భారీ విధ్వంసం తప్పదు
విపరీతమైన వేగంతో దూసుకొస్తున్న హుదూద్ తుఫాను భారీ విధ్వంసం సృష్టించక తప్పదని జాతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం ఉదయం వరకు విశాఖ వైపు కదిలిన తుఫాను.. ఆ తర్వాత ఉత్తరంవైపు.. అంటే శ్రీకాకుళం వైపు పయనిస్తున్నట్లు అధికారులు చెప్పారు. వాస్తవానికి ఆదివారం మధ్యాహ్నం తర్వాత తీరం దాటుతుందని అనుకున్నా, దానికంటే మూడు గంటల ముందే తీరాన్ని తాకొచ్చని అంటున్నారు.
శ్రీకాకుళం జిల్లాకు విస్తారంగా 192 కిలోమీటర్ల సముద్రతీరం ఉంది. ఇక్కడ ప్రభావం ఎక్కువ ఉంటుందని చెప్పడంతో.. 11 మండలాలు, 231 గ్రామాలకు చెందిన అందరినీ పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టారు. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయంటున్నారు. ఈ సమయంలో ప్రజలెవరూ బయట తిరగొద్దని స్పష్టం చేశారు. రేకులు పైకి ఎగిరిపడతాయని, అందువల్ల గాయాల పాలయ్యే అవకాశం ఉందని తెలిపారు. కిటికీలు, తలుపులు వేసుకోవాలని, ఏ పని ఉన్నా బయటకు రావద్దని హెచ్చరించారు. పూరిళ్లలో కూడా ఉండొద్దన్నారు. మట్టిగోడల ఇంట్లో ఎవరైనా ఉంటే బలవంతంగానైనా వారిని తరలించాలని కలెక్టర్ చెప్పారు.
వాస్తవానికి లోతట్టు ప్రాంతాలు, తీరప్రాంతాల్లో ఉన్న ప్రజలను శనివారం రాత్రి తరలించాలని అనుకున్నారు. కానీ తుఫాను ముందుగానే వస్తోంది కాబట్టి వెంటనే అప్రమత్తం కావాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, ఇతర అధికారులు హెచ్చరించారు. దాంతో అందరినీ వెంటనే అక్కడినుంచి తరలించేస్తున్నారు. పోలీసు స్టేషన్లలో అదనపు సిబ్బందిని మోహరించారు. తుఫాను తీరం దాటిన తర్వాత కూడా అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదే జరిగితే నాగావళి, వంశధార నదులకు వరద వచ్చే ప్రమాదం ఉంది. ఆయా నదీ పరివాహక ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవాళ్లను ఎత్తయిన ప్రాంతాలకు తరలిస్తున్నారు.