adharkardu
-
బీఎస్ఎన్ఎల్ ఉచిత సిమ్ మేళా
కడప వైఎస్ఆర్ సర్కిల్: బీఎస్ఎన్ఎల్ ఉచిత సిమ్ మేళాను గురు, శుక్ర వారాల్లో నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని బీఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ వై.శివశంకర్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 40 కేంద్రాల్లో, కడప నగరంలో 16 సెంటర్లలో మేళాను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సిమ్ కావాల్సిన వారు పాస్‌పోర్ట్ సైజు ఫోటో, ఆధార్‌కార్డు జిరాక్స్ తీసుకుని రావాలని అన్నారు. అమూల్య నేస్తం, స్టూడెంట్ ప్లాన్ల కింద సిమ్‌లను ఉచితంగా అందజేస్తామని వివరించారు. జిల్లాలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
నేనెట్ల బతకాలే..
హుస్నాబాద్ : పండు ముదుసలి వయసులో ఒంటరి జీవనం గడుపుతున్న ఓ అవ్వ బియ్యానికి సర్కారు ఎసరుపెట్టింది. ఆధార్‌కార్డు సమర్పించినప్పటికీ ఆన్లైన్లో చూపించడం లేదంటూ రేషన్ బియ్యాన్ని కట్ చేసింది. కనీస కరుణ చూపించాల్సిన అధికారులు కాదు పొమ్మంటుండడంతో ఆ వృద్ధురాలు యాచిస్తూ పూట గడుపుకుంటోంది. హుస్నాబాద్ మండలం గాంధీనగర్‌కు చెందిన చామంతుల వెంకవ్వకు ఇద్దరు కుమారులు కాగా ఓ కుమారుడు మృతిచెందాడు. మరో కుమారుడు దినసరి కూలీగా పనిచేస్తూ జీవనం వెళ్లదీస్తున్నాడు. వెంకవ్వ ఓ పూరి గుడిసెలో జీవనం సాగిస్తోంది. ప్రభుత్వం నుంచి నెలనెలా నాలుగు కిలోల బియ్యం, రూ.200 పింఛన్ పొందుతున్న వెంకవ్వకు నెల రోజులు గడవాలంటే అప్పుడప్పుడు పస్తులుండాల్సిందే. రేషన్ లబ్ధిదారులు తప్పనిసరిగా ఆధార్‌కార్డు జిరాక్స్ పత్రాలు సమర్పించాలని రెవెన్యూ అధికారులు సూచించడంతో తన ఆధార్‌కార్డు నంబర్ 571058335448 గల పత్రాన్ని స్థానిక డీలర్ ద్వారా రెవెన్యూ అధికారులకు అప్పగించింది. రెవెన్యూ అధికారులు రెండు నెలల క్రితమే ఆన్లైన్లో నమోదు చేశారు. అక్టోబర్‌లో సైతం రేషన్ తీసుకున్న వెంకవ్వ ఈ నెల డీలర్ వద్దకు వెళ్తే నీ బియ్యం కారట్ తీసేశారని చెప్పడంతో ఆశ్చర్యపోయింది. ఏ ఆసరాలేని నా కారట్ ఎందుకు తొలగించారని ప్రశ్నిస్తే ఆధార్‌కార్డు నంబర్ ఆన్లైన్లో చూపించడం లేదని తొలగించినట్లు వివరించారు. రేషన్ సరుకులు లేకపోవడంతో ఆకలి తీర్చుకునేందుకు ఇతరుల వద్ద యాచిస్తూ జీవనం సాగిస్తోంది. ఁనేను ముసలిదాన్ని. కారట్ పట్టుకొనిపోతే బియ్యం రావని డీలర్ సెప్పిండు. మరి నేనెట్ల బతకాలే. మాలాంటి ముసలోల్లను గోసపెడితే బతుకుతమా సార్... జర బియ్యం ఇచ్చి పుణ్యం గట్టుకోండ్రి* అంటూ వెంకవ్వ దీనంగా అర్థిస్తోంది. ఎవరైనా దయతలిస్తే తప్ప పూటగడవని ఆ వృద్ధురాలి కార్డు పునరుద్ధరించేందుకు అధికారులు ప్రయత్నించడం లేదని మండల పరిషత్ ఉపాధ్యక్షుడు మాదాసు రాంగోపాల్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు అన్యాయం చేయొద్దని కోరారు. -
ఓటరు కార్డులకూ ఆధార్‌తో లింకు
సాక్షి, సిటీబ్యూరో: దేశంలోనే తొలిసారిగా ఓటరు కార్డులను ఆధార్‌కార్డులతో అనుసంధానించే కార్యక్రమానికి జీహెచ్ ఎంసీ సిద్ధమైంది. కేంద్ర ఎన్నికల సంఘం సూచన మేరకు జీహెచ్ఎంసీ పరిధిలో పైలట్ ప్రాజెక్టుగా దీనిని అమలు చేయనుంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈఓ) భన్వర్‌లాల్ సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. దీని ద్వారా బోగస్ కార్డులను ఏరివేయడంతోపాటు.. ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరగ్గలదని అంచనా వేస్తున్నారు. తొలుత జీహెచ్ఎంసీలో అమలు చేశాక.. మిగతా ప్రాంతాలకూ దీన్ని వర్తింపచేయనున్నారు. అధికారులతో సమావేశానంతరం భన్వర్‌లాల్ ఈ కార్యక్రమాన్ని గురించి విలేకరులకు వివరించారు. సీఈఓ ఏమన్నారంటే.. కార్డుల లింకు వల్ల గ్రేటర్ పరిధిలో ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకునే వారి సంఖ్య పెరగనుంది. తెలంగాణలో 2. 63 కోట్లు, జీహెచ్ఎంసీ పరిధిలో 81.54 లక్షల ఓటర్లున్నారు. వీటిల్లో డూప్లికేట్లు భారీ సంఖ్యలో ఉండవచ్చు. అనుసంధానం ద్వారా బోగస్ ఓటర్లను తొలగించేందుకు వీలవుతుంది. చిరునామా మారిన వారు, మృతి చెందిన వారి పేర్లు సైతం ఓటరు జాబితాలో ఉన్నాయి. ఆధార్‌తో అనుసంధానం ద్వారా వీటిని తొలగించవచ్చు. ఓటర్ల నమోదు కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, గ్రేటర్లో ఆశించిన స్థాయిలో ఓటర్లు నమోదు చేసుకోవడం లేదు. గత సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్‌శాతం కేవలం 52-54 శాతంగా నమోదైంది. రాబోయే ఎన్నికల నాటికి ఓటరు జాబితాలో పేరు నమోదుకు.. తద్వారా పోలింగ్ శాతం పెంపునకు ఈ ప్రక్రియ దోహదపడుతుంది. నేడు శిక్షణ.. దీని అమలుకు సంబంధించి సీఈవో సోమవారం జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, హైదరాబాద్, మెదక్ జిల్లాల కలెక్టర్లు, జీహెచ్ఎంసీ స్పెషల్ కమిషనర్లు, అడిషనల్ కమిషనర్(ఎన్నికలు)లతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారులు(ఈఆర్ఓలు), అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతో సమీక్ష జరిపారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు నేడు (మంగళవారం) ఈఆర్ఓలు, ఏఈర్ఓలకు హరిహరకళాభవన్‌లో శిక్షణ నిర్వహించాల్సిందిగా అడిషనల్ కమిషనర్(ఎన్నికలు) ఎస్. హరికృష్ణకు సూచించారు. త్వరితంగా అమలు.. నిర్ణీత వ్యవధిలోగా జీహెచ్ఎంసీ పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సిందిగా భన్వర్‌లాల్ కమిషనర్ సోమేశ్‌కుమార్‌కు సూచించారు. అందుకు కమిషనర్ స్పందిస్తూ .. యుద్ధప్రాతిపదికన కార్యక్రమాన్ని పూర్తి చేస్తామన్నారు. తొలుత నాలుగు నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తామని, ఫలితాలను బట్టి మిగతా నియోజకవర్గాల్లోనూ చేపడతామని వెల్లడించారు. ఆధార్‌కార్డులకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను ఓటరు గుర్తింపు(ఎపిక్)కార్డులతో అనుసంధానిస్తామని, డూప్లికేట్లు , మృతులు , తదితరుల పేర్లు తొలగించేముందు నిర్ధారణ కోసం ఎన్నికల సిబ్బందిని ఇళ్లవద్దకు పంపిస్తామని తెలిపారు. ఓటర్లే తమ ఆధార్ వివరాలను తెలిపేందుకు వీలుగా టోల్‌ఫ్రీ ద్వారా ఎస్ఎంఎస్, జీహెచ్ఎంసీ కాల్ సెంటర్‌కు ఫోన్ చేయడం వంటి విధానాలను కూడా అందుబాటులోకి తెస్తామన్నారు. నాలుగు నియోజకవర్గాల్లో.. భన్వర్‌లాల్‌తో సమావేశం ముగిసిన వెంటనే కార్యక్రమాన్ని అమలు చేసేందుకు నాలుగు నియోజకవర్గాలను ఎంపిక చేశారు. ఖైరతాబాద్‌లోని 100, 104, 186 నెంబర్ల పోలింగ్ కేంద్రాల్లో, నాంపల్లిలోని 75, 213, 207 పోలింగ్ కేంద్రాల్లో, కార్వాన్ లోని 30, 90, 96 నెంబర్ల పోలింగ్‌కేంద్రాల పరిధిలో, సికింద్రాబాద్‌లోని 165, 163, 151, పోలింగ్ కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా సోమేశ్‌కుమార్ సంబంధిత ఈఆర్‌లను ఆదేశించారు. -
గీసుకొండను మోడల్‌గా తీర్చిదిద్దుతా..
గంగదేవిపల్లి స్ఫూర్తితో ముందుకు సాగాలి ప్రతి పంచాయతీకి 10 లెడ్ లైట్లు ఇస్తాం సేంద్రియ వ్యవసాయం మేలు కలెక్టర్ గంగాధర కిషన్ గీసుకొండ : మండలంలోని మిగిలిన 16 పంచాయతీలను ఇదే బాటలో నడిపి రాష్ట్రంలోనే గీసుకొండను మోడల్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని కలెక్టర్ గంగాధర కిషన్ హామీ ఇచ్చారు. గీసుకొండ మండలంలోని ఆదర్శ గ్రామం గంగదేవిపల్లిని శనివారం ఆయన తొలిసారిగా సందర్శించారు. గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశమై గ్రామ సమగ్ర అభివృద్ధికి చేపట్టిన చర్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గంగదేవిపల్లి సాధిం చిన విజయాలను ప్రతి గ్రామపంచాయతీ సర్పంచ్ తెలుసుకుని.... తమ గ్రామాలు అలా ఎందుకు కాకూడదని ఆలోచించాలన్నారు. చాలా విషయాల్లో ఆదర్శంగా ఉన్న గంగదేవిపల్లిని ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉందని, ఇందుకోసం తన సహకారం ఉంటుందన్నారు. మన ఊరు-మన ప్రణాళిక కింద ప్రభుత్వం ప్రతి గ్రామానికీ ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయిస్తుందని, దీని వల్ల అభివృద్ధి త్వరితగతిన సాగే అవకాశం ఉంటుందన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి పది లెడ్ వీధిలైట్లు సమకూర్చేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రతి వ్యక్తి తప్పనిసరిగా ఆధార్‌కార్డు, ఓటరుకార్డు, రేషన్‌కార్డు, బ్యాంకు ఖాతా కలిగి ఉండాలని... అప్పుడే ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు అందుతాయని వివరించారు. పంచాయతీల్లో ఇంటి, నీటి పన్నును తప్పకుండా చెల్లించాలని, సర్పంచ్‌లకు ఈ విషయంలో పూర్తి అధికారాలు ఉన్నాయన్నారు. పన్నులు చెల్లిం చని వారి ఆస్తులను జప్తు చేసే అధికారం చట్టప్రకారం పంచాయతీలకు ఉందన్నారు. పంటలపై పురుగుల మందులను అతిగా వాడితే అనర్థాలుంటాయని, గంగదేవిపల్లె రైతులు సేంద్రియ వ్యవసాయం చేపట్టాలని ఆకాంక్షిం చారు. కూరగాయల పెంపకం చేపడితే రైతు బజార్లో గ్రామస్తులకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయిస్తానన్నారు. ప్రతి ఇంటివద్ద వర్మీ కంపోస్టు బెడ్స్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ స్థలాలను గుర్తించాలి... గంగదేవిపల్లిగ్రామంలో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు, లింక్‌రోడ్లు వేయించేందుకు కృషి చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. పందుల కుంటను స్టోరేజ్ ట్యాంకుగా ఏర్పాటు చేస్తామని, డంపింగ్ యార్డు తప్పనిసరిగా ఉండాలని.. ఈ మేరకు సర్వే చేసి ప్రభుత్వ స్థలాలను గుర్తించి ప్రజావసరాలకు ఉపయోగించేలా చూడాలని గీసుకొండ తహసీల్దార్ మార్గం కుమారస్వామిని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలకు రెండు అదనపు తరగతి గదులు మంజూరు చేస్తానని, వీటికి సంబంధించిన ఎస్టిమేట్లను త్వరలో వేసి తీసుకుని రావాలని అధికారులు, సర్పంచ్‌కు సూచించారు. కాగా, గ్రామపంచాయతీ కార్యాలయం, అంగన్వాడీ కేంద్రం, అపార్డు ట్రైనింగ్ సెంటర్లను కలెక్టర్ సందర్శించారు. సమావేశంలో ఎంపీడీఓ పారిజాతం, ఈఓపీఆర్డీ భీంరెడ్డి రవీంద్రారెడ్డి, గ్రా మ అదర్శ అధికారి తిలక్‌గౌడ్, సాక్షరభారత్ మండల కోఆర్డినేటర్ వేల్పుల సురే స్, సర్పంచ్ కూసం లలిత, ఉపసర్పంచ్ కూసం రాజమౌళి, పంచాయతీ కార్యదర్శులు శైలజ, వేణుప్రసాద్, ఐకేపీ సీసీ ర వీందర్‌రాజు, సింగిరెడ్డి జ్యోతి, గోనె కు మారస్వామి,చల్ల మలయ్య పాల్గొన్నారు.