మొదట ఇంటి దొంగల వేట.. ఎస్పీ అభిషేక్‌ మహంతి | Kadapa District Superintendent Abhishek Mahanthi Said Many Police Officers Were Behind Illegal Activities | Sakshi
Sakshi News home page

మొదట ఇంటి దొంగల వేట.. ఎస్పీ అభిషేక్‌ మహంతి

Published Wed, Jul 24 2019 8:36 AM | Last Updated on Wed, Jul 24 2019 8:36 AM

Kadapa District Superintendent Abhishek Mahanthi Said Many Police Officers Were Behind Illegal Activities - Sakshi

ఎస్పీ అభిషేక్‌ మహంతి

రాష్ట్రంలో అవినీతి రహిత పాలన సాగాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తరచూ చెబుతున్నారు. ఉన్నతాధికారులకూ ఇదే ఆయన తలపోస్తున్నారు. జిల్లాలో తన నేతృత్వంలోని పోలీసు శాఖను ఈ దిశగా తొలుత ప్రక్షాళన చేయాలని జిల్లా ఎస్పీ అభిషేక్‌ మహంతి కృతనిశ్చయంతో ఉన్నారు. ఇందుకోసం ఆయన ముందు శాఖలోని ఇంటి దొంగల పని పట్టాలని యోచిస్తున్నారు. అలాంటి వారి జాబితా ఇప్పటికే ఎస్పీ వద్ద ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. పోలీసు శాఖపై నమ్మకం సడలేలా వ్యవహరిస్తున్న అధికారుల భరతం పట్టాలని ఎస్పీ చర్యలకు దిగడంతో చాలామంది గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

నిషేధిత గుట్కా రవాణాలోనూ కొందరు పోలీసుల పాత్ర ఉందని ఎస్పీ భావిస్తున్నారు. బెంగళూరు నుంచి జిల్లాకు గుట్కా అక్రమరవాణా అవుతోంది.  ప్రొద్దుటూరు, కడప ప్రాంతాలతో పాటు జిల్లా వ్యాప్తంగా తరలించి విక్రయిస్తున్నారు. పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. అక్రమరవాణాను అరికట్టాల్సిన పోలీసులే సహకరించడంపై సర్వత్రా విమర్శలున్నాయి. 

సాక్షి ప్రతినిధి,కడప: పోలీసు శాఖలో అక్రమార్కుల.. అసాంఘిక కార్యకలాపాలకు వెన్నుదన్నుగా నిలుస్తున్న పలువురు అధికారులు,పోలీసులపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ అభిషేక్‌ మహంతి గట్టి సంకల్పంతో ఉన్నారు.  పై నుంచి కింది స్థాయి వరకూ అక్రమ కార్యకలాపాల్లో భాగస్వాములైన వారిపై ఆయన  నిఘా పెట్టినట్లు తెలిసింది. వారి వివరాలు ఇవ్వాలంటూ ఇప్పటికే అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలోని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. నిఘా విభాగం నుంచి కూడా  ఎస్పీ ఈ వివరాలు కోరినట్లు తెలుస్తోంది. దీంతో  పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా వ్యాప్తంగా స్టేషన్ల పరిధిలో అక్రమాలకు కేరాఫ్‌గా నిలుస్తూ.. దందాలు సాగిస్తున్న అధికారులు, పోలీసులజాబితాను  జిల్లా పోలీసు బాసుకు అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరి వివరాలను చేరవేశారు. మరికొందరు ఈ కీలక సమాచార సేకరణనిలో ఉన్నట్టు భోగట్టా. జాబితా చేరిన వెంటనే నిశితంగా పరిశీలించి అధికారులు, పోలీసులపై చర్యలు తీసుకొనే అవకాశమున్నట్లు అంతర్గతంగా ప్రచారం జరుగుతోంది.

అక్రమాలకు కొమ్ముకాస్తున్న అధికారులు పదుల సంఖ్యలో ఉండగా  ఇక పోలీసులు,హోంగార్డులు వందల సంఖ్యలోనే ఉన్నట్లు ప్రాధమిక సమాచారం. సీఎం జిల్లా కావడంతో అన్ని రకాల అక్రమాలకు తెరదించి అవినీతి రహిత  పారదర్శక పాలన అందించాలని ఎస్పీ అభిషేక్‌ మహంతి భావిస్తున్నారు.  ముందు ఇంటి దొంగల పనిపట్టి అక్రమాలకు అడ్డు కట్ట వేయాలని సిద్ధమయ్యారు.  సీఎం జిల్లా కావడంతో ఎస్పీ అభిషేక్‌ మహంతి ప్రత్యేక దృష్టి సారించారు.  ఇంటి దొంగలను కట్టడిచేశాక అసలు దొంగల పనిపట్టాలని ఎస్పీ వ్యూహం. అక్రమ పోలీసులపై చర్యలు తీసుకుంటే మిగిలిన వారు తప్పు చేయడానికి వెనుకడగు వేస్తారని ఎస్పీ ప్రణాలిక.. ఇందుకోసమే అక్రమార్కుల చిట్టాను ఎస్పీ సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. వివరాల సేకరణ తరువాత చర్యలు మొదలవుతాయని తెలిసింది.ఎస్పీ ఆరా  వ్యవహారం తెలిసి శాఖలో కొందరు బెంబేతెత్తుతున్నట్లు సమాచారం.

జిల్లాలో  బెట్టింగుల జోరు:
ప్రొద్దుటూరు ప్రాంతం క్రికెట్‌ బెట్టింగులకు అడ్డాగా మారింది. ఇక్కడి నుండి కడపతో పాటు జిల్లావ్యాప్తంగా బుకీలు బెట్టింగులు నడిపిస్తున్నారు. కోట్లలోనే ఈ వ్యాపారం నడుస్తోంది.  యువత తోపాటు అన్నివర్గాల వారు బెట్టింగులకు అలవాటు పడ్డారు. ఆర్ధికంగా నష్టపోతున్నారు. అప్పులు తాళలేక కొందరు ఊళ్లు వదలి ఇతర ప్రాంతాలకు వలసపోయిన ఘటనలు కోకొల్లలు. క్రికెట్‌ బెట్టింగులలో కొందరు పోలీసు అధికారులతో పాటు పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారన్న  ఆరోపణలున్నాయి. వీరి  వ్యవహారం నడుస్తున్నట్లు ప్రచారం.

ఎర్రచందనం అక్రమరవాణాలోనూ కొందరు పోలీసుల పాత్ర ఉందనేది బహిరంగ రహస్యం.బద్వేలు,మైదుకూరు,రాజంపేట, రైల్వేకోడూరు,రాయచోటి నియోజకవర్గాల పరిధిలోని నల్లమల,లంకమల,శేషాచలం తదితర అటవీ ప్రాంతంలోఎర్రచందనం ఉంది. అత్యంత విలువైన ఈసంపద అక్రమరవాణా యధేచ్ఛగా సాగుతోంది. చిత్తూరు, కడప జిల్లాకు చెందిన పలువురు స్మగ్లర్లు ఇప్పటికే వందల కోట్ల విలువైన చందనాన్నిఅక్రమంగా తరలించారు. ఇంకా తరలిస్తూనే ఉన్నారు.  గతంలో ఎర్రచందనం కేసుకు సంబంధించి జిల్లాకు చెందిన  ఆల్‌ఫ్రెడ్‌ అనే అధికారిపై అప్పటి ఎస్పీ కేసు నమోదుచేసి సస్పెండ్‌ చేశారు. ఆ అధికారితోపాటు జిల్లావ్యాప్తంగా మరి కొందరు స్మగ్లర్లకు సహకారంఅందిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

పోలీసు స్టేషన్లలో పంచాయితీలు
జిల్లావ్యాప్తంగా కొన్ని పోలీసు స్టేషన్లలో కొందరు పోలీసు అధికారులు ,పోలీసులు సెటిల్‌మెంట్లు నిర్వహిస్తున్నారు. బాధితులపక్షాన కాకుండా అక్రమార్కులకు వెన్నుదన్నుగా నిలిచి  వసూళ్లకు పాల్పడుతున్నారు. పంచాయతీలలో పై నుంచి దిగువ స్థాయి హోంగార్డు వరకూ ఈ వసూళ్లలో పాల్గొంటున్నారని తెలిసింది. ఈ తరహా పోలీసులను..అధికారులను గుర్తించి చర్యలు తీసుకుంటే నేరాలకు అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుందని ఎస్పీ మొహంతి విశ్వసిస్తున్నారు. 

మట్కాలోనూ సహకారం
జమ్మలమడుగు,తాళ్లప్రొద్దుటూరు, ప్రొద్దుటూరు ప్రాంతాలతోపాటు జిల్లాలోని మరికొన్ని ప్రాంతాలలో మట్కా వ్యవహారం నడిపిస్తున్నారు. ఇది చాలామందికి వ్యసనంగా మారింది.  చాలా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. కట్టడి చేయాల్సిన కొందరు పోలీసులు ఈ జూదానికి అండగా ఉంటున్నారు. జిల్లాలో దొంగతనాలకూ కొదవలేదు. ఇందులోనూ కొందరు పోలీసు అధికారులు, పోలీసులపాత్ర ఉన్నట్లు  ఆరోపణలున్నాయి.  వారితో కుమ్మక్కైన కొందరు దొంగతనాలను ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రొద్దుటూరుకు చెందిన ఓ కానిస్టేబుల్‌  దొంగలకు సహకరించినట్లు రేణిగుంట పోలీసులు గుర్తించి అరెస్ట్‌ చేశారు. ఇలాంటి సంఘటనలు గతంలోనూ మరిన్ని జరిగినట్లు  సమాచారం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement