మరో ఘోరం..!
=అధిక రక్తస్రావంతో బాలింత మృతి
=‘నిలోఫర్’లో మార్మోగుతున్న చావుకేకలు
సాక్షి, సిటీబ్యూరో: పురిటి నొప్పులు వినాల్సిన చోట చావుకేకలు మార్మోగుతున్నాయి. పండంటి బిడ్డను కనేందుకు వచ్చిన పేదల తల్లలు బతుకులు నిలోఫర్ ఆస్పత్రిలోనే తెల్లారిపోతున్నాయి. వైద్యుల నిర్లక్ష్యం, మౌలిక వసతుల లేమీ వల్ల మంగళవారం షాపూర్‌నగర్‌కు చెందిన భారతి(20) అనే బాలింత మృతి చెందగా, తాజాగా, జగద్గిరిగుట్టకు చెందిన ఓ గర్భిణి ప్రసవం కోసం నిలోఫర్ ఆస్పత్రికి వెళ్లింది. బిడ్డ కడుపులోనే కన్నుమూసింది. అధిక రక్తస్రావం అవుతున్న ఆ బాలింతను బుధవారం మధ్యాహ్నం ఉస్మానియాకు తరలించగా, ఆమె సాయంత్రం 4 గంటలకు కన్నుమూసింది.
రెండు మాసాల్లో ఏడుగురు మృతి...
ఉస్మానియా మెడికల్ కళాశాలకు అనుబంధంగా కొనసాగుతోన్న నిలోఫర్ చిన్నపిల్లల ఆస్పత్రిలో రోజుకు సగటున 20 ప్రసవాలు జరుగుతున్నాయి. ప్రసవ సమయంలో తలెత్తే సమస్యలను నివారించేందుకు అవసరమైన ఏర్పాట్లు ఈ ఆసుపత్రిలో లేవు. అధిక రక్తపోటు, విపరీతమై రక్తస్రావంతో బాధపడుతున్న తల్లులను వెంటనే క్రిటికల్ కేర్ యూనిట్‌కు తరలించి, వైద్యం అందించాల్సి ఉంది. ఇక్కడ అలాంటి ఏర్పాట్లు లేవు. నిత్యం 20 మంది గర్భిణులు, బాలింతలు ఉండే లేబర్ వార్డులో ఒక్క వెంటిలేటర్ కూడా లేదంటే అతిశయోక్తి కాదు. ఫలితంగా గత 2 మాసాల్లో ఏడుగురు బాలిం తలు చనిపోయినట్టు విశ్వనీయంగా తెలిసింది. అత్యవసర పరిస్థితుల్లో బాలింతలను ఉస్మానియాకు తరలించి చేతులు దులుపుకుంటున్నారు తప్ప.. వీటి ఏర్పాటుకు అధికారులు ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు.
కుర్చీలోంచి కదలని ఆర్‌ఎంఓలు...
నిరుపేదలనే కనికరం లేకుండా ఇక్కడి సిబ్బంది రోగుల బంధువుల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. బాబు పుడితే రూ.1000, పాప పుడితే రూ.500 వసూలు చేస్తున్నారు. చివరకు బాలింతలను పరామర్శించాలన్నా... కొనఊపిరితో ఉన్న నవజాత శిశువు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవాలన్నా....అడిగినంతా ఇ చ్చుకోవాల్సిందే. దీనిపై బాధితులు ఆర్ఎంఓకు ఫిర్యా దు చేసినా పట్టించుకోరు. ఇలా వసూలు చేసిన సొ మ్ములో సదరు ఆర్ఎంకు కూడా వాటాలు అందుతున్నట్లు సమాచారం. ఎప్పటికప్పుడు వార్డుల్లో రౌండ్స్ నిర్వహించి, వైద్యులు, ఇతర సిబ్బంది పని తీరు, రోగుల ఇబ్బందులపై ఆరా తీయాల్సిన ఆర్‌ఎంఓలు కూర్చున్న కుర్చీలోంచి లేవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
అవాస్తవం..
ఆసుపత్రిలో గత రెండు నెలల్లో ఏడుగురు బాలింతలు మృతి చెందినట్టు వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు. గర్భిణులకు అవసరమైన సేవలందిస్తున్నాం. మంగళవారం చోటుచేసుకున్న భారతి మృతిపై విచారణ జరిపిస్తున్నాం.
- దేవరాజ్ , నిలోఫర్ ఆస్పత్రి, సూపరింటెండెంట్