నేనెట్ల బతకాలే..
హుస్నాబాద్ :
పండు ముదుసలి వయసులో ఒంటరి జీవనం గడుపుతున్న ఓ అవ్వ బియ్యానికి సర్కారు ఎసరుపెట్టింది. ఆధార్‌కార్డు సమర్పించినప్పటికీ ఆన్‌లైన్‌లో చూపించడం లేదంటూ రేషన్ బియ్యాన్ని కట్ చేసింది. కనీస కరుణ చూపించాల్సిన అధికారులు కాదు పొమ్మంటుండడంతో ఆ వృద్ధురాలు యాచిస్తూ పూట గడుపుకుంటోంది. హుస్నాబాద్ మండలం గాంధీనగర్‌కు చెందిన చామంతుల వెంకవ్వకు ఇద్దరు కుమారులు కాగా ఓ కుమారుడు మృతిచెందాడు.
మరో కుమారుడు దినసరి కూలీగా పనిచేస్తూ జీవనం వెళ్లదీస్తున్నాడు. వెంకవ్వ ఓ పూరి గుడిసెలో జీవనం సాగిస్తోంది. ప్రభుత్వం నుంచి నెలనెలా నాలుగు కిలోల బియ్యం, రూ.200 పింఛన్ పొందుతున్న వెంకవ్వకు నెల రోజులు గడవాలంటే అప్పుడప్పుడు పస్తులుండాల్సిందే. రేషన్ లబ్ధిదారులు తప్పనిసరిగా ఆధార్‌కార్డు జిరాక్స్ పత్రాలు సమర్పించాలని రెవెన్యూ అధికారులు సూచించడంతో తన ఆధార్‌కార్డు నంబర్ 571058335448 గల పత్రాన్ని స్థానిక డీలర్ ద్వారా రెవెన్యూ అధికారులకు అప్పగించింది.
రెవెన్యూ అధికారులు రెండు నెలల క్రితమే ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. అక్టోబర్‌లో సైతం రేషన్ తీసుకున్న వెంకవ్వ ఈ నెల డీలర్ వద్దకు వెళ్తే నీ బియ్యం కారట్ తీసేశారని చెప్పడంతో ఆశ్చర్యపోయింది. ఏ ఆసరాలేని నా కారట్ ఎందుకు తొలగించారని ప్రశ్నిస్తే ఆధార్‌కార్డు నంబర్ ఆన్‌లైన్‌లో చూపించడం లేదని తొలగించినట్లు వివరించారు. రేషన్ సరుకులు లేకపోవడంతో ఆకలి తీర్చుకునేందుకు ఇతరుల వద్ద యాచిస్తూ జీవనం సాగిస్తోంది. ఁనేను ముసలిదాన్ని.
కారట్ పట్టుకొనిపోతే బియ్యం రావని డీలర్ సెప్పిండు. మరి నేనెట్ల బతకాలే. మాలాంటి ముసలోల్లను గోసపెడితే బతుకుతమా సార్... జర బియ్యం ఇచ్చి పుణ్యం గట్టుకోండ్రి* అంటూ వెంకవ్వ దీనంగా అర్థిస్తోంది. ఎవరైనా దయతలిస్తే తప్ప పూటగడవని ఆ వృద్ధురాలి కార్డు పునరుద్ధరించేందుకు అధికారులు ప్రయత్నించడం లేదని మండల పరిషత్ ఉపాధ్యక్షుడు మాదాసు రాంగోపాల్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు అన్యాయం చేయొద్దని కోరారు.