మరిన్ని వర్షాలు.. మరిన్ని కష్టాలు
దాదాపు శతాబ్ద కాలంగా ఎన్నడూ లేనంత భారీ వర్షపాతం నమోదు కావడంతో తమిళనాడు.. ముఖ్యంగా రాజధాని చెన్నై నగరం అస్తవ్యస్తంగా మారింది. అయితే ఈ వర్షాలు అప్పుడే తగ్గే పరిస్థితి లేదని.. మరిన్ని రోజుల పాటు పడతాయని జాతీయ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాబోయే మూడు నాలుగు రోజుల పాటు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఇప్పట్లో ఊరట లభించకపోవచ్చని జాతీయ వాతావరణశాఖకు చెందిన లక్ష్మణ్ సింగ్ రాథోడ్ తెలిపారు.
భారీ వర్షాలు, గతం నుంచి ఉన్న వరదల కారణంగా ఇప్పటివరకు తమిళనాడులో 197 మంది మరణించగా, చెన్నై నగరంలో గత 24 గంటల్లో 200 మంది తీవ్రంగా గాయపడినట్లు హోం మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు తెలిపారు.
తాను, తన స్నేహితుడు పీకల్లోతు నీళ్లలో నడుచుకుంటూ ఎత్తయిన ప్రదేశానికి వెళ్లామని, అక్కడి నుంచి ఆర్మీ ట్రక్కులో కష్టమ్మీద ఇంటికి చేరామని రూపమ్ చౌధురి అనే వైద్యుడు తెలిపారు. ఆయన ఆస్పత్రి చెన్నై నడిబొడ్డున ఉంది. ఇక తన ఆస్పత్రిలో పేషెంట్లకు ఆక్సిజన్ స్టాకు కూడా అయిపోయిందని, జనరేటర్లలో డీజిల్ లేదని చెన్నైలోని ప్రముఖ డయాబెటిస్ ఆస్పత్రి చీఫ్ డాక్టర్ ఎ.రామచంద్రన్ ఫోన్లో తెలిపారు. నగరంలో చాలావరకు సెల్‌ఫోన్లు పనిచేయడం లేదు. ఆహార పదార్థాల నిల్వలు కూడా అడుగంటాయి.
జీతాలు రాకముందే వర్షాలు
ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు చేసుకునేవాళ్లకు ఒకటో తారీఖు వస్తే తప్ప చేతిలో డబ్బులుండవు. ఆ తర్వాత మాత్రమే నెలకు సరిపడ సరుకులు, బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులు తెచ్చుకుంటారు. కానీ 30వ తేదీ నుంచే భారీ వర్షాలు పడుతుండటంతో.. ముందుగా సరుకులేవీ తెచ్చుకోలేకపోయారు. చేతికి జీతాలు వచ్చినా ఇప్పుడు సరుకులు తెచ్చుకునే పరిస్థితి లేదు. దాంతో నెలాఖరుకు నిండుకున్న సరుకులను మళ్లీ నింపుకోడానికి కూడా వీల్లేకుండా పోయింది.