aditya sachdeva
-
ఆదిత్య బతికుంటే సంతోషించేవాళ్లం..
గయా: బిహార్‌లో ఎమ్మెల్సీ కొడుకు చేతిలో హత్యకు గురైన ఆదిత్య సచ్దేవ (19) ఇంటర్ పరీక్షల్లో 70 శాతం మార్కులతో పాసయ్యాడు. ఆదిత్యను పోగొట్టుకుని విషాదంలో ఉన్న అతని తల్లిదండ్రులు చందా, శ్యాంసుందర్‌లను ఈ వార్త మరింత కలచివేసింది. 'నా కొడుకు అతని పరీక్షల్లో పాసయ్యాడు. అయితే జీవిత పరీక్షలో ఫెయిలయ్యాడు. ఆదిత్య బతికుంటే ఈ ఫలితాల చూసి మేం సంతోషించేవాళ్లం. ఇప్పడేం మాట్లాడాలో తెలియడం లేదు. ఆదిత్య పాసయ్యాడని అతని స్నేహితులు చెప్పారు. ముంబై లేదా ఢిల్లీలో పై చదువులు చదవాలని కోరుకునేవాడు. ఎన్నో ఆశలుండేవి. అన్నీ వమ్మయ్యాయి' అంటూ శ్యాంసుందర్ కన్నీటిపర్యంతమయ్యారు. జేడీయూ ఎమ్మెల్సీ మనోరమా దేవి కొడుకు రాఖీ యాదవ్.. తన కారును ఓవర్ టేక్ చేశాడని ఆదిత్యను కాల్చిచంపాడు. ఈ ఘటన అనంతరం జేడీయూ మనోరమను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పోలీసులు రాఖీని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతను గయ సెంట్రల్ జైల్లో ఉన్నాడు. -
ఔను! నేనే కాల్చి చంపాను!
పట్నా: బిహార్‌లో సంచలనం సృష్టించిన ఆదిత్య సచ్దేవ్ హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఆదిత్యను తానే కాల్చిచంపినట్టు నిందితుడు, ఎమ్మెల్సీ మనోరమా దేవి కొడుకు రాకీ కుమార్ యాదవ్ ఒప్పుకొన్నట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. తన వాహనాన్ని దాటిపోయాడన్న కోపంతో రాకీకుమార్ యాదవ్.. ఆదిత్య సచ్దేవ్ అనే యువకుడిని కాల్చి చంపినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే రాకీని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో అతన్ని విచారిస్తున్నారు. ఈ విచారణలో ఆదిత్యను తానే కాల్చి చంపానని రాకీ అంగీకరించడాని బిహార్ పోలీసుశాఖకు చెందిన అత్యంత ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. -
జైలుకు పంపడం కాదు అతణ్ణి ఉరితీయాలి!
చేతికందివచ్చేందుకు సిద్ధంగా ఉన్న చెట్టంతా కొడుకు అకారణంగా ఒక దుర్మార్గానికి బలైతే.. ఆ తండ్రి వేదన ఎంత దీనంగా ఉంటుందో.. ఆదిత్య సచ్ దేవ్ తండ్రిని చూస్తే తెలుస్తుంది. ఎమ్మెల్సీ కొడుకు చేతిలో తన తనయుడు దారుణ హత్యకు గురయ్యాడన్న వార్త తెలిసి గుండె పగిలిన ఆయన తీవ్ర విషాదంలో మునిగిపోయారు. బంధువులు, కుటుంబసభ్యులు ఎంత ఓదార్చాలని ప్రయత్నిస్తున్నా.. ఆయన దుఃఖాన్ని ఆపడం వారి వశమవ్వడం లేదు. తన కొడుకును హత్య చేసిన ఎమెల్సీ కొడుకు రాకీకుమార్ యాదవ్ ను ఉరితీయాలని ఆయన డిమాండ్ చేశారు. అతడిని అరెస్టు చేసి జైలుకు పంపితే.. కేవలం ఆరు నెలల్లోనే బయటకొస్తాడని అన్నారు. ఈ కేసులో వేగంగా దర్యాప్తు జరుపాలని, రాకీకుమార్ ను ఉరితీస్తేనే ఇలాంటి ఘటనలు పునరావృతం కావని ఆయన పేర్కొన్నారు. తన వాహనాన్ని ఓవర్ టేక్ చేశాడన్న కోపంతో జేడీయూ ఎమ్మెల్సీ మనోరమదేవి తనయుడు రాకీ యాదవ్ ఆదిత్య సచ్ దేవ్ ను కాల్చిచంపినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అతడిని తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. అయితే, తాను ఆదిత్యను కాల్చలేదని, తనకు ఈ ఘటనతో ప్రమేయం లేదని నిందితుడు చెప్తున్నాడు. #WATCH: Victim Aditya's father mourns the demise of his son, who was allegedly shot dead by JDU MLC's son Rockyhttps://t.co/slitxs46n2 — ANI (@ANI_news) 10 May 2016 -
నా కొడుకు దోషి అయితే.. వాడిని శిక్షించండి!
గయ: తన వాహనాన్ని దాటిపోయాడన్న కోపంతో బిహార్ ఎమ్మెల్సీ కొడుకు రాకీకుమార్ యాదవ్.. ఆదిత్య సచ్దేవ్ అనే యువకుడిని కాల్చి చంపడం రాజకీయ దుమారం రేపుతున్నది. ఈ ఘటనపై తాజాగా నిందితుడు రాకీకుమార్ తల్లి, మహిళా ఎమ్మెల్సీ అయిన మనోరమ దేవీ స్పందించారు. ఈ ఘటనలో తన కొడుకు దోషి అయితే, అతడిని శిక్షించాల్సిందేనని ఆమె స్పష్టం చేశారు. అదే సమయంలో తన కొడుకు పరారీలో లేడని, త్వరలోనే కోర్టు ముందుకు అతడు హాజరవుతాడని ఆమె తెలిపారు. 'నా కొడుకు దోషిగా తేలితే అతణ్ని శిక్షించాల్సిందే. నా కొడుకు ఇప్పుడు పరారీలో లేడు. త్వరలోనే కోర్టు ముందుకు హాజరవుతాడు. నా కొడుకు కావడం వల్లే రాకీని టార్గెట్ చేశారు' అని మనోరమ దేవీ ఓ టీవీ చానెల్‌తో పేర్కొన్నారు. రాకీకుమార్ యాదవ్ శనివారం రాత్రి 20 ఏళ్ల ఆదిత్యను దారుణంగా కాల్చిచంపినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. తన వాహనాన్ని ఓవర్ టేక్ చేసినందుకు తగిన గుణపాఠం చెప్పాలనే అతడు ఈ దుర్మార్గానికి పాల్పడినట్టు భావిస్తున్నారు. ఈ ఘటన బిహార్‌లో తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.