ఆదిభట్లలోనూ నయీం ఆగడాలు!
నయీం బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో వందల సంఖ్యలో బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. వాళ్లను బెదిరించి కోట్ల విలువైన భూములను ఈ ముఠా కొట్టేసినట్లు బయటకు వస్తోంది. ఇటీవలి కాలంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆదిభట్ల ప్రాంతంలో కూడా నయీం ముఠా ఆగడాలకు పాల్పడింది. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆదిభట్ల ప్రాంతంలో తనకున్న 41 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు నయీం ముఠా ప్రయత్నించిందని బాధితుడు లయన్ లింగారెడ్డి 'సాక్షి'కి తెలిపారు. భూమి అప్పగించాలంటూ తనను బెదిరించారని, తాను విదేశాలకు వెళ్లినప్పుడు ఆ 41 ఎకరాలను కబ్జా చేసేందుకు వాళ్లు ప్రయత్నించారని చెప్పారు. వందలమంది రౌడీలను తీసుకొచ్చి భయానక వాతావరణం సృష్టించారని, దాంతో తాను పోలీసులను ఆశ్రయించగా.. ఆ తర్వాత వేధింపులు మరింత ఎక్కువయ్యాయని లింగారెడ్డి అన్నారు. తన భూమిని కబ్జా చేయడమే కాక, తనమీద తప్పుడు కేసులు బనాయించారని చెప్పారు.
ప్రోత్సహించింది ప్రభుత్వం, పోలీసులే
కాగా నయీంను గత ప్రభుత్వాలు, పోలీసులే ప్రోత్సహించారని నయీం చేతిలో హతమైన బెల్లి లలిత సోదరి కవిత ఆరోపించారు. నయీం అనుచరులను కూడా హతమార్చాలని ఆమె డిమాండ్ చేశారు. నయీంకు సహకరించిన రాజకీయ నేతల అంతు కూడా చూడాలన్నారు.