accounts officer
-
జీతం కావాలంటే.. లంచం తప్పదు
సాక్షి, ఒడిశా : ఒక ఉపాధ్యాయినికి సంబంధించిన మూడు నెలల జీతం చెల్లించాలంటే రూ.పదివేలు లంచం ఇవ్వాలి. లేదంటే ఫైల్ ముందుకు కదలదంటూ తెగేసి చెప్పిన భాగోతం ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి. జిల్లా పరిధిలో గల కొల్నారా సమితిలోని ఆగుడి గ్రామం పాఠశాలలో పనిచేస్తున్న జ్యోతిర్మయి మల్లిక్ అనే ఉపాధ్యాయిని మెటర్నిటీ లీవ్‌పై వెళ్లారు. సెలవు అనంతరం తనకు రావాల్సిన మూడు నెలల జీతాన్ని చెల్లించమని సమితి విద్యాధికారి ఎం. ఖగేశ్వరావును ఆమె సంప్రదించింది. త్వరలో జీతం చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పడంతో ఉపాధ్యాయిని వెళ్లిపోయింది. రోజులు గడుస్తున్నా ఇంకా చెల్లించక పోవడంతో సమితి విద్యాశాఖ కార్యాలయంలో పనిచేస్తున్న అకౌంటెంట్ ఫరీదా బేగంను సంప్రదించింది. జీతం అందాలంటే రూ.పది వేలు చెల్లించాలని అకౌంటెంట్ లంచం డిమాండ్ చేసింది. నెల జీతం రూ.6,400 అయితే రూ.పదివేలు ఎలా ఇవ్వగలనని ఉపాధ్యాయిని జ్యోతిర్మయి మల్లిక్ వాపోయింది. జ్యోతిర్మయి మల్లిక్ (ఉపాధ్యాయిని), అకౌంటెంట్ ఫరీదా బేగం వారిద్దరి సంభాషణలకు సంబంధించిన ఆడియో వైరల్ కావడంతో విషయం బయటకొచ్చింది. విషయం తెలుసుకున్న కలెక్టర్ ప్రమోద్ కుమార్ బెహరా దీనికి సంబంధించి దర్యాప్తు చేయాలని జిల్లా విద్యాశాఖాధికారిని ఆదేశించారు. ఈ మేరకు ఉపాధ్యాయిని జ్యోతిర్మయి మల్లిక్, అకౌంటెంట్ ఫరీదా బేగంను జిల్లా తన కార్యాలయానికి డీఈఓ పిలిపించి విచారణ చేపట్టి ఇద్దరి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. దీనికి సంబంధించి అకౌంటెంట్ బేగంను విలేకరులు ప్రశ్నించగా ఇదంతా తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారమని ఖండించారు. ఉపాధ్యాయిని జ్యోతిర్మయి మల్లిక్ మాత్రం తనకు జీతం చెల్లించాలంటే రూ.పదివేలు లంచం అడిగిన మాట వాస్తవమని అందుకు సంబంధించి తన వద్ద ఆధారాలు ఉన్నాయని వాటిని జిల్లా విద్యా శాఖాధికారికి అందించానని చెప్పారు. -
రెండు గంటల్లో రిటైర్మెంట్.. ఇంతలో...
సాక్షి, ముంబై: చేసిన నేరం దాస్తే దాగదు.. తప్పు చేసిన వాడు ఏదో ఒకరోజు శిక్ష అనుభవించక తప్పదు... ఇలాంటి మాటలు ఒక్కోసారి రుజువవుతుంటాయి. మరికాసేపట్లో పదవీ విమరణ చేయాల్సిన వ్యక్తి.. తప్పుడు పని చేసి కటకటాలపాలైన ఘటన వార్తల్లో నిలిచింది. ముంబైకి చెందిన సదాశివ్ ధ్యాన్‌దేవ్ సాత్పుత్(58) అకౌంట్స్ డిపార్ట్మెంట్లో విధులు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం అతని ఆఖరి పని దినం. మరో రెండు గంటల్లో అతను రిటైర్ అవ్వాల్సి ఉంది. ఇంతలో ఓ సర్టిఫికెట్ పని నిమిత్తం వచ్చిన వ్యక్తి నుంచి రూ.1500 లంచం తీసుకున్నాడు. అదే సమయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రైడ్ చేసి అతన్ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తొలుత సదాశివ్ రూ. 2 వేల కోసం డిమాండ్ చేశాడని, చివరకు రూ.15 వందలకు బేరం కుదుర్చుకున్నాడని తెలుస్తోంది. సదాశివ్ వేధింపులు, అవినీతి చరిత్ర గురించి తెలుసుకున్న బాధిత యువకుడు పక్కా స్కెచ్‌తో ఏసీబీకి పట్టించాడు. అధికారులు కేసు నమోదు చేసుకుని సదాశివ్‌ను రిమాండ్‌కు తరలించారు. -
స్వీపర్‌కు విద్యుత్ శాఖ ఏఏవో వేధింపులు
సత్తెనపల్లి: స్వీపర్‌పై విద్యుత్ శాఖ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్(ఏఏవో) వేధింపులకు పాల్పడుతున్న వైనంపై బాధితురాలు తిరుపతి ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ దొరకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు చేసిన లేఖ ప్రస్తుతం విద్యుత్ శాఖ ఉద్యోగుల సెల్ఫోన్లలోని వాట్సప్‌లో హల్ చల్ చేస్తోంది. వివరాలు ఇలా... పట్టణంలోని విద్యుత్ శాఖలో లైన్మెన్గా పని చేస్తూ రమేష్ నాయక్ మృతి చెందాడు. దీంతో ఆయన భార్యకు పట్టణంలోని గుంటూరు రోడ్డులో గల ఈఆర్వో కార్యాలయంలో స్వీపర్‌గా ఏడాదిన్నర క్రితం ఉద్యోగమిచ్చారు. కార్యాలయంలో ఏఏవోగా పని చేస్తున్న విశ్వేశ్వరరెడ్డి ఎనిమిది నెలలుగా తనను మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. మార్చి 2017 నుంచి కార్యాలయం సమయం దాటిన తరువాత ఫోన్ చేస్తూ అభ్యకరంగా మాట్లాడుతున్న చెప్పింది. ఎన్నిసార్లు హెచ్చరించినా పద్ధతి మార్చుకోలేదని పేర్కొంది. ఈ నెల 3న సాయంత్రం 4.30 గంటలకు జేఏవో అనుమతి తీసుకుని ఇంటికి వెళ్లినా మరుసటి రోజు వేధింపులకు గురి చేశాడని తెలిపింది. ఏఏవోతో తనకు ప్రాణ హాని ఉంటుందని ఎనిమిది నెలలుగా వేధింపులు భరించినట్లు ఆవేదన వ్యక్తం చేసింది. ఇక ఓపిక పట్టలేక ఫిర్యాదు చేస్తున్నట్లు పేర్కొంది. దీంతో ఆయన జిల్లా విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి విచారణ నిమిత్తం ఇద్దరు ఉన్నతాధికారులను నియ మించారు. అధికారులు మంగళవారం సత్తెనపల్లి చేరుకుని ఏఏవో విచారణ చేపట్టారు. తొలుత బాధితురాలిని విచారించారు. ఆ సమయంలో మీడియా ప్రతినిధులను అనుమతించలేదు. మరో వైపు స్వీపర్‌తో రాజీ చేసేందుకు కొందరు ఉద్యోగులు, రాజకీయ నాయకులు రంగంలోకి దిగారు. జరిగిందేదో జరిగింది ఇకపై నీ జోలికి రాకుండా చూస్తామని, ఫిర్యాదును వాపస్ తీసుకోవాలని కోరుతున్నారు. కాగా రాజీ చర్చలు ఫలించలేదు. ఈ వ్యవహారం విద్యుత్ శాఖ ఉద్యోగుల్లో కలకలం రేపుతోంది. -
ఏసీబీకి చిక్కిన అకౌంట్స్ ఆఫీసర్
విజయవాడ: విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారి ఒకరు లంచం తీసుకుంటూ దొరికిపోయారు. కార్పొరేషన్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ శివశంకర్ ఓ కాంట్రాక్టర్‌కు చెందిన రూ.38 లక్షల బిల్లును మంజూరు చేసేందుకు రూ.50 వేలు డిమాండు చేశాడు. దీంతో ఆ కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచన మేరకు గురువారం మధ్యాహ్నం ఆ అధికారికి ఆయన చాంబర్లోనే రూ.50వేలు ఇస్తుండగా మాటువేసి ఉన్న ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. గతంలో రాజమహేంద్రవరం కార్పొరేషన్ లో పనిచేస్తున్న సమయంలో ఇదే తరహాలో శివశంకర్ పట్టుబడినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.