూడా ఆర్థిక శాఖ అనుమతి తీసుకోలేదు. కేబినెట్‌ ఆమోదమూ పొందలేదు. ప్రివిలేజ్‌ ఫీజును రద్దు చేస్తూ 2015 డిసెంబరు 11న జీవో 468 జారీ అయింది. అందుకు సంబంధించిన నోట్‌ ఫైళ్లపై ఎక్సైజ్‌ శాఖ మంత్రి హోదాలో కొల్లు రవీంద్ర 2015 డిసెంబరు 3న సంతకం చేయగా సీఎం హోదాలో చంద్రబాబు 2015 డిసెంబరు 4న డిజిటల్‌ సంతకాలు చేయడం వారి పన్నాగానికి నిదర్శనం. డిస్టిలరీలన్నిటికీ అనుమతినిచ్చింది చంద్రబాబు ప్రభుత్వమే మద్యం విధానం ముసుగులో చంద్రబాబు తన బినామీలు, సన్నిహితులకు చెందిన డిస్టిలరీలకు అడ్డగోలుగా లబ్ధి చేకూర్చారు. వారి ద్వారా ఖజానాకు గండి కొట్టి నిధులను సొంత ఖజానాకు మళ్లించుకున్నారు. రాష్ట్రంలో 20 మద్యం డిస్టిలరీలు ఉండగా 14 డిస్టిలరీలకు చంద్రబాబు సర్కారే అనుమతులిచ్చింది. మిగిలిన ఆరు డిస్టిలరీలకు అంతకుముందటి ప్రభుత్వాలు అనుమతులిచ్చాయి.వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్న 2019–24లో రాష్ట్రంలో ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వనేలేదు. 2014 నవంబరులో జీవో నంబర్‌ 993 ప్రకారం రెవెన్యూ (ఎౖక్సైజ్‌2) డిపార్ట్‌మెంట్‌ ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా, కమిటీ సూచించిన వాటి కంటే ఎక్కువ డిస్టిలరీల స్థాపనకు టీడీపీ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. కేబినెట్‌కు చెప్పకుండానే.. 2015లో చంద్రబాబు ప్రభుత్వం కొత్త మద్యం విధానం తెచ్చింది. నాడు కేబినెట్‌ సమావేశానికి ముందు ఎక్సైజ్‌ కమిషనర్‌ మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్‌ ఫీజును కొనసాగించడమే కాక 10 రెట్లు పెంచాలని ఓ నోట్‌ ఫైల్‌ను పంపారు. ఈ ప్రతిపాదనను చంద్రబాబు కేబినెట్‌ అజెండాలో చేర్చలేదు. కొత్త మద్యం విధానంపై కేబినెట్‌ సమావేశంలో చర్చించి 2015 జూన్‌ 22న జీవోలు 216, 217 జారీ చేశారు. ఆ రెండు జీవోల్లోనూ మద్యం దుకాణాలకు ప్రివిలేజ్‌ ఫీజు తొలగిస్తున్నట్లు పేర్కొనలేదు. కానీ, అదే రోజు సాయంత్రం అప్పటి ఎక్సైజ్‌ కమిషనర్‌ ప్రివిలేజ్‌ ఫీజు తొలగించాలని ప్రతిపాదిస్తూ, ఎక్సైజ్‌ చట్టం 16(9) నిబంధనను రద్దు చేయాలని సిఫార్సు చేశారు. ఆ నోట్‌ ఫైల్‌ను చంద్రబాబు కార్యాలయానికి పంపారు. ఈ మేరకు ‘కాపీ టు పీఎస్‌ టు సీఎం’ అని నోట్‌ ఫైల్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. అంటే ప్రివిలేజ్‌ ఫీజును తొలగిస్తున్న విషయం చంద్రబాబుకు స్పష్టంగా తెలుసనేది సుస్పష్టం. అదే రోజు అంటే.. 2015 జూన్‌ 22న సాయంత్రం గుట్టుగా జీవో 218 జారీ అయింది. దీని గురించి కేబినెట్‌లో చర్చించలేదు. ఖజానాకు నష్టం వాటిల్లే అంశాలపై ముందుగా ఆర్థిక శాఖ ఆమోదం తప్పనిసరి. కానీ ప్రివిలేజ్‌ ఫీజు రద్దు విషయాన్ని ఆర్థిక శాఖకు తెలియజేయనే లేదు. ‘పవర్‌ స్టార్‌’, ‘లెజెండ్‌’లను తెచ్చింది ఎవరు?పవర్‌ స్టార్, లెజెండ్‌.. ఇవేవో టీడీపీ కూటమిలోని నాయకుల పేర్ల ముందు ఉండే బిరుదులు కావు. మద్యం బ్రాండ్లు. ఈ రెండే కాదు.. ఊరూ పేరు తెలియని అనేక బ్రాండ్ల మద్యంకు చంద్రబాబు ప్రభుత్వమే అనుమతులిచ్చింది. దాదాపు 200 రకాల బ్రాండ్లను మార్కెట్‌లో ప్రవేశపెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడింది. టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మద్యం బ్రాండ్లలో కొన్ని .. ప్రెసిడెంట్‌ మెడల్‌: ఈ బ్రాండ్‌కు 2017 నవంబరు 22న చంద్రబాబు ప్రభుత్వం అనుమతినిచ్చింది. హై వోల్టేజ్, వోల్టేజ్‌ గోల్డ్, ఎస్‌ఎన్‌జీ 10000, బ్రిటీష్‌ అంపైర్‌ సూపర్‌ స్ట్రాంగ్‌ ప్రీమియం బీర్, బ్రిటీష్‌ ఎంపైర్‌ అల్ట్రా బ్రాండ్‌ బీర్‌ ఉత్పత్తులకు 2017 జూన్‌ 7న చంద్రబాబు ప్రభుత్వం ఓకే చెప్పింది. గవర్నర్‌ రిజర్వ్, లెఫైర్‌ నెపోలిన్, ఓక్టోన్‌ బారెల్‌ ఏజ్డ్, సెవెన్త్‌ హెవెన్‌ బ్లూ బ్రాండ్ల విస్కీలకు 2018 అక్టోబరు 26న అంగీకారం తెలిపారు. రాయల్‌ ప్యాలస్, న్యూ కింగ్, సైన్‌ అవుట్‌ పేర్లతో విస్కీ, బ్రాందీ బ్రాండ్లకు 2018 నవంబరు 9న అనుమతిచ్చింది. బీరా 91 పేరుతో మూడు రకాల బీర్‌ బ్రాండ్లకు 2019 మే 13న అప్పటి టీడీపీ ప్రభుత్వమే పచ్చజెండా ఊపింది. టీఐ మ్యాన్షన్‌ హౌస్, టీఐ కొరియర్‌ నెపోలియన్‌ విస్కీ, బ్రాందీ బ్రాండ్లకు 2018 మే 15న అనుమతినిచ్చింది. అసలు స్కాం ఎవరిది? లంచాలు ఎవరికి ఇస్తారు?టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే వైఎస్సార్‌సీపీ పాలనలో అమ్మకాలు తగ్గాయి.. ఈ నేపథ్యంలో లిక్కర్‌ వ్యవహారంలో వాస్తవంగా స్కాంలు చేసింది ఎవరు? అనేది పరిశీలిస్తే.. » మద్యాన్ని ఎక్కువగా అమ్మితే లంచాలు ఇస్తారా? అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా? » మద్యం అమ్మకాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే లంచాలు ఇస్తారా? లేక ప్రభుత్వం ద్వారా మాత్రమే అమ్మితే లంచాలు ఇస్తారా? » విక్రయ వేళలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? లేక ఎక్కువ సమయం అమ్మేలా చేస్తే లంచాలు ఇస్తారా? » మద్యం దుకాణాలను పెంచితే లంచాలు ఇస్తారా? దుకాణాలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? »దుకాణాలకు తోడు పర్మిట్‌ రూమ్‌లు, బెల్టు షాప్‌లు పెడితే లంచాలు ఇస్తారా? లేక బెల్టు షాపులు తీసేసి, పర్మిట్‌ రూమ్స్‌ను రద్దు చేస్తే లంచాలు ఇస్తారా? » 2014 - 19లో చంద్రబాబు నిర్ణయించిన బేసిక్‌ రేట్లను పెంచి.. డిస్టిలరీల నుంచి కొనుగోళ్లు చేస్తే లంచాలు వస్తాయా? లేక పాత రేట్లను కొనసాగిస్తే లంచాలు వస్తాయా? » మద్యంపై తక్కువ ట్యాక్స్‌ల ద్వారా ఎక్కువ అమ్మకాలు చేసే విధంగా డిస్టిలరీలకు మేలు చేస్తే లంచాలు వస్తాయా? లేక ట్యాక్స్‌లు పెంచి, తద్వారా అమ్మకాలు తగ్గితే లంచాలు వస్తాయా? » ఎంపిక చేసుకున్న 4-5 డిస్టిలరీలకు మాత్రమే అధికంగా ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? అన్ని డిస్టిలరీలకు సమాన స్థాయిలో ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? » ఇప్పుడున్న డిస్టిలరీలలో అధిక భాగం అనుమతులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న వారికి లంచాలు వస్తాయా? లేక ఏ ఒక్క డిస్టిలరీకీ అనుమతివ్వని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఉన్నవారికి లంచాలు వస్తాయా? వైఎస్సార్‌సీపీ హయాంలో.. » 2019-24 మధ్య ఐదేళ్లలో కొత్తగా ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. మద్యం విధానంలో అక్రమ దందా సాగించే సిండికేట్‌ వ్యవస్థను పూర్తిగా ఎత్తివేసింది. » లిక్కర్‌ షాపుల నుంచి పూర్తిగా ప్రైవేటు వ్యక్తులను తొలగించింది. ప్రభుత్వ ఆధీనంలోనే అమ్మకాలు సాగించింది. » 33 శాతం మద్యం దుకాణాలను తీసివేసింది. షాపుల సంఖ్యను 4,380 నుంచి 2,934కు తగ్గించింది. » మద్యం దుకాణాలకు అనుబంధంగా ఉన్న 43 వేల బెల్టు షాపులను, 4,380 పర్మిట్‌ రూమ్‌లను రద్దు చేసింది. » మద్యం ధరలను షాక్‌ కొట్టేలా పెంచింది. ఎక్సైజ్‌కు సంబంధించిన నేరాలకు పాల్పడితే శిక్షలను కఠినం చేసింది. » మద్యం విక్రయాల వేళలను కుదించింది. ప్రతి ఊరికి ఒక మహిళా పోలీసును నియమించింది. దీంతో మద్యం అమ్మకాలు బాగా తగ్గాయి. లబ్ధి పొందిన చంద్రబాబు బినామీలు, సన్నిహితులు వీరు టీడీపీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు వియ్యంకుడు, టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్‌ జిల్లా మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌ యాదవ్‌. ప్రస్తుత ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌ యాదవ్‌కు తండ్రి ఈయన. టీడీపీ మాజీ ఎంపీ దివంగత డీకే ఆదికేశవుల నాయుడు కుటుంబం టీడీపీ నేత, మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డి కుటుంబం. 2014లో వైఎస్సార్‌సీపీ తరపున ఎంపీగా గెలిచిన ఎస్పీవై.. నిబంధనలకు విరుద్ధంగా టీడీపీలో చేరినందుకు నజరానాగా ఆయన డిస్టిలరీకి చంద్రబాబు అనుమతిచ్చారు. 2019 ఎన్నికలకు ముందు ఆగమేఘాల మీద 2019, ఫిబ్రవరి 25న అనుమతినిచ్చిన విశాఖ డిస్టిలరీస్‌ అప్పటి టీడీపీ సీనియర్‌ నేత, ప్రస్తుత స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు కుటుంబానికి చెందింది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement