దూసుకొస్తున్న జల ప్రళయం..
జల ప్రళయం దూసుకొస్తోంది. మూడు రోజులుగా భయకంపితులను చేస్తున్న పై-లీన్ తుఫాను తీరం వైపు వేగంగా కదులుతోంది. ప్రస్తుతం గోపాల్పూర్కు 150 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుఫాను తీరం దాటే సమయంలో పెనుముప్పు తప్పదని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. అత్యధికంగా 25 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదవుతుందని అంచనా. శ్రీకాకుళం సహా నాలుగు జిల్లాలకు పెను ముప్పు తప్పదని అంచనా వేస్తున్నారు. పై- లీన్ తుఫాను ఈ సాయంత్రం గోపాల్‌పూర్ వద్ద తీరం దాటుతుందని మెట్రోలాజికల్ సీనియర్ సైంటిస్ట్ బి.కె. బందోపాధ్యాయ అన్నారు. తీరం దాటిన తర్వాత తుఫాను ప్రభావం ప్రమాదస్థాయిలో ఉంటుందన్నారు. పై-లీన్ తుఫానుతో ఒడిషాలోని గోపాల్‌పూర్ వాసులు వణికిపోతున్నారు.
విజయనగరం జిల్లాలో తీరప్రాంతాల ప్రజలు జడిసిపోతున్నారు . తుఫాను బారి నుంచి తమను కాపాడాలని మత్య్సకార గ్రామాల ప్రజలు గంగమ్మకు పూజలు చేస్తున్నారు. సముద్రం నుంచి ప్రచండ వేగంతో గాలులు వీస్తుండటంతో తీరప్రాంత ప్రజలు బెంబేలెత్తున్నారు. విజయనగరం జిల్లాలో సుమారు 23 గ్రామాలు తీరప్రాంతాన్ని అనుకుని ఉన్నాయి.
నెల్లూరు జిల్లా వాసులు పై-లీన్ తుఫానుతో వణికిపోతున్నారు. తీర ప్రాంతంలో సముద్రం దాదాపు 10 మీటర్ల మేర ముందుకు వచ్చింది. సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలల ఉధృతి అధికమైంది. దాదాపు మీటరు ఎత్తున అలలు ఎగిసిపడుతున్నాయి. జిల్లాలోని తడ, తూపిలిపాలెం, కోడూరుపాడు, మైపాడు, జువ్వలదిన్నె, తుమ్మల పెంట, రామతీర్థం వద్ద సముద్రం ముందుకు రావడంతో తీర ప్రాంత ప్రజలు భయంతో వణికిపోతున్నారు. కృష్ణపట్నం పోర్టులో మూడో ప్రమాద హెచ్చరికను ఎగురవేశారు. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
పశ్చిమగోదావరిజిల్లా తీరప్రాంత ప్రజలను పై-లీన్ తుపాను భయపెట్టిస్తోంది. తుపాను హెచ్చరికల నేపధ్యంలో నరసాపురం తీరప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. చినలంక, పెదమైనవానిలంక, పేరుపాలెం, మోళ్ళవర్రు గ్రామాల్లోని మత్స్యకారులు పడవలు, వలలను భద్రపరుచుకున్నారు. ప్రత్యేక అధికారి, సీనియర్ ఐఏఎస్ సంజయ్ జాజు ఆధ్వర్యంలో తీరప్రాంత ప్రజలను సురక్షిత కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే పలుచోట్ల మత్స్యకారుల పడవలు ధ్వంసమయ్యాయి.
సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిన బాధ్యత ప్రజలదే
ముంపు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాల్సిన బాధ్యత ప్రజలపైనే ఎక్కువగా ఉందని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డీసీ రోశయ్య అన్నారు. అధికారులు రాలేదని... ఊళ్లు ఖాళీ చేయకుండా ఉండవద్దని సూచించారు. తీరప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఇళ్ల ముందు పశువులను కట్టివేయకుండా వదిలేయాలని సూచించారు. మత్య్సకారులు చేపలు పట్టడానికి వెళ్ళవద్దన్నారు. చెట్ల కింద నిల్చోరాదని ..ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునారావాస కేంద్రాల్లోనే ఉండాలని డీసీ రోశయ్య సూచించారు.
కంట్రోల్ రూంలు, హెల్ప్ లైన్ల నెంబర్లు..
శ్రీకాకుళం: 0894-2240557/ 9652838191
విశాఖపట్టణం: 1800425002
విజయనగరం: 0892-2236947 టోల్ ఫ్రీ: 1077
తూర్పుగోదావరి: 0884-2365506
పశ్చిమగోదావరి: 0881230617
కృష్ణా: 086722525, టోల్ ఫ్రీ: 1077
గుంటూరు : 08632345103/08632234990
నెల్లూరు: 08612331477