సాక్షి, ముంబై: చేసిన నేరం దాస్తే దాగదు.. తప్పు చేసిన వాడు ఏదో ఒకరోజు శిక్ష అనుభవించక తప్పదు... ఇలాంటి మాటలు ఒక్కోసారి రుజువవుతుంటాయి. మరికాసేపట్లో పదవీ విమరణ చేయాల్సిన వ్యక్తి.. తప్పుడు పని చేసి కటకటాలపాలైన ఘటన వార్తల్లో నిలిచింది.
ముంబైకి చెందిన సదాశివ్ ధ్యాన్‌దేవ్ సాత్‌పుత్(58) అకౌంట్స్ డిపార్ట్‌మెంట్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం అతని ఆఖరి పని దినం. మరో రెండు గంటల్లో అతను రిటైర్ అవ్వాల్సి ఉంది. ఇంతలో ఓ సర్టిఫికెట్ పని నిమిత్తం వచ్చిన వ్యక్తి నుంచి రూ.1500 లంచం తీసుకున్నాడు. అదే సమయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రైడ్ చేసి అతన్ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
తొలుత సదాశివ్ రూ. 2 వేల కోసం డిమాండ్ చేశాడని, చివరకు రూ.15 వందలకు బేరం కుదుర్చుకున్నాడని తెలుస్తోంది. సదాశివ్ వేధింపులు, అవినీతి చరిత్ర గురించి తెలుసుకున్న బాధిత యువకుడు పక్కా స్కెచ్‌తో ఏసీబీకి పట్టించాడు. అధికారులు కేసు నమోదు చేసుకుని సదాశివ్‌ను రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment