ఆదిత్య బతికుంటే సంతోషించేవాళ్లం..
గయా: బిహార్లో ఎమ్మెల్సీ కొడుకు చేతిలో హత్యకు గురైన ఆదిత్య సచ్దేవ (19) ఇంటర్ పరీక్షల్లో 70 శాతం మార్కులతో పాసయ్యాడు. ఆదిత్యను పోగొట్టుకుని విషాదంలో ఉన్న అతని తల్లిదండ్రులు చందా, శ్యాంసుందర్లను ఈ వార్త మరింత కలచివేసింది.
'నా కొడుకు అతని పరీక్షల్లో పాసయ్యాడు. అయితే జీవిత పరీక్షలో ఫెయిలయ్యాడు. ఆదిత్య బతికుంటే ఈ ఫలితాల చూసి మేం సంతోషించేవాళ్లం. ఇప్పడేం మాట్లాడాలో తెలియడం లేదు. ఆదిత్య పాసయ్యాడని అతని స్నేహితులు చెప్పారు. ముంబై లేదా ఢిల్లీలో పై చదువులు చదవాలని కోరుకునేవాడు. ఎన్నో ఆశలుండేవి. అన్నీ వమ్మయ్యాయి' అంటూ శ్యాంసుందర్ కన్నీటిపర్యంతమయ్యారు.
జేడీయూ ఎమ్మెల్సీ మనోరమా దేవి కొడుకు రాఖీ యాదవ్.. తన కారును ఓవర్ టేక్ చేశాడని ఆదిత్యను కాల్చిచంపాడు. ఈ ఘటన అనంతరం జేడీయూ మనోరమను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పోలీసులు రాఖీని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతను గయ సెంట్రల్ జైల్లో ఉన్నాడు.