ఆ హిందూ దంపతుల కూతురి పేరు.. 'యూనుస్'
ఒకవైపు రాజకీయ నాయకులు, కొందరు సెక్యులరిస్టులు అసహనం అంటూ గగ్గోలు పెడుతుంటే.. సామాన్యులు మాత్రం అదేమీ తమకు అక్కర్లేదని, తాము పరమత సహనంతోనే ఉన్నామని చాటి చెబుతున్నారు. చెన్నైలో భారీ వర్షాలు, వరదలు వచ్చి జనం అల్లాడుతుంటే తన రెండు ఫ్లాట్లలో వచ్చి ఎవరైనా ఉండొచ్చని మహ్మద్ యూనుస్ అనే యువకుడు ఇంతకుముందు చెప్పాడు... గుర్తుంది కదూ. అలా అతడి అపార్టుమెంటులో తలదాచుకున్న వారిలో చిత్ర, మోహన్ అనే హిందూ దంపతులు కూడా ఉన్నారు. వీళ్లు నివాసం ఉంటున్న ఉరప్పక్కం అనే ప్రాంతానికి వెళ్లి.. రక్షించేందుకు పడవల వాళ్లు కూడా ఏమాత్రం ఆసక్తి చూపించలేదు.
కానీ యూనుస్ ఎలాగోలా వాళ్లను బతిమాలి.. అక్కడకు వెళ్లి జనాన్ని రక్షించి తన అపార్టుమెంటుకు తీసుకొచ్చాడు. అప్పటికి చిత్ర నిండు గర్భిణి. అక్కడ కరెంటు లేదు, చాలామంది జనం చెట్లమీద వేలాడుతున్నారు. ఎలాగోలా పడవ తెచ్చి, ఆ గర్భిణిని, మరికొందరిని పడవ ఎక్కించాడు. నీళ్లలో పడవ వెళ్తూ.. కూలిపోయిన చెట్టును ఢీకొని తిరగబడినంత పనైంది. దాంతో ఆమె భయంతో విలవిల్లాడిపోయింది. తర్వాత చిత్రను ఓ ఆస్పత్రిలో చేర్చగా.. శనివారం నాడు పండంటి ఆడబిడ్డను కంది. తనతో పాటు తన బిడ్డ ప్రాణాలు కూడా కాపాడినది యూనుస్ కాబట్టి.. అతడి పేరే తమ బిడ్డకు పెట్టుకున్నారా హిందూ దంపతులు. ఈ విషయం గురించి యూనుస్‌కు వాట్సప్ ద్వారా ఓ సందేశం కూడా పంపారు. మీరు ఫ్రీగా ఉంటే ఒకసారి వచ్చి కలుస్తామని తెలిపారు. ఇకనుంచి తన జీతంలో సగం మొత్తాన్ని పేదలకు ఇస్తానని కూడా చెప్పారు.