Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

US President Donald Trump Public image image down 43 percent1
టారిఫ్‌లతో పడిపోయిన ట్రంప్‌ గ్రాఫ్‌ 

వాషింగ్టన్‌: ప్రపంచ దేశాలపై ఎడాపెడా టారిఫ్‌లు వడ్డించిన అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గ్రాఫ్‌ బాగా పడిపోయింది. ఆయనను అధ్యక్షుడిగా అంగీకరించే అమెరికన్ల సంఖ్య 43 శాతానికి పడిపోయింది. బుధవారంతో ముగిసిన మూడు రోజుల సర్వేలో ఈ మేరకు వెల్లడైంది. మూడు నెలల కింద అధికారం చేపట్టిన నాటి నుంచి ఆయనకు మద్దతు ఇంత తగ్గడం ఇదే తొలిసారి. జనవరిలో పదవీ బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకు ట్రంప్‌కు 47 శాతం మద్దతు లభించింది. ట్రంప్‌ సుంకాలు, నిర్వహణపై అమెరికన్లు బాగా అసంతృప్తితో ఉన్నారు. ఆయన విదేశాంగ విధానాన్ని సైతం వ్యతిరేకిస్తున్నారు. వలసదారులను తిప్పి పంపుతున్న అంశంపై మాత్రమే ట్రంప్‌ విధానాలకు ఆమోదం తెలిపారు. ట్రంప్‌ పాపులారిటీ తగ్గడానికి ప్రధాన కారణం ఆర్థిక వ్యవస్థను నిర్వహిస్తున్న తీరే. ఈ విషయంలో ఆయన పనితీరును కేవలం 37 శాతం మంది మాత్రమే ఆమోదించారు. ఆటోమొబైల్స్, ఆటోమోటివ్‌ విడిభాగాల వంటి వస్తువులపై ట్రంప్‌ విధించిన భారీ సుంకాలతో చాలామంది అమెరికన్లు ఆందోళన చెందుతున్నారు. కొత్త టారిఫ్‌లు తమకు, తమ కుటుంబాలకు చేటు చేస్తాయని భావిస్తున్నట్లు సర్వేలో దాదాపు సగం మంది పేర్కొన్నారు. ట్రంప్‌ సుంకాల పెంపు స్టాక్‌ మార్కెట్లో కూడా అనిశ్చితికి దారితీయడం తెలిసిందే. ఆయన దుందుడుకు విధానాలు దీర్ఘకాలిక దౌత్య నిబంధనలకు విఘాతం కలిగించడమే గాక ప్రపంచంతో అమెరికా వ్యవహరించే విధానంలో మార్పుకు కారణమయ్యాయి. ట్రంప్‌ సైనిక నిర్వహణ పట్ల కూడా అమెరికన్లు బాగా ఆందోళన చెందుతున్నట్టు సర్వే తేల్చింది. యెమెన్‌లో హౌతీ ఉగ్రవాదులపై సైనిక దాడి ప్రణాళిక సిగ్నల్‌ యాప్‌ ద్వారా లీకవడంపై వారు ఆగ్రహంగా ఉన్నారు. ఇది తవ్ర బాధ్యతారాహిత్యమని ఏకంగా 74 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇక ట్రంప్‌ విదేశాంగ విధానానికి జనామోదం కూడా జనవరిలో 34 శాతానికి పడిపోయింది. జనవరిలో ఇది 37 శాతంగా ఉంది. ట్రంప్‌ వలస విధానాలకు 48 శాతం ఆమోదం లభించింది.

Growing pressure within the party on Chandrababus approach to the Waqf Bill2
వక్ఫ్‌ బిల్లుకు మద్దతుపై ముసలం!

సాక్షి, అమరావతి: వక్ఫ్‌ చట్ట సవరణ బిల్లుకు జేడీయూ మద్దతివ్వటాన్ని నిరసిస్తూ బిహార్‌లో పలువురు నేతలు వరుసగా రాజీనామాలు చేస్తుండటంతో ఆ పార్టీలో ముసలం మొదలైంది. ఎన్డీఏ కీలక భాగస్వామ్య పక్షంగా కొనసాగుతున్న జేడీయూకు బిహార్‌ ఎన్నికలకు ముందు ఇది అతి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. ఇదే మాదిరిగా సీఎం చంద్రబాబు వక్ఫ్‌ సవరణకు బిల్లుకు మద్దతివ్వడం పట్ల టీడీపీకి చెందిన మైనార్టీ నేతల్లో తీవ్ర అసంతృప్తి రాజుకుంటోంది. బిల్లుకు అనుకూలంగా ఓటే­యడం ద్వారా ముస్లిం సమాజానికి టీడీపీ ఎంత ద్రోహం తలపెట్టిందో పార్లమెంట్‌ సాక్షిగా తేటతెల్లమైందనే చర్చ జరుగుతోంది. దీంతో పలువురు నేతలు పార్టీని వీడే యోచనలో ఉన్నట్లు గ్రహించడంతో ఒత్తిడి పెరిగిన సీఎం చంద్రబాబు డైవర్షన్‌ పాలిటిక్స్‌కు తెర తీశారు. ఈ క్రమంలో ఏమాత్రం ఉపయోగం లేని మూడు సవరణలను ప్రతిపాదించి గొప్పగా ప్రచారం చేసుకున్నారు. పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ద్వారా కుటుంబ వ్యవహారాలను మాట్లాడించడంతోపాటు రుషికొండ గురించి టీడీపీ కరపత్రంలో తప్పుడు కథనాలు రాయించారు. వైఎస్సార్‌ సీపీ వక్ఫ్‌ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసిందని పొద్దున టీడీపీ సోషల్‌ మీడియాలో ప్రచారం చేయించిన చంద్రబాబు సాయంత్రాని కల్లా అనుకూలంగా ఓటు వేసిందంటూ మరో ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు. ముస్లిం సమాజానికి సమాధానం చెప్పాల్సిన చంద్రబాబు డైవర్షన్‌ రాజకీయాలు చేస్తుండటం గమనార్హం.పెరుగుతున్న ఒత్తిళ్లతో ఉక్కిరిబిక్కిరి..వక్ఫ్‌ చట్ట సవరణ బిల్లుకు అనుకూలంగా ఓటేసిన ఎన్డీఏ పక్షాలు జేడీయూ, రాష్ట్రీయ లోక్‌దళ్‌కు బిహార్, యూపీలో పలువురు నేతలు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తుండటం.. టీడీపీ రెండు నాలుకల వైఖరిపై ముస్లిం సమాజంలో తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకుతుండటంతో సీఎం చంద్రబాబు మరో డ్రామాకు తెర తీశారు. తనకు అలవాటైన డైవర్షన్‌ పాలిటిక్స్‌లో భాగంగా వైఎస్సార్‌ సీపీపై సోషల్‌ మీడియాలో తలా తోకా లోకుండా దుష్ప్రచారానికి పచ్చ కూలీలను రంగంలోకి దించారు. హైదరాబాద్‌లోని ‘సాక్షి’ కార్యాలయం వక్ఫ్‌ బోర్డునకు చెందినదని, అందుకే లోక్‌సభలో వక్ఫ్‌ చట్ట సవరణ బిల్లును వైఎస్సార్‌ సీపీ ఎంపీలు వ్యతిరేకించారని.. రాజ్యసభలో మాత్రం అనుకూలంగా ఓటు వేయించారని.. విప్‌ జారీ చేయలేదని.. ఇలా పరస్పర విరుద్ధంగా, పొంతన లేని ప్రచారం చేయించుకున్నారు. సవరణ బిల్లులో ఏమాత్రం సత్తాలేని మూడు సవరణలు ప్రతిపాదించి ముస్లింలను మభ్యపుచ్చేందుకు యత్నించి బోనులో నిలబడ్డ చంద్రబాబు తన నిర్వాకాలకు సమాధానం చెప్పకుండా బురద చల్లేందుకు విఫల యత్నాలు చేశారు.మైనార్టీలకు నష్టం జరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోనని ఎన్నికల సమయంలో చంద్రబాబు గంభీరంగా ప్రకటనలు చేయగా గుంటూరు ఎంపీ అభ్యర్థి అయితే మైనార్టీలకు నష్టం జరిగితే ఏకంగా రాజీనామా చేస్తానని చెప్పారు. వక్ఫ్‌ బిల్లు నేపథ్యంలో ముస్లిం మైనార్టీలంతా టీడీపీని నిలదీస్తుండటంతో దీని నుంచి బయట పడేందుకు చంద్రబాబు డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారు. నాడు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు నుంచి నేడు పీ 4 కార్యక్రమం దాకా నోరు తెరిస్తే చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేనని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా ఉన్న షర్మిల ఆ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వక్ఫ్‌ బిల్లుపై స్పందించాల్సి పోయి కుటుంబ విషయాలను ప్రస్తావించటాన్ని బట్టి చంద్రబాబు స్క్రిప్టు ప్రకారమే నడుచుకుంటున్నట్లు మరోసారి స్పష్టమైందని, ఇదంతా డైవర్షన్‌ రాజకీయాల్లో భాగమేనని వ్యాఖ్యానిస్తున్నారు.స్పష్టంగా వ్యతిరేకించిన వైఎస్సార్‌ సీపీ.. ఆది నుంచి అదే విధానంవక్ఫ్‌ చట్ట సవరణ బిల్లు విషయంలో వైఎస్సార్‌ సీపీ మొదటినుంచి తన విధానాన్ని చాలా స్పష్టంగా చెబుతూ వచ్చింది. రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్న ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ఎప్పుడో ప్రకటించారు. ఆ మేరకు మొన్న లోక్‌సభలో.. నిన్న రాజ్యసభలోనూ బిల్లుకు వ్యతిరేకంగా పార్టీ ఓటు వేసింది.వక్ఫ్‌ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని వైఎస్సార్‌ సీపీ తన ఎంపీలకు విప్‌ జారీ చేసింది. బిల్లును పార్టీ వ్యతిరేకించిందనేందుకు లోక్‌సభ, రాజ్యసభల్లో రికార్డయిన ఉభయ సభల కార్యకలాపాలే తిరుగులేని రుజువు. వక్ఫ్‌ బిల్లుపై పార్లమెంట్‌లో వైవీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి ప్రసంగాలే మరొక సాక్ష్యం.టీడీపీ ప్రతిపాదించిన నిస్సత్తువ సవరణలివీ..వక్ఫ్‌ సవరణ బిల్లుకు మద్దతు ఇవ్వవద్దన్న తమ విజ్ఞప్తిని పట్టించుకోకపోగా.. సత్తువ లేని సవరణలు ప్రతిపాదించి వాటికి జేపీసీ (పార్లమెంట్‌ సంయుక్త కమిటీ) ఆమోదం తెలిపిందని, అది తమ ఘనతేనని టీడీపీ ప్రచారం చేసుకోవడంపై ముస్లిం సమాజం మండిపడుతోంది. జేపీసీకి టీడీపీ సవరణలు ప్రతిపాదించినట్లు ఆ పార్టీ గొప్పలు చెప్పుకోవడం, జాతీయ మీడియాలో ప్రచారం చేసుకోవటమేగానీ దీనికి సంబంధించి ఎక్కడా కనీసం కసరత్తు చేసిన దాఖలాలు లేవని, ఏ ఒక్కరినీ సంప్రదించలేదని పేర్కొంటున్నారు. అసలు టీడీపీ ప్రతిపాదించిన మూడు సవరణలు ఏమాత్రం పస లేనివని, ముస్లింల పట్ల ఆ పార్టీ మొసలి కన్నీళ్లు కారుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా బిహార్‌ ఎన్నికల ముంగిట ఎన్డీఏ కీలక భాగస్వామ్య పక్షం ఎన్డీఏకి ఆ పార్టీ నేతలు షాకులిస్తున్నారు. వక్ఫ్‌ సవరణ బిల్లుకు సీఎం నితీష్‌ సారథ్యంలోని జేడీయూ మద్దతివ్వటాన్ని నిరనిస్తూ పలువురు నేతలు మూకుమ్మడి రాజీనామాలు సమర్పిస్తున్నారు.1) సాధారణంగా కొత్త చట్టాలన్నీ అవి రూపుదిద్దుకుని ఆమోదం పొందిన నాటి నుంచే అమలులోకి వస్తాయి. అంతేగానీ పాత తేదీలకు వర్తించవు. అలాంటప్పుడు ఆస్తుల పునఃపరిశీలనకు అవకాశం లేదంటూ టీడీపీ ప్రతిపాదించిన సవరణకు ఏం విలువ ఉంటుందని ముస్లిం పెద్దలు నిలదీస్తున్నారు.2) రెండో సవరణ కింద.. వక్ఫ్‌ ఆస్తుల నిర్థారణలో జిల్లా కలెక్టర్‌కు తుది అధికారం ఉండరాదని, రాష్ట్ర ప్రభుత్వం హయ్యర్‌ ర్యాంకింగ్‌ అథారిటీ ఉన్న అధికారిని నియమిస్తుందని ప్రతిపాదించారు. అధికారులు ఎవరైనప్పటికీ ఆయా ప్రభుత్వాల విధానాలకు అనుగుణంగానే వ్యవహరిస్తారు. అలాంటప్పుడు కలెక్టర్‌ అయినా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయినా ఒకటే కదా! ఏ అధికారిని నియమించినా ప్రభుత్వ ఆదేశాల మేరకే నడుచుకుంటారు కదా!! మరి ఈ సవరణ సత్తువ లేని సవరణ కాదా?3) మూడో సవరణ పేరుతో.. డిజిటల్‌ పత్రాలను సమర్పించేందుకు ఆర్నెళ్లకుపైగా గడువు పొడిగింపును ప్రతిపాదించారు. వక్ఫ్‌ ఆస్తుల డిజిటలైజేషన్‌ ప్రక్రియ ఇప్పటికే పూర్తైందని ముఖ్తార్‌ అబ్బాస్‌ నక్వీ లాంటి బీజేపీ నేతలే చెబుతున్నారు. అంటే.. ఇప్పటికే పూర్తయిన ప్రక్రియకు టీడీపీ సవరణలను ప్రతిపాదించిందని భావించాలా??

Public entry restricted on 400 acre Kancha Gachibowli till April 16: Telangana3
కంచ గచ్చిబౌలిలో నిషేధాజ్ఞలు

సాక్షి, సిటీబ్యూరో/గచ్చిబౌలి/రాయదుర్గం: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో కేంద్రీయ విశ్వవిద్యాలయంలో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ఆ పరిసర ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు విధించారు. సుప్రీంకోర్టు, కేంద్ర సాధికార కమిటీ ఆదేశాల మేరకు ప్రశాంతతకు భంగం కలగకుండా, అల్లర్లు జరగకుండా నిరోధించేందుకు మాదాపూర్‌ డీసీపీ వినీత్‌ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల ప్రాంతంలో సంబంధం లేని వ్యక్తుల ప్రవేశానికి అనుమతులు లేవని తెలిపారు.నిషేధాజ్ఞలు శుక్రవారం నుంచి ఈనెల 16 వరకూ అమలులో ఉంటాయని తెలిపారు. ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, సెంట్రల్‌ వర్సిటీతో పాటు కంచ గచ్చిబౌలి సర్వే నంబర్‌ 25లో పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. గురువారం నాటి సుప్రీంకోర్టు స్టేతో ధర్నాలు, ఆందోళనలు ఆగిపోయాయి.సదరు 400 ఎకరాల్లో పనులను నిలిపివేశారు. క్యాంపస్‌తో పాటు వివాదాస్పద భూముల్లో పోలీసు లు బందోబస్తు నిర్వహిస్తున్నారు. క్యాంపస్‌ ప్రధాన ద్వారం వద్ద వాహనాలను తనిఖీలు చేసి, ఐడీ కార్డులున్న సిబ్బంది, విద్యార్థులను మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. విద్యార్థుల భారీ ర్యాలీ శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు హెచ్‌సీయూలో వివిధ విద్యార్థి సంఘాలు భారీ ర్యాలీని నిర్వహించాయి. ‘ప్రతిఘటన, విజయోత్సవ ర్యాలీ’పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీచర్స్‌ అసోసియేసన్, వర్కర్స్‌ అసోసియేషన్‌ సహా పలు విద్యార్థి సంఘాలు పాల్గొన్నాయి. విద్యార్థులు, ఫ్యాకలీ్ట, నాన్‌టీచింగ్, వర్కర్స్‌ ఐక్యత వర్ధిల్లాలి, హెచ్‌సీయూ భూములను కాపాడుతాం అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. అరెస్టయిన, కస్టడీలో ఉన్న విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని, విద్యార్థులు, సివిల్‌ సొసైటీ గ్రూప్‌లు, ఇతరులపై పెట్టిన కేసులను ఉపసంహరించాలని, క్యాంపస్‌ నుంచి పోలీస్‌ క్యాంప్‌లను ఎత్తివేయాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. కుక్కల దాడిలో గాయపడి.. దుప్పి మృతి హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో శుక్రవారం కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన దుప్పి (మచ్చల జింక).. మృగవనికి తరలిస్తుండగా మృతిచెందింది. విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల హెచ్‌సీయూ క్యాంపస్‌లో చెట్లు, పొదలను తొలగించడంతో స్థావరాలను కోల్పోయిన వన్యప్రాణులు క్యాంపస్‌లోని హాస్టళ్ల వైపు వస్తున్నాయి.శుక్రవారం మధ్యాహ్న సమయంలో ఒక దుప్పి రాగా కుక్కలు వెంటపడి గాయపరిచాయి. విద్యార్థులు, సెక్యూరిటీ సిబ్బంది కుక్కలను తరిమివేసి గాయపడిన దుప్పికి ప్రాథమిక చికిత్స అందించి, అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. వారు దానిని మృగవనికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. దీంతో మృగవనిలో పోస్టుమార్టమ్‌ నిర్వహించి అక్కడే ఖననం చేశారు. గోపన్‌పల్లిలో ఇళ్ల మధ్య జింక పరుగులు.. శుక్రవారం హెచ్‌సీయూ అటవీ ప్రాంతం సమీపంలోని గోప న్‌పల్లి ఎన్‌టీఆర్‌నగర్‌లో ఓ జింక రోడ్లపై పరుగులు తీసింది. అటూఇటూ తిరుగుతూ ఓ ఇంట్లోకి వెళ్లగా, స్థానికులు గమ నించి తలుపులు మూసివేశారు. అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు. అటవీ శాఖ అధికారులు అక్కడకు వచ్చి జింకను పట్టుకుని జూపార్కుకు తరలించారు.అవన్నీ ఏఐ చిత్రాలే సాక్షి, హైదరాబాద్‌: హెచ్‌సీయూ పరిధిలో చెట్ల తొలగింపుతో వన్యప్రాణులకు తీవ్ర నష్టం కలుగుతోందన్న రీతిలో.. సామాజిక మాధ్యమాల్లో చేసిన ప్రచారమంతా కల్పితమని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. కొన్ని జేసీబీలతో చెట్లను నరికివేయడం వల్ల అక్కడున్న నెమళ్లు, జింకలు పరుగెత్తుకుంటూ పారిపోతున్న రీతిలో రూపొందించిన చిత్రం పూర్తిగా ఏఐ(ఆర్టీఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) ఆధారితమని తేల్చిచెప్పింది. బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియాలో క్రిషాంక్‌ ఎక్స్‌ ఖాతాలో జింక కాళ్లు కట్టేసి చంపినట్లు చూపిన చిత్రం కూడా తప్పుడు చిత్రమని తేల్చింది. ఈ చిత్రం ఓ సోషల్‌ మీడియా జర్నలిస్టు పొరపాటున పోస్టు చేశారని, ఆ తర్వాత సదరు రిపోర్టర్‌ తన తప్పిదాన్ని ఒప్పుకుని తొలగించినట్లు ఎక్స్‌ వేదికగా తెలిపారని వివరించింది.

Tension at the police station due to the TDP leaders4
కలెక్టర్‌ వీపు బద్దలు కొడతాం!

సంతబొమ్మాళి : రాష్ట్రంలో టీడీపీ నేతల ఆగడాలు అంతులేకుండాపోతోంది. అధికారం ఉండగానే వీలైనంత మేర దండుకునేందుకు చెలరేగిపోతున్నారు. ఇందుకోసం ఉన్నతాధికారులను సైతం ఖాతరు చేయడంలేదు. నోటికొచ్చినట్లు మాట్లాడుతూ వారిని బెంబేలెత్తిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలో చేపల కట్టు వేలంపాట విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగడంతో టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు జీరు బీమారావు అధికారం అండతో పేట్రేగిపోయారు. కలెక్టర్, ఆర్డీఓపై పరుష వ్యాఖ్యలు చేశారు. కలెక్టర్‌ వీపులు బద్దలు కొడతామంటూ నోటికొచ్చినట్లు మాట్లాడారు.సాక్షాత్తు పోలీసుస్టేషన్‌లో ఈ ఘటన చోటుచేసుకోవడం టీడీపీ బరితెగింపునకు నిదర్శనం. వివరాలివీ.. మండలంలోని మూలపేట గ్రామంలో చేపల కట్టు వేలం పాట, ఇతర విషయాల్లో రెండు వర్గాల మధ్య విభేదాలు తలెత్తి ఘర్షణ వాతావరణం ఏర్పడింది. దీంతో వారు నౌపడ పోలీసుస్టేషన్‌ను ఆశ్రయించారు. అక్కడ టెక్కలి రూరల్‌ సీఐ శ్రీనివాసరావు, నౌపడ ఎస్‌ఐ నారాయణస్వామి సమక్షంలో టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. ఊరికి, తమకు సంబంధంలేదని వైఎస్సార్‌సీపీ సర్పంచ్‌ జీరు బాబూరావు అంటున్నారని రేపు ఏం జరిగినా మీరు జోక్యం చేసుకోవద్దని భీమారావు పోలీసులను హెచ్చరించారు. సర్పంచ్‌ బాబూరావు లెక్కలు చెప్పాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ సమయంలో.. మూలపేట పోర్టు నిర్మాణం నిమిత్తం గ్రామాన్ని ఖాళీ చేయించే ప్రస్తావన వచ్చింది. దీంతో.. సర్పంచ్‌ ప్రతి విషయంలో కలగజేసుకుంటున్నాడని, పోర్టు నిర్మాణ నిమిత్తం మూలపేట గ్రామాన్ని ఖాళీ చేయించడానికి కలెక్టర్‌ వస్తే ఆయన వీపు బద్దలుకొడతామని పోలీసుల సమక్షంలో భీమారావు పరుషంగా మాట్లాడారు. ‘మేం మా­రం.. మా ఊరు వదలం.. పరిహారం డబ్బు­లు ఎవరికి ఇచ్చారని ఇళ్లు ఖాళీ చేయమంటున్నారు’ అంటూ రెచ్చిపోయారు.పోర్టు ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీలో 580 కుటుంబాలకు లాటరీ తీయకుండా.. ‘వాడెవడు 80 మందికి లాటరీ తీశాడం’టూ ఆర్డీఓపై విరుచుకుపడ్డారు. ‘గ్రామాన్ని ఖాళీ చేయడమేమిటి? అంతా మీ ఇష్టమా? ఇళ్లు, డబ్బులు ఎవరికిచ్చారం’టూ ప్రశ్నించారు. ‘పోలీస్‌స్టేషన్‌కు ఈరోజు 200 మంది వచ్చాం.. రేపు రెండువేల మందితో వస్తాం.. లెక్కలు చెప్పకపోతే చంపేస్తాం.. మీరు మాత్రం కేసు కట్టకండి’ అని పోలీసులను భీమారావు హెచ్చరించారు. ఇలా టీడీపీ నేతల తీరుతో మధ్యాహ్నం వరకు పోలీస్‌స్టేషన్‌ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరకు.. సర్పంచ్‌ బాబూ­రావు శనివారం లెక్కలు చెప్తారని పోలీసులు నచ్చజెప్పడంతో అంతా అక్కడి నుంచి నిష్క్రమించారు.

Shooter Rahi Sarnobat returns to the ring after recovering from illness5
నిలబడలేని స్థితి నుంచి... మళ్లీ గన్‌ పట్టి...

రాహీ సర్నోబత్‌... భారత్‌ తరఫున షూటింగ్‌ ప్రపంచకప్‌ 25 మీటర్ల పిస్టల్‌ విభాగంలో స్వర్ణం సాధించిన తొలి భారత మహిళ. మొత్తంగా షూటింగ్‌ ప్రపంచ కప్‌లలో ఆమె ఖాతాలో 5 స్వర్ణాలు, ఒక రజతం, రెండు కాంస్యాలు ఉన్నాయి. దీంతో పాటు ఆసియా క్రీడల్లో స్వర్ణ, కాంస్యాలు... కామన్వెల్త్‌ క్రీడల్లో 2 స్వర్ణాలు, ఒక రజతం ఆమె గెలుచుకుంది. దాదాపు మూడేళ్ల క్రితం వరకు రాహీ భారత అత్యుత్తమ షూటర్లలో ఒకరిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే 32 ఏళ్ల వయసులో ఆమె ఊహించని ఘటన రాహీ జీవితంలో చోటు చేసుకుంది. వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ పోటీల కోసం ఆమె సిద్ధమవుతోంది. అనూహ్యంగా ఆమె శరీరంలో కాస్త మార్పు కనిపించింది. కొంత నొప్పిగా అనిపించినా ఆ సమయంలో దానిని పట్టించుకోలేదు. కానీ కొద్ది రోజుల తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. శరీరమంతా తట్టుకోలేనంత నొప్పితో విలవిల్లాడింది. బెడ్‌ మీద నుంచి లేవలేని పరిస్థితి వచ్చింది. దాంతో అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించారు. అన్నింటిలో అంతా బాగుందనే వచ్చింది. అసలు సమస్య ఏమిటనేది మాత్రం తేలలేదు. పరిస్థితి మరింత తీవ్రంగా మారి అసలు పడుకోలేని పరిస్థితి. కూర్చొని మాత్రమే నిద్రపోవాల్సి వచ్చేది. చివరకు ఆమెకు ‘న్యూరోపతిక్‌ పెయిన్‌’ ఉన్నట్లుగా డాక్టర్లు తేల్చారు. అయితే దీనికి ప్రత్యేక కారణం గానీ, ప్రత్యేక చికిత్స గానీ ఉండదని, ప్రతీ వ్యక్తికీ భిన్నమైన లక్షణాలు ఉంటాయని చెప్పడం రాహీలో ఆందోళనను మరింత పెంచింది. ‘కొన్ని నెలల పాటు రోజుకు 17–20 గంటలు కేవలం పడుకునేదాన్ని. అసలు ఏం జరుగుతోందో అర్థం కాకుండా పైకప్పు వైపు చూస్తూ ఉండిపోయేదాన్ని’ అని నాటి బాధాకర రోజులను రాహీ గుర్తు చేసుకుంది. మహారాష్ట్ర ప్రభుత్వంలోని రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న రాహీ అదృష్టవశాత్తూ ఆరోగ్యం మెరుగవడం మొదలైంది. కొన్ని నెలల తర్వాత నొప్పి పూర్తిగా తగ్గకపోయినా ఫిజియోథెరపీని మొదలు పెట్టారు. నిర్విరామంగా 20 నిమిషాలు పాటు టీవీ షో చూడటం కూడా ఆమె మొదటి ఎక్సర్‌సైజ్‌గా మారింది. మొదట్లో అది కూడా కష్టంగా అనిపించింది. అయితే ఫిజియోథెరపీతో నెమ్మదిగా పరిస్థితి మారి కొంత ఎక్కువ సమయం కూర్చోవడం మొదలు పెట్టింది. ఆ సమయంలో ఆమె ఆటలో పునరాగమనం గురించి అస్సలు ఆలోచించలేదు. అసలు జీవితం సాధారణంగా మారి ఆరోగ్యంగా ఉంటే చాలు అనుకునే పరిస్థితి మాత్రమే ఆమెది. కానీ రాహీ చివరకు కోలుకొని ఆపై ఫిట్‌నెస్‌పై కూడా దృష్టి పెట్టింది. అంతా చక్కబడటంతో సర్నోబత్‌ మళ్లీ గన్‌ పట్టుకొని షూటింగ్‌ మొదలు పెట్టింది. ఈ సారి తనను తాను నిరూపించుకునేందుకో, పతకాలు గెలుచుకునేందుకో కాదు. తాను ఎలాంటి కఠిన పరిస్థితులను దాటి ధైర్యంగా నిలబడ్డానో, జీవితం ఇచ్చిన రెండో అవకాశాన్ని పట్టుదలగా ఎలా వాడుకున్నానో చూపించేందుకు రాహీ మళ్లీ ఆటలోకి అడుగు పెట్టింది. ఇటీవల డెహ్రాడూన్‌లో జరిగిన జాతీయ క్రీడల్లో 25 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో స్వర్ణం సాధించడంతో ఆమె కొత్త జీవితం మొదలైంది. రియో, టోక్యో ఒలింపిక్స్‌లలో పాల్గొన్న రాహీ సర్నోబత్‌ ఇప్పుడు మరోసారి తన స్వప్నం ఒలింపిక్స్‌ పతకం కోసం సిద్ధమవుతోంది. అసలు లేవలేని పరిస్థితి నుంచి కోలుకొని మళ్లీ సత్తా చాటుతూ లాస్‌ ఏంజెలిస్‌ గేమ్స్‌ లక్ష్యంగా తన సన్నాహాలు చేస్తోంది. - సాక్షి క్రీడా విభాగం

Rasi Phalalu: Daily Horoscope On 05-04-2025 In Telugu6
ఈ రాశి వారికి వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలం.

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: శు.అష్టమి రా.12.30 వరకు, తదుపరి నవమి, నక్షత్రం: ఆరుద్ర ఉ.10.28 వరకు, తదుపరి పునర్వసు, వర్జ్యం: రా.10.13 నుండి 11.47 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.55 నుండి 7.34 వరకు, అమృతఘడియలు: లేవు; రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు, యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు, సూర్యోదయం: 5.56, సూర్యాస్తమయం: 6.10.మేషం: దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. కార్యజయం. దైవదర్శనాలు. వాహనయోగం. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.వృషభం: శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. దూరప్రయాణాలు. సోదరులతో కలహాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. విద్యార్థులకు నిరాశ.మిథునం: కుటుంబంలో సంతోషకరంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.కర్కాటకం: ఆర్థిక ఇబ్బందులు, రుణయత్నాలు. ఆలోచన లు స్థిరంగా ఉండవు. వ్యవహారాలలో చికాకులు. కళాకారులకు ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా అనుకూలించవు.సింహం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. వస్తులాభాలు. మిత్రులతో సఖ్యత. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలం.కన్య: పరపతి కలిగిన వారితో పరిచయాలు. సంఘంలో ఆదరణ. పనులు చకచకా సాగుతాయి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరమైన పరిస్థితి.తుల: వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. వృథా ఖర్చులు. అనారోగ్యం. బంధువులతో తగాదాలు. పారిశ్రామికవేత్తల యత్నాలు మందగిస్తాయి. వృత్తులు, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.వృశ్చికం: శ్రమ ఫలించదు. వ్యయప్రయాసలు. ఆధ్యాత్మిక చింతన. ఆరోగ్యసమస్యలు. పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహవంతంగా ఉంటాయి.ధనుస్సు: ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.మకరం: ఇంటర్వ్యూలు అందుతాయి. యత్నకార్యసిద్ధి. దైవదర్శనాలు. దూరపు బంధువుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.కుంభం: అనుకున్న కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. నిర్ణయాలలో తొందరవద్దు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని చికాకులు.మీనం: శ్రమ తప్ప ఫలితం ఉండదు. వ్యవహారాలలో అవాంతరాలు. వృథా ఖర్చులు. కొత్త బాధ్యతలు. ఆరోగ్యం మందగిస్తుంది. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.

Higher US tariffs on rival manufacturing hubs can benefit India7
పోటీ దేశాలపై టారిఫ్‌లు.. మనకు మరిన్ని అవకాశాలు

న్యూఢిల్లీ: అమెరికా టారిఫ్‌లతో భారత ఎగుమతులకు సవాళ్లు ఉన్నప్పటికీ, పోటీ దేశాలపై మరింత అధిక స్థాయిలో సుంకాలు విధించడం వల్ల, మన వ్యాపారాన్ని పెంచుకునేందుకు గణనీయంగా అవకాశాలు ఉన్నాయని ఎలక్ట్రానిక్స్, ఐటీ హార్డ్‌వేర్‌ సంస్థల సమాఖ్య ఎంఏఐటీ తెలిపింది. భారత్‌తో పోలిస్తే చైనా, వియత్నాంలపై భారీగా సుంకాలు విధించడమనేది మన ఎగుమతులకు సానుకూలాంశమని వివరించింది. ‘భౌగోళిక, రాజకీయ రిస్కులను అధిగమించేందుకు గ్లోబల్‌ కంపెనీలు తమ తయారీ కార్యకలాపాలను భారత్‌కు మళ్లించే అవకాశం ఉంది. దీంతో మన ఎగుమతులు మరింత పెరగవచ్చు. పోటీ దేశాలతో వ్యాపారం భారీ వ్యయాలతో కూడుకున్నది కావడంతో అంతర్జాతీయంగా కొనుగోలుదారులు భారత ఎగుమతులవైపు మొగ్గు చూపవచ్చు. గ్లోబల్‌ బ్రాండ్లు తమ తయారీ కేంద్రాలను ఇతర దేశాలకు మళ్లించడంపై దృష్టి పెడతాయి కనుక సరఫరా వ్యవస్థకు సంబంధించి భారత్‌కు మరిన్ని అవకాశాలు లభించవచ్చు‘ అని ఎంఏఐటీ పేర్కొంది. భారత్‌పై 27 శాతం సుంకాలు ప్రకటించిన అమెరికా, మనకు పోటీ దేశాలైన చైనాపై 54 శాతం, వియత్నాంపై 46 శాతం, థాయ్‌లాండ్‌పై 36 శాతం విధించింది. దీనితో ఎల్రక్టానిక్స్, టెలికాం పరికరాలు, ఐటీ హార్డ్‌వేర్‌ విషయంలో ఆయా దేశాలు మనతో పోటీపడే పరిస్థితి తగ్గుతుందని, మన ఎగుమతులకు డిమాండ్‌ మెరుగుపడవచ్చని ఎంఏఐటీ తెలిపింది. అమెరికాకు భారత్‌ సుమారు 7 బిలియన్‌ డాలర్ల స్మార్ట్‌ఫోన్లను ఎగుమతి చేస్తోంది. టారిఫ్‌ల వల్ల వీటిపై ప్రభావం పడనుంది. స్థిరమైన పాలసీలు కావాలి.. పోటీ దేశాలపై టారిఫ్‌లను మనకు అనుకూలంగా మల్చుకోవాలంటే వ్యాపారాల నిర్వహణ సులభతరం చేయడానికి మరింత ప్రాధాన్యతనివ్వాల్సి ఉంటుందని ఎంఏఐటీ తెలిపింది. అలాగే పాలసీలపరంగా స్థిరత్వం ఉండేలా చూడాలని, లాజిస్టిక్స్‌.. ఇన్‌ఫ్రాపై భారీగా పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుందని పేర్కొంది. ఇవన్నీ చేయగలిగితే రాబోయే రోజుల్లో ప్రపంచానికి తయారీ, ఎగుమతుల హబ్‌గా భారత్‌ ఎదగవచ్చని వివరించింది. 2021–22 నుంచి 2023–24 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో భారత్‌కు అమెరికా అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా నిల్చింది. మొత్తం భారత్‌ ఎగుమతుల్లో అమెరికా వాటా సుమారు 18 శాతం, దిగుమతుల్లో 6.22 శాతం, ద్వైపాక్షిక వాణిజ్యంలో 10.73 శాతంగా ఉంది. అమెరికాతో మనకు వాణిజ్య మిగులు 2019–20లో 17.26 బిలియన్‌ డాలర్లుగా ఉండగా, 2023–24లో ఇది 35.32 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఎలక్ట్రానిక్స్‌ విషయానికొస్తే 2024 ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు భారత్‌ ఎగుమతులు 10 బిలియన్‌ డాలర్లుగా, దిగుమతులు 3.17 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.

Legendary Actor Manoj Kumar Passed Away8
వెండితెరకు మిస్టర్‌ భారత్‌

‘ఈ దేశం నీకేమిచ్చిందనేది కాదు... ఈ దేశానికి నువ్వేమిచ్చావ్‌ అనేది చూడాలి’ అన్నారు నెహ్రూ. ‘జై జవాన్ జై కిసాన్ ’ అన్నారు లాల్‌బహదూర్‌ శాస్త్రి. ఈ దేశానికి ప్రధానులైన వారు ప్రజలను దేశం వైపు చూసేలా చేయగలిగారు. ఈ స్ఫూర్తిని సినిమా రంగంలో మొదటగా అందుకున్న హీరో మనోజ్‌ కుమార్‌. సినిమాల్లో తన పాత్రకు ‘భారత్‌’ అని పేరు పెట్టుకుని అందరి చేత ‘మిస్టర్‌ భారత్‌’ అనిపించుకున్నాడు. శుక్రవారం మరణించిన ఈ దేశభక్త నటుడికి నివాళి1974.‘రోటీ కపడా ఔర్‌ మకాన్‌’ రిలీజైంది. జనం మొదటిరోజు మొదటి ఆటకు వెళ్లారు. ఫస్ట్‌సీన్‌... జేబులో డిగ్రీ పెట్టుకుని రోడ్ల మీద బేకార్‌గా తిరుగుతున్న హీరో ఒకచోట ఆగిపోయాడు. కారణం... పోలీస్‌ ఒకతనిపై తుపాకీ ఎక్కుపెట్టి ‘చెప్పు... ఎవరు నువ్వు’ అని అడుగుతున్నాడు. ‘నేనా... ఢిల్లీ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్‌ని’... ‘ఏం దొంగిలించుకుని వెళుతున్నావ్‌?’ ‘చూస్తావా...’ కోటు చాటున ఉన్న వస్తువు చూపించాడు. రొట్టె ముక్క.ఈ సీన్‌తోనే ఆనాటికి దేశంలో పేరుకొని పోయిన ఆకలిని, నిరుద్యోగాన్ని చూపించి ప్రేక్షకుల గుండెలను గట్టిగా చరుస్తాడు మనోజ్‌ కుమార్‌. ఆ తర్వాతి సీను కప్పుకోవడానికి గుడ్డలేని పేద స్త్రీలు... నిలువ నీడలేని నిరుపేద కూలివాళ్లు. దర్శకుడు తీసిన కథ తమ కష్టాల గురించే అని జనం అర్థం చేసుకున్నారు. సినిమా సూపర్‌ హిట్‌ అయ్యింది.‘సినిమా అనేది సందేశాలివ్వడానికి కాదు అని కొందరు అంటారు... అనుకుంటారు. కాని నేను తీసేది మాత్రం ఏదో ఒక సందేశం ఇవ్వడానికి. సమాజం నుంచి ఎంతో పొందాం... బదులుగా మంచి మాట చెప్పడానికి ఏమిటి కష్టం’ అంటాడు మనోజ్‌ కుమార్‌.బాధ చూసినవాడు బహుశా బాధ్యతగా ఉంటాడు. పదేళ్ల వయసులో ఉండగా దేశ విభజన చూశాడు మనోజ్‌ కుమార్‌. నేటి పాకిస్తాన్‌లో ఉన్నా అబ్తాబాద్‌ నుంచి అతడి కుటుంబం ఢిల్లీకి వచ్చేసింది. రెఫ్యూజీ క్యాంప్‌లో ఉంటూ చదువుకున్నాడు. ఆ కష్టాలను మర్చిపోవడానికి అప్పుడప్పుడు మేనమామ వచ్చి సినిమాకు తీసుకెళ్లేవాడు. పన్నెండేళ్ల మనోజ్‌ చూసిన మొదటి సినిమా ‘జుగ్ను’. ఇందులో దిలీప్‌ కుమార్‌ హీరో. సినిమా చివరలో చనిపోతాడు. తర్వాత మనోజ్‌ మరో సినిమా చూశాడు. ‘షహీద్‌’. ఇందులో కూడా దిలీప్‌ కుమార్‌ హీరో. సినిమాలో చనిపోతాడు. మనోజ్‌ చాలా విస్మయం చెంది ఇంటికొచ్చి తల్లిని అడిగాడు ‘అమ్మా.. ఒక మనిషి ఎన్నిసార్లు చనిపోతాడు?’. ‘ఒకసారే’. ‘మరి రెండుసార్లు చనిపోతే?’... ‘అలాంటి వాళ్లు దేవదూతలై ఉంటారు’ అంది. ‘అంటే సినిమా హీరోకు మరణం లేదన్నమాట. నేను హీరోను అవుతాను. దిలీప్‌ కుమార్‌లాంటి హీరో’ అనుకున్నాడు మనోజ్‌ కుమార్‌. అంతే కాదు దిలీప్‌ కుమార్‌ నటించిన ‘షబ్నమ్‌’ చూసి అందులో దిలీప్‌ పేరు ‘మనోజ్‌’ అని ఉంటే ‘నేను పెద్దయ్యి హీరో అయ్యాక ఆ పేరే పెట్టుకుంటాను’ అనుకున్నాడు. అనుకున్నట్టుగానే హీరో అయ్యాడు. అదే పేరుతో విఖ్యాతం అయ్యాడు. ఎంతగా అంటే అతని అసలు పేరు హరికిషన్‌ గిరి గోస్వామి అని ఎవరికీ తెలియనంత!ఢిల్లీ నుంచి బాంబే వచ్చి సినిమా అవకాశాల కోసం చాలా కష్టపడ్డాడు మనోజ్‌ కుమార్‌. వాళ్ల నాన్న కవి. ఇతనికి కూడా రాయడం వచ్చింది. కొన్నాళ్లు ఘోస్ట్‌ రైటర్‌గా పని చేశాడు. సినిమాల్లో ‘ఎక్స్‌ట్రా’గా కూడా కనిపించాడు. దిలీప్‌ కుమార్‌ను ఇమిటేట్‌ చేస్తూ ఇతను చేస్తున్న నటన ఖరీదైన దిలీప్‌ కుమార్‌ను బుక్‌ చేసుకోలేకపోయేవారిని ఆకర్షించింది. మెల్లగా అవకాశాలు వచ్చాయి. 1960లో వచ్చిన ‘కాంచ్‌ కీ గుడియా’తో తొలిసారి హీరోగా కనిపించాడు. సినిమా ఫ్లాప్‌ అయ్యింది. మరికొన్ని సినిమాలు కూడా ఫ్లాప్‌ అయ్యాయి. అదే సమయంలో హీరో అవకాశాలు పొందడానికి డింకీలు కొడుతున్న ధర్మేంద్ర, శశి కపూర్‌లతో దోస్తీ కట్టి ఎక్కే స్టూడియో దిగే స్టూడియోగా ఉండేవాడు. ముగ్గురి జాతకం బాగుంది... ముగ్గురూ పెద్ద హీరోలయ్యారు. కాని మిగిలిన ఇద్దరి కంటే మనోజ్‌ ఎక్కువ నైపుణ్యాలు ప్రదర్శించాడు. నటుడు, రచయిత, ఎడిటర్, నిర్మాత, దర్శకుడు... అన్నింటికి మించి దేశభక్తి అనే అంశాన్ని సినిమాకు ఫార్ములాగా మార్చగలిగిన మేధావి అయ్యాడు.పెద్ద హీరోల రొమాంటిక్‌ సినిమాల హవా నడుస్తున్న రోజుల్లో డాన్స్‌ ఏ మాత్రం చేయలేని, లిమిటెడ్‌ బాడీ లాంగ్వేజ్‌ ఉన్న మనోజ్‌ కుమార్‌ సీరియస్‌ సబ్జెక్ట్స్‌ తనను గట్టెక్కిస్తాయని భావించాడు. భగత్‌సింగ్‌లాంటి కేరెక్టర్‌ తన ఇమేజ్‌ను పెంచుతుందని ఆ సినిమా చేయాలనుకున్నాడు. కాని భగత్‌ సింగ్‌కు సంబంధించి సినిమా తీసేంత సమాచారం ఆ రోజుల్లో లేదు. మనోజ్‌ కుమారే నాలుగేళ్లు తిరిగి సమాచారం సేకరించి కథ తయారు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. 1965లో వచ్చిన ‘షహీద్‌’... భగత్‌ సింగ్‌ మీద వచ్చిన తొలి భారతీయ సినిమా. పెద్ద హిట్‌ అయ్యింది. అంతేకాదు ‘నర్గిస్‌దత్‌ జాతీయ పురస్కారం’ గెలుచుకుంది. ఈ సందర్భంగా ఢిల్లీకి వెళ్లినప్పుడు నాటి ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి సినిమాను చూశారు. మరుసటిరోజు టీకి ఆహ్వానించి మనోజ్‌తో ‘నేను జై జవాన్‌ జై కిసాన్‌ నినాదం ఇచ్చాను కదా. నువ్వు ఆ నినాదం పై సినిమా తీయరాదూ’ అని అడిగారు. దేశ ప్రధాని కోరిన కోరిక మనోజ్‌ను సూటిగా తాకింది. ఒక నోట్‌బుక్, పెన్ను పట్టుకుని ఢిల్లీలో రైలెక్కి ముంబైలో దిగేలోపు ‘ఉప్‌కార్‌’ స్క్రిప్ట్‌ రాశాడు. దర్శకుడు కావాలనే కోరిక అప్పటి వరకూ మనోజ్‌కు లేదు. కాని ప్రధానిని ఇంప్రెస్‌ చేసేలా సినిమా తీయాలంటే తానే దర్శకుడిగా మారక తప్పదు అనుకున్నాడు. అంటే ఒక ప్రధాని వల్ల దర్శకుడైన ఏకైన వ్యక్తి మనోజ్‌. భారతదేశంలో రైతుకు ప్రాధాన్యం ఇవ్వాలని, సైనికులకు బాసటగా నిలవాలని మనోజ్‌ తీసిన ‘ఉప్‌కార్‌’ అతణ్ణి అంబరంలో కూచోబెట్టింది. అవార్డుల రాసి పోసింది. ‘మేరే దేశ్‌ కీ ధర్తీ’ పాట జనాన్ని ఊపేసింది. సినిమాలో పాత్రకు పెట్టిన పేరు భారత్‌ మనోజ్‌ కుమార్‌ నిక్‌నేమ్‌ అయ్యింది. ‘మిస్టర్‌ భారత్‌’.పాశ్చాత్య సంస్కృతి చెడ్డది కాకపోయినా దానిని చెడ్డగా ఇమిటేట్‌ చేస్తున్న వారిపై ‘పూరబ్‌ ఔర్‌ పశ్చిమ్‌’ తీశాడు మనోజ్‌. మన సంస్కృతి మనకు ముఖ్యం అని చాటాడు. ఇక దేశంలో నిరుద్యోగం, యువకుల్లో పేరుకుపోతున్న అనిశ్చితి పై ‘రోటీ కపడా ఔర్‌ మకాన్‌’ తీశాడు. నేటికీ ప్రభుత్వాలు ఈ మూడూ అందించడానికి ఆపసోపాలు పడుతూనే ఉన్నాయి. ఇక బ్రిటిష్‌ వారు ఆక్రమించుకున్న చిన్న సంస్థానాల నుంచి వారిపై సాయుధ పోరాటం చేసిన వారి కథతో తీసిన భారీ చిత్రం ‘క్రాంతి’ సూపర్‌డూపర్‌ హిట్‌ అయ్యి భాష తెలియని ప్రాంతాల్లో కూడా పెద్ద కలెక్షన్లు రాబట్టింది. కార్మికుల సమస్యలతో ‘షోర్‌’ తీశాడు. చిరుద్యోగుల తరఫున ‘క్లర్క్‌’ తీశాడు. ఆకాంక్షలో స్వచ్ఛత, ప్రయత్నంలో శ్రమ ఉంటే విజయం వరిస్తుందనడానికి మనోజ్‌ కుమార్‌ జీవితం ఒక ఉదాహరణ. ఏ హీరోని అయితే చూసి హీరో అయ్యాడో ఆ దిలీప్‌ కుమార్‌తో ‘ఆద్మీ’లో నటించగలిగాడు మనోజ్‌ కుమార్‌. అదే దిలీప్‌ కుమార్‌ను డైరెక్ట్‌ చేసి ‘క్రాంతి’గా సూపర్‌హిట్‌ సాధించగలిగాడు. తగిన ఎక్స్‌ప్రెషన్స్‌ ఇవ్వలేక ముఖాన్ని చేతుల్లో దాచుకునే మేనరిజంతో ఫేమస్‌ అయిన మనోజ్‌ను అప్పుడప్పుడు కళాకారులు అదే మేనరిజంతో ఆటపట్టించడం కద్దు. షారూక్‌ ఖాన్‌ ‘ఓమ్‌ శాంతి ఓమ్‌’లో మనోజ్‌ను ఇమిటేట్‌ చేసి ఆయనకు కోపం తెప్పించాడు. పరువు నష్టం దావా వేసే వరకూ వ్యవహారం వెళ్లి తర్వాత సద్దుమణిగింది.మనోజ్‌ కుమార్‌ నిజమైన దేశ ప్రేమికుడు. తన సినిమాల్లో అన్ని మతాల, వర్గాల వారి పాత్రలు సృష్టించి దేశమంటే మనుషులోయ్‌ అని చూపించినవాడు. నేటి హేట్‌ ఫిల్మ్స్‌ మధ్యలో మనోజ్‌ భావధార వెనుకబడ్డట్టు అనిపించిన అంతిమంగా గెలవబోయేది అదే. ఎందుకంటే విలువల వరుసలో మానవత్వం ముందు ఉండి తర్వాతే కదా మతం ఉండేది. సెల్యూట్‌ మిస్టర్‌ భారత్‌. హోమియోపతి డాక్టర్‌మనోజ్‌ కుమార్‌ మంచి హోమియోపతి డాక్టర్‌. అతనికి ఒకసారి చెంప మీద సర్పి వచ్చింది. అల్లోపతిలో ఎన్ని వైద్యాలు చేసినా పని చేయలేదు. నటుడికి ముఖాన సర్పి చాలా ప్రమాదం. ఆ సమయంలో మద్రాసులో షూటింగ్‌లో ఉండగా హోమియోపతిప్రాక్టీసు చేసే నటుడు అశోక్‌ కుమార్‌ ఒక డోస్‌ మందు వేశాడు. వారంలో సర్పి మాయమైంది. మనోజ్‌కు ఇది ఎంతగా ఆసక్తి రేపిందంటే అతడు హోమియోపతి డాక్టర్ల కంటే ఎక్కువగా హోమియోపతి చదివి ఆ వైద్యం ప్రాక్టీసు చేయడానికి సర్టిఫికెట్‌ పొందాడు. చాలామందికి హోమియోపతి వైద్యం చేశాడు.తెలుగు సినిమాల్లో మనోజ్‌ కుమార్‌మనోజ్‌ కుమార్‌ తెలుగు ప్రేక్షకులకు తెలియకుండా తెలుగు సినిమాల్లో ఉన్నాడు. ఆయన తీసిన ‘ఉప్‌కార్‌’ తెలుగులో కృష్ణ హీరోగా ‘పాడిపంటలు’గా రీమేక్‌ అయ్యి హిట్‌ అయ్యింది. మరో సూపర్‌హిట్‌ ‘రోటీ కపడా ఔర్‌ మకాన్‌’ తెలుగులో శోభన్‌ బాబు హీరోగా ‘జీవన పోరాటం’ పేరుతో రీమేక్‌ అయ్యింది. హిందీలో అమితాబ్‌ వేసిన పాత్రను తెలుగులో రజనీకాంత్‌ చేశాడు. మనోజ్‌ కుమార్‌ నటించిన ‘ఓ కౌన్‌ థీ’ తెలుగులో జగ్గయ్య, జయలలిత కాంబినేషన్‌లో ‘ఆమె ఎవరు’గా వచ్చింది. ‘హిమాలయ్‌ కీ గోద్‌ మే’ శోభన్‌ బాబు హీరోగా ‘డాక్టర్‌ బాబు’గా వచ్చింది. ‘దస్‌ నంబరీ’ పెద్ద హిట్‌ కావడంతో ఎన్టీఆర్‌ హీరోగా ‘కేడీ నంబర్‌ 1’ పేరుతో రీమేక్‌ చేశారు. చిరంజీవి నటించిన ‘మగ మహారాజు’ సినిమాలో ఏడు రోజులు సైకిల్‌ తొక్కే సన్నివేశం ఒరిజినల్‌ మనోజ్‌ కుమార్‌ నటించిన ‘షోర్‌’లో ఉంది.మనోజ్‌ కుమార్‌ కన్నుమూతసుప్రసిద్ధ సినీనటుడు, దర్శకుడు మనోజ్‌ కుమార్‌ (87) శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. చాలాకాలంగా వెన్నునొప్పితోనూ, వయసు సంబంధమైన ఇతర రుగ్మతలతోనూ బాధపడుతున్న మనోజ్‌కుమార్‌ ముంబైలోని కోకిలా బెన్‌ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయనకు ఇద్దరు కుమారులు. కునాల్, విశాల్‌. వీరిలో కునాల్‌ హీరోగా కొన్ని సినిమాల్లో నటించాడు. దేశభక్తి సినిమాలతో ఖ్యాతి పొందిన మనోజ్‌కుమార్‌ను 1992లో పద్మశ్రీ, 2015లో దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డులు వరించాయి. షహీద్, ఉప్‌కార్, పూరబ్‌ ఔర్‌ పశ్చిమ్, క్రాంతి తదితర సూపర్‌హిట్‌ సినిమాలు మనోజ్‌ దర్శకత్వంలో రూపొందాయి.

Telugu Desam Partys yellow madness has reached its peak9
పచ్చరంగు పిచ్చి పీక్స్‌కు..

సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీలో పసుపు రంగు పిచ్చి పరాకాష్టకు చేరింది. చివరికి మరుగుదొడ్లను కూడా వదలడంలేదు. మంగళగిరి మండలం ఎర్రుబాలెంలో సీఎం తనయుడు, ఐటీ, విద్యాశాఖల మంత్రి లోకేశ్‌ శుక్రవారం నిర్వహించిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం అంతా పసుపుమయంగా మారింది. సభకు వచ్చిన వారికి బయో మరుగుదొడ్లు ఏర్పాటుచేయగా అవి నీలం రంగులో ఉండడంతో వాటి చుట్టూ పసుపు రంగు తెరలు కట్టారు. అలాగే, అక్కడ కాలువపై ఉన్న వంతెనకూ పూర్తిగా పసుపు రంగు వేశారు. ఎటు చూసినా పసుపు రంగులతోనే అలంకరించారు. ఆక్రమిత ఇళ్ల స్థలాలను క్రమబద్దీకరించి పట్టాలిచ్చే కార్యక్రమం చిన్నదైనా భారీ హంగామాతో చేయడం గమనార్హం. సీఎం తనయుడి నియోజకవర్గం కావడంతో ప్రభుత్వ సొమ్మును చిన్నా, చితకా కార్యక్రమాలకు సైతం ఇష్టానుసారం దుబారా చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజల ఇళ్లకు లోకేశ్‌ పేరా? మరోవైపు.. పట్టాల పంపిణీ కార్యక్రమానికి లోకేశ్‌ పేరు పెట్టుకున్నారు. ప్రజలు ఎప్పటి నుంచో ఉంటున్న ఇళ్లను క్రమబద్దీకరించి దాన్ని పెద్ద ఘన కార్యంగా ప్రచారం చేసుకుంటున్నారు. దానికీ ‘మన ఇల్లు–మన లోకేశ్‌’ అని నామకరణం చేశారు. వీటికి ఆయన పేరు పెట్టడమేంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. గతంలో వైఎస్‌ జగన్‌ హయాంలో లక్షలాది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసినప్పుడు.. లక్షలాది ఎకరాలను 22ఏ చెర నుంచి విడిపించినప్పుడు అధికారుల నిర్ణయంతో ఆయన ఫొటో వేయడంపై చంద్రబాబు, లోకేశ్, టీడీపీ ముఠాలు చేసిన రాద్ధాంతం అంతా ఇంతా కాదు.రంగుల పిచ్చి ఎవరిది?తప్పుడు ప్రచారాలు, దొంగ హామీలతో అధికారంలోకి వచ్చాక ఇప్పుడు టీడీపీ బ్యాచ్‌ ప్లేటు ఫిరాయించింది. గతంలో చేసిన ఆరోపణలకు భిన్నంగా ప్రవర్తిస్తోంది. ప్రతి ఊర్లో పసుపు రంగే ఉండాలనేలా టీడీపీ నేతలు, కార్యకర్తలు వ్యవహరిస్తున్నారు. చివరికి.. లోకేశ్‌ నియోజవర్గంలో నిర్వహించిన కార్యక్రమంలో మరుగుదొడ్లకు కూడా పసుపు రంగువేసే వరకూ వెళ్లిందంటే పరిస్థితి అర్థంచేసుకోవచ్చు. ఏ కార్యక్రమంలో అయినా పసుపు రంగే ఉండాలని అధికార యంత్రాంగానికి చంద్రబాబు అనధికారికంగా ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. అందుకే కొందరు టీడీపీ భక్త ఐపీఎస్‌ అధికారులు ఆఫీసుల్లో పసుపు రంగులు వేసుకున్నారు. చంద్రబాబు తనను కలవడానికి వచ్చే అతిథులు, ఇతరులకు సైతం పసుపు శాలువాలే కప్పుతున్నారు. ఢిల్లీలో ప్రధాని, కేంద్ర మంత్రులు, ఇతర వీవీఐపీలను కలిసినప్పుడు కూడా పసుపు రంగు శాలువాలనే కప్పుతున్నారు. దీన్నిబట్టి రంగుల పిచ్చి ఎవరికి ఉందో అర్థంచేసుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తాను చేస్తే ఒప్పు, పక్కవాడు చేస్తే ఏదైనా తప్పేననేది చంద్రబాబు, టీడీపీ సిద్ధాంతమని రుజువైందని వారంటున్నారు.

Punjab Kings vs Rajasthan Royals match today10
పంజాబ్‌ జోరు కొనసాగేనా!

ముల్లాన్‌పూర్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) టి20 టోర్నమెంట్‌ 18వ సీజన్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న పంజాబ్‌ కింగ్స్‌... రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌కు సిద్ధమైంది. ‘డబుల్‌ హెడర్‌’లో భాగంగా శనివారం జరగనున్న రెండో పోరులో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. గత పదేళ్లుగా ప్లే ఆఫ్స్‌కు చేరలేకపోయిన పంజాబ్‌ జట్టు... ఆసీస్‌ దిగ్గజం రికీ పాంటింగ్‌ శిక్షణ, శ్రేయస్‌ అయ్యర్‌ కెపె్టన్సీలో తాజా సీజన్‌లో జోరు మీదుంది. మరోవైపు తొలి సీజన్‌లో చాంపియన్‌గా నిలిచిన రాజస్తాన్‌ రాయల్స్‌ తిరిగి సత్తా చాటేందుకు రెడీ అయింది. ఆటేతర అంశాలతో వార్తల్లో నిలుస్తున్న రాయల్స్‌ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌పై ఒత్తిడి అధికంగా ఉంది. గత మూడు మ్యాచ్‌ల్లో వరుసగా 1, 29, 4 పరుగులు చేసిన జైస్వాల్‌... ఈసారి ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి. సీజన్‌ తొలి మూడు మ్యాచ్‌ల్లో కేవలం ఆటగాడిగానే బరిలోకి దిగిన సంజూ సామ్సన్‌... ఈ మ్యాచ్‌లో సారథ్య బాధ్యతలు అందుకోనున్నాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోవడంతో వికెట్‌ కీపింగ్‌ చేసేందుకు బీసీసీఐ అతడికి అనుమతినిచ్చింది. జైస్వాల్, సామ్సన్, నితీశ్‌ రాణా, రియాన్‌ పరాగ్, ధ్రువ్‌ జురేల్, హెట్‌మైర్, హసరంగతో రాయల్స్‌ బ్యాటింగ్‌ బలంగా కనిపిస్తోంది. ఆర్చర్, తీక్షణ, సందీప్‌ శర్మ, తుషార్‌ దేశ్‌పాండే, శుభమ్‌ శర్మ బౌలింగ్‌ భారం మోయనున్నారు. ఇక గత రెండు మ్యాచ్‌ల్లో చక్కటి ప్రదర్శన కనబర్చిన పంజాబ్‌ కింగ్స్‌... సొంతగడ్డపై తొలి మ్యాచ్‌లో అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. అటు విదేశీ హిట్టర్లు... ఇటు స్వదేశీ ప్లేయర్లతో పంజాబ్‌ పటిష్టంగా ఉంది. ప్రభ్‌సిమ్రన్‌ సింగ్, ప్రియాంశ్‌ ఆర్య జట్టుకు మెరుగైన ఆరంభాలు అందిస్తుండగా... శ్రేయస్‌ అయ్యర్, మ్యాక్స్‌వెల్, స్టొయినిస్, శశాంక్‌ సింగ్, యాన్సెన్‌తో మిడిలార్డర్‌ పటిష్టంగా కనిపిస్తోంది. అర్ష్ దీప్ సింగ్‌తో కలిసి ఫెర్గూసన్, యాన్సెన్‌ పేస్‌ భారం మోయనుండగా... యుజ్వేంద్ర చహల్‌ స్పిన్‌ బాధ్యతలు చూసుకోనున్నాడు. పెద్ద బౌండరీలతో కూడిన ముల్లాన్‌పూర్‌ మైదానం స్పిన్‌కు అనుకూలించనుంది. గత సీజన్‌లో ఇక్కడ ఓ మాదిరి స్కోర్లే నమోదు కాగా... బౌలింగ్‌ బలంతోనే జట్లు విజయాలు సాధించాయి. తుది జట్లు (అంచనా) రాజస్తాన్‌ రాయల్స్‌: సామ్సన్‌ (కెప్టెన్ ), జైస్వాల్, రాణా, పరాగ్, జురేల్, హసరంగ, హెట్‌మైర్, ఆర్చర్, తీక్షణ, తుషార్, సందీప్, శుభమ్‌ దూబే. పంజాబ్‌ కింగ్స్‌: శ్రేయస్‌ అయ్యర్‌ (కెప్టెన్ ), ప్రభ్‌సిమ్రన్, ప్రియాంశ్, మ్యాక్స్‌వెల్, స్టొయినిస్, శశాంక్‌ సింగ్, సుర్యాంశ్, యాన్సెన్, ఫెర్గూసన్, అర్ష్ దీప్, చహల్, వైశాక్‌.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement