ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు
ధర్మవరం: అనంతపురం జిల్లా రామగిరి మండలం గంగంపల్లి ఘటనపై ధర్మవరం ఏఎస్పి అభిషేక్ మహంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. గంగంపల్లిలో మైనర్ బాలికను టీడీపీ కార్యకర్త మురళీధర్ మోసం చేసి, గర్భవతిని చేశాడు. ఆ తరువాత ఆ బాలికకు నాటు పద్దతిలో అబార్షన్ చేయించడానికి ప్రయత్నించాడు. ఈ ఘటనలను 'సాక్షి' వెలుగులోకి తీసుకు వచ్చింది. దాంతో పోలీసులు ఈ రోజు మురళీధర్‌పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడు పారిపోవడంతో అతని తల్లిదండ్రులను అదుపులోకి తీసుకొని సికెపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఏఎస్పి అభిషేక్ మహంతి మాట్లాడుతూ ఈ కేసు విషయంలో తాను రాజకీయ ఒత్తిళ్లకు లొంగనని చెప్పారు.
ఘటన పూర్వాపరాలు: అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం గంగంపల్లిలో ఈ సంఘటన జరిగింది. బాధితురాలి తల్లి కథనం ప్రకారం వ్యవసాయ కూలి పనులు చేసుకునే ఓ మహిళకు మూడో సంతానం ఈ బాలిక(16). తల్లి కూలి పనికి వెళితే, బాలిక గ్రామంలోని తన అవ్వ ఇంట్లో ఉండేది. ఈ క్రమంలో మురళి అనే యువకుడు ఆ ఇంటికి రాకపోకలు సాగిస్తూ మాయమాటలతో బాలికను లోబరుచుకున్నాడు. రోజులు గడిచాయి. బాలిక తను గర్భవతినని తెలుసుకుంది. ఇదే విషయాన్ని ఈ నెల 10న యువకుడి తల్లి ముత్యాలమ్మకు చెప్పింది. దీంతో ఆమె బాలికపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నోటికొచ్చినట్టు దుర్భాషలాడింది. గర్భస్రావానికి సంబంధించిన మాత్రలు ఇచ్చి వేసుకొమ్మని చెప్పి బాలికను పంపించేసింది. అయితే బాలిక ఆ మాత్రలు వేసుకోకపోతే ఇబ్బందులు వస్తాయని భావించి, 11వ తేదీన ఆ యువకుడు, తన తల్లితో కలిసి బాలికను గంగంపల్లి పరిసరాల్లోకి తీసుకెళ్లి నాటుపద్ధతిలో గర్భస్రావం చేయించాడు.
పొద్దుపోయాక బాధతో మెలికలు తిరుగుతూ ఇంటికెళ్లిన బాలికను తల్లి ఆరా తీయగా విషయం చెప్పింది. తీవ్రంగా రక్తస్రావమవుతుండటంతో అదే రోజు రాత్రి కూతురును అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ ఇది మెడికో లీగల్ కేసు అని, ప్రభుత్వాస్పత్రికి వెళ్లాలని సూచించారు. అక్కడి నుంచి నేరుగా సర్వజనాస్పత్రికి తీసుకెళ్లింది. బాలికను పరిశీలించిన వైద్యులు గర్భస్రావం జరిగినట్లు గుర్తించారు. అప్పటికి ఆ బాలిక శరీరంలో హిమోగ్లోబిన్ శాతం 4 మాత్రమే ఉంది. రెండు రోజుల వ్యవధిలో రెండు బాటిళ్ల రక్తం ఎక్కించారు. మరో రెండు రోజులు గడిస్తే కానీ ఆరోగ్య పరిస్థితి చెప్పలేమని వైద్యులు చెప్పారు. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న బాలికను చూసేందుకు సదరు యువకుడు గానీ, వారి తరఫు వారు గానీ ఎవరూ రాలేదు. ‘ఇలాంటి పరిస్థితి ఏ ఒక్కరికీ రాకూడదయ్యా.. మా కూతురిని ఇలా చేసిన యువకుడు ఎమ్మెల్యే సోదరుడి మనిషంట.. ఏం చేస్తామయ్యా.. మా లాంటి పేదోల్ల బతుకులింతేనా’ అని బాలిక తల్లి రోదిస్తోంది.
విషయాన్ని గోప్యంగా ఉంచడమే మంచిది : సీఐ
బాలికను వంచించిన యువకుడిపై నిన్నటి వరకూ రామగిరి పోలీసులు కేసు నమోదు చేయలేదు. శుక్రవారం మధ్యాహ్నం రామగిరి సీఐ, ఎస్ఐలు బాధితురాలు, ఆమె తల్లి నుంచి వివరాలు సేకరించారు. ఇంత జరిగినా కేసు ఎందుకు నమోదు చేయలేదని రామగిరి సీఐ నరసింహారావును నిన్న ‘న్యూస్‌లైన్’ సంప్రదించగా, ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడమే మంచిదని సమాధానమిచ్చారు.
ఈ వివరాలన్నీ ఈ రోజు సాక్షి దినపత్రికలో రావడంతో తప్పనిసరి పరిస్థితులలో పోలీసులు కేసు నమోదు చేశారు. మురళీధర పారిపోవడంతో తల్లిదండ్రులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.