Abhishek Mahanti
-
దయచేసి 'న్యూ ఇయర్' రోజు ఇటువైపు వెళ్లకండి!
కరీంనగర్: న్యూ ఇయర్ సందర్భంగా లోయర్ మానేరు డ్యాం, కేబుల్ బ్రిడ్జిపైకి వెళ్లడాన్ని నిషేధిస్తున్నట్లు సీపీ అభిషేక్ మహంతి ఒక ప్రకటనలో తెలి పారు. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. డిసెంబర్ 31(ఆదివారం) సాయంత్రం 6 గంటల నుంచి జనవరి 01(సోమవారం) ఉదయం 5 గంటల వరకు ఎల్ఎండీ కట్ట, తీగల వంతెనపై ఆ ంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. వేడుకలు జరుపుకునేందుకు వాటి పైకి అనుమతించబోమన్నారు. వాహనదారులు గమనించి, ఇతర మార్గాల్లో వెళ్లాలన్నారు. అలాగే, రోడ్లమీద వేడుకలు నిర్వహించడం, డీజేలను వినియోగించడం, బైక్ సైలెన్సర్లను మార్చి శబ్ధ కాలుష్యం చేస్తూ రోడ్లపై తిరగడం, ట్రిపుల్ రైడింగ్ వంటి వాటికి అనుమతి లేదని పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపినా, ముందస్తు అ నుమతి లేకుండా జనసమూహంగా ఏర్పడి, కార్యక్రమాలు చేపట్టినా, ప్రైవేట్ పార్టీలు నిర్వహించినా, ప్రజాశాంతికి భంగం కలిగించేలా వ్యవహరించినా కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇవి చదవండి: భార్య మృతి.. ఆ కొద్ది సేపటికే భర్త కూడా! -
యువకుణ్ణి భుజంపై మోసిన 'ఆ' ఎస్సైకు రివార్డు!
సాక్షి, కడప: సాహసోపేతంగా యువకుడిని కాపాడిన రిమ్స్ ఎస్సైను జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతి అభినందించారు. రెండు రోజుల క్రితం పాలకొండలో తేనెటీగల దాడిలో గాయపడిన యువకుడ్ని తన భుజంపై మోసుకుని కొండ కిందకు రిమ్స్ ఎస్సై తెచ్చిన విషయం విధితమే. ఎస్సై సమయస్పూర్తితో వ్యవహరించిన కారణంగా తేనేటీగల బారిన పడిన యువకుడు ప్రాణాలతో బయట పడ్డాడు. దీంతో విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా రిమ్స్ ఎస్సై, సిబ్బందికి రివార్డు అందజేశారు. -
మొదట ఇంటి దొంగల వేట.. ఎస్పీ అభిషేక్ మహంతి
రాష్ట్రంలో అవినీతి రహిత పాలన సాగాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తరచూ చెబుతున్నారు. ఉన్నతాధికారులకూ ఇదే ఆయన తలపోస్తున్నారు. జిల్లాలో తన నేతృత్వంలోని పోలీసు శాఖను ఈ దిశగా తొలుత ప్రక్షాళన చేయాలని జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతి కృతనిశ్చయంతో ఉన్నారు. ఇందుకోసం ఆయన ముందు శాఖలోని ఇంటి దొంగల పని పట్టాలని యోచిస్తున్నారు. అలాంటి వారి జాబితా ఇప్పటికే ఎస్పీ వద్ద ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. పోలీసు శాఖపై నమ్మకం సడలేలా వ్యవహరిస్తున్న అధికారుల భరతం పట్టాలని ఎస్పీ చర్యలకు దిగడంతో చాలామంది గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. నిషేధిత గుట్కా రవాణాలోనూ కొందరు పోలీసుల పాత్ర ఉందని ఎస్పీ భావిస్తున్నారు. బెంగళూరు నుంచి జిల్లాకు గుట్కా అక్రమరవాణా అవుతోంది. ప్రొద్దుటూరు, కడప ప్రాంతాలతో పాటు జిల్లా వ్యాప్తంగా తరలించి విక్రయిస్తున్నారు. పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. అక్రమరవాణాను అరికట్టాల్సిన పోలీసులే సహకరించడంపై సర్వత్రా విమర్శలున్నాయి. సాక్షి ప్రతినిధి,కడప: పోలీసు శాఖలో అక్రమార్కుల.. అసాంఘిక కార్యకలాపాలకు వెన్నుదన్నుగా నిలుస్తున్న పలువురు అధికారులు,పోలీసులపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతి గట్టి సంకల్పంతో ఉన్నారు. పై నుంచి కింది స్థాయి వరకూ అక్రమ కార్యకలాపాల్లో భాగస్వాములైన వారిపై ఆయన నిఘా పెట్టినట్లు తెలిసింది. వారి వివరాలు ఇవ్వాలంటూ ఇప్పటికే అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలోని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. నిఘా విభాగం నుంచి కూడా ఎస్పీ ఈ వివరాలు కోరినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా వ్యాప్తంగా స్టేషన్ల పరిధిలో అక్రమాలకు కేరాఫ్‌గా నిలుస్తూ.. దందాలు సాగిస్తున్న అధికారులు, పోలీసులజాబితాను జిల్లా పోలీసు బాసుకు అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరి వివరాలను చేరవేశారు. మరికొందరు ఈ కీలక సమాచార సేకరణనిలో ఉన్నట్టు భోగట్టా. జాబితా చేరిన వెంటనే నిశితంగా పరిశీలించి అధికారులు, పోలీసులపై చర్యలు తీసుకొనే అవకాశమున్నట్లు అంతర్గతంగా ప్రచారం జరుగుతోంది. అక్రమాలకు కొమ్ముకాస్తున్న అధికారులు పదుల సంఖ్యలో ఉండగా ఇక పోలీసులు,హోంగార్డులు వందల సంఖ్యలోనే ఉన్నట్లు ప్రాధమిక సమాచారం. సీఎం జిల్లా కావడంతో అన్ని రకాల అక్రమాలకు తెరదించి అవినీతి రహిత పారదర్శక పాలన అందించాలని ఎస్పీ అభిషేక్ మహంతి భావిస్తున్నారు. ముందు ఇంటి దొంగల పనిపట్టి అక్రమాలకు అడ్డు కట్ట వేయాలని సిద్ధమయ్యారు. సీఎం జిల్లా కావడంతో ఎస్పీ అభిషేక్ మహంతి ప్రత్యేక దృష్టి సారించారు. ఇంటి దొంగలను కట్టడిచేశాక అసలు దొంగల పనిపట్టాలని ఎస్పీ వ్యూహం. అక్రమ పోలీసులపై చర్యలు తీసుకుంటే మిగిలిన వారు తప్పు చేయడానికి వెనుకడగు వేస్తారని ఎస్పీ ప్రణాలిక.. ఇందుకోసమే అక్రమార్కుల చిట్టాను ఎస్పీ సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. వివరాల సేకరణ తరువాత చర్యలు మొదలవుతాయని తెలిసింది.ఎస్పీ ఆరా వ్యవహారం తెలిసి శాఖలో కొందరు బెంబేతెత్తుతున్నట్లు సమాచారం. జిల్లాలో బెట్టింగుల జోరు: ప్రొద్దుటూరు ప్రాంతం క్రికెట్ బెట్టింగులకు అడ్డాగా మారింది. ఇక్కడి నుండి కడపతో పాటు జిల్లావ్యాప్తంగా బుకీలు బెట్టింగులు నడిపిస్తున్నారు. కోట్లలోనే ఈ వ్యాపారం నడుస్తోంది. యువత తోపాటు అన్నివర్గాల వారు బెట్టింగులకు అలవాటు పడ్డారు. ఆర్ధికంగా నష్టపోతున్నారు. అప్పులు తాళలేక కొందరు ఊళ్లు వదలి ఇతర ప్రాంతాలకు వలసపోయిన ఘటనలు కోకొల్లలు. క్రికెట్ బెట్టింగులలో కొందరు పోలీసు అధికారులతో పాటు పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. వీరి వ్యవహారం నడుస్తున్నట్లు ప్రచారం. ఎర్రచందనం అక్రమరవాణాలోనూ కొందరు పోలీసుల పాత్ర ఉందనేది బహిరంగ రహస్యం.బద్వేలు,మైదుకూరు,రాజంపేట, రైల్వేకోడూరు,రాయచోటి నియోజకవర్గాల పరిధిలోని నల్లమల,లంకమల,శేషాచలం తదితర అటవీ ప్రాంతంలోఎర్రచందనం ఉంది. అత్యంత విలువైన ఈసంపద అక్రమరవాణా యధేచ్ఛగా సాగుతోంది. చిత్తూరు, కడప జిల్లాకు చెందిన పలువురు స్మగ్లర్లు ఇప్పటికే వందల కోట్ల విలువైన చందనాన్నిఅక్రమంగా తరలించారు. ఇంకా తరలిస్తూనే ఉన్నారు. గతంలో ఎర్రచందనం కేసుకు సంబంధించి జిల్లాకు చెందిన ఆల్ఫ్రెడ్ అనే అధికారిపై అప్పటి ఎస్పీ కేసు నమోదుచేసి సస్పెండ్ చేశారు. ఆ అధికారితోపాటు జిల్లావ్యాప్తంగా మరి కొందరు స్మగ్లర్లకు సహకారంఅందిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పోలీసు స్టేషన్లలో పంచాయితీలు జిల్లావ్యాప్తంగా కొన్ని పోలీసు స్టేషన్లలో కొందరు పోలీసు అధికారులు ,పోలీసులు సెటిల్మెంట్లు నిర్వహిస్తున్నారు. బాధితులపక్షాన కాకుండా అక్రమార్కులకు వెన్నుదన్నుగా నిలిచి వసూళ్లకు పాల్పడుతున్నారు. పంచాయతీలలో పై నుంచి దిగువ స్థాయి హోంగార్డు వరకూ ఈ వసూళ్లలో పాల్గొంటున్నారని తెలిసింది. ఈ తరహా పోలీసులను..అధికారులను గుర్తించి చర్యలు తీసుకుంటే నేరాలకు అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుందని ఎస్పీ మొహంతి విశ్వసిస్తున్నారు. మట్కాలోనూ సహకారం జమ్మలమడుగు,తాళ్లప్రొద్దుటూరు, ప్రొద్దుటూరు ప్రాంతాలతోపాటు జిల్లాలోని మరికొన్ని ప్రాంతాలలో మట్కా వ్యవహారం నడిపిస్తున్నారు. ఇది చాలామందికి వ్యసనంగా మారింది. చాలా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. కట్టడి చేయాల్సిన కొందరు పోలీసులు ఈ జూదానికి అండగా ఉంటున్నారు. జిల్లాలో దొంగతనాలకూ కొదవలేదు. ఇందులోనూ కొందరు పోలీసు అధికారులు, పోలీసులపాత్ర ఉన్నట్లు ఆరోపణలున్నాయి. వారితో కుమ్మక్కైన కొందరు దొంగతనాలను ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రొద్దుటూరుకు చెందిన ఓ కానిస్టేబుల్ దొంగలకు సహకరించినట్లు రేణిగుంట పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. ఇలాంటి సంఘటనలు గతంలోనూ మరిన్ని జరిగినట్లు సమాచారం. -
అప్రజాస్వామికంగా వ్యవహరిస్తే... తాట తీస్తా..!
సాక్షి, కడప అర్బన్: ఎన్నికల నిర్వహణలో అప్రజాస్వామికంగా వ్యవహరించినా, విఘాతం కలిగించినా తాట తీస్తామని ఎస్పీ అభిషేక్ మహంతి హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా గురువారం ఎన్నికలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టామనీ ఆయన పేర్కొన్నారు. ప్రజలకు, వివిధ పార్టీల నేతలకు, ఏజెంట్లకు సూచనలు చేశారు. అభ్యర్థులు, ఏజెంట్లు, ఓటర్లు గానీ వాహనాలు కాన్వాయ్‌గా రాకూడదన్నారు. అనుమతించిన వాహనాలలోనే విడివిడిగా వెళ్లాలన్నారు. పోలింగ్ స్టేషన్ల వద్ద, ఇతర ప్రదేశాలకుగానీ గుంపులుగా ఉండరాదు. ఓటరును భయపెట్టరాదు. ప్రలోభాలకు గురి చేయరాదు. ఓటర్లను వాహనాల్లో తరలించరాదు. ఇతర సౌకర్యాలైన భోజనం, వగైరా వసతులను కల్పించరాదన్నారు. అలా చేస్తే వాహనాలు, వస్తువులను సీజ్ చేయడంతో పాటు చట్ట ప్రకారం వారిపై కఠిన చర్యలు తీసుకుంటామనీ హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 18వేల మందిని బైండోవర్ చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్నికల ప్రక్రియను ఎప్పటికపుడు చిత్రీకరించనున్నారు. దాదాపు 6 వేల మంది పోలీసు సిబ్బందిబందోబస్తులో పాల్గొంటున్నారు. సిఆర్పీఎఫ్, ఐఆర్బీ, కేరళ, కర్నాటక నుంచి వచ్చిన ప్రత్యేక బలగాలు పోలింగ్ స్టేషన్ వద్ద బందోబస్తులో పాల్గొంటాయి. పోలింగ్ ప్రక్రియకు విఘాతం కల్గించే వ్యక్తులపై, వారికి మద్దతు ఇచ్చే అభ్యర్థులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటారు. -
పోలీసుల అదుపులో మురళీధర్ తల్లిదండ్రులు
ధర్మవరం: అనంతపురం జిల్లా రామగిరి మండలం గంగంపల్లి ఘటనపై ధర్మవరం ఏఎస్పి అభిషేక్ మహంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. గంగంపల్లిలో మైనర్ బాలికను టీడీపీ కార్యకర్త మురళీధర్ మోసం చేసి, గర్భవతిని చేశాడు. ఆ తరువాత ఆ బాలికకు నాటు పద్దతిలో అబార్షన్ చేయించడానికి ప్రయత్నించాడు. ఈ ఘటనలను 'సాక్షి' వెలుగులోకి తీసుకు వచ్చింది. దాంతో పోలీసులు ఈ రోజు మురళీధర్‌పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడు పారిపోవడంతో అతని తల్లిదండ్రులను అదుపులోకి తీసుకొని సికెపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఏఎస్పి అభిషేక్ మహంతి మాట్లాడుతూ ఈ కేసు విషయంలో తాను రాజకీయ ఒత్తిళ్లకు లొంగనని చెప్పారు. ఘటన పూర్వాపరాలు: అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం గంగంపల్లిలో ఈ సంఘటన జరిగింది. బాధితురాలి తల్లి కథనం ప్రకారం వ్యవసాయ కూలి పనులు చేసుకునే ఓ మహిళకు మూడో సంతానం ఈ బాలిక(16). తల్లి కూలి పనికి వెళితే, బాలిక గ్రామంలోని తన అవ్వ ఇంట్లో ఉండేది. ఈ క్రమంలో మురళి అనే యువకుడు ఆ ఇంటికి రాకపోకలు సాగిస్తూ మాయమాటలతో బాలికను లోబరుచుకున్నాడు. రోజులు గడిచాయి. బాలిక తను గర్భవతినని తెలుసుకుంది. ఇదే విషయాన్ని ఈ నెల 10న యువకుడి తల్లి ముత్యాలమ్మకు చెప్పింది. దీంతో ఆమె బాలికపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నోటికొచ్చినట్టు దుర్భాషలాడింది. గర్భస్రావానికి సంబంధించిన మాత్రలు ఇచ్చి వేసుకొమ్మని చెప్పి బాలికను పంపించేసింది. అయితే బాలిక ఆ మాత్రలు వేసుకోకపోతే ఇబ్బందులు వస్తాయని భావించి, 11వ తేదీన ఆ యువకుడు, తన తల్లితో కలిసి బాలికను గంగంపల్లి పరిసరాల్లోకి తీసుకెళ్లి నాటుపద్ధతిలో గర్భస్రావం చేయించాడు. పొద్దుపోయాక బాధతో మెలికలు తిరుగుతూ ఇంటికెళ్లిన బాలికను తల్లి ఆరా తీయగా విషయం చెప్పింది. తీవ్రంగా రక్తస్రావమవుతుండటంతో అదే రోజు రాత్రి కూతురును అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ ఇది మెడికో లీగల్ కేసు అని, ప్రభుత్వాస్పత్రికి వెళ్లాలని సూచించారు. అక్కడి నుంచి నేరుగా సర్వజనాస్పత్రికి తీసుకెళ్లింది. బాలికను పరిశీలించిన వైద్యులు గర్భస్రావం జరిగినట్లు గుర్తించారు. అప్పటికి ఆ బాలిక శరీరంలో హిమోగ్లోబిన్ శాతం 4 మాత్రమే ఉంది. రెండు రోజుల వ్యవధిలో రెండు బాటిళ్ల రక్తం ఎక్కించారు. మరో రెండు రోజులు గడిస్తే కానీ ఆరోగ్య పరిస్థితి చెప్పలేమని వైద్యులు చెప్పారు. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న బాలికను చూసేందుకు సదరు యువకుడు గానీ, వారి తరఫు వారు గానీ ఎవరూ రాలేదు. ‘ఇలాంటి పరిస్థితి ఏ ఒక్కరికీ రాకూడదయ్యా.. మా కూతురిని ఇలా చేసిన యువకుడు ఎమ్మెల్యే సోదరుడి మనిషంట.. ఏం చేస్తామయ్యా.. మా లాంటి పేదోల్ల బతుకులింతేనా’ అని బాలిక తల్లి రోదిస్తోంది. విషయాన్ని గోప్యంగా ఉంచడమే మంచిది : సీఐ బాలికను వంచించిన యువకుడిపై నిన్నటి వరకూ రామగిరి పోలీసులు కేసు నమోదు చేయలేదు. శుక్రవారం మధ్యాహ్నం రామగిరి సీఐ, ఎస్ఐలు బాధితురాలు, ఆమె తల్లి నుంచి వివరాలు సేకరించారు. ఇంత జరిగినా కేసు ఎందుకు నమోదు చేయలేదని రామగిరి సీఐ నరసింహారావును నిన్న ‘న్యూస్‌లైన్’ సంప్రదించగా, ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడమే మంచిదని సమాధానమిచ్చారు. ఈ వివరాలన్నీ ఈ రోజు సాక్షి దినపత్రికలో రావడంతో తప్పనిసరి పరిస్థితులలో పోలీసులు కేసు నమోదు చేశారు. మురళీధర పారిపోవడంతో తల్లిదండ్రులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.