ఆ వాట్సప్ మెసేజి తప్పు.. నమ్మొద్దు
ఇటీవలే భారీ వర్షాలతో అల్లకల్లోలంగా మారిన చెన్నై నగరంలో రాబోయే మూడు నాలుగు రోజుల పాటు అత్యంత భారీ వర్షాలు వస్తాయంటూ నాసా హెచ్చరించిందని వాట్సప్‌లో ఇటీవల ఓ సందేశం విపరీతంగా సర్క్యులేట్ అవుతోంది. హరికేన్ కారణంగా అత్యంత భారీ వర్షపాతం తప్పదని, అది కూడా భారతదేశ చరిత్రలోనే ఎన్నడూ లేనంత ఎక్కువగా.. ఏకంగా 250 సెంటీమీటర్ల వర్షం పడుతుందని ఆ మెసేజిలో ఉంది. కానీ.. అదంతా తప్పు. దాన్ని ఎవరూ నమ్మొద్దన్నది తాజా కబురు.
వాట్సప్‌లో ఎవరో ఒకరు మొదలుపెట్టిన ఈ మెసేజ్ దావానలంలా వ్యాపించి, చాలా గ్రూపులలో షేర్ అయ్యింది. దాంతో గత ఆదివారం వరకు సెలవులో ఉన్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు మళ్లీ సోమ, మంగళవారాల్లో కూడా సెలవులు పెట్టి ఆఫీసులకు వెళ్లకుండా ఊరుకున్నారు. చెన్నైలో ఉన్న తమ మిత్రులను పరిస్థితి ఎలా ఉంది, రావచ్చా అంటూ అడగడం కూడా కనిపిస్తోంది. తీరాచూస్తే ఇప్పుడు చెన్నై నగరంలో అసలు వర్షం అన్నదే పడటం లేదు.