మున్సిపల్ కార్యాలయంలోని పౌర సేవా కేంద్రం
సాక్షి, అచ్చంపేట : పట్టణ ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా మున్సిపల్ కార్యాలయంలో పౌరసేవా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కేంద్రం ద్వారా 34రకాల సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రజలు తమ సమస్యలను ఫోన్, ఈమెయిల్, నేరుగా సంప్రదించి అధికారులకు తెలిపే వెసులుబాటును కల్పించింది. ఆయా సేవలకు దరఖాస్తు చేసుకునే వారు సమర్పించాల్సిన పత్రాలకు సంబంధించిన వివరాలను గోడలపై, బోర్డులపై రాసి ఉంచారు. సిటిజన్ చార్టర్ బోర్డును ఏర్పాటు చేశారు.
దరఖాస్తు విధానం
ఈవోడీబీ(ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్) సేవలను ఆన్‌లైన్ ద్వారా ఇంటి నుంచే పొందే వీలు ఉంటుంది. ఆయా పనుల నిమిత్తం కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పని ఉండదు. దరఖాస్తుదారుడికి తన దరఖాస్తుకు సంబంధించి జరుగుతున్న పని ఎప్పటికప్పుడు మొబైల్‌కు మెసేజ్ వస్తుంది. సిటిజన్ చార్టర్ నిబంధనల ప్రకారం గడువులోగా దరఖాస్తులను పూర్తి చేయాల్సి ఉంటుంది. మున్సిపల్ పరిధిలోని ఏదైనా విభాగంలో దరఖాస్తు చేయాలనుకునే వారు ఈ– ఆఫీస్ ద్వారా ఆన్‌లైన్ నమోదు చేయాలి. వచ్చిన దరఖాస్తులను కమిషనర్ పరిశీలించి అన్ని పత్రాలు సరిగ్గా ఉన్నాయా లేదా అనే విషయాలను పరిశీలించిన అనంతరం అనుమతులు జారీ చేస్తారు.
సేవలను వినియోగించుకోవాలి
పట్టణ ప్రజలు పౌర సేవా కేంద్రం సేవలను వినియోగించుకోవాలి. గడువులోగా సర్టిఫికెట్లు పొందవచ్చు. పైరవీలకు తావే లేదు. 30కి పైగా సేవలు అందుబాటులో ఉన్నాయి. మరికొన్ని సేవలు అందుబాటులోకి వస్తాయి. పారదర్శకత పెంచేందుకే సేవా కేంద్రం ఏర్పాటు చేశాం.
– నాయిని వెంకటస్వామి, మున్సిపల్ కమిషనర్, అచ్చంపేట
Comments
Please login to add a commentAdd a comment