శ్రీకాకుళంలో భయం భయం!
శ్రీకాకుళం/శ్రీకాకుళంన్యూకాలనీ: హుదూద్ తుపాను ప్రభావం, ఆ తర్వాత వరద హెచ్చరికతో శ్రీకాకుళం పట్టణ వాసులు క్షణం ఒక యుగంలా గడిపారు. కంటిమీద కునుకులేకుండా పోయింది. ఆదివారం వేకువజాము నుంచి భీకర ఈదురుగాలులతోపాటు కురిసిన భారీ వర్షానికి ఆపసోపాలు పడ్డ ప్రజలు సోమవారం ఉదయానికి కాస్త తేరుకున్నట్టు కనిపించారు. తుపాను భయం వీడిందని కాస్త ఊపిరిపీల్చుకున్నారు. ఇంతలోనే రాకాసి కారుమబ్బులు కమ్మేశాయి. భారీ వర్షంతో జనజీవనం స్తంభించింది.
పట్టణంలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ముఖ్యంగా హడ్కోకాలనీ, బలగ, కృష్ణాపార్కు, ఇలిసిపురం, చిన్నబజారు రోడ్డు, గుజరాతిపేట, విశాఖ-ఏ, బీ కాలనీలు, రామ్‌నాగర్, ఆదిత్యనగర్, తదితర లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. మిర్తిబట్టి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. రెండడుగుల నీరు ప్రవహిస్తుండడంతో చాలా ప్రాంతాల్లో నడవడానికి కూడా వీలులేకుండాపోయింది. దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. లోతట్టు ప్రాంతాల వాసులు నీటిలో చిక్కుకుని రెండు రోజులుగా ఆకలితో అలమటిస్తున్నారు. అధికార యంత్రాం గం తీర ప్రాంతాల్లో ఉండడంతో వీరిని పట్టించుకునే వారే లేకుండాపోయారు. ఈ నేపథ్యంలో సోమవారం ఒక్కసారిగా నాగావళినదికి వరద పోటెత్తింది. దీంతో నదికి ఇరువైపులా ఉన్న ప్రజలు ఎప్పు డు ఏఉపద్రవం ముంచుకువస్తుందోనని చిగురుటాకులా వణికిపోతున్నారు.
ఆది వారంపేట, బలగ, శాంతినగర్‌కాలనీ, రెల్లివీధి, పెద్దరెల్లివీధి, గుడివీధి, కంపోస్టుకాలనీ, లెప్రసీకాలనీ కలెక్టరేట్ పరిధిలోని పలుకాలనీలతోపాటు తమ్మినాయుడుపేట, పీఎన్‌కాలనీ, ఫాజుల్‌బాగ్‌పేట, పొందరవీధి, తోటవీధి తదితర కాలనీల వాసులు భయం గుప్పెట్లో ఉన్నారు. పీఎన్‌కాలనీ, ఫాజుల్‌బాగ్‌పేటలో ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. వరదనీరు పోటెత్తింది. ఇదిలా ఉండగా మధ్యాహ్నం 12.30 గంటలకు నాగావళి ఉగ్రరూపం దాలుస్తుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. 2 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహించే అవకాశం ఉందని ప్రచారం చేశారు. నది సమీపంలోకి వెళ్లవద్దని హెచ్చరించడంతో ప్రజలు హడలిపోయారు. కాగా మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో నదిలో 1.50 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహించినట్లు అధికారులు చెప్పారు. ఈ నేపథ్యంలో బ్రిడ్జిపై వాహనాల రాకపోకలు నిలిపివేశారు. సీపన్నాయుడుపేట నుంచి డేఅండ్‌నైట్ కూడలి వరకు పోలీసు పహరా కాశారు. కాగా నాగావళి వరద ఉద్ధృతిని చూసేందుకు ప్రజలు ఎగబడ్డారు.