ఐపీఎస్ అధికారి భార్య ఆత్మహత్య
- హైదరాబాద్ అడిషనల్ సీపీ శివప్రసాద్ సతీమణి ఉషారాణి బలవన్మరణం
హైదరాబాద్: తెలంగాణ పోలీసు శాఖలో ఉన్నతాధికారిగా పనిచేస్తోన్న శివప్రసాద్ భార్య ఉషారాణి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్‌లోని ప్రకాశ్‌నగర్‌లో గల తమ నివాసంలో ఉషారాణి ఉరివేసుకున్నారు. ఇది గమనించిన కుటుంబసభ్యులు సాయంత్రం 5 గంటలకు ఆమెను కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి చేరేలోపే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఉషారాణి కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు కుటుంబసభ్యులు పేర్కొన్నారు. గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం ఉషారాణి పార్థివదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆమె భర్త శివప్రసాద్ హైదరాబాద్‌లో సీఏఆర్ అడిషనల్ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. భార్య మృతితో విషాదంలో కూరుకుపోయిన శివప్రసాద్‌కు పలువురు నేతలు, అధికారులు ఓదార్చారు.