పుణే మేయర్‌గా దత్తా
పింప్రి, న్యూస్‌లైన్: పుణే నగర మేయర్ పదవికి అధికారపక్షం ఎన్సీపీ కార్పొరేటర్ దత్తాత్రేయ ధనకవడే, ఉప మేయర్ పదవికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్పొరేటర్ ఆబా బాగుల్ బుధవారం నామినేషన్లు వేశారు. కార్పొరేషన్లో ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి సంఖ్యాబలం ఎక్కువ కాబట్టి వీరి ఎన్నిక లాంఛయప్రాయమే. నగర మేయర్, ఉప మేయర్ పదవులకు సెప్టెంబరు 15న ఎన్నికలు జరుగుతాయి. రాబోయే రెండున్నర సంవత్సరాలకు గాను మేయర్ పదవి ఓపెన్ కేటగిరి వెళ్లడంతో ఈ ఎన్నిక అనివార్యమయింది.
రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీలు అభ్యర్థుల ఎంపిక జాగ్రత్తగా వ్యవహరించాయి. ఎన్సీపీ నుంచి మేయర్ అభ్యర్థిత్వం కోసం దత్తాత్రేయతోపాటు బాబురావు, ప్రశాంత్ జగతాప్, వికాస్ దాంగట్, బాలా సాహెబ్, సచిన్ దొడకే దరఖాస్తు చేసుకున్నారు. చివరికి దత్తాత్రేయను ఎన్సీపీ తన అభ్యర్థిగా నిర్ణయించింది. రాబోయే ఎన్నికల్లో కులం, ప్రాం తం కీలకం కాబట్టి అన్ని పార్టీలూ అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి వ్యవహరించాయి. ప్రస్తుతం ధన్గార్ల రిజర్వేషన్ల ఉద్యమం తీవ్రంగా కొనసాగుతోంది. వీరు పలు ప్రాంతాల్లో హింసాత్మకం ఆందోళనలకు పాల్పడ్డారు కూడా.
అన్ని విధాలా వెనకబడ్డ తమకు ఎస్టీలుగా గుర్తింపునివ్వాలని డిమాండ్ చేశాయి. మరోవైపు మరాఠాల రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో కులాలు కీలకంగా మారాయి. మేయర్ అభ్యర్థిత్వాన్ని ఎస్సీలకు కట్టబెట్టాలని కొందరు, మరాఠాల కని కొందరు డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ నుంచి ఉప మేయర్ కోసం ఏడుగురు దరఖాస్తు చేయగా, ఆబా బాగుల్‌ను ఎంపిక చేశారు. ప్రస్తుతం పుణే కార్పొరేషన్లలో బలాబలాలు ఇలా ఉన్నాయి. ఎన్సీపీ-54 , కాంగ్రెస్ 26, బీజేపీ-26, శివసేన-15, ఎమ్మెన్నెస్‌కు 28 మంది సభ్యులు ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఎమ్మెన్నెస్ తటస్థంగా ఉండాలని నిర్ణయించింది.