ప్రకృతిని పలకరిస్తూ!
విభిన్నం
ఈ లోకంతో సంబంధం లేనట్లుగా, నాలుగు గోడల మధ్య ఇరుకిరుకుగా వ్యాయమాలు చేస్తుంటాం. ఇలా కాకుండా కాస్త కొత్తగా ఆలోచించాడు హైదరాబాద్‌కు చెందిన చైతన్యరెడ్డి. హైదరాబాద్ రగ్బీ టీమ్‌కు కోచ్‌గా వ్యవహరిస్తున్న చైతన్య సరికొత్త ‘ఫిట్నెస్ ఫిలాసఫీని’ కనిపెట్టాడు. ‘‘వ్యాయామం అంటే నాలుగు గోడల మధ్య, కృత్రిమ వాతావరణం మధ్య చేసేది కాదు.
విశాలమైన ప్రకృతిని చూస్తూ, దాంట్లో మమేకం అవుతూ చేసేది’’ అంటుంది ఆయన ఫిలాసఫీ. విశేషం ఏమిటంటే, వ్యాయామానికి ఉపయోగించే సంప్రదాయ పరికరాలు ఆయన దగ్గర సరికొత్త రూపంలో, అంటే చెట్ల మొద్దుల రూపంలో కనిపిస్తుంటాయి. వెయిట్ ట్రైనింగ్‌ను చెట్ల దుంగలతో చేస్తున్నాడు చైతన్య. ప్రకృతి మధ్య చేసే ఈ వ్యాయామానికి ‘మోవంట్’ అని పేరు పెట్టాడు చైతన్య. ‘మోవంట్’ గురించి వివరించడానికి యూట్యూబ్‌లో ఛానల్ కూడా ప్రారంభించాడు.
‘‘సహజమైన పద్ధతిలో శారీరకదృఢత్వాన్ని కాపాడుకోవడమే మోవంట్’’ అంటున్న చైతన్య వ్యాయామాన్ని ‘వ్యాయామశాల’ నుంచి ప్రకృతిమధ్యకు తీసుకువెళ్లే పనిలో ఉన్నాడు. ‘‘ఏసీలు, కృత్రిమ వెలుగులు, క్యూబికల్‌లు మనకు సహజమైపోయాయి. నిజానికవి అసహజమైనవి. యోగాను స్టూడియోలలో, నాలుగు గోడల మధ్య చేయడం లేదనే విషయాన్ని గ్రహించాలి’’ అంటున్నాడు చైతన్య. మనకున్న బిజీ షెడ్యూల్లో రోజూ ప్రకృతి మధ్య వ్యాయామం కుదరకపోయినా, వారానికి కనీసం రెండుసార్లయినా చేయాలని, ప్రకృతికి దగ్గర కావాలని సూచిస్తున్నాడు చైతన్య.