వేలానికి మాల్యా గోవా విల్లా
స్వదేశానికి రావాలని ఉంది...కానీ పాస్ పోర్టు రద్దయిందని చిలక పలుకులు పలికిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా కు మరో బ్యాడ్ న్యూస్. మాల్యా ప్రసిద్ధ విల్లాను వేలం వేసేందుకు ముహూర్తం ఖరారైంది. సుమారు రూ 85 కోట్ల కు దీన్ని వేలంవేయాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యాప్ ట్రస్టీ నిర్ణయించింది. కాండోలిమ్ బీచ్ లోని 12, 350 చ.మీ విస్తీర్ణమున్నఈ విల్లా విక్రయానికి రంగం సిద్ధమైంది. అక్టోబర్ 19న ఈ వేలం నిర్వహించనున్నారు. ఈ విల్లాను తనిఖీ చేసుకోవాలనుకునే వారు సెప్టెంబర్ 26, 27, అక్టోబర్ 5, 6 తేదీల అవకాశం ఉంటుందని ట్రస్టీ తెలిపింది.
విజయ్ మాల్యా గోవా వచ్చినప్పుడు ఈ విల్లాలో బస చేసి ప్రముఖులతో విందు చేసుకునేవాడు. అత్యాధునిక సదుపాయాలతో బీచ్ ఒడ్డున కొలువు దీరిన ఈ విల్లా విలువ సుమారు తొంభై కోట్లు ఉంటుందని అంచనా. కాగా సుమారు తొమ్మిదివేల కోట్ల రుణ బకాయిలు ఎగవేసి లండన్ కు పారిపోయాడు. గోవాలోని కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ వివాదంలో ఈ విల్లాను ఎస్బీఐ క్యాప్ ట్రస్టీ ఎటాచ్ చేసిన సంగతి తెలిసిందే.