సాక్షి, సిటీబ్యూరో: దేశంలోనే తొలిసారిగా ఓటరు కార్డులను ఆధార్‌కార్డులతో అనుసంధానించే కార్యక్రమానికి జీహెచ్ ఎంసీ సిద్ధమైంది. కేంద్ర ఎన్నికల సంఘం సూచన మేరకు జీహెచ్‌ఎంసీ పరిధిలో పైలట్ ప్రాజెక్టుగా దీనిని అమలు చేయనుంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈఓ) భన్వర్‌లాల్ సోమవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. దీని ద్వారా బోగస్ కార్డులను ఏరివేయడంతోపాటు.. ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరగ్గలదని అంచనా వేస్తున్నారు. తొలుత జీహెచ్‌ఎంసీలో అమలు చేశాక.. మిగతా ప్రాంతాలకూ దీన్ని వర్తింపచేయనున్నారు. అధికారులతో సమావేశానంతరం భన్వర్‌లాల్ ఈ కార్యక్రమాన్ని గురించి విలేకరులకు వివరించారు.
సీఈఓ ఏమన్నారంటే..
కార్డుల లింకు వల్ల గ్రేటర్ పరిధిలో ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకునే వారి సంఖ్య పెరగనుంది. తెలంగాణలో 2. 63 కోట్లు, జీహెచ్‌ఎంసీ పరిధిలో 81.54 లక్షల ఓటర్లున్నారు. వీటిల్లో డూప్లికేట్లు భారీ సంఖ్యలో ఉండవచ్చు. అనుసంధానం ద్వారా బోగస్ ఓటర్లను తొలగించేందుకు వీలవుతుంది. చిరునామా మారిన వారు, మృతి చెందిన వారి పేర్లు సైతం ఓటరు జాబితాలో ఉన్నాయి.
ఆధార్‌తో అనుసంధానం ద్వారా వీటిని తొలగించవచ్చు. ఓటర్ల నమోదు కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, గ్రేటర్‌లో ఆశించిన స్థాయిలో ఓటర్లు నమోదు చేసుకోవడం లేదు. గత సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్‌శాతం కేవలం 52-54 శాతంగా నమోదైంది. రాబోయే ఎన్నికల నాటికి ఓటరు జాబితాలో పేరు నమోదుకు.. తద్వారా పోలింగ్ శాతం పెంపునకు ఈ ప్రక్రియ దోహదపడుతుంది.
నేడు శిక్షణ..
దీని అమలుకు సంబంధించి సీఈవో సోమవారం జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, హైదరాబాద్, మెదక్ జిల్లాల కలెక్టర్లు, జీహెచ్‌ఎంసీ స్పెషల్ కమిషనర్లు, అడిషనల్ కమిషనర్(ఎన్నికలు)లతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారులు(ఈఆర్‌ఓలు), అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతో సమీక్ష జరిపారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు నేడు (మంగళవారం) ఈఆర్‌ఓలు, ఏఈర్‌ఓలకు హరిహరకళాభవన్‌లో శిక్షణ నిర్వహించాల్సిందిగా అడిషనల్ కమిషనర్(ఎన్నికలు) ఎస్. హరికృష్ణకు సూచించారు.
త్వరితంగా అమలు..
నిర్ణీత వ్యవధిలోగా జీహెచ్‌ఎంసీ పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సిందిగా భన్వర్‌లాల్ కమిషనర్ సోమేశ్‌కుమార్‌కు సూచించారు. అందుకు కమిషనర్ స్పందిస్తూ .. యుద్ధప్రాతిపదికన కార్యక్రమాన్ని పూర్తి చేస్తామన్నారు. తొలుత నాలుగు నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తామని, ఫలితాలను బట్టి మిగతా నియోజకవర్గాల్లోనూ చేపడతామని వెల్లడించారు.
ఆధార్‌కార్డులకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను ఓటరు గుర్తింపు(ఎపిక్)కార్డులతో అనుసంధానిస్తామని, డూప్లికేట్లు , మృతులు , తదితరుల పేర్లు తొలగించేముందు నిర్ధారణ కోసం ఎన్నికల సిబ్బందిని ఇళ్లవద్దకు పంపిస్తామని తెలిపారు. ఓటర్లే తమ ఆధార్ వివరాలను తెలిపేందుకు వీలుగా టోల్‌ఫ్రీ ద్వారా ఎస్‌ఎంఎస్, జీహెచ్‌ఎంసీ కాల్ సెంటర్‌కు ఫోన్ చేయడం వంటి విధానాలను కూడా అందుబాటులోకి తెస్తామన్నారు.
నాలుగు నియోజకవర్గాల్లో..
భన్వర్‌లాల్‌తో సమావేశం ముగిసిన వెంటనే కార్యక్రమాన్ని అమలు చేసేందుకు నాలుగు నియోజకవర్గాలను ఎంపిక చేశారు. ఖైరతాబాద్‌లోని 100, 104, 186 నెంబర్ల పోలింగ్ కేంద్రాల్లో, నాంపల్లిలోని 75, 213, 207 పోలింగ్ కేంద్రాల్లో, కార్వాన్ లోని 30, 90, 96 నెంబర్ల పోలింగ్‌కేంద్రాల పరిధిలో, సికింద్రాబాద్‌లోని 165, 163, 151, పోలింగ్ కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా సోమేశ్‌కుమార్ సంబంధిత ఈఆర్‌లను ఆదేశించారు.
ఓటరు కార్డులకూ ఆధార్‌తో లింకు
Published Tue, Oct 14 2014 3:50 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM
Advertisement
Advertisement