దేవర్ జయంతి వేడుకలకు భారీ భద్రత
టీ.నగర్, న్యూస్‌లైన్ : దేవర్ జయంతి వేడుకలకు దక్షిణ జిల్లాల్లో 25 వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేయనున్నట్లు ఐజీ అభయ్‌కుమార్ వెల్లడించారు. రామనాథపురం జిల్లా పసుం పొన్లో ముత్తురామలింగ దేవర్ జయంతి వేడుకలు అక్టోబర్ 30వ తేదీ నిర్వహించనున్నారు. ఇందులో దక్షిణ జిల్లాల నుంచి మాత్రమే కాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వేలాదిమంది పాల్గొంటా రు. గత ఏడాది జయంతి ఉత్సవాలకు వెళ్లి తిరిగి వస్తున్న వారిపై మదురై సమీపంలో కొందరు దుండగులు పెట్రో బాంబులు వేశారు.
ఈ సంఘటన సహా రెండు ఘటనలలో 10 మంది మృతిచెందారు. ఈ ఏడాది ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అదనపు డీజీపీ రాజేంద్రన్ ఆధ్వర్యంలో దక్షిణ జిల్లా పోలీసు అధికారులు పసుంపొన్‌లో నేరుగా పరిశీలన జరిపి భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. దీని గురించి సౌత్ డివిజన్ ఐజీ అభయ్‌కుమార్ సింగ్ మాట్లాడుతూ మదురై సహా తొమ్మిది దక్షిణ జిల్లాల్లో 22 వేల మంది పోలీసులు ఉన్నారని, చెన్నై సహా మిగతా ప్రాంతాల నుంచి మూడు వేల మందికి పైగా పోలీసులు దక్షిణ జిల్లా భద్రతకు రానున్నట్లు తెలిపారు. మొత్తం 25 వేల మందికి పైగా పోలీసులు అక్టోబర్ 30న భద్రతా పనులలో నిమగ్నమవుతారన్నారు.