నా కొడుకు దోషి అయితే.. వాడిని శిక్షించండి!
గయ: తన వాహనాన్ని దాటిపోయాడన్న కోపంతో బిహార్ ఎమ్మెల్సీ కొడుకు రాకీకుమార్ యాదవ్.. ఆదిత్య సచ్‌దేవ్ అనే యువకుడిని కాల్చి చంపడం రాజకీయ దుమారం రేపుతున్నది. ఈ ఘటనపై తాజాగా నిందితుడు రాకీకుమార్ తల్లి, మహిళా ఎమ్మెల్సీ అయిన మనోరమ దేవీ స్పందించారు. ఈ ఘటనలో తన కొడుకు దోషి అయితే, అతడిని శిక్షించాల్సిందేనని ఆమె స్పష్టం చేశారు. అదే సమయంలో తన కొడుకు పరారీలో లేడని, త్వరలోనే కోర్టు ముందుకు అతడు హాజరవుతాడని ఆమె తెలిపారు.
'నా కొడుకు దోషిగా తేలితే అతణ్ని శిక్షించాల్సిందే. నా కొడుకు ఇప్పుడు పరారీలో లేడు. త్వరలోనే కోర్టు ముందుకు హాజరవుతాడు. నా కొడుకు కావడం వల్లే రాకీని టార్గెట్ చేశారు' అని మనోరమ దేవీ ఓ టీవీ చానెల్‌తో పేర్కొన్నారు. రాకీకుమార్ యాదవ్ శనివారం రాత్రి 20 ఏళ్ల ఆదిత్యను దారుణంగా కాల్చిచంపినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. తన వాహనాన్ని ఓవర్ టేక్ చేసినందుకు తగిన గుణపాఠం చెప్పాలనే అతడు ఈ దుర్మార్గానికి పాల్పడినట్టు భావిస్తున్నారు. ఈ ఘటన బిహార్‌లో తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.