too heavy rains
-
ఆ వాట్సప్ మెసేజి తప్పు.. నమ్మొద్దు
ఇటీవలే భారీ వర్షాలతో అల్లకల్లోలంగా మారిన చెన్నై నగరంలో రాబోయే మూడు నాలుగు రోజుల పాటు అత్యంత భారీ వర్షాలు వస్తాయంటూ నాసా హెచ్చరించిందని వాట్సప్‌లో ఇటీవల ఓ సందేశం విపరీతంగా సర్క్యులేట్ అవుతోంది. హరికేన్ కారణంగా అత్యంత భారీ వర్షపాతం తప్పదని, అది కూడా భారతదేశ చరిత్రలోనే ఎన్నడూ లేనంత ఎక్కువగా.. ఏకంగా 250 సెంటీమీటర్ల వర్షం పడుతుందని ఆ మెసేజిలో ఉంది. కానీ.. అదంతా తప్పు. దాన్ని ఎవరూ నమ్మొద్దన్నది తాజా కబురు. వాట్సప్‌లో ఎవరో ఒకరు మొదలుపెట్టిన ఈ మెసేజ్ దావానలంలా వ్యాపించి, చాలా గ్రూపులలో షేర్ అయ్యింది. దాంతో గత ఆదివారం వరకు సెలవులో ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మళ్లీ సోమ, మంగళవారాల్లో కూడా సెలవులు పెట్టి ఆఫీసులకు వెళ్లకుండా ఊరుకున్నారు. చెన్నైలో ఉన్న తమ మిత్రులను పరిస్థితి ఎలా ఉంది, రావచ్చా అంటూ అడగడం కూడా కనిపిస్తోంది. తీరాచూస్తే ఇప్పుడు చెన్నై నగరంలో అసలు వర్షం అన్నదే పడటం లేదు. -
హెలెన్ తీవ్రత.. 18 మంది మత్స్యకారుల గల్లంతు
హెలెన్ తుఫాను దిశ మార్చుకుంది. మచిలీపట్నానికి తూర్పు ఆగ్నేయంగా 280 కిలోమీటర్ల దూరంలో అది కేంద్రీకృతమై ఉంది. ఒంగోలుకు తూర్పు ఈశాన్యంగా 200 కిలోమీటర్ల దూరంలోను, విశాఖపట్నానికి 200 కిలోమీటర్ల దక్షిణ ఆగ్నేయంలోను ఇది స్థిరపడింది. శుక్రవారం సాయంత్రం తర్వాత పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం - కృష్ణా జిల్లా మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం కనిపిస్తోంది. దీని ప్రభావం గురువారం రాత్రి నుంచే కనిపిస్తుంది. గోదావరి జిల్లాల నుంచి ప్రకాశం, నెల్లూరు జిల్లాల వరకు గల తీరప్రాంతం అంతా భారీ నుంచి అతి భారీ వర్షాలు (25 సెంటీమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ) కురుస్తాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ప్రస్తుతానికి తుఫాను ఈశాన్య దిశగా కదులుతోంది. ఈ తుఫాను వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని తీరప్రాంత జిల్లాలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా పూరిళ్లు, గుడిసెలు ఎక్కువగా ధ్వంసం అవుతాయని తెలిపింది. చెట్లు విరిగి పడటం వల్ల విద్యుత్తు, కమ్యూనికేషన్ లైన్లకు కూడా నష్టం కలుగుతుందని హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతానికి ప్రస్తుతానికి 'ఆరంజ్' హెచ్చరికను జారీచేసింది. అంటే పూర్తి అప్రమత్తంగా వ్యవహరించాలని అర్థం. మత్స్యకారులు వేటకు సముద్రంలోకి వెళ్లొద్దని, తీరప్రాంతాల్లో ఉంటున్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని హెచ్చరించారు. తీర ప్రాంతం అల్లకల్లోలంగా ఉంది. నెల్లూరు జిల్లాలో సముద్రం 30 అడుగులు ముందుకుచొచ్చుకుని వచ్చింది. అధికారులు ప్రజల్ని అప్రమత్తం చేశారు. తుఫాను తీవ్రరూపం దాలుస్తున్న దృష్ట్యా కృష్ణా జిల్లాలోని తీరప్రాంత మండలాల్లో 110 పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేశారు. ముఖ్యంగా దివిసీమ ప్రాంతంపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించామని తుఫాను ప్రత్యేక అధికారి నవీన్ మిట్టల్ తెలిపారు. -
రాష్ట్రానికి మొదటి ప్రమాద హెచ్చరిక
తెలంగాణ, రాయలసీమ, కోస్తా ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. ప్రధానంగా కోస్తా జిల్లాల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తాజా బులెటిన్‌లో సూచించింది. తెలంగాణ జిల్లాల్లో అప్రమత్తంగా ఉండాలని తెలపగా, రాయలసీమలో మాత్రం ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనిస్తూ ఉండాలని సూచించింది. కోస్తా జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించడం, ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడం లాంటి చర్యలు చేపట్టాలని తెలిపింది. అత్యంత తీవ్రస్థాయిలో ఉన్న అల్పపీడనం తెలంగాణ, దానికి అనుబంధంగా ఉన్న రాయలసీమ, కోస్తా ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతాలపై ఆవరించి ఉందని, దీని ప్రభావంతో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని బులెటిన్‌లో పేర్కొంది. రాగల 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోని చాలా ప్రాంతా్లో వర్షం, జల్లులు ఉంటాయని, తర్వాత క్రమంగా తగ్గుతాయని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షపాతం కురిసే ప్రమాదం ఉందని హెచ్చరిక జారీచేసింది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. -
దూసుకొస్తున్న జల ప్రళయం..
జల ప్రళయం దూసుకొస్తోంది. మూడు రోజులుగా భయకంపితులను చేస్తున్న పై-లీన్ తుఫాను తీరం వైపు వేగంగా కదులుతోంది. ప్రస్తుతం గోపాల్‌పూర్‌కు 150 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుఫాను తీరం దాటే సమయంలో పెనుముప్పు తప్పదని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. అత్యధికంగా 25 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదవుతుందని అంచనా. శ్రీకాకుళం సహా నాలుగు జిల్లాలకు పెను ముప్పు తప్పదని అంచనా వేస్తున్నారు. పై- లీన్ తుఫాను ఈ సాయంత్రం గోపాల్పూర్ వద్ద తీరం దాటుతుందని మెట్రోలాజికల్ సీనియర్ సైంటిస్ట్ బి.కె. బందోపాధ్యాయ అన్నారు. తీరం దాటిన తర్వాత తుఫాను ప్రభావం ప్రమాదస్థాయిలో ఉంటుందన్నారు. పై-లీన్ తుఫానుతో ఒడిషాలోని గోపాల్పూర్ వాసులు వణికిపోతున్నారు. విజయనగరం జిల్లాలో తీరప్రాంతాల ప్రజలు జడిసిపోతున్నారు . తుఫాను బారి నుంచి తమను కాపాడాలని మత్య్సకార గ్రామాల ప్రజలు గంగమ్మకు పూజలు చేస్తున్నారు. సముద్రం నుంచి ప్రచండ వేగంతో గాలులు వీస్తుండటంతో తీరప్రాంత ప్రజలు బెంబేలెత్తున్నారు. విజయనగరం జిల్లాలో సుమారు 23 గ్రామాలు తీరప్రాంతాన్ని అనుకుని ఉన్నాయి. నెల్లూరు జిల్లా వాసులు పై-లీన్ తుఫానుతో వణికిపోతున్నారు. తీర ప్రాంతంలో సముద్రం దాదాపు 10 మీటర్ల మేర ముందుకు వచ్చింది. సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలల ఉధృతి అధికమైంది. దాదాపు మీటరు ఎత్తున అలలు ఎగిసిపడుతున్నాయి. జిల్లాలోని తడ, తూపిలిపాలెం, కోడూరుపాడు, మైపాడు, జువ్వలదిన్నె, తుమ్మల పెంట, రామతీర్థం వద్ద సముద్రం ముందుకు రావడంతో తీర ప్రాంత ప్రజలు భయంతో వణికిపోతున్నారు. కృష్ణపట్నం పోర్టులో మూడో ప్రమాద హెచ్చరికను ఎగురవేశారు. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పశ్చిమగోదావరిజిల్లా తీరప్రాంత ప్రజలను పై-లీన్ తుపాను భయపెట్టిస్తోంది. తుపాను హెచ్చరికల నేపధ్యంలో నరసాపురం తీరప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. చినలంక, పెదమైనవానిలంక, పేరుపాలెం, మోళ్ళవర్రు గ్రామాల్లోని మత్స్యకారులు పడవలు, వలలను భద్రపరుచుకున్నారు. ప్రత్యేక అధికారి, సీనియర్ ఐఏఎస్ సంజయ్ జాజు ఆధ్వర్యంలో తీరప్రాంత ప్రజలను సురక్షిత కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే పలుచోట్ల మత్స్యకారుల పడవలు ధ్వంసమయ్యాయి. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిన బాధ్యత ప్రజలదే ముంపు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాల్సిన బాధ్యత ప్రజలపైనే ఎక్కువగా ఉందని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డీసీ రోశయ్య అన్నారు. అధికారులు రాలేదని... ఊళ్లు ఖాళీ చేయకుండా ఉండవద్దని సూచించారు. తీరప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఇళ్ల ముందు పశువులను కట్టివేయకుండా వదిలేయాలని సూచించారు. మత్య్సకారులు చేపలు పట్టడానికి వెళ్ళవద్దన్నారు. చెట్ల కింద నిల్చోరాదని ..ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునారావాస కేంద్రాల్లోనే ఉండాలని డీసీ రోశయ్య సూచించారు. కంట్రోల్ రూంలు, హెల్ప్ లైన్ల నెంబర్లు.. శ్రీకాకుళం: 0894-2240557/ 9652838191 విశాఖపట్టణం: 1800425002 విజయనగరం: 0892-2236947 టోల్ ఫ్రీ: 1077 తూర్పుగోదావరి: 0884-2365506 పశ్చిమగోదావరి: 0881230617 కృష్ణా: 086722525, టోల్ ఫ్రీ: 1077 గుంటూరు : 08632345103/08632234990 నెల్లూరు: 08612331477