met officials
-
మరో మూడు రోజులు అతి భారీ వర్షాలు
-
మరిన్ని వర్షాలు.. మరిన్ని కష్టాలు
దాదాపు శతాబ్ద కాలంగా ఎన్నడూ లేనంత భారీ వర్షపాతం నమోదు కావడంతో తమిళనాడు.. ముఖ్యంగా రాజధాని చెన్నై నగరం అస్తవ్యస్తంగా మారింది. అయితే ఈ వర్షాలు అప్పుడే తగ్గే పరిస్థితి లేదని.. మరిన్ని రోజుల పాటు పడతాయని జాతీయ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాబోయే మూడు నాలుగు రోజుల పాటు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఇప్పట్లో ఊరట లభించకపోవచ్చని జాతీయ వాతావరణశాఖకు చెందిన లక్ష్మణ్ సింగ్ రాథోడ్ తెలిపారు. భారీ వర్షాలు, గతం నుంచి ఉన్న వరదల కారణంగా ఇప్పటివరకు తమిళనాడులో 197 మంది మరణించగా, చెన్నై నగరంలో గత 24 గంటల్లో 200 మంది తీవ్రంగా గాయపడినట్లు హోం మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు తెలిపారు. తాను, తన స్నేహితుడు పీకల్లోతు నీళ్లలో నడుచుకుంటూ ఎత్తయిన ప్రదేశానికి వెళ్లామని, అక్కడి నుంచి ఆర్మీ ట్రక్కులో కష్టమ్మీద ఇంటికి చేరామని రూపమ్ చౌధురి అనే వైద్యుడు తెలిపారు. ఆయన ఆస్పత్రి చెన్నై నడిబొడ్డున ఉంది. ఇక తన ఆస్పత్రిలో పేషెంట్లకు ఆక్సిజన్ స్టాకు కూడా అయిపోయిందని, జనరేటర్లలో డీజిల్ లేదని చెన్నైలోని ప్రముఖ డయాబెటిస్ ఆస్పత్రి చీఫ్ డాక్టర్ ఎ.రామచంద్రన్ ఫోన్లో తెలిపారు. నగరంలో చాలావరకు సెల్ఫోన్లు పనిచేయడం లేదు. ఆహార పదార్థాల నిల్వలు కూడా అడుగంటాయి. జీతాలు రాకముందే వర్షాలు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు చేసుకునేవాళ్లకు ఒకటో తారీఖు వస్తే తప్ప చేతిలో డబ్బులుండవు. ఆ తర్వాత మాత్రమే నెలకు సరిపడ సరుకులు, బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులు తెచ్చుకుంటారు. కానీ 30వ తేదీ నుంచే భారీ వర్షాలు పడుతుండటంతో.. ముందుగా సరుకులేవీ తెచ్చుకోలేకపోయారు. చేతికి జీతాలు వచ్చినా ఇప్పుడు సరుకులు తెచ్చుకునే పరిస్థితి లేదు. దాంతో నెలాఖరుకు నిండుకున్న సరుకులను మళ్లీ నింపుకోడానికి కూడా వీల్లేకుండా పోయింది. -
కళింగపట్నం పోర్ట్ లో 7వ నెంబర్ ప్రమాద హెచ్చరిక
విశాఖ : హుదూద్ తుఫాను నేపథ్యంలో ప్రధాన ఓడరేవుల్లో హై-అలర్ట్ ప్రకటించారు. కళింగపట్నం, గంగవరం ఓడరేవుల్లో శనివారం 7వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కాకినాడ, మచిలీపట్నం పోర్ట్ల్లో అయిదో నెంబర్, కృష్ణపట్నం, నిజాంపట్నం ఓడరేవుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక సూచికలను ఎగురవేశారు. ఓడ రేవుల్లో మొత్తం 11వ నెంబర్ వరకూ ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తారు. సాధారంగా అయిదో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ అయితేనే తుఫాను ప్రభావం భారీగా ఉన్నట్లు లెక్క. ఇక 11వ నెంబర్ జారీ అయితే మొత్తం సమాచార వ్యవస్థే స్తంభించిపోతుంది. -
భారీ విధ్వంసం తప్పదు
విపరీతమైన వేగంతో దూసుకొస్తున్న హుదూద్ తుఫాను భారీ విధ్వంసం సృష్టించక తప్పదని జాతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం ఉదయం వరకు విశాఖ వైపు కదిలిన తుఫాను.. ఆ తర్వాత ఉత్తరంవైపు.. అంటే శ్రీకాకుళం వైపు పయనిస్తున్నట్లు అధికారులు చెప్పారు. వాస్తవానికి ఆదివారం మధ్యాహ్నం తర్వాత తీరం దాటుతుందని అనుకున్నా, దానికంటే మూడు గంటల ముందే తీరాన్ని తాకొచ్చని అంటున్నారు. శ్రీకాకుళం జిల్లాకు విస్తారంగా 192 కిలోమీటర్ల సముద్రతీరం ఉంది. ఇక్కడ ప్రభావం ఎక్కువ ఉంటుందని చెప్పడంతో.. 11 మండలాలు, 231 గ్రామాలకు చెందిన అందరినీ పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టారు. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయంటున్నారు. ఈ సమయంలో ప్రజలెవరూ బయట తిరగొద్దని స్పష్టం చేశారు. రేకులు పైకి ఎగిరిపడతాయని, అందువల్ల గాయాల పాలయ్యే అవకాశం ఉందని తెలిపారు. కిటికీలు, తలుపులు వేసుకోవాలని, ఏ పని ఉన్నా బయటకు రావద్దని హెచ్చరించారు. పూరిళ్లలో కూడా ఉండొద్దన్నారు. మట్టిగోడల ఇంట్లో ఎవరైనా ఉంటే బలవంతంగానైనా వారిని తరలించాలని కలెక్టర్ చెప్పారు. వాస్తవానికి లోతట్టు ప్రాంతాలు, తీరప్రాంతాల్లో ఉన్న ప్రజలను శనివారం రాత్రి తరలించాలని అనుకున్నారు. కానీ తుఫాను ముందుగానే వస్తోంది కాబట్టి వెంటనే అప్రమత్తం కావాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, ఇతర అధికారులు హెచ్చరించారు. దాంతో అందరినీ వెంటనే అక్కడినుంచి తరలించేస్తున్నారు. పోలీసు స్టేషన్లలో అదనపు సిబ్బందిని మోహరించారు. తుఫాను తీరం దాటిన తర్వాత కూడా అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదే జరిగితే నాగావళి, వంశధార నదులకు వరద వచ్చే ప్రమాదం ఉంది. ఆయా నదీ పరివాహక ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవాళ్లను ఎత్తయిన ప్రాంతాలకు తరలిస్తున్నారు.