adityanagar
-
ప్రియురాలికి మరోకరితో పెళ్లి....జీర్ణించుకోలేక కత్తితో దాడి..ఆ తర్వాత
సాక్షి, మియాపూర్ (హైదరాబాద్): ప్రియురాలితో పాటు ఆమె తల్లిపై ఓ యువకుడు కత్తితో దాడి చేయడమేగాక తానూ గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ తిరుపతిరావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి... గుంటూరుజిల్లా, ఇసుకపల్లికి చెందిన వెంకటరాజు, శోభ దంపతులకు కుమార్తె వైభవీ, కుమారుడు గోవర్ధన్ ఉన్నారు. వెంకటరాజు ముంబైలో ప్యాబ్రికేషన్ పనులు చేస్తూ అక్కడే ఉంటున్నాడు. శోభ తన కుమార్తె వైభవీ, గోవర్ధన్‌తో కలిసి మియాపూర్‌లోని న్యూ – హఫీస్‌పేట ఆదిత్య నగర్లో ఉంటోంది. కాగా అదే గ్రామానికి చెందిన సందీప్ అలియాస్ బబ్లూ వారి ఇంటి పక్కనే ఉండేవాడు. ఈ నేపథ్యంలో వారి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. ఈ విషయం తెలియడంతో వైభవి కుటుంబసభ్యులు ఆమెను మందలించారు. దీంతో కొన్నాళ్లుగా వైభవీ సందీప్‌ను దూరం పెడుతుంది. దీనిని జీర్ణించుకోలేని సందీప్ ప్రేమ పేరుతో వేధింపులకు పాల్పడుతున్నాడు. ఆమెకు తరచూ ఫోన్ చేసి తనతో మాట్లాడాలని లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని, చంపేస్తానని బెదిరిస్తున్నాడు. దీంతో శోభ ఇద్దరు పిల్లలతో సహా నగరానికి వలస వచ్చి న్యూ – హాపీస్‌పేట ఆదిత్యనగర్‌లో ఉంటున్నారు. కొద్ది రోజుల క్రితం వైభవికి తమ సమీప బంధువుతో పెళ్లి కుదిరింది. వచ్చే ఆదివారం వారి నిశ్చతార్థం జరిపేందుకు నిశ్చయించారు. ఈ విషయం తెలియడంతో మంగళవారం ఉదయం నగరానికి వచ్చిన సందీప్ నేరుగా వైభవి ఇంటికి వెళ్లి గొడవ పడ్డాడు. కోపంతో కూరగాయాలు కోసే కత్తితో వైభవీ, ఆమె తల్లి శోభపై దాడి చేశాడు. వైభవిని గొంతు కింద చాతీభాగంలో, తల్లి శోభను కడుపులో పొడిచాడు. ఆ తర్వాత అదే చాకుతో దీపూ గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వీరి అరుపులు విన్న స్థానికులు అక్కడికి చేరుకుని రక్తం మడుగులో ఉన్న ముగ్గురిని ఆసుపత్రికి కొండాపూర్‌లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి సందీప్‌ను కోఠిలోని ఈఎన్టీ ఆసుపత్రి తరలించారు. వైభవీ, తల్లి శోభలను గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిలకడగా సందీప్ ఆరోగ్యం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సందీప్‌ను పోలీసులు కోఠి ఈఎన్టీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రోగి పరిస్థితి పరిశీలించిన ఈఎన్టీ వైద్యులు అతడి గొంతుకు ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం అతడి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు ఈఎన్టీ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. -
శ్రీకాకుళంలో భయం భయం!
శ్రీకాకుళం/శ్రీకాకుళంన్యూకాలనీ: హుదూద్ తుపాను ప్రభావం, ఆ తర్వాత వరద హెచ్చరికతో శ్రీకాకుళం పట్టణ వాసులు క్షణం ఒక యుగంలా గడిపారు. కంటిమీద కునుకులేకుండా పోయింది. ఆదివారం వేకువజాము నుంచి భీకర ఈదురుగాలులతోపాటు కురిసిన భారీ వర్షానికి ఆపసోపాలు పడ్డ ప్రజలు సోమవారం ఉదయానికి కాస్త తేరుకున్నట్టు కనిపించారు. తుపాను భయం వీడిందని కాస్త ఊపిరిపీల్చుకున్నారు. ఇంతలోనే రాకాసి కారుమబ్బులు కమ్మేశాయి. భారీ వర్షంతో జనజీవనం స్తంభించింది. పట్టణంలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ముఖ్యంగా హడ్కోకాలనీ, బలగ, కృష్ణాపార్కు, ఇలిసిపురం, చిన్నబజారు రోడ్డు, గుజరాతిపేట, విశాఖ-ఏ, బీ కాలనీలు, రామ్‌నాగర్, ఆదిత్యనగర్, తదితర లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. మిర్తిబట్టి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. రెండడుగుల నీరు ప్రవహిస్తుండడంతో చాలా ప్రాంతాల్లో నడవడానికి కూడా వీలులేకుండాపోయింది. దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. లోతట్టు ప్రాంతాల వాసులు నీటిలో చిక్కుకుని రెండు రోజులుగా ఆకలితో అలమటిస్తున్నారు. అధికార యంత్రాం గం తీర ప్రాంతాల్లో ఉండడంతో వీరిని పట్టించుకునే వారే లేకుండాపోయారు. ఈ నేపథ్యంలో సోమవారం ఒక్కసారిగా నాగావళినదికి వరద పోటెత్తింది. దీంతో నదికి ఇరువైపులా ఉన్న ప్రజలు ఎప్పు డు ఏఉపద్రవం ముంచుకువస్తుందోనని చిగురుటాకులా వణికిపోతున్నారు. ఆది వారంపేట, బలగ, శాంతినగర్‌కాలనీ, రెల్లివీధి, పెద్దరెల్లివీధి, గుడివీధి, కంపోస్టుకాలనీ, లెప్రసీకాలనీ కలెక్టరేట్ పరిధిలోని పలుకాలనీలతోపాటు తమ్మినాయుడుపేట, పీఎన్‌కాలనీ, ఫాజుల్‌బాగ్‌పేట, పొందరవీధి, తోటవీధి తదితర కాలనీల వాసులు భయం గుప్పెట్లో ఉన్నారు. పీఎన్‌కాలనీ, ఫాజుల్‌బాగ్‌పేటలో ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. వరదనీరు పోటెత్తింది. ఇదిలా ఉండగా మధ్యాహ్నం 12.30 గంటలకు నాగావళి ఉగ్రరూపం దాలుస్తుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. 2 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహించే అవకాశం ఉందని ప్రచారం చేశారు. నది సమీపంలోకి వెళ్లవద్దని హెచ్చరించడంతో ప్రజలు హడలిపోయారు. కాగా మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో నదిలో 1.50 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహించినట్లు అధికారులు చెప్పారు. ఈ నేపథ్యంలో బ్రిడ్జిపై వాహనాల రాకపోకలు నిలిపివేశారు. సీపన్నాయుడుపేట నుంచి డేఅండ్‌నైట్ కూడలి వరకు పోలీసు పహరా కాశారు. కాగా నాగావళి వరద ఉద్ధృతిని చూసేందుకు ప్రజలు ఎగబడ్డారు. -
ఆరీఫ్‌గా అదృశ్యం.. సమీర్‌గా ప్రత్యక్షం
మియాపూర్: ఇంటి ముందు ఆడుకుంటూ అదృశ్యమైన బాలుడు ఏడేళ్ల తర్వాత పోలీసుల సహాయంతో తల్లిదండ్రుల చెంతకు చేరాడు. ‘ఆరీఫ్’గా వెళ్లి ‘సమీర్’గా తిరిగొచ్చాడు. దీంతో తల్లిదండ్రులు ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మియాపూర్‌లోని ఆదిత్యానగర్‌లో ఉండే ఎండీ గౌస్, రజియా బేగంలు కూలీలు. వీరికి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఆరీఫ్ సంతానం. ఆరీఫ్ 2007 ఆగస్టు 16న ఇంటి ముందు ఆడుకుంటూ అదృశ్యమయ్యాడు. అప్పటి నుంచి కుమారుడి కోసం తండ్రి తిరగని ఊరు లేదు. అయినా ఆచూకీ దొరకలేదు. ఏడేళ్ల తర్వాత సంగారెడ్డిలో షేక్ ఖాదర్ వద్ద తమ కుమారుడున్నట్లు సమాచారం అందుకున్న గౌస్ మియాపూర్ పోలీ సులను ఆశ్రయించాడు. సీఐ పురుషోత్తం ఆధ్వర్యంలో పోలీసులు సంగారెడ్డి వెళ్లారు. ఖాదర్ ఇంట్లో లేకపోవడంతో అక్కడ ఉన్న ఆరీఫ్ అలియాస్ సమీర్‌ను తీసుకొని మియాపూర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. తలపై మచ్చ ఆధారంగా గుర్తింపు.. మూడేళ్ల వయస్సులోనే ఆరీఫ్ తలకు గాయమైంది. ఆ గాయం మచ్చ ఆధారంగా తమ కుమారుడని గౌస్, రజియా బేగంలు గుర్తిం చారు. 2007లో షేక్ ఖాదర్ పండ్ల వ్యాపా రం చేసేవాడు. ఇతనికి ఇద్దరు భార్యలు. వీరికి సంతానం లేదు. పిల్లలపై మమకారం పెంచుకున్న షేక్ ఖాదర్ మియాపూర్ ఆదిత్యానగర్‌లో ఇంటి ముందు ఆడుకుంటున్న ఆరీఫ్‌కు పండ్లు ఇస్తానని కిడ్నాప్ చేశాడు. బాలుడిని మెదక్ జిల్లా సంగారెడ్డి అంగడిపేటలోని అత్తామామ వద్ద ఉంచి పెంచుకుంటున్నాడు. అక్కడే ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నాడు. అంతేగాక ఆరీఫ్ పేరును సమీర్‌గా మార్చి ఆధార్ కార్డులో ఆ పేరు నమోదు చేయించాడు. పోలీసులు అండగిపేటకు వెళ్లి విచారించగా ఖాదర్.. సమీర్‌ను పెంచుకుంటున్నాడని స్థానికులు తెలిపారు. దీంతో ఖాదర్‌పై కిడ్నాప్ కేసు నమోదు చేస్తున్నట్లు సీఐ పురుషోత్తం తెలిపారు. పోలీసులు వచ్చిన విషయం తెలుసుకొని ఖాదర్ పరారయ్యాడు. ఆన ందంలో తల్లిదండ్రులు... కనిపించకుండా పోయిన తమ కుమారుడు ఏడేళ్ల తరువాత తిరిగి చెంతకు చేరడంతో తల్లిదండ్రులు గౌస్, రజియా బేగం పట్టరాని సంతోషలో మునిగిపోయారు. తమ కొడుకు అదృశ్యం అయినప్పటి నుంచి కొడు కు దొరుకుతాడో లేడోనని బెంగపడ్డ రజి యా బేగం కళ్లు ముందే కొడుకు ప్రత్యక్షం కావడంతో ఆనంద బాష్పాలు రాల్చింది.