acham pet
-
నన్ను చంపాలని చూశారు: ఎమ్మెల్యే గువ్వల
సాక్షి,హైదరాబాద్: కాంగ్రెస్ గూండాలు తనపై దాడి చేశారని, తన కాన్వాయ్‌ని వెంబడిస్తూ దాడి చేశారని అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చెప్పారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ నా అనుచరులను చంపినంత పనిచేశారు. రాయితో నాపై దాడి చేశారు. ఈ మధ్యనే కొత్త ప్రభాకర్ రెడ్డి మీద దాడి చేశారు నిన్న నామీద దాడిచేశారు. నా అదృష్టం, ప్రజల దీవెనల వల్ల బతికి బయటపడ్డా. వంశీకృష్ణ గతంలో నా ఆఫీసు మీద దాడి చేశాడు. అతనిపై పోలీసులు చర్యలు తీసుకోవాలి. నా ఊపిరి ఉన్నంత వరకు ప్రజల కోసం, కేసీఆర్, కేటీఆర్ ఆశయాల కోసం పనిచేస్తా’ అని బాలరాజు చెప్పారు. కాగా, అచ్చంపేటలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య శనివారం రాత్రి ఘర్షణ జరిగింది. బీఆర్ఎస్ నేతలు కారులో డబ్బు తరలిస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు వెంబడించారు. ఇరు పార్టీల నేతలు రాళ్లు విసురుకున్నారు. రాళ్ల దాడిలో గువ్వల బాలరాజుకు గాయాలయ్యాయి. కేటీఆర్, హరీశ్‌రావు పరామర్శ.. దాడి తర్వాత అపోలో ఆస్పతత్రిలో చికిత్స పొందిన ఎమ్మెల్యే బాలరాజును మంతత్రులు కేటీఆర్, హరీశ్‌రావు వేర్వేరుగా పరామర్శించారు. దాడి వివరాలు, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇదీ చదవండి..నా భర్తపై దాడిని ఖండిస్తున్నా: ఎమ్మెల్యే గువ్వల భార్య -
అందుబాటులో పౌర సేవలు
సాక్షి, అచ్చంపేట : పట్టణ ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా మున్సిపల్ కార్యాలయంలో పౌరసేవా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కేంద్రం ద్వారా 34రకాల సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రజలు తమ సమస్యలను ఫోన్, ఈమెయిల్, నేరుగా సంప్రదించి అధికారులకు తెలిపే వెసులుబాటును కల్పించింది. ఆయా సేవలకు దరఖాస్తు చేసుకునే వారు సమర్పించాల్సిన పత్రాలకు సంబంధించిన వివరాలను గోడలపై, బోర్డులపై రాసి ఉంచారు. సిటిజన్ చార్టర్ బోర్డును ఏర్పాటు చేశారు. దరఖాస్తు విధానం ఈవోడీబీ(ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్) సేవలను ఆన్లైన్ ద్వారా ఇంటి నుంచే పొందే వీలు ఉంటుంది. ఆయా పనుల నిమిత్తం కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పని ఉండదు. దరఖాస్తుదారుడికి తన దరఖాస్తుకు సంబంధించి జరుగుతున్న పని ఎప్పటికప్పుడు మొబైల్‌కు మెసేజ్ వస్తుంది. సిటిజన్ చార్టర్ నిబంధనల ప్రకారం గడువులోగా దరఖాస్తులను పూర్తి చేయాల్సి ఉంటుంది. మున్సిపల్ పరిధిలోని ఏదైనా విభాగంలో దరఖాస్తు చేయాలనుకునే వారు ఈ– ఆఫీస్ ద్వారా ఆన్లైన్ నమోదు చేయాలి. వచ్చిన దరఖాస్తులను కమిషనర్ పరిశీలించి అన్ని పత్రాలు సరిగ్గా ఉన్నాయా లేదా అనే విషయాలను పరిశీలించిన అనంతరం అనుమతులు జారీ చేస్తారు. సేవలను వినియోగించుకోవాలి పట్టణ ప్రజలు పౌర సేవా కేంద్రం సేవలను వినియోగించుకోవాలి. గడువులోగా సర్టిఫికెట్లు పొందవచ్చు. పైరవీలకు తావే లేదు. 30కి పైగా సేవలు అందుబాటులో ఉన్నాయి. మరికొన్ని సేవలు అందుబాటులోకి వస్తాయి. పారదర్శకత పెంచేందుకే సేవా కేంద్రం ఏర్పాటు చేశాం. – నాయిని వెంకటస్వామి, మున్సిపల్ కమిషనర్, అచ్చంపేట -
ఓటుకు రశీదు
► గ్రేటర్ వరంగల్, ఖమ్మం, అచ్చంపేట ఎన్నికల్లో అమలుకు యోచన సాక్షి, హైదరాబాద్: ఇకపై ఓటేస్తే వేలికి ఇంకే కాదు... చేతికి రశీదు అందుతుంది. ఇకపై రాష్ట్రంలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లకు రశీదు ఇచ్చేందుకు ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ సిస్టమ్ (వీవీపీఏటీ)ను అమలు చేయాలని రాష్ట్ర ఎన్నిక సంఘం సూత్రప్రాయంగా నిర్ణయించింది. వచ్చే నెల 6న జరగనున్న గ్రేటర్ వరంగల్, ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్లతో పాటు మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికల్లో దీన్ని అమలు చేసేందుకు అనుమతి కోరుతూ శనివారం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖరాసింది. ఈవీఎంల ద్వారా జరిగే ఎన్నికల్లో వీవీపీఏటీ అమలు చేయాలని దేశ సర్వోన్నత న్యాయ స్థానం 2013లో తీర్పు జారీ చేసింది. ఓటరు ఈవీఎం బ్యాలెట్‌పై ఉండే మీటను నొక్కగానే విజయవంతంగా ఓటేసినట్లు తెలుపుతూ.. అప్పటికప్పుడు ప్రింటై రశీదు జారీ అవుతుంది. ఈ ప్రతిపాదనలను సీఎం కేసీఆర్ ఆమోదిస్తే తదుపరిగా న్యాయ శాఖ పరిశీలించి ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. పోలింగ్‌కు వారం రోజులు మాత్రమే ఉండడంతో శరవేగంగా అనుమతులు వస్తేనే ఈ ఎన్నికల్లో అమలుకు అవకాశం ఉండనుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. జీహెచ్ఎంసీ ఫలితాల నేపథ్యంలో... జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ సునామీ సృష్టించడంతో ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఘోరపరాజయాన్ని చవిచూశాయి. అధికార పార్టీ ఈవీఎంల టాంపరింగ్‌కు పాల్పడడంతోనే ఇలా ఏకపక్షంగా ఫలితాలు వచ్చాయని కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో వరంగల్, ఖమ్మం, అచ్చంపేట ఎన్నికల్లో ఓటర్లకు రశీదు ఇచ్చే విధానాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.